కథ

ఈ బంధం పేరేంటి?

అక్టోబర్ 2013

రాత్రి ఆలశ్యంగా రూంకి వచ్చి తలుపు తాళం తీస్తుండగా పక్క రూం నుండి స్త్రీల గొంతులు గల గల లాడుతూ. ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆ మాటల వెంటనే చంటి పిల్లాడి నవ్వులు వినబడుతున్నాయి. ఓహ్ అప్పుడు గుర్తుకొచ్చింది పక్క రూం ఖాళీ అవడం వలన ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకుంటా……. కాని నేనుంటున్న బిల్డింగ్ మొత్తంబ్రహ్మహారుల రూములే! ఒక పెద్ద హాలు, కిచెన్ ఉన్నా.. వాటిని ఇళ్ళు అనడానికి వీల్లేదు! మరి ఈ బాచిలర్ల మధ్యన ఫ్యామిలీ ఏమిటని ఆశ్చర్యం కలిగినా, బాగా అలసిపోవడం వలన ఇహ ఆ విషయం అంతటితో వదిలేసి తొందరగానే నిద్రపోయాను.

మరసటి రోజున బయటకెళ్ళి టిఫిన్ చేసి రూమ్‌కు చేరుకొని తాళం తీస్తుండగా పక్క రూమ్‌లో నుండి అప్పుడే 30 ఏళ్ళ వ్యక్తి బయటకు వచ్చి, “నా పేరు రాజు, మీ పక్క రూం లో కొత్తగా వచ్చాను” అంటూ పరిచయం చేసుకున్నాడు.

“ఓహ్..నా పేరు…” అని చెప్పి, “ఇక్కడంతా బ్యాచిలర్స్ కదా మరెలా మీరు…..? ” అని అర్థోక్తి లో ఆగాను.

“మాకు సొంత ఇల్లు ఉంది ఉస్మానియ క్యాంపస్ వద్ద. నా భార్య ఇక్కడ ఓ ఎమ్.ఎన్.సి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కొత్తగా జాబ్ వచ్చింది . మాకో మూడు నెలల బాబు ఉన్నాడు. మెటర్నిటీ సెలవలు అయిపోయాయి. ఇల్లు దూరంగా ఉండడం వలన బాబుకు మిల్క్ ఫీడింగ్ కష్టమవుతుంది, అందుకే కాస్త ఆఫీస్ కి దగ్గరగా తాత్కాలికంగా కొన్ని రోజుల వుండడానికి ఇక్కడికొచ్చాము ” వివరించాడు.

“కానీ… బ్యాచలర్ రూమ్స్ మధ్యన ” కాస్త సంశయించాను.

” మా మిసెస్ కోలిగ్ ఇదే వింగ్‌లో మొదటి రూంలో వుంటున్నారు. ఇక్కడ అంతా మంచి వారు సమస్య లేదని అతను చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. అందునా.. అతను మాకు పక్కనే ఉండడం మూలాన మాకు సపోర్టే తప్ప సమస్య లేదు లెండి ” అన్న అతని మాటతో తలూపి……

బాబుని చూద్దామనుకొని ఉద్దేశంతో ఆయన రూమ్‌లోకి తొంగి చూసి… ఊయల్లో నిద్దరలో ఉండడం తో అతనికి బై చెప్పి నా రూం లోకి వెళ్ళాను.

నా ప్రాజెక్ట్ పనుల బిజీతో, దాదాపుగా రెండు నెలలపాటు పక్క రూం అతనితో మాట్లాడే సమయమే దొరకలేదు. నా రాక పోకల మధ్యలో వారి మూణ్ణెళ్ళ బాబుని గమనిస్తూ వుండేవాడిని.

వాడిని చూస్తే అసలు మూడునెలలు పిలాడిలా కనపడడు ! లావుగా, బొద్దుగా, ఎర్రగా కాశ్మీరి యాపిల్ పండులాగ ఉన్నాడు. దానికి తగ్గట్టే “పండు” వాడి ముద్దు పేరు! నిజం చెప్పాలంటే సినిమాల్లోను, కథల్లోను అంటారుగా గుమ్మడిపండు లాంటి పిల్లోడు అని, అచ్చు అలాగే ఉన్నాడు.

ఓ రెండు నెలల తర్వాత నా ప్రాజెక్ట్ పని పూర్తి అయ్యింది. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి మధ్యన ఓ మూడు నెలల గ్యాప్ ఉంటుంది, ఆ మూడు నెలలు విశ్రాంతి నాకు.

ఆ వెసులబాటు సమయంలో బాబుతో గడపడానికి నాకు సమయం దొరికింది.

ఒక రోజు ఉదయం 10 గంటలకి రూం బయట ఉన్నా ఖాళీ స్థలం లో నించున్నాను. వసారా అనొచ్చునేమో దాన్ని !
“హలో” అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తే మా పక్క రూం లో ఉన్న రాజు తన బాబుతో నించొని ఉన్నాడు వెనుకే.
“హలో” అంటూ పలకరించాను బదులుగా !

అతని చేతుల్లో ఉన్న బాబు నా వంక ఎవడ్రా ఈ కొత్త మొహం అనుకుంటూ కొత్తగా చూస్తున్నాడు . బాబుని చూస్తూ నేను పలకరింపుతో చిటికెలు వేస్తూ నవ్వాను. వాడు అలాగే వింతగా చూసూ ఉండిపోయాడు

సరే “దా” అంటూ చేతులు చాచి నేనే కాస్త చొరవతో బాబుని అందుకున్నా రాజు నుండి.

అంతే మెల్లిగా నూటొక్క రాగం మొదలయ్యి పెద్దగా వచ్చేసరికి, రాజు నవ్వుతూ “లేదు రా” అంటూ వాడిని అందుకొంటూ “కొత్త కదా, అందుకే ఏడ్పు” అంటూ సముదాయించాడు.

నాకెందుకో కొంత వెలితిగా అనిపించింది. ఎత్తుకోగానే వాడు కిల కిలా నవ్వుతూ నా గుండెమీద ఒదిగి పోతే ఎంత బాగుండేది అనిపించిందో క్షణం. వాడిని ఎలాగైనా దగ్గరకు తీయాలని, మచ్చిక చేసుకోవాలని గాఢంగా అనిపించింది మనసులో. అనుకోని విధంగా ఆ మరుసటి రోజే నాకు ఆ అవకాశం దొరికింది.

రాజు భార్య ఆఫీసుకు వెళ్ళినట్లుంది, అతను వంట పనిలో బిజీగా ఉన్నాడు. రాజు ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది .భార్యకు కొంతైనా ఇంటి పని మిగలనివ్వడు. ఇంటిపని వంటపని పిల్లాడి పని మొత్తం తనే చూస్తాడు .

ఊయలలో ఉన్న పండు గాడు మాత్రం ఆడించే వాళ్ళు లేక బిక్క మొహం వేశాడు. నేను మెల్లిగా దగ్గరికెల్లి చిటికెలు వేస్తూ చేతులు చాచాను.

రాజు నన్ను గమనించి “నా పనులు తొందరగా తెమలట్లేదు, పండుకేమో ఆకలిగా ఉన్నట్లుంది ఈ అరటి పండు తినిపించాలి” అని అనగానే,

“సరే , నేను తినిపించనా “అని నేను అనడమే ఆలస్యం “థాంక్సండీ బాబూ”అని రాజు నాకు అరటి పండు అందించాడు.

అరటిపండు తీసుకొని మెత్తగా స్పూన్ తో నలుపుతూ పండు నోటికి అందిస్తూ కూర్చున్నాను. అరటి పండు అంతా అయ్యాక, మెల్లిగా నా వద్దకు వచ్చాడు. నాతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. అది చూసిన రాజు “పండు ఒక్క అరటిపండు తినిపించగానే ఫ్రెండ్ అయిపోయావాభడవా” అంటు హాస్యలాడాడు….! ఆ మాటల మద్యలోనే రాజు భార్య రావడంతో

ఆవిడకు పరిచయం కూడా చేసాడు. ఆవిడ పేరు అంజలి.

వారిద్దరిది ప్రేమ వివాహం. అంజలి గుజరాత్ అమ్మాయి, తాతాల కాలం నాటినుండి హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు, తెలుగు చాలా సరళంగా మాట్లాడుతుంది. అంజలి ఎం.సి.ఏ, రాజు బీ.టెక్ చేసారు.

“అదెలా ఇద్దరు ఎలా కలిసారు?” అని ప్రశ్నార్థకంతా చూసాను రాజు వైపు.

మొత్తానికి వీర గాధే ఇద్దరిదీనూ! తల్లి దండ్రుల్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారట. ఇప్పుడు అందరూ కల్సి పోయినట్లే! ఏ సమస్యలూ లేవు.

ఆ రోజు మొదలు ఇక వాళ్ళ నాన్నను వదిలి నాతోనే గడపడం మొదలెట్టాడు పండు. ఒక దశలో అసలు వాళ్ళ నాన్న వద్దకు వెళ్ళడం కూడా మానేసాడు. అది ఆయనకు కాస్త విశ్రాంతి గా కూడా అనిపించి వాడిని నా మీదే వదిలేసే వాడు.

పండు పూర్తిగా నాకు అలవాటు పడ్డాడు. రోజంతా నావద్ద ఉంటున్నాడు కేవలం రాత్రిళ్ళు నిద్రపోవడం మాత్రమే వాళ్ళ రూం లో ఉంటున్నాడు. అంజలి ఆఫీస్ వేళల్లో మధ్యలో వచ్చి బాబుకి పాలు ఇవ్వడానికి వచ్చిన సమయంలో తల్లి వద్ద వుండి…తర్వాత ఆమె వెళ్లాక మళ్లీ నారూమ్‌లోనే వుండిపోతున్నాడు. అంజలి మళ్ళీ రాత్రి ఏ 9 కో వచ్చేది. ఆ వచ్చినప్పుడు ఓ రెండు నిమిషాలు అంజలి వద్ద ఉండి మళ్ళీ నా రూం లోకే వొస్తున్నాడు పండు. రాత్రి ఏ 11 కో లేక 12 కో నిద్రపోయాక వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. నా రూములోనే వాడి తిండి తిప్పలు .. ! వాడు ఒకట్లు రెండ్లు చేస్తే కడగటం నా పనే ! అంజలి వస్తే వోరుకునేవాడు కాదు . కేకలు పెట్టి దగ్గరికి రానిచ్చే వాడు కాదు .

ఎంతలా నాతో పండు పెనవేసుకపోయాడంటే…… పండు రూమ్‌లో పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు వున్నాయి, మెత్తటి పరుపు, తాత్కాలికంగా వుంటున్నారు కాబట్టి తెచ్చుకున్న ఏయిర్‌కూలర్, మంచి ఉయ్యాల…ఇంకా ఏమిటేమిటో! వాడికి మాత్రం అవేవీ పట్టేవి కావు. అవేవి లేని బ్యాచలర్ రూమ్‌లో చింకి చాప మీదనే ఆడుకొంటూ వుండిపోతున్నాడు. రూమ్‌లో చీమలు పరిగెడుతూ వుంటే వాటి వెంట పరిగెడుతూ ఆడుకొంటు వుండేవాడు. ఆ చీమల సైజు అవి అలా వరసగా పోవడం వాడికి వింతగా ఉండేదేమో, ఆ వరస వెనకాలే దోగాడుతూ వెళ్ళేవాడు. మధ్య మధ్యలో నా వొళ్లోకి వచ్చి నాకళ్లోకి ఓ రెండు మూడు క్షణాలు చూసి, నేనే ..తన మనిషినే అని గుర్తించాక, “అమ్మయ్య, ఇక్కడే ఉన్నావా” అనే భరోసాతో మళ్లీ ఆటల్లోకి వెళ్లే వాడు.

మా మద్యన అనుబంద ఎంతలా ముదిరిపోయిందంటే……నేను ఎక్కడికెళ్లినా నాతో వుంటున్నాడు పండు. బజారుకు, మార్కెట్‌కు ఎవరైనా ఫ్రెండ్స్ వొస్తే వారితో పాటు కారులో వెళ్తున్న సమయంలో కూడ నాతోనే వుంటున్నాడు, చివరకునా ఫ్రెండ్స్ “ఏంట్రా పిలల్ల తల్లి లాగ వీడిని వెంటేసుకొని తిరుగుతున్నావు” అనే సటైర్స్ వేసే దశకు చేరింది పరిస్థితి. ఒక్కడినే బయటికి వెళ్తే “ఏడీ ? నీ దత్త పుత్రుడు ? ఒక్కడివే వొచ్చావేం “అని జోకులు కూడా!

ఒకరోజు ఉదయాన్నే పని మీద వెళ్ళి మధ్యాహ్నం కానీ ఇల్లు చేరలేక పోయాను. వస్తూనే అలసటతో నిద్రకు పడ్డాను. నిద్ర మధ్యలో మాటలు వినిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. గడప మీద చేతులు ఆనించి మోకాళ్ల మీద కూచుని ఉన్నాడు పండు. ముక్కు అంతా ఎర్రగా వాచి ఉంది. కళ్ళలో ఇంకా నిలిచే ఉన్న నీటి బొట్లు. ఎందుకో గుండెలో కలుక్కుమన్న భావన. ఒక్క ఉదుటున లేచి

“అయ్యో పండు ఏమైందిరా ” అంటూ ఎత్తుకొన్నాను. నా మాటలకు అంజలి బయటకొచ్చి…..

“ఉదయం నుండి ఇలానే గడప మీద చేతులు పెట్టుకొని మీ తలుపు వైపు చూస్తూ అలానే మోకాళ్ల మీద నించోనే వున్నాడు, వాడికి తాళం వేసి వున్నదన్న సంగతి అర్థం కాదుగా..అంకుల్ లేడని ఎంత చెప్పినా వెనక్కు రాలేదు..అలానే వున్నాడు కదా నిద్రొచ్చిందేమో అలానె గడప మీద నుండి ముందుకు తూలాడు..అంతే ముక్కు కి దెబ్బ తగిలింది” వివరించించి విషయం… !

చూస్తే సర్కస్‌లో ని బఫూన్‌లకు ముక్కు ఎర్రగా దొండపండులా వున్నట్లు పండు ముక్కు కూడ అలా అయ్యింది. బాదపడాలొ..లేక ఎర్రటి ముక్కుతో వున్న పండును చూస్తూ నవ్వాలో అర్థం కాలేదు నాకు. వరసగా, చూడడానికి ఒకే రకంగా ఉండే గదుల మధ్య వాడు నా గదిని ఖచ్చితంగా గుర్తు పట్టి అక్కడే పడిగాపులు కాయడం ఆశ్చర్యంగా తోచింది !

నేను బయటికి వెళ్ళినా, వచ్చేవరకు నా కోసం ఆ పసి వాడు ఎదురు చూస్తున్నాడన్న విషయం తెలీడంతో గుండెలో ఏదో నిండిపోయిన భావన. అన్ కండిషనల్ ప్రేమ అంటే పిల్లలు ఇచ్చేదేనా? ఏమో!

పండు గాడిని కోప్పడితే వాడికి అర్థమవుతోందిప్పుడు. అంజలి విసుక్కున్నా కోపగించినా గబ గబా గది దాటి దోగాడుతూ నా దగ్గరికి వచ్చేసేవాడు. అంజలి పిలిచినా వెళ్ళేవాడు కాదు. ఇలా ఒకటి రెండు సార్లు జరిగాక అంజలి మొహంలో పాపం వెలుగు తగ్గడం గమనించాను. నాకే అయ్యో అనిపించింది.

“పండూ, వెళ్ళు, అమ్మ దగ్గరకు”అని నేనే వాళ్ళ గదిలో దింపేసి వచ్చేవాడిని

నేను అక్కడే ఉన్నపుడు వాడు కింద పడినా సరే నేనే వెళ్లి లేపి ఎత్తుకోవాలని మారాం చేసే వాడు. ఇతరులతో మాటల్లో పడి వాడిని పట్టించుకోక పోయినా ఏడ్చి గోల పెట్టేసి భుజం ఎక్కేసే వాడు . ఎత్తుకుంటూ ఉండగానే అప్పుడప్పుడే గట్టి పడుతున్న వాడి లేలేత చిగుళ్ళతో నా చొక్కా అంచుల్ని కొరుకుతూ మెడ వంపులో మోము దాచుకుని జుట్టు గట్టిగా పీకే వాడు “నన్ను నిర్లక్ష్యం చేయకు సుమా “అన్నట్లు చూస్తు వాడి ప్రేమను నానా రకాలుగాను ప్రదర్శించే వాడు .”నువ్వంటే నాకిష్టం “అని పలు రకాలుగా నాకు తెలియ జెప్పాలని ప్రయత్నించే వాడు .

ఎలా తెలుస్తాయి పసి వారికి ఇవన్నీ ? ఏ ప్రకృతి నేర్పుతుంది ? ఏ బంధం ఏ అనురాగం ప్రేరేపిస్తాయో !!

పిల్లలతో ఏర్పడ్డ బంధాన్ని తెంచుకోవడం ఎంత కష్టమో అనిపిస్తుండేది . అలాటి రోజు ఒకటి రానే వచ్చింది.

ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికీ మనసు భారంగా అయిపోతుంది. సాయంత్రం బయటి నుంచి వచ్చి గేట్లోంచి అడుగు లోపల పెడుతుండగానే కింద కాపురం ఉండే ఓనర్ భార్య, ఆమె ఇద్దరు కూతుళ్ళు,వారి పక్కింటామె … వీళ్ళందరితో అంజలి గల గల కబుర్లు చెప్తూ కనిపించింది. పండు ఓనరమ్మ చంకలో ఉన్నాడు. నేను అక్కడికి రావడంతోనే ఆవిడ “ఆగండాగండి, తమాషా చూద్దాం, పండుగాడు ఎవరి దగ్గరికి వెళ్తాడో”అంటూ “ఏవండోయ్, వాడిని రమ్మని అడగండి” అంది నా వైపు చూస్తూ.

ఇరుకులో పెట్టడానికి ఈవిడకు నేనే దొరికానా అనిపించి చిరాకు వేసిందో క్షణం.

“భలే వారే, వద్దు లెండి” అనబోతుండగా అంజలి వాడివైపు చేతులు చాచింది నవ్వుతూ. పండు కొద్దిగా సంకోచిస్తున్నట్లు పువ్వు లాంటి వాడి ఎడమ చేతిని ముందుకు చాచి అంజలి చేతిని తాకాడు. భారం దిగి పోయినట్లు అమ్మయ్య అనుకుని అక్కడి నుంచి కదల బోయాను. అదే నేను చేసిన పొరపాటు. అంజలి చేయి చాచడంతో తల్లి వైపు రాబోయాడు తప్ప వాడి కన్ను నా మీదే ఉన్నట్లుంది. ఒక్క ఉదుటున ఏడుపు లంకించుకుని, నా భుజం పట్టేసుకుని ఓనరమ్మ నుంచి గింజుకుంటూ నా మీదికి దూకాడు పండు.
అందరూ గొల్లున నవ్వులు.”నేను అనుకుంటూనే ఉన్నాను, వీడు అంకుల్ దగ్గరికే పోతాడని”అంది ఓనరమ్మ కూతురు.

అంజలి మొహంలో నవ్వు మాయమైంది. అది గమనిస్తూనే నవ్వుని మొహానికి అతికించుకుని వాడిని అంజలి చేతికి అందించి గబ గబా పైకి వచ్చేసాను.

నేను వచ్చేస్తుంటే కింది నుంచి మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి.”సొంతిల్లు ఉంచుకుని ఇక్కడ ఈ చిన్న ఇంట్లో కష్టాలెందుకు మీకు చెప్పండి? పండుగాడిని అతనికే ఇచ్చేయండి పెంచుకుంటాడు. మీరు హాయిగా మీ ఇంట్లో ఉండొచ్చు..”

ఇబ్బంది గా అనిపిస్తోంది ఆ మాటలు వింటుంటే. ఏడాదైనా నిండని పసి వాడు తనను కాదని మరీ ఎవరో పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్తే తల్లి మనసు గాయపడదూ మరి?

కానీ పాపం ఆ పసి వాడికేం తెలుసు? ఎవరు ప్రేమగా చేరదీస్తే వారి దగ్గరికి వెళ్తాడు.అంతేగా! కానీ నొచ్చుకున్న అంజలి మనసు ఈ సత్యాన్ని ఒప్పుకోవద్దూ!

రెండు రోజులు పండు గాడి కంట పడకుండా మానేజ్ చేశాను. వాడి పువ్వు లాంటి మెత్తని స్పర్శ, నన్ను చూడగానే మిల మిల మెరిసే వాడి కళ్ళు,ఎత్తుకోగానే భుజం మీద వాలి నా మీడ చుట్టు వేసే వాడి చేతులు.. ఇవన్నీ గుర్తొస్తే గుండెలో ఏదో ఖాళీ తనం. పసి పిల్లల స్పర్శ లో ఎంత అలౌకికమైన ఆనందం! ఎలాటి ఆశింపులూ కోరని ఆ స్పర్శలో ఎంతటి దైవత్వం!!

వాడిని ఎత్తుకోవాలని, గుండెకు హత్తుకోవాలని తీవ్రమైన కోరిక. ఒక్కోసారి ఈ సంఘర్షణ భరిచలేక అన్నీ తోసిరాజని వెళ్ళి పండుని నా దగ్గరికి తెచ్చేసుకోవాలని అనిపించేది.

ఎప్పుడైనా నేను రూములో ఉన్నపుడు కూడా తలుపు మూసి ఉంచడం మొదలు పెట్టాను. పండు నా గది వైపు పాక్కుంటూ వస్తుంటే అంజలి “అంకులు లేరు ఇంట్లో..” అనో “అంకుల్ బజ్జున్నారు పండూ, వెళ్ళకు”అనో అనడం వినిపించేది.

ఒకరోజు మధ్యాహ్నం నేను వచ్చేసరికి పండు వాళ్ళ గడప మీద మోచేతులు ఆనించి నా రూము వైపే చూస్తూ కనిపించాడు. గుండెలో ఏదో మెలిదిరుగుతున్న భావన. వాడు నన్ను గమనించక ముందే భారమైన గుండెతో మెట్లు చక చకా దిగేసి బయటపడ్డాను.
కానీ ఆ రోజు గేటు దగ్గర జరిగిన సంఘటన తాలూకు ఫలితం నెలాఖరున కనపడనే పడింది. నెలాఖరుకు ఇల్లు ఖాళీ చేసారు రాజు దంపతులు.

వెళ్ళే రోజు నా దగ్గరికి వచ్చి “అనుకోకుండా మంచి ఇల్లు దొరికింది. తప్పకుండా మా ఇంటికి వస్తూ ఉండండి. మా కోసం కాకపోయినా పండు గాడి కోసమైనా రండి”అని మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అడ్రస్ ఇచ్చారు .

తప్పక వస్తానని చెప్పాను. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళి పోయాక శూన్యత్వం అంటే ఏమిటో తెల్సింది. మెట్లు ఎక్కుతూ ఉండగానే పండు గాడు పాక్కుంటూ నా దగ్గరికి వస్తాడేమో అన్న ఊహతో ఎక్కే వాడిని..వాడు అక్కడ లేడని తెల్సినా కూడా !

వాళ్ల తలుపు వైపు చూస్తుంటే పండు మోచేతులు గడప మీద ఆనించి నా రూముకేసి చూస్తుండే దృశ్యం గుర్తొచ్చేది. రాజు ఇంటికి వెళ్ళి పండుతో మనసారా ఆడుకోవాలని వాడిని ఎత్తుకుని తిప్పాలని పదే పదే పీకేది.

వాడిని తలపుల్లోంచి తోసి వేయడానికి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.

ఇంతలో కొత్త ప్రాజెక్ట్ రావడం, రాజు వాళ్ళు ఉన్న గదిలోకి మరెవరో రావడం వీటన్నిటితో నెమ్మదిగా మామూలు మనిషిని అయ్యాను. మధ్యలో రాజు రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు రమ్మని. అయినా నియంత్రించుకున్నాను.

ఆరు నెలల తర్వాత పండుగాడికి బొమ్మలు తీసుకుని రాజు ఇంటికి వెళ్ళాను.

వాకిట్లో ఆడుకుంటున్న పండు నన్ను చూస్తునే కొత్త మనిషిని చూసినట్లు బెదురుగా తప్పటడుగులు వేస్తూ లోపలికి తుర్రుమన్నాడు.
నా మనోఫలకం మీద ఇంకా ఆ పాకే పసివాడి రూపమే ముద్రించి ఉన్నది. వీడేమో అప్పుడే నడక దాకా ఎదిగాడు.

రాజు, అంజలి సాదరంగా ఆహ్వానించారు. పండుని పిల్చి “అంకుల్ రా.. మన అంకులే! నువ్వు ఎప్పుడూ అక్కడే ఉండేవాడివి..”అంటు నానా రకాలుగా వాడికి నన్ను గుర్తు చేసే ప్రయత్నాలు చేసారు కానీ పండు నన్ను కొత్తగానే చూస్తుండి పోయాడు.
కొద్దిగా రిలీఫ్ గా ఉన్నా , లోలోపల ఏదో తెలీని నొప్పి. వాడికి నాకూ మధ్య ఎవరూ వర్ణించలేని ఒక ప్రేమానుబంధం ఉండేది. అది నాకు గుర్తుంది. దాన్ని నేను ఇంకా అనుభవిస్తున్నాను. వాడు దూరమైతే ఎంతో బాధ పడ్డాను. వాడికి మాత్రం అది గుర్తు లేదు.
ఎవరిమీదో తెలీని ఉక్రోషం వచ్చింది.

నేను తెచ్చిన బొమ్మలు కూడా అంజలి తీసుకుని వాడికిస్తే తీసుకున్నాడు. దగ్గరకు తీసుకుని ఎత్తుకుంటే ఆ స్పర్శలో ఇదివరకు వాడు చూపించిన పిచ్చి ప్రేమ, ఆత్మీయత లేవు. ఇబ్బందిగా కదులుతూ… రెండు నిమిషాలుండి కిందకు జారి పోయాడు.
మరో గంట తర్వాత,… వస్తానంటూ సెలవు తీసుకుని బయట పడ్డాను. పండు నన్నింకా కొత్తగానే చూస్తూ చెయ్యి వూపుతుండగా..
పసి బిడ్డలతో బంధం పెనవేసుకోవాలంటే అది రక్త సంబంధమే అయి ఉండాలా?పేగు బంధం, కన్న కడుపు అందుకే అంత ప్రేమ.. అంటారే? అది తల్లికేనా? పేగు బంధం ఉంటేనే బంధం పెరుగుతుందా? వాడు తల్లిని వొద్దని నా దగ్గరికి దూకిన క్షణంలో అంజలి మనసు నొచ్చుకుని ఉండొచ్చు. కానీ వాడిని చూడకుండా ఆ పసి స్పర్శ లోని లాలిత్యాన్ని ఆ ప్రేమను అనుభవించకుండా, వాడిని ఎదురుగానే ఉంచుకుని ఎత్తుకోకుండా..వాడికి నన్ను దూరం చేసుకుని నేనెంత వేదన పడ్డాను?

నా బంధానికి ఏ పేగు బంధం కారణం?

తల్లి ప్రేమ తల్లులకే ప్రత్యేకమా? మరి నా ప్రేమ? వాడి చుట్టూ పెంచుకున్న నా బంధం..? దీనికే పేరు పెట్టాలి…?దీనికసలు పేరుందా?
మనసులో రేగే ఆలోచనలకు ఆనకట్ట వేసే ప్రయత్నాన్ని నిట్టూర్పు వెనుక దాచి అడుగులు ముందుకు వేశాను.