కథ

అమెరికాలో అస్తిత్వం

అక్టోబర్ 2013

“మహతీ ” భర్త రఘు పెట్టిన గావు కేకకి మూడు నెలల బాబుని నిద్ర పుచ్చుతున్న మహతి హడిలిపోయింది. నిద్దట్లోనే కెవ్వుమన్నాడు పసికందు రాహుల్. ఒక్కసారి వాడిని గుండెలకి హత్తుకున్న మహతికి రఘు ఉగ్ర స్వరూపం చూడగానే ఊపిరి ఆగినట్లయింది.

“ఏమయిందండీ” సన్నని స్వరంతో అడిగింది.

“ఇంకా ఏమవ్వాలి? అసలు నీకు నేనంటే ఏమన్నా లెక్క ఉందా? ఈ మధ్య చూస్తున్నాను, కట్టుకున్న మొగుడికి తిండీ తిప్పలు ఉన్నాయా? వర్క్ కి వెళ్ళేటప్పుడు బట్టలు ఇస్త్రీ ఉన్నాయా, అని ఏమన్నా జ్ఞానం ఉందా నీకు?”

అతని కోపానికి కారణం తెలియక చేతిలోనున్న బాబుతో సహా మధ్య గదిలోకి వచ్చింది మహతి. అలాగ తనని చూడగానే ఇంకా రెచ్చిపోయాడు రఘు.

“మాట్లాడితే చాలు ఆ వెధవని ఒకడ్ని అడ్డం పెట్టుకొస్తావు. అన్నీ వేషాలు, వాడిని చేతిలో పట్టుకుంటే నిన్నేం చెయ్యలేననేగా నీ ధీమా?ఉండు నీ సంగతిలా కాదు” అని ఒక్కంగలో వచ్చి జుట్టు పట్టుకున్నాడు రఘు.

“ప్లీజ్, నన్నేం చెయ్యకండి. బాబుని పడుకోపెట్టివస్తాను, నిస్సహాయంగా అర్ధించింది మహతి.

ఇంతలో తన అదృష్టం బాగుండి, రఘు సెల్ ఫోన్ మోగింది అంత కోపం లోనూ, ఫోన్ నంబర్ చూడగానే, సడన్ గా గొంతు అతివినయంగా మార్చి ,”ఓ హాయ్ ,ఐ యాం ఆన్ మై వే ” అంటూ మళ్ళి మహతి మొహం చూడకుండా తలుపు ధడాల్మని వేసుకుని వెళ్ళిపోయాడు.

మహతికి ఏం చెయ్యాలో అర్ధం కాక అలా ఎంతో సేపు చిత్తరువులా నిల్చుండిపోయినది. ఇంతలో చేతిలో నున్న పిల్లవాడు కదిలేసరికి, చైతన్యం వచ్చి, ముందుగా వాడిని తీసుకెళ్ళి క్రిబ్ లో పడుకో బెట్టింది .

అసలు మహతికి తన జీవితం తలా తోకా లేకుండా అయిపోతున్నట్లనిపించినది . అతి నీరసంగా ఉన్నా కూడా, వోపిక చేసుకుని కొంచెం హార్లిక్స్ కలుపుకుని తాగింది మెల్లగా సోఫా లో జారగిలబడి ఒక్కసారి తన జీవితం సింహావలోకనం చేసుకుంది.

అసలు ఎక్కడ అపశ్రుతి పలకడం మొదలయింది? తను తల్లితండ్రికి ఒక్కతే కూ తురు. అల్లారు ముద్దుగా కాక పోయినా జాగ్రత్తగా ప్రేమగానే పెంచుకున్నారు తనని. తనూ బాగా చదువుకుని ఎం సి ఎ చేసింది. యూనివర్సిటీ రాంక్ కాక పోయినా ఫస్ట్ క్లాస్ లో పాసయింది . ఎమ్.బి ఏ చేద్దామనుకుంటుండగా మేనత్త కి తెలిసిన వాళ్ళని రఘు సంబంధం వస్తే నాన్న వొప్పుకోమన్నారు. తనకీ పెద్దగా అభ్యంతరం లేక పోయింది అ బ్బాయి బాగానే ఉన్నాడు, బాగా చదువుకుని మంచి ఉద్యోగం లో ఉన్నాడు. స్టేట్స్ కి వెళ్లి మూడేళ్ళయిందిట. బాగా సంపాదిస్తాడు. అతనికి ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు అయిపోయి ఒకళ్ళు లండన్ లోనూ ఇంకొకళ్ళు డెహరాడూన్ లోనూ ఉన్నారు. లండన్ లో ఉన్న అక్క గారు డాక్టర్. వాళ్ళకో చిన్న పాప. చాలా ముద్దుగా ఉండి, మహతికి పెళ్ళిలోనే బాగా చేరిక అయింది డెహరాడూన్ లో ఉన్న అన్నగారు కూడా మిలిటరీ లో డాక్టర్,ఈ మధ్యనే సివిల్ సర్విస్ లోకి వచ్చారు.

పెద్దవాళ్ళు ఇద్దరూ డాక్టర్ లు అయేసరికి, తనకి విసుగొచ్చి తను కంప్యూటర్ సైన్స్ తీసుకున్నానని రఘు చెప్పాడు, పెళ్లి చూపులప్పుడే. కాని తల్లికి మాత్రం తన చదువు ఆనదు అన్నాడు చటుక్కున. అక్కడే ఉన్న అత్తగారు, “అదేమిటబ్బాయ్ నేనెప్పుడలా అన్నాను?” అన్నారు. పెద్దగ పట్టించుకోలేదు తను.

సరే, మిగిలిన అమెరికా ఉద్యోగస్తుల్లాగే తామూ పెళ్లికాగానే మూడువారాల్లో అమెరికా వచ్చేసారు. అప్పటికే ఉద్యోగం లో మంచి పేరు తెచ్చుకున్న రఘు, మహతి తను ఉద్యోగ ప్రయత్నం చేస్తానంటే ఎందుకో వొప్పుకోలేదు. అయినా, “నీకు వీసా అదీ రావాలంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళే వీసా స్పాన్సర్ చెయ్యాలి” అన్నాడు. కాని అదేమంత కష్టం కాదుగా, “పోనీ ఎం బి ఏ చెయ్యనా అడిగింది” ఆతను విసుగ్గా చూసి, “ఏమిటి, ఏదో ఒకటి చేసి తీరాలా? ఇంటి పట్టున ఉండలేవూ?” అన్నాడు. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? అనుకుంది కాని తనది ఎక్కువగా వాదించే తత్త్వం కానందువలన అప్పటికి ఊరుకుంది.
ఇలా ఒక నెల్లాళ్ళు బాగానే గడిచి పోయాయి.

డ్రయివింగ్ నేర్చుకుంటాను అన్నప్పుడు కూడా అంతే . మొదట ఏమీ అనలేదు కాని వారం అయిపోయినా ఆత ను ఆ ప్రసక్తే తేకపోతే , తను మళ్ళి అడిగింది ఆ రోజు తనకి బాగా జ్ఞాపకం. గుత్తి వంకాయ కూర, మావిడికాయ పప్పుతో బాటు అతనికిష్టమైన కొబ్బరి పచ్చడి చేసింది ర ఘు ప్రసన్నంగా కనపడేసరికి, మెల్లిగా డ్రైవింగ్ గురించి ప్రస్తావించింది. ఏ కళనున్నాడో “సరే కానీ ,రేపు ఫోన్ చేసి ,ప్రొఫెషనల్ స్కూల్ తో మాట్లాడు. వాళ్ళే ఇంటికొచ్చి నేర్పుతారు. నా ప్రాణాలు మాత్రం తీయకు. అన్నట్లు నీ పేరు మీద ఎక్కౌంట్ ఎలాగూ ఉంది కాబట్టి ఆ చెక్కులే ఇవ్వు” అన్నాడు.

సంతోషంతో కుర్చీ లోంచి ఒక్కసారి లేచి అతన్ని గట్టిగా ముద్దు పెట్టేస్కుంది

“ఊ , చాల్లే సంతోషించాం, ఆక్సిడెంట్ మాత్రం చెయ్యకు” అన్నాడు అదేం సరసమో మరి.

ఏమయితేనేం అనుకున్నది సాధించి డ్రైవింగ్ నేర్చేసుకుంది

నిజంగా అది ఎంత పనికి వచ్చింది ఇప్పుడు! చిన్నవాడు రాహుల్ ని పీడియాట్రిష న్ కి చూపించ డానికి రఘు కి కుదరకపోతే తనే తీసుకెళ్ళింది . ఒక్కోసారి అనుమానం వస్తుంది మహతికి ,తను స్వతంత్రంగా పనులు చేసుకోవడం రఘుకి ఇష్టం ఉండదేమోనని . ఎందుకంటే తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిన రోజు ఆత ను చాలా ముభావంగా ఉన్నాడు. పసివాడిని కూడా వేలేసి ముట్టుకోలేదు. అయినా ఎందుకో మరి,రాహుల్ అని పేరు పెడతానని రఘు తనతో సంప్ర దించ కుండానే హాస్పిటల్ లో పేరు రాయించేసానని చెప్పినప్పుడు మనసు చివుక్కుమంది . గౌతమ బుద్ధుడు పరిత్యజించిన కొడుకు రాహులుడు! తనకెందు కో ఆ పేరంటే భయం . అయినా తల్లికదా తను, అతని పెత్తనమేమిటి తమ బిడ్డ కి తనొక్కడే పేరు పెట్టేయ్యడేమిటి?

ఇలాగ ఎన్ని సర్దుకు పోతున్నా మనసు ఎక్కడో అక్కడ బాధ పడుతూనే ఉంది మహతికి .

రాహుల్ ఏడుపుతో గబుక్కున ఆలోచనల్లోంచి బయటపడింది మహతి. వాడిని సముదాయించి, పాలు అవీ పట్టి, స్ట్రోలర్ లో జాగ్రత్తగా పడుకోబెట్టి , ఇల్లు తాళం వేసి క్రిందకి వచ్చింది మహతి. వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి పిల్లలు ఆడుకునే చిన్న పార్క్ లాగ ఉంది. అ క్కడ మొక్కల మధ్యన కూర్చుంటే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది . అదీ కాక తన డెలివరి ముందు అక్కడ తనకి ఎదురింటి జేమీ, ప్రక్క కాంప్లెక్స్ లోని స్నేహ, తన ఫ్రెండ్ ఆసిమా పరిచయ మయ్యారు. వారిలో జేమీ ఆసిమా చాలా నచ్చారు మహతికి. జేమీ సహాయంతో ఆసిమా డ్రైవింగ్ నేర్చుకుని పక్క వీధిలో నున్న బార్న్స్ అండ్ నోబుల్ పుస్తకాల కొట్టుకి వెళ్లి చదువుకునేది. ఆ అమ్మాయి కూడా పాకిస్తాన్ నుంచి కొత్తగా రావడం ,మొగుడు వారానికి నాలుగు రోజులు ట్రావెలింగ్ లో ఉండి శుక్రవారం తెల్లారగట్ల వచ్చి ఆదివారం సాయంత్రం వెళ్ళిపోవడం వలన వొంటరిగా ఉండేది .కాని జేమీ పరిచయం వలన ఆన్లయిన్ కోర్సులో చేరి కౌన్సెలింగ్ సర్టిఫికేషన్ చేస్తోంది . ఆ సంగతి మహతి ఉత్సాహంగా చెప్తే పాకిస్తాన్ వాళ్ళతో మనకి పరిచయాలు అక్కర్లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రఘు. బిత్తరపోయింది మహతి. దేశం వదిలి ఇన్ని వేల మైళ్ళ దూ రానా ఉండి, ఇలాటి సంకుచిత భావాలేమిటి? ఇతనసలు నాకు ఎప్పటికయినా అర్ధం అవుతాడా? మహతి కి ఆదుర్దా మొదలయింది . ఎంత సర్దిపుచ్సుకున్నా కొన్ని విషయాల్లో రఘు తో అస్సలు ఏకీభవించ లేక పోతోంది .బాబోయ్ తమ ఇద్దరి భావాలు ఎంత విరుద్ధమో.

తను అప్పుడే పిల్లలు వద్దు అనుకుంది కొన్ని రోజులు ఉద్యోగం చేసి, కొంచెం అమెరికా అంటే ఏమిటో చూసి, అప్పుడు పిల్లలుంటే బాగుంటుంది అనుకుంది. కాని రఘు చెప్పిన కారణం విని నివ్వెర పోయింది . “చూడు మహతీ , ఆఖరు వాడిని అవడం వలన నేను ఏపనీ ఫస్ట్ చేసే అవకాశం రాలేదు మాఇంట్లో . కొడుకు మాత్రం నాకే మొదట పుట్టాలి మా అక్కకి కూతురు, అన్నయ్యకి ఒకతే పాప. అందుకని మనకి కొడుకే పుట్టి తీరాలి. మా పేరెంట్స్ కి మొదటి మనవడిని ఇచ్చిన గొప్ప నాకే దక్కాలి .” మహతికి మతిపోయింది ఒకవేళ తమకి ఆడపిల్ల పుడితే? వీల్లేదు గట్టిగా అరిచాడు , అదిరిపోయింది మహతి.ఎంత సున్నితమయిన, అందమయిన విష యాన్ని ఎంత భయంకరం చేసాడితను?? మెల్ల మెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ మహతికి గాభరా ఎక్కువయిపోయేది. ఎలాగో అయిదవ నెల వచ్చాక అల్ట్రాసౌండ్ చేసి మగ పిల్లాడే అని తెలిసాక గట్టిగా ఊపిరి పీల్చుకుంది . ఆ రోజు రఘు సంబరం చూడాలి.
ఏకంగా డాక్టర్ ఆఫీస్ నుండే తన వర్క్ కి ఫోన్ చేసి, మిగిలిన రోజు సెలవు పెట్టేసాడు . ఇద్దరూ మంచి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసాక, జ్యుయేలర్ షాప్ కి వెళ్లి చక్కటి లాకెట్ ఉన్న సన్న గొలుసు కొన్నాడు. కాని యాంత్రికంగా అతనితోటి వెళ్తూనే ఉంది కాని మహతి మనసు ముక్కలయిపోయింది.

ఏమిటీ మనిషి? పోనీ ఎవరితోనయినా ఏమయినా చెప్దామంటే , ఏమని చెప్తుంది? ఆటను తనని అందలం ఎక్కిస్తాడు, అంతలో లోయల్లోకి తోసేస్తాడు. ఉద్యోగంలో ఎంతో మంచి పేరుంది . ఇంట్లోకి అన్నీ కొంటాడు ,కాని అతని మాటే చెల్లాలి, ఎప్పుడూ అందరికన్నా, ముఖ్యంగా తన అన్న అక్కల కన్నా గొప్పగా ఉండాలి. ఇతన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రతి క్షణం కత్తిమీద సాము లాటి బ్రతుకు ఎన్నాళ్ళు సాగించ గలదు?

డెలివరీకి అమ్మ వస్తానని అడిగింది . తను వాళ్ళకి ఒక్కతే కూతురు, అదీకాక మొదటి కాన్పు. ససేమిరా వీల్లేదు అనేసాడు రఘు. “నువ్వేం నచ్చ చెప్పుకుంటావో నాకు తెలియదు. నీ సంగతి, నా కొడుకు సంగతీ నేనే చోసుకోగలను. “అన్న రఘు మాట కాదనలేక , తల్లికే సద్ది చెప్పింది .తల్లీ తండ్రీ చాలా నొచ్చుకున్నారు పాపం .

తొమ్మిదోనెల వచ్చాక ఆసిమా అడిగింది ,మీ అమ్మ వస్తున్నారా అని ఇంకా ఉండబట్టలేక ఆసిమాతో రఘు కి ఇష్టం లేదని చెప్పేసింది . మాట పెదవి దాటితే పృధివి దాటుతుందంటారు .నిజమే ఆసిమా, జేమీ చాలా మంచి స్నేహితులు, అందుకని జేమీ తో చెప్పినట్లుంది . మర్నాడు పార్క్ లో కలిసినప్పుడు, జేమీ అడిగింది బావున్నావా అని. వెంటనే అంది, నీకు ఎప్పుడు ఏమి కావాలన్నా నేనున్నానని మర్చి పోకు. నేను ఒక లా ఫర్మ్ లో పని చేస్తాను. అదికాక నేను, ఆసిమా విమెన్స్ షెల్టర్ లో కూడా వాలంటీర్ గ పని చేస్తాము. నా కార్డ్ నీ దగ్గర ఉండనీ అని విజిటింగ్ కార్డ్ ఇచ్చింది.
తనకి చాలా కోపం వచ్చింది, వీళ్ళు తమ గురించి ఏమనుకుంటున్నారు? కాని ఒక్క క్షణం తమాయించుకునేసరికి ,వాళ్ళకి ఏ దురుద్దేశ్యము లేదని, కేవలం సహాయం చేయాలని అనుకోవడమే తప్ప ,అని అర్ధం అయింది . థాంక్స్ , అని చెప్పి, ఆ కార్డ్ జాగ్రత్తగా దాచుకుంది .

కడుపులో తిప్పినట్లయి, ఆకలి వేస్తోందని గ్రహించి, మహతి వంట చేద్దామని లేచింది .

రాహుల్ అవసరాలు చూసి, స్నానం అవీ ముగించుకునేసరికి, కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది.

“అసుర సంధ్య వేళ ఏమిటీ మొద్దు నిద్ర?” రఘు మాటలతో గబుక్కున లేచి కూర్చుంది . అతని ముఖంలో పొద్దుటి కోపపు చాయలేమ్ లేవు. “త్వరగా లేచి మొహం కడుక్కో. ఇవాళ బయటకి వెళ్లి తినేద్దాం .”హుషారుగా అన్నాడు. ఎందుకో అడగవేం ? నాకు ప్రమోషన్ గారంటీ అని మా మేనేజర్ చెప్పాడు . ‘ఓ, కంగ్రాచులేశన్స్ అంది మహతి. వండిన వంట మాట్లాడకుండా ఫ్రిజ్ లో పెట్టేసింది . అతని మూడ్ మారేలోగా గబా గబా చంటివాడిని తయారు చేసి, తనూ రెడీ అయిపోయింది.

సరిగ్గా తలుపు తాళం వేసే వేళకి ఫోన్ మోగింది మహతి ఫోన్ తీసుకోబోయి, వాయిస్ మెయిల్ కే వదిలేసింది.

ఇలా ముళ్ళమీద ఇంకో ఆరు నెలలు గడిచేసరికి మహతికి తను ఎవరో ఏమయిపోతోందో అర్ధం కాకుండా అయిపోయింది . ఒకరోజు తన బాల్య స్నేహితురాలు శైలజ అమెరికా వచ్చానని, వాళ్ళ అమ్మని అడిగి మహతి నంబర్ సంపాదించానని మర్నాడు వస్తాననీ ఫోన్ చేసింది . మహతికి ప్రాణం లేచి వచ్చింది కాని అంతలోనే రఘు ఏమంటాడో నని దిగులూ వేసింది . ఆత ను ఆఫీస్ నుండి వచ్చాక మెల్లగా శైలజ, భర్త వస్తారని చెప్పింది ఏ కళ నున్నాడో సరేనన్నాడు.సరిగ్గా నిద్ర పట్టేముందు , మహతి ని కుదిపి, మీ ఫ్రెండ్ మొగుడు ఏం ఉద్యోగం చేస్తాడేమిటీ ? అనడిగాడు. అతను కాలేజి లో లెక్చరర్ అనుకుంటాను అంది . అయితే సరేలే, రమ్మను అన్నాడు. శైలు కూడా ఉద్యోగం చేస్తుందని చెప్పలేదు మహతి.

మర్నాడు వాళ్ళొచ్చి, రెండురోజులు గడిపినా, రఘు బాగానే ఉన్నాడు. అస్తమానూ తన ఉద్యోగం గురించి, ఈ మధ్యనే వచ్చిన ప్రమోషన్ గురించీ మాట్లాడాడు.

వెళ్ళే రోజున శైలజ భర్తకి ఒక మంచి షర్ట్ , ఆ అమాయికో చీర ఇమ్మని మరీమరీ చెప్పివెళ్ళాడు దానికే ఎంతోపొంగిపోయింది మహతి. శైలజ మాత్రం మహతి రెండు చేతులూ పట్టుకుని, కళ్ళనీళ్ళతో, “మహీ, ఇక్కడికి వచ్చి నిన్ను కలవక పోతే బాగుండేదే , ఏంటో , అమెరికాలో ఉన్నావు, ఎంతో సుఖ పడుతున్నావు అనుకుని సంతోషించే దాన్ని. ఇప్పుడు ఇండియా వెళ్ళాక మీ అమ్మకి ఏమని చెప్పను?” అంది .నాకేమ యింది , బాగానే ఉన్నాను కదా అంది మహతి తత్తర పాటుతో.

“సరేలేవే, చిన్నప్పటినుంచి నిన్ను తెలిసిన నేను, నీకు ఇది బాగున్న జీవితం అనుకోమంటావా?ఎవరిని మభ్యపెడుతున్నావు??”
“శైలూ ,ఇంకా పద మనం వెళ్ళాలి” అన్నాడు శైలు భర్త మూర్తి ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేక. తను కేవలం కాలేజి లెక్చరర్ అనుకున్నప్పుడు అతని ప్రవర్తన కీ ,తను సైకాలజీ అసిస్టంట్ ప్రొఫెసర్ అని తెలియగానే మారి పోయిన ముఖ కవళికల కీ ఉన్న అంతరం చూసి క్షణం లో అతని మనస్తత్వాన్ని కనిపెట్టేసాడు మూర్తి. కాని, తన భార్యకి మహతి అంటే ఎంత ప్రాణమో తెలిసిన మూర్తి ఇంక ఆ విషయాన్ని విశ్లేషించ లేదు. వాళ్ళు వెళ్ళాక మహతి తన జీవితాన్ని తరచి చూసు కుంది . నిజమే , బయట వాళ్ళ దృష్టిలో తనకేం తక్కువ లేదు. కాని తన ప్రాణ స్నేహితురాలు తను నోరు విప్పి ఒక్క మాట చెప్పకపోయినా, తనని పుస్తకం చదివినట్లు చదివేసింది. రేప్పొద్దున్న అమ్మ దగ్గర ఏం చెప్తుందో , నాన్న ఎలా రియాక్ట్ అవుతారో,ఊహించ లేకపోయింది.

ఆ మర్నాడు రఘు ఉగ్ర నరసింహ మూర్తి లాగ వచ్చాడు ఇంటికి. కాఫీ అందిస్తుంటే చేయి తొణికి కొంచెం కాఫీ వొలికింది . అంతే , కప్పు గోడ కేసి కొట్టి, ఓ చేత్తో మహతి జుట్టు పట్టుకుని, “ఎం ,నీక్కూడా నేనంటే లెక్క లేదా? ఆ మానేజర్ గాడికి ఎంత కొవ్వు? నాకు వచ్చే ప్రమోషన్ ఇంకోడికిచ్చేస్తాడా? ఇంటికొస్తే నీకు ఎంత పొగరు? కాఫీ కప్పు కూడా తిన్నగా అందించలేవా ”

మహతి వణికి పోయిన్ది. అతని ప్రమోషన్ కీ తనకీ సంబంధం ఏమిటి? ఇంతలో రాహుల్ పాకుతూవచ్చి రఘు కాళ్ళకి చుట్టుకున్నాడు. విసురుగా ఒక్క సారి కాలు విదిలించేసరికి వాడు వెళ్లి గోడకి కొట్టుకుని కెవ్వుమన్నాడు. ఒక్క పరుగున గుక్క పట్టిన వాడిని పట్టేసుకుంది మహతి.

“ఛి చీ, ఇల్లోసంత అయిపొయింది, ఎక్కడా మనశ్శాంతి లేకుండా, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఒక చేత్తో విప్పుకుంటున్న టై తీసిపారేసి ,బయటకి వెళ్ళిపోయాడు రఘు.

చేతిలో పిల్లవాడిని పట్టుకుని, తలుపు తాళం అయినా వెయ్యకుండా వెనకే పరుగెత్తింది మహతి. ఆతను అప్పటికే మెట్లు దిగి వెళ్ళిపోయాడు . గుక్క పట్టిన రాహుల్ ని ఓవైపు సముదాయిస్తూనే, వెనక్కి వచ్చి, తన పర్స్, తాళాలు తీసుకుని పరుగెట్టిన మహతి లిఫ్ట్ కోసం కూడా ఆగలేదు. క్రిందకి వెళ్తూనే అప్పుడే కాంప్లెక్స్ లోకి వస్తున్నా జేమీ ని చూసి “మై బేబీ, మై బేబీ ” అంటూ హెల్ప్ మీ అని గట్టిగా పట్టేసుకుంది అప్పటికే రాహుల్ నుదుటి మీద పెద్ద బొప్పి కట్టింది జేమీ ఇంకేం ఆలోచించకుండా “కమ్ విత్ మి , ఐ విల్ డ్రైవ్ యూ “అని పార్కింగ్ లాట్ లోకి పరిగెత్తింది ఆ తొందరలో తన కార్ లో బేబీ సీట్ లేదని కూడా ఇద్దరికీ తట్టలేదు. రాహుల్ ని పొదివి పట్టుకున్న మహతి కి ప్రపంచం స్తంభించిపోయింది . తనని విసురుగా తోసేసిన సందర్భాలు ఎన్నో వున్నా తను తట్టుకుంది .కాని పసివాడు, కన్నకొడుకు అన్న జ్ఞానం కూడా లేని రఘు మనిషా ,పశువా?

“మాహి, వాట్ హాపెండ్? డు యు నో వాట్ టు సే టు ది డాక్టర్? ఐ డోంట్ వాంట్ టు స్కేర్ యు, బట్ దే విల్ క్వశ్చన్ అబౌట్ చైల్డ్ అబ్యూజ్ ” అన్న జేమీ కేసి వెర్రి మొహం వేసి చూసింది మహతి. తను చెప్పబోయే నాలుగు మాటల మీద తన భవిష్యత్తు, సంసారం, రాహుల్ జీవితం అన్నీ ఆధారపడి ఉన్నాయి. తనలో ఆ గుర్తింపు కలిగేలా అతి సున్నితంగా చెప్పిన జేమీ కేసి చూసింది . శ్రద్ధగా రోడ్ మీదే దృష్టి పెట్టి , అతి జాగ్రత్తగా, బేబీ సీట్ లేదన్న స్పృహతో డ్రైవ్ చేస్తున్న జేమీ కి మనసులోనే కోటి దండాలు పెట్టుకుంది .”వేరీజ్ రఘు? ” అనడిగింది . ఐ జస్ట్ సా హిమ్ డ్రైవ్ అవే ఇన్ అ హర్రీ అనగానే మహతికి అర్ధమయిపోయింది ,ఆ అమ్మాయి తనకి అబద్ధం ఆడే అవసరం లేకుండా ప్రయత్నిస్తోందని.

“నో ,నో ఇట్ వాజ్ ఆక్సిడెంటల్. రాహుల్ వాజ్ క్రాలింగ్ అండ్ రఘు ఓపెండ్ ది డోర్ అండ్ డిడ్ నాట్ సీ హిమ్ . ”
మనసులో ఏమనుకుందో ఇంకేం మాట్లాడలేదు జేమీ.

అలాగ ఎమర్జెన్సీ రూమ్ లో ఒక పదిమందితోనయినా చెప్పాల్సి వచ్చింది .ప్రతిసారీ నాలుక చివరిదాకా రఘు విషయం చెప్పేద్దామని వచ్చినా, మహతి లోని కామన్ సెన్స్ గెలిచింది .తమ గొడవలు తాము తరవాత పడచ్చు కాని రఘు మీద కంప్లైంట్ ఇస్తే తమందరి జీవితాలూ అతలాకుతల మయిపోతాయి. భయపడిపోయినా,రాహుల్ కి దెబ్బ అంతగా డేంజరస్ కాదనీ, ఫ్రాక్చర్ అవీ లేవనీ ఓ రెండు గంటల పరీక్ష తర్వాత ఇంటికి పంపే సారు.

అంత సేపూ ఓపిక గా కూర్చుని, ఇంటికి తీసుకెళ్ళే ముందు కార్ స్టార్ట్ చేయకుండా జేమీ మహతి కేసి చూసి, సీరియస్ గా ,”విల్ యు టెల్ మీ నౌ?” అంది .

“నాట్ నౌ ,జేమీ ఐ నీడ్ సమ్ టైమ్ . ఐ నీడ్ టు సార్ట్ ఔట్ ఏ ఫ్యూ ఇష్యూస్ కెన్ ఐ టాక్ టు యు ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్?”అంది మహతి. ష్యూర్ ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యు ఎండ్ ద బేబీ. అని మహతి చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది .చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది మహతి. ఇంటికొచ్చేసరికి ,కారిడార్ లో పచార్లు చేస్తున్నాడు రఘు. ” అయినా నీకు అమెరికన్ల తోటీ పాకిస్తాన్ వాళ్ళతోటి స్నేహాలు వద్దంటే వింటావూ ? ” తను జేమీ తో వస్తుంటే పైనుంచి చూసినట్లున్నాడు.
మాట్లాడకుండా అతన్ని తప్పించుకుని, నిద్రపోతున్న రాహుల్ ని క్రిబ్ లో పడుకో బెట్టి, వంట గదిలోకి వెళ్ళింది మహతి. ” అసలు నీకు మొగుడనేవాడంటే లెక్క ఉందా?”మహతి భుజం పట్టుకుని విసురుగా తనవయిపు తిప్పుకోబోయిన రఘు చేయి పట్టుకుని అక్కడే ఆపేసింది మహతి. అనుకోని ఈ పరిణామానికి తెల్లబోయిన రఘు చేయి దింపేసాడు.

ఎంత ధైర్యం అని గొణుక్కుంటూ అక్కడినుంచి వెళ్లి పోయాడు. “హమ్మయ్య ” అనుకుని గ్లాసుడు చల్లటి మంచినీళ్ళు గటగటా తాగేసింది మహతి.

ఆ రోజు నుంచీ రాహుల్ ని వేలేసి ముట్టుకోలేదు రఘు. మహతి ఆతను కూడా ఎడమొహం పెడమొహం గానే ఉన్నారు.

మర్నాడు జేమీ మహతి కి ఫోన్ చేసి, తన అపార్ట్మెంట్ కి టీ కి రమ్మంది . ఎందుకో తెలిసినా కూడా ధైర్యం చేసి, బాబు ని తీసుకుని వెళ్ళింది . అక్కడ ఆసిమా కూడా ఉంది .తను రాగానే రాహుల్ కేసి చేయి జాపి, వాడికో బొమ్మనిచ్చి, వేరే గదిలోకి తీసుకెళ్ళింది ఆసిమా. ఇది ముందుగానే జేమి ఆసిమా వేసుకున్న ప్లాన్ అని అర్ధమయింది మహతికి. కాని, జేమీ నవ్వుతూ కబుర్లు చెప్తోంది ,టీ ఎలాగ కావాలో అడిగి ప్లేట్ లో తను బేక్ చేసిన కేక్ ముక్క పెట్టింది , మహతి ని ఒక్క ప్రశ్న అడగ లేదు. తను ఎప్పుడు సిద్ధపడితే అప్పుడే మాట్లాడవచ్చని అర్ధమయింది మహతికి. ఆ అమ్మాయి సంస్కారానికి తల వంచిన మహతి, ఒక్కసారి కట్టలు తెంచుకున్న వరదలా మాట్లాడడం మొదలెట్టింది.

చేతిలో టీ కప్పు అలానే ఉండిపోయింది. ఎప్పుడు జేమీ వచ్చి తన ప్రక్కన కూ ర్చుందో మహతి గుర్తించ లేదు.

అలా ఒక అరగంట గడగడా మాట్లాడేసరికి మహతికి నీరసం వచ్చేసింది . రాహుల్ ని ఎం మాయ చేసిందో ఆసిమా, ఎక్కడా చప్పుడు లేదు. జేమీ మెల్లిగా లేచి, ఒక హాండ్ టవల్ చల్ల నీళ్ళతో తడిపి, అదీ ఒక క్లీనెక్స్ డబ్బా పక్కన పెట్టింది .

అలాగే చల్లారి పోయిన టీ కప్పు వంపేసి, ఇంకో కప్పులో వేడి వేడి టీ తీసుకొచ్చింది అ ది తాగాక మహతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది . ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు జేమీ. ప్రశ్నార్ధకంగా చూసింది మహతి. “మాహీ ఇట్ ఈజ్ యువర్ లైఫ్ . ఆల్సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రాహుల్ జస్ట్ రిమెంబర్ దట్ ” అంది అంతే . ఇంకో అరగంట కూర్చుని, రఘు వచ్చే సమయమయిందని, జేమీకి, ఆసిమా కి థాంక్స్ చెప్పి తన అపార్ట్మెంట్ కి వెళ్ళిన మహతికి గుమ్మం లోనే ఎదురయ్యాడు రఘు. ఎందుకో మరి ఆ రోజు త్వరగా వచ్చేసాడు.

“ఎక్కడికెళ్ళావు పెత్తనానికి?” అన్న రఘు మాటలకి ఒక్క చూపు చూసింది మహతి. ఆ మెలో కనిపిస్తున్న స్వల్ప మార్పుకి కొంచెం వెనక్కి తగ్గాడు రఘు. ఎలాగూ సమాధానం రాదనీ తెలిసి, లోపలి గదిలోకి వచ్చి టీ వీ పెట్టుకుని కూర్చున్నాడు.

రఘుకి అసలు తనకో కొడుకున్నాడని గుర్తింపు ఉందా అని అనుమానం వచ్చీస్తుంది మహతికి. కొడుకు పుట్టడం దాకానే వాళ్ళ అక్క అన్నయ్యల మీద ధ్వజం ఎత్త గలిగాను , అన్న దాకానే అతనికీ బాబు కీ సంబంధం అన్నమాట. ఇంకా రఘు గురించి ఆలోచించి, అతన్ని మార్చాలనుకునేకన్నా, తన బ్రతుకు తను చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసింది మహతి.

ఈ దేశం లో తను ఒక్కర్తీ పిల్లవాడిని పెంచ గలదా? రఘు మీద ఏమని కంప్లయిన్ ఎవరికీ చెయ్యగలదు? ఆత ను పెట్టే సొంటిపిక్కలు, బయటకు కనపడని కముకు దెబ్బలు , మనసుకి గుచ్చే బాణాలు ఎవరికీ కనపడతాయి?

అలాగని ఇండియా వెళ్లి తల్లి తండ్రికి భారం కాగలదా ?

ఉహు. తను, రాహుల్ ఎవరికీ భారం కారు. తనకి ఇండియాలో డిగ్రీలున్నాయి. అమ్మ వాళ్ళకి దగ్గరగా ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉంటుంది . అత్తగారు, మావ గారు తనకేమీ సహాయం చేయక పోయినా, అడ్డుపడకుండా ఉంటే చాలు. ఎంతయినా రక్త సంబంధం, మనవడు కావలసి వస్తాడేమో అప్పుడే చూద్దాం .

మనసు దిట్టపర్చుకుని, మర్నాడు బ్యాంకు లోంచి డబ్బు తీసి టికెట్ కొనేసింది . తన బట్టలు, బాబు బట్టలు రెండు సూట్ కేసుల్లో సర్దింది . జేమీ దగ్గరకు వెళ్లి, రాహుల్ కి కొన్ని వస్తువులు కొనాలి, రైడ్ ఇస్తావా అని అడిగింది . మృదువుగా భుజం తట్టి,”యు ఆర్ శ్యూర్ ” అంది జేమీ . తల ఊపిన మహతి కి సడెన్ గా భయం వేసిన్ది.కాని మనసు దిటవు చేసుకుని, బజారు లో కావలసిన సరుకులు తెచ్చుకుంది . జేమీ కి ఆసిమాకి థాంక్స్ చెప్పి, శైలజకి ఫోన్ చేసింది .తల్లిని చూడాలని ఉంది, సర్ప్రైజ్ గా వస్తున్నానని, ఎయిర్ పోర్ట్ కి రమ్మనీ . శైలు ఎగిరి గంతేసింది ఫోన్ లోనే.

సాయంత్రం ఇంటికొచ్చిన రఘు సర్దిఉన్న సూట్ కేసులు చూసి ,”అయితే ప్రయాణం అయ్యావన్న మాట!చూస్తాను నేను లేకుండా నిన్ను ఎవరు ఎన్నాళ్ళు భరిస్తారో.

నాకు రేపు ఆఫీస్ లో చాలా పని ఉంది. లేటుగా వస్తాను. ఉన్నారుగా నీ ఆప్తులు వాళ్ళని దింపమను. “అన్నాడు వెటకారంగా.

థాంక్స్, మీకా శ్రమ అక్కర్లేదు. టాక్సీ వస్తుంది . బల్ల మీద భోజనం ఉంది . అంటూ, రాహుల్ ని ఎత్తుకుని, రఘుని ఆఖరుసారి, మొదటిసారి చూసినంత నిశితంగా చూసి, అడుగు బయట పెట్టినది ఆధునిక అబల మహతి. ప్రక్క ఇంటి కుర్రాడు పది డాలర్లు ఇస్తానంటే వెనకే సూట్కేసులు పట్టుకుని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు.

వ్యక్తిత్వం వికసించింది, అస్తిత్వమూ ఆకారం దిద్దుకుంది,కాని, జీవితం నలిగిపోయిందా ???



11 Responses to అమెరికాలో అస్తిత్వం

  1. Mamatha
    October 1, 2013 at 7:27 am

    Could have been an inspriring story for many. But the last line just killed it all.

    • December 16, 2013 at 8:43 am

      ఆలోచన రేకెత్తించే అభిప్రాయం.
      కధలు చదవడానికి ఎంత బాగున్నా, ఎంతలాగా ఆలోచనలు రేకెత్తించినా, వాస్తవం చేదుగా ఉంటుంది.
      ఎంతో ధైర్యంగా ఇల్లు వదలిన మహతి భవిష్యత్తు ,ఒక పసి వాడితో ఎంతో క్లిష్టమయినది.
      ఇంకో చిన్న మాట .చివరి వాక్యం ప్రశ్నార్ధకం. జవాబు, కాదు.

      • ప్రసాద్
        December 17, 2013 at 9:28 pm

        “ఎంతో ధైర్యంగా ఇల్లు వదలిన మహతి భవిష్యత్తు ,ఒక పసి వాడితో ఎంతో క్లిష్టమయినది.”

        అవును, నిజమే. అయితే, ఆ దుష్టుడయిన భర్తతో, ఆ పసివాడితో, మహతి భవిష్యత్తు ఇంకా క్లిష్టమయినది.

        “ఇంకో చిన్న మాట .చివరి వాక్యం ప్రశ్నార్ధకం. జవాబు, కాదు.”

        అవును, ప్రశ్నర్థకం కాబట్టే, తప్పు అర్థాలు వస్తాయి. ఎవరినయినా, “మీరు దొంగా???” అని ప్రశ్నిస్తే, వారు ఆ ప్రశ్నకి కోపం తెచ్చుకోకుండా, “అబ్బే, కాదండీ! మీరు చాలా అమాయకంగా, నేను దొంగ అవొచ్చేమోనన్నట్టు అడిగారు. అయినా సరే, అది ప్రశ్నే. అందులో గూఢార్థాలు ఏమీ ధ్వనించవు లెండి. ‘మీరు మర్డరరా???’ అని అడిగినా సరే, ‘అయివుండొచ్చు’ అన్న ధ్వని నేను పట్టించుకోను లెండి. ‘కాదు’ అని చెబుతాను. ” అని తెలివి తక్కువ వారు మాత్రమే అంటారు. ఎందుకంటే, అటువంటి ప్రశ్నల్లోంచి ఒక తప్పు ధ్వని వస్తోంది.

        ప్రసాద్

  2. October 1, 2013 at 8:03 am

    కధనంలో లోపాలున్నా, మంచి పాజిటివ్ కధ. ఒక మంచి స్త్రీకి ధైర్యం చెప్పగలిగే కధ.

    కధ చివరలో, “థాంక్స్, మీకా శ్రమ అక్కర్లేదు. టాక్సీ వస్తుంది . బల్ల మీద భోజనం ఉంది” అన్న మాటలు చదవగానే మొదట వుసూరుమంది ప్రాణం. తర్వాత చాలా చిరాకేసింది ఆ పాత్ర మాటలకి. అటువంటి దుర్మార్గులకి, వెళ్ళి పోయే ముందర కూడా, బల్ల మీద భోజనం పెట్టడం, చాలా పనికి మాలిన విషయం. బానిస మనస్తత్వం. ఈ కధలో, ఆ అమ్మాయి, చాలా చక్కగా ఆ దౌర్భాగ్యుడిని వదిలేసి వెళ్ళిపోతోంది. అస్సలు ఆ దుష్టుడి మాటలకి సమాధానం చెప్పకుండా బుర్ర తిప్పేసుకోవాలి. వాడి మొహం ఆఖరు సారి కూడా చూడ కూడదు. సాధారణంగా ఎక్కువ మందికి వదిలి వెళ్ళిపోయే ధైర్యం వుండదు. ఆ ధైర్యం వచ్చిన తర్వాత, ఇదంతా చెత్త ప్రవర్తన.

    చివరిగా, “,కాని, జీవితం నలిగిపోయిందా ???” అని రచయిత్రి రాశారు. ఎలాగో ఒక లాగా ఒక మగ వాడి పంచన బతకడమే జీవితం అనుకునే వాళ్ళకి, ఈ జీవితం నలిగిపోయినట్టే. అయితే, రచయిత్రి ఈ అమ్మాయి ప్రవర్తనని సమర్థిస్తున్నారు. అలాంటి ముక్కలు రాయకూడదు. కధ చివర్లో, “వ్యక్తిత్వం వికసించింది, అస్తిత్వమూ ఆకారం దిద్దుకుంది” అన్న ముక్కలతో ముగిస్తే, ఎంతో చక్కగా వుండేది. వికసించిన వ్యక్తిత్వమూ, ఆకారం దిద్దుకున్న అస్తిత్వమూ కలవారికి, జీవితం ఎప్పుడూ నలిగి పోదు.

    ఈ నాలుగు ముక్కలూ చెప్పాలనిపించింది క్లుప్తంగా.

    ప్రసాద్

  3. October 2, 2013 at 10:39 am

    Yep,,last line jus killed the essence ….beautiful narration with stupidest ending….

  4. October 2, 2013 at 12:00 pm

    జీవితం నలిగిపోదు, అక్కడే చిగుర్లు తొడిగి వికసించటం మొదలవుతుంది.

  5. October 5, 2013 at 11:44 am

    బాగుంది. స్త్రీ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని తెలియచేసే కథలు ఎన్ని వస్తే అంత మంచిది. కథను ఇంకెక్కడైనా ప్రచురిస్తుంటే ఆఖరి వాక్యం తీసేయండి.
    రాధ

  6. నిశీధి
    October 17, 2013 at 7:47 pm

    ఏ దేశమేగినా ఎందుకాలిడినా …..తెగడరా … నీ భార్య అస్తిత్వాన్ని … నిలుపరా నీ మగజాతి నిండు గౌరవాన్ని.. పాపం పెద్దాయన రాయప్రోలు సుబ్బా రావు ఎక్కడున్నారో కాని ఇపుడు బ్రతికుంటే ఇదే అనేవారేమో .

  7. December 22, 2013 at 10:16 pm

    ప్రపంచం ఎంత విశాలమైనా.. మనుషులు సంకుచితాలే.. nice narration
    యే యుద్ధమైనా కొంత పరాజయం మీద బెరుకు, నిర్ణయం తీసుకున్నామన్న విశ్వాసమ్.. ఈ రెంటి కలగలుపులే వుంటాయి.
    జీవితం నలగనిదే అనుభవాలు మనసుని రాటు దేల్చలేవు.. అప్పుడే చెయ్యబోయే పనులకి సిద్ధంగా వుంటాము. చివరి వాక్యాలు అప్పటి వరకూ కొనసాగిన ఫోకస్ ని చెల్లా చెదురు చేశాయి. ప్రధాన పాత్ర అడుగు ముందుకు వేస్తున్నపుడు, ఇటువంటి వాక్యాలు ఆ మూడ్ ని చెడగొడతాయి. ఆ ఒక్క విషయం తప్ప, నేరేషన్ బాగా సాగింది.

  8. buchireddy gangula
    December 31, 2013 at 9:43 pm

    కథ –సో సో — గా ఉంది ?????????????
    ————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  9. rakumari
    February 11, 2015 at 12:25 pm

    కదా చాల భావుంది జీవితం నలిగి పో యిందా అవును నలిగి పొయింది కాని ఇంకా అక్కడే వుంటే ఇంకా నలుగుతుంది చదువుకున్న మహిళా వంటరిగా బతకవచ్చు

Leave a Reply to buchireddy gangula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)