కవిత్వం

అంతర్మథనం

సెప్టెంబర్ 2013

ఒక నిండు జీవితం బుగ్గి. వృథా. నలిపేసి ఉండ చుట్టి పారేసిన చిత్తు కాయితం. ఆరు దశాబ్దాల ఆయువు లోని అత్తెసరు వ్యాసంగంతో సాధించావెంత? మల్లీశ్వరిలో భానుమతికి రాణివాసం నచ్చనట్టు నచ్చని ప్రొఫెషన్. ఏవో కొన్ని రాసినందుకే ఎందుకో కొంత తృప్తి! తృప్తి పడ గల మనుషుల తృప్తి పడే గుణం పట్ల యెంత అసంతృప్తి! ఇట్లా కాదు. ఇంకా రాయాలి. డజన్ల కొద్దీ. ఉబుసుపోకకు రాసినవి కావు. పస వున్నవి. పసందైనవి. తాలు కాని గట్టి గింజల్లాంటివి. చిరకాలం గుర్తుండేవి. కానీ యెట్లా రాస్తావు దశాబ్దాల విలువైన కాలం దహనమయ్యాక? పూర్తిగా రూపం దాల్చక అబార్టయిన కవితవు నువ్వు. పూడ్చిపెట్టాలి నిన్ను. మనసును మెలాంకొలీ లోకి వొంపేసి కాఫ్కా కథల పుస్తకం దూరం నుంచి యిటు వైపే చూస్తూ… దుష్టంగా నవ్వుతోంది. ఇరవై ముప్ఫై మీడియోకర్ పుస్తకాల్తో యేం లాభం? వంద రాయాలి. రెండొందలు. ఇంకా ఎక్కువే. అవి కూడా ఉద్గ్రంథాలు.ఉత్కృష్టమైనవి. నాణ్యత వున్నవి. చిరకాలం నిలిచేవి. అబ్బ నీ ఆశ మండా. యెట్లా రాస్తావురా? నువ్వేమన్నా కోరిన్ టెల్లాడోవా? ఎడ్వర్డ్ స్ట్రేట్ మేయర్ వా? మేరీ ఫాల్క్నర్ వా? నువ్వేమన్నా సోమర్సెట్ మామ్ లాగా సింగిల్ గాడివా? అర్థంపర్థం లేకుండా మాట్లాడే ఆశపోతువి నువ్వు. కలలు కనే అర్హత లేని కల్లగాడివి నువ్వు. ఊహాసౌధాల మెట్లెక్కడం మాని పడుకో మూలకు.

రాస్తావు కొన్ని. రాయాలనిపించేవెన్నెన్నో. పత్రికల్లో రాకపోతే పతనమవుతావ్ లోయల్లోకి. వస్తే జుయ్యిమని ఎగురుతావ్ శిఖరాల మీదికి. నలభై పంక్తుల్లో నాలుగైనా సూపర్బ్ అనుకుంటే రెండు కూడా కాదు ఒకటే అని కవిమిత్రుడు చెప్తున్నట్టు లోపల్లోపల ఉలుకు. ఉత్తుత్తి ఆవేశాన్ని కలంలో పోసి కాయితమ్మీద పరుస్తావ్. యేం పొడిచావని? ఎందుకంత మిడిసిపాటు? సముద్రంలో కాకిరెట్టకే సమర విజయోత్సాహమా? సొంత సుఖాల ఆలోచనల్లో పీకల్దాకా కూరుకు పోయి సమాజ రణరంగానికి వెన్ను చూపే సాహిత్య భీరువా! కడుపులో చల్ల కదలకుండ కూర్చుని కలం తిప్పే నకిలీ వీరుడా! వాపును చూసి బలుపనుకునే వాతరోగం వచ్చింది నీకు. అయితే మితి మీరిన ఆత్మవిశ్వాసం, లేకపోతే లోతుల్లోకి పడిపోయే తృప్తిరాహిత్యం. త్రిపుర పుస్తకం చదివి తిమిర సముద్రం లోకి విసిరేయబడ్డ వాడా! నిరుత్సాహ జలాల్ని తాగి నిట్టనిలువునా కూలిన వాడా! కళ్లు మూసుకుని కలుగు లోపలికి వెళ్లిపో కొన్నాళ్ల పాటు.

అంత లోనే పౌరుషం. కలం తీసుకుని కావ్యరచన కోసం పరుగు. గాఢమైన భాషను కలం కడవలో నింపి కాయితపు మడిలో గుమ్మరించటం. జబ్బలు చరుచుకుని చంకలు గుద్దుకోవటం.

ఆహా కవిపుంగవా! ఆడుకో నీకు నువ్వే. ఆశించిన అమోఘత్వం అందక వేదనా భూధరం కింద నలిగిపోతూ పొగిలిపోతూ. ఆపై మళ్లీ ఆత్మవిశ్వాస తరంగాల మీద తేలిపోతూ.



One Response to అంతర్మథనం

  1. Thirupalu
    September 4, 2013 at 10:56 pm

    `సముద్రంలో కాకిరెట్టకే సమర విజయోత్సాహమా?
    సొంత సుఖాల ఆలోచనల్లో పీకల్దాకా కూరుకు పోయి సమాజ రణరంగానికి వెన్ను చూపే సాహిత్య భీరువా!
    వాపును చూసి బలుపనుకునే వాతరోగం వచ్చింది నీకు!
    కవి ఆత్మ విమర్శ ! కవి అంతర్మదనం! బాగు! బాగు!
    అకవులకు కుకవులకు చెంపపెట్టు!
    కాకపోతే సుదీర్గం!

Leave a Reply to Thirupalu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)