నాలుగు పాదాల ధర్మాన్ని
నాలుగు వందల ఏండ్ల నుంచి నిలబెట్టిన
భాగమతి ప్రేమ ప్రతీకను
కులీ కలల పుత్రికను
అనారోగ్య పీడనలనుంచి రక్షించే
ఉమ్మీద్‌వార్‌ను
నేను చార్మినార్‌ను
నేను హైదరాబాద్‌ను.
యురోపియన్ మొగలాయి
సంగమ కళతో
ఉత్తర దక్షణాల్లో
సలాబత్ జంగ్ పుదిచ్చిన
నాలుగేసి మహల్‌లను
చౌమల్లా ప్యాలెస్‌ను
నేను హైదరాబాద్‌ను.
వందమందిని ఒక్కసారి ఒదిగించుకునే
రోజ్‌వుడ్ మేజా బల్లతో
పాలరాతి పదసోపానాలతో
వెనెటియన్ షాండిలియర్‌లతో
వికార్ వుల్ వుమ్రా స్థిరపరిచిన
ప్రపంచ ధనైక నవాబు
అతిథి గృహాన్ని
ముఖరంజా ముద్దుబిడ్డడి ఆస్తిని
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను
నేను హైదరాబాద్‌ను
మహబూబ్ అలీ
విలాసాల మస్సారత్ మహల్‌ను
పురానీ హవేలీని
నేను హైదరాబాద్‌ను
హోప్, నూర్ ఉల్ ఐన్
రిజెంట్, కోహినూర్ వజ్రాలగనిని
మధ్యయుగపు మహిమాన్విత నిర్మాణాన్ని
ఒక కాంతి సముద్రాన్ని
శత్రు దుర్భేద్య దుర్గాన్ని
నేను గోలుకొండను
నేను హైదరాబాద్‌ను
ది బెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా
మీర్ యూసఫ్ అలీఖాన్ పొందుపరిచిన
దేశ చరిత్ర వర్తమాన దర్పణాన్ని
వెల్డ్ రెబెక్కా, మ్యూజికల్ క్లాక్
వింతల సమాహారాన్ని
సాలార్‌జంగ్ మ్యూజియాన్ని
నేను హైదరాబాద్‌ను.
పెట్టుబడుల
పుట్టగొడుగు మందిరాలకు నెలవైన
నౌవత్ పహాడ్‌ను
నేను హైదరాబాద్‌ను.
గోలుకొండ గొంతు తడిపిన
తటాకాన్ని
దుర్గం చెరువును
నేను మైదరాబాద్‌ను
కుతుబ్‌షాహీ
అసఫ్‌జాహీ వంశవారధిని
హుస్సేన్‌షా వలీ చేతిల
విరబూసిన తామరను
హుస్సేన్ సాగర్‌ను
నేను హైదరాబాద్‌ను.
‘రక్తం రుచిమరిగిన రాజు’ గా
చిత్రిక కట్టబడ్డ
నిజాం నిర్మించిన
జంట జలాశయాలం
నగర దాహార్తి తీర్చే
ఉస్మాన్ సాగర్‌ను, హిమాయత్ సాగర్‌ను
నేను హైదరాబాద్‌ను
మక్కా ఇటుకల
మహిమాన్విత మసీదును
నగర కలికితురాయిని
నేను హైదరాబాద్‌ను
పఠాన్, పార్సీ,హిందూ
కళా సంగమమంలో వెలిసిన
అద్భుత కట్టడాన్ని
నగర సిగ పువ్వును
కుతుబ్‌షాల సమాధిని
నేను హైదరాబాద్‌ను
వలస పాలకుల గుండెల మీద
ఎగిరి తన్నిన
తుడుం ఖాన్‌ను
మరో భగత్‌సింగ్‌ను
తుర్రేబాజ్ ఖాన్‌ను
నేను హైదరాబాద్‌ను
మతాల కఫన్‌ను చింపుకొని
ప్రజల పక్షాన కలం ఝుళిపించి
ఇమ్రోజ్ కొరకు
రక్తం ధారపోసిన
షోయబుల్లా ఖాన్‌ను
నేను హైదరాబాద్‌ను.
కలల ఉల్లారబోసుకునే
లిబర్టీని, సంగీత్‌ను
జమ్రుద్‌ను, నవరంగ్‌ను
దిల్షాద్‌ను, నేను దిల్‌దార్‌ను
నేను హైదరాబాద్‌ను
తీరొక్క జబ్బుల నయం చేసే
తీరొక్క చికిత్సల నెలవులం
నేను జజ్జిఖానాను
ఇయన్‌టిని, దారుషిఫాను
బొక్కల దవాఖానాను, ఛాతీవైద్యశాలను
ఉస్మానియాను, కోరంటిని
ముఖ్యంగా నీలోఫర్‌ను
నేను హైదరాబాద్‌ను
పారిశ్రామిక విప్లవ ఫల
అనుకరణను
నేను సింగరేణిని, ఆల్విన్‌ను
హెచ్‌ఎమ్‌టిని, ఐడిపియల్‌ను
ప్రాగాటూల్స్‌ను
నేను హైదరాబాద్‌ను
రాజుకు ప్రజలకు మధ్య
పరుచుకున్న వారధిని
విస్తరించిన భవిష్యత్ దిక్సూచిని
నగర కొత్వాల్‌ను
రెడ్డి హాస్టల్‌ను,లేడీ కాలేజీని
బాలికల పాఠశాలను
బహుముఖ ప్రజ్ఞను
నేను సర్ బహదూర్‌ను
నేను హైదరాబాద్‌ను
వసుధ మీద
తొట్టతొలిగా
విశ్వవిద్యాలయ విద్యను
మాతృభాషలో బోధించిన
చదువుల ఒడిని
నేను ఉస్మానియాను
నేను హైదరాబాద్‌ను
అనంతగిరి పర్వత శ్రేణుల్లో పుట్టి
హొయలు పోతూ, వంకర్లు తిరుగుతూ
ప్రజల దూప తీర్చ
నగర నడిబొడ్డన పొంగిన తడిని
నేను ముచుకుందను
నేను హైదరాబాద్‌ను
బోనమొండి
యాపమండ చేతబూని
రంగం సిద్ధం చేసి
బయిలెల్లితె
మహంకాళి జాతరను
భవిష్యవాణి వినించే అమ్మను
నేను హైదరాబాద్‌ను
దట్టిగట్టి, కుడకల పేర్లు కట్టి
దరువులేసి
ఊరేగింపై సాగి
అగ్ని గుండంల అస్సోయి దూలా ఆడే
పీరీల పండుగను
నేను హైదరాబాద్‌ను
నా తండ్రి కులీ కలగన్న తటాకాన్నై
నానా జాతి చేపల నాలోకి ఒంపుకున్న
గంగ జమున తహజీబ్‌ను
సమభావ సాంస్కృతిక ప్రతీకను
నేను హైదరాబాద్‌ను
నేను తెలంగాణను.
హైదరాబాదు ప్రతి గల్లి తిరిగినట్లు , కళ్ళముందు ప్రతి స్పాట్ విసిట్ అయిపోయింది సర్ . థాంక్స్ .
ధన్యవాదాలు