కవిత్వం

నేను-నా తోట-ఒక కోయిల

జనవరి 2013

ఒంటరితనం
సర్రున దూరి
మెదడు సందుల్లోంచి బుసకొడ్తది

జ్ఞాపకం పొరలు చీల్చుకొని
ఎర్రరక్తకణం
బొర్ర విరుస్తది

తోడులేనితనాన్ని ఈడుస్తున్నప్పుడు
ఒక జామ కొమ్మ
వంగి భుజాన్ని తడుతది
రాత్రి ఒడిసి పట్టుకున్న మంచుముత్యాల్ని
తలంబ్రాలు పోస్తది

నిండుగా పూసిన
పేరు తెలువని పువ్వొకటి
తన్ను తాకమని
యవ్వన మకుటాల్ని చాస్తది

జీవన ప్రభాత వాకిట
రూపుదిద్దుకున్న పిందె
వయ్యారంగా వూగుతూ
ఆహ్వానం పలుకుతది

పంకిలమంటినా
పంకజమన్నా, పారిజాతమన్నా
పరవశత్వమే

నిద్రగన్నేరు
అనేక
నిదుర రాని రాత్రుల్ని
బహూకరిస్తది

కాగితపు పువ్వు
చేసిన తప్పులకు
చేతులు జోడిస్తది
ఆకాశానికి నిచ్చెనలేస్తున్న కొబ్బరి చెట్టు
ఒంగి
పాదాలు ముద్దాడుతది

కాలం పొడుగూతా కలగన్న
బొడ్డుమల్లె
ఒడిల వెన్నెల పూలు పరిచి
పిలుస్తది

నా రక్తం కళ్ళజూసిన
ముళ్ళ మీద అలిగి
ఎర్ర గులాబి
అంతర్థానమైతది

నీరెత్తినట్టు వుండని నిమ్మ
కాయల చప్పట్లతో
ఉత్సాహపరుస్తది

నారింజ
పండ్లు
ఇకిలించి
నవ్వించ చూస్తది

తీగమల్లె,జాజిమల్లె
బంతి,చామంతి
జీవితానికి
వాసనలద్దుతవి

అన్నింటినీ మించి
అప్పుడప్పుడూ
హఠాత్తుగా
ఒక కోయిల ప్రత్యక్షమైతది
పలుకుల ప్రవాహంలో నను ముంచుతది
నాకు ఒంటరితనంలాగే
తనకు రంగుమీద బెంగ
నేను అంత: సౌందర్యాన్ని మించింది లేదంటాను
తను నేనున్నానంటూ చేతులు కలుపుతుంది

బుసకొట్టి బుసకొట్టి
అలిసిన ఒంటరితనం
ఊపిరాడక తోకముడుస్తది