కరచాలనం

నా ఉద్విగ్న మానస సంభాషణ

అక్టోబర్ 2013

నాకు భాషమీద, భాషకున్న పరిమితులమీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలు చుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. నా మిత్రులు ,కుటుంబ సభ్యులు చాలా మంది తరచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు.

అదేమంటే ‘నువ్వు కవిత్వమెందుకు రాస్తావ’ని. బహుశా ఇదే ప్రశ్న కొన్నిసార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడ చెప్పుకుంటూ వుంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనమెందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరపున నియమించుకున్న లాయర్‌ నా కవిత్వం.

“సహజ మానవునికి, సమిష్టి మానవునికి మధ్య వైరుధ్యమే కవిత్వం ఆవశ్యకత, మన ఆర్థిక కార్యాచరణే కవిత్వం అంటాడు క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌. వెంటనే మీరు మరో ప్రశ్న వేయవచ్చు. ఈ వాదన వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి?” అని. అవును మనం ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. కవులు అనధికారిక శాసనకర్తలు (unacknoeledged legislators)-P.B.shelly. “only the poet can look beyond the details and see the whole picture” అంటూ సమాజంలో కవుల ప్రాధాన్యతను అనేక రకాలుగా చెప్పారు. సామాజిక భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే కళాకారుడు రచయిత. మనిషి అంతరంగంతో సంభాషించి మానవత్వపు పరిమళాన్ని వెదజల్లేవాడు రచయిత. ప్రపంచంలో అనేక గొప్ప మార్పులు సాహిత్యం వల్లనే సాధ్యపడ్డాయి.

ఒక భూస్వామ్యసమాజంలో రెవెన్యూ అధికారిగావుండి ,వ్యసనపరుడై అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పేద ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదుకదా! సాహిత్యం చదవడం అనే ఒకే ఒక మంచి వ్యసనం వల్ల అతను జనరల్‌ ఛూటేగా మారి జనచైనా జనం గుండె చప్పుడయ్యాడు. భగత్‌సింగ్‌ వీలునామాలో జైలుజీవితానికి ముందు తాను ఒక పుస్తకం చదివివుంటే కనుక అసెంబ్లీలో బాంబులు వేసే ఉగ్రవాద చర్యకు పాల్పడి ఉండేవాడిని కాదని అంటాడు. ఆ పుస్తకం లెనిన్‌ రాసిన ‘స్టేట్‌ అండ్‌ రివల్యూషన్‌’. బహుశా అదే జరిగివుంటే భారత దేశ చరిత్రగతి ఇంకో రకంగా ఉండేదేమో! ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. నన్ను నేను మానవీయ విలువలతో నిలబెట్టుకోవడానికి సాహత్యం చదువుతాను.

మానవుని ఆవేశాలను పోగుచేసి, సహజాతాలను సిద్ధం చేసి సమిష్టి కార్యాచరణకు పురిగొల్పే గుంపు పండగల్లో కవిత్వం పుట్టింది. వర్గవిభజన లేని సమాజంలో శ్రమ సమిష్టి శ్రమగా ఉండేది. కవిత్వం సమిష్టి భావనగా మనుగడ సాగించేది. వర్గ సమాజంలో సంపదని, అధికారాన్ని కైవశం చేసుకున్న వర్గం శ్రమనుంచి కవిత్వాన్ని దూరంచేసింది. అంత:పుర బందీని చేసింది. తెలుగు కవిత్వం పరిణామక్రమంలో అంత:పుర బందిఖానాల్లోంచి తప్పించుకొని, రాజప్రసాదాల్లో సాగిలబడ్డ స్థితిని దాటుకొని , వ్యాకరణాల సంకెళ్ళని, ఛందోసర్పపరిస్వంగాలని విడిపించుకుని ఆధునిక కవిత్వమై నిలబడ్డది. ఆధునిక కవిత్వం ఒక స్పష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథంతో నడుస్తున్నది. నేనెక్కువగా రాజకీయాలు మాట్లాడుతుంటానని నా మిత్రులు నా మీద ఆరోపణలు చేస్తుంటారు. ఒక విలేఖరి ఇదే మాట అంటే, నోబల్‌బహుమతి గ్రహీత, కొలంబియా మేటి రచయిత గేబ్రియల్‌ గార్సియా మార్క్వెజ్‌-’ఈ సందిగ్ధకాలంలో నేను కొలంబియాలో జీవిస్తున్నాను కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడాల్సి వుంటుంది’ అన్నాడు.

ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మాన్ని సమూలంగా నిర్మూలించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడానికి పురిగొల్పే క్రియలో ఉత్ప్రేరకాలుగా రచయితలు ఉండాలి కదా! ఈ నాటి పరిస్థితులల్లో సామ్రాజ్యవాదాన్ని, ఆర్థిక ప్రపంచీకరణని, సాంస్కృతిక ప్రపంచీకరణని ఎదుర్కొనే ఉద్యమాలలో సూదిలో దారంలాగా రచయితలు ఉండాలి కదా! సామ్రాజ్యవాదుల ఆయుధ సంపత్తి పౌరసమాజాన్ని నోరెత్తకుండా చేస్తే, డబ్లుటివో,వరల్డ్‌బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలను కొల్లగొడుతున్నాయి. ప్రసారసాధనాలు, నాన్‌ సీరియస్‌ సాహిత్యం పలాయనవాద వ్యక్తిత్వాన్ని సమకూర్చుకొమ్మని ఉద్భోదిస్తున్నాయి. వ్యక్తివాదం,వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిచేతన అనేవి సమిష్టిభావ సంస్కృతిని నాశనం చేస్తున్నాయి.

ఈ విషయాల్ని కొద్దిసేపు ప్రక్కనపెట్టి నా వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావిస్తాను. అరవై ఎనిమిది ఎకరాల పట్టేదారు, ముప్పై ఎకరాల ఆసామి కొట్టనంపు రామయ్య పటేలు, సత్తెవ్వల కడగొట్టు సంతానంగా నల్లగొండ జిల్లా బొందుగుల గ్రామంలో 1966(?)లో జననం. ఆర్థికమాంద్యం, అత్యవసర పరిస్థితి కలిసి బాల్యం మీద చేసిన దారిద్య్రపు గాయాల మచ్చలింకా మానలేదు. పచ్చజొన్న పిసికిళ్ళు ప్రాణాలు కాపాడుతున్న కాలంలో చెలరేగిన కరువుకు ఒక్కొక్క ఆవు తోకలు పట్టి లేవట్టించుకుంటూ దొడ్డి ఖాలీ చేసి వెళ్ళిపోతున్న దౌర్భాగ్యం. ఇంటికెదురుగావున్న మేనమామ కూతుళ్ళు అందంగా, ఆరోగ్యంగా,ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళతో పోల్చుకుంటూ అక్క కన్నీళ్ళు పెట్టుకుంటున్న దృశ్యం ఇంకా చెరిగిపోలేదు. అమ్మ,బాపుల నిరంతర చాకిరికి గుండె చెదిరి అప్పుడప్పుడూ పశువులకాపరిగా, మోటగొట్టే మోతుబరిగా, మోకాలు లోతు బురదలో నాగలిదున్నే ఆసామిగా నా బాల్యం ఇంకాపచ్చి పచ్చిగానేవుంది. తండ్రి ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడు కాబట్టి ఆ వచ్చే నెలవారీ జీతంవల్ల నా సహాధ్యాయిని, మేనమామ కూతురు సుఖంగా, ఏలోటూ లేకుండా చదువుకోగలుగుతందని గ్రహించి కసిగా చదువును ‘ఇరువాలు’ దున్నిన సాహసం. ఆ కసే ఏడవ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిపింది. అప్పుడు నా ఉపాధ్యాయుడు చూపిన దారి,తెలంగాణలోని ఒకేఒక్క గవర్నమెంటు రెసిడెన్సియల్‌ స్కూలైన సర్వేల్‌లో స్థానం కల్పించింది. అది నాకు విశాల ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇతర రచయితల అంతరంగాల్ని ఇదిగా నేనెప్పుడూ చదవలేదు. నా రిదీదీలిజీ ఖీళిరిబీలి ని నేనెప్పుడూ తొక్కి పెట్టలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక విశాలమైన లైబ్రరీని చూసి, నాకు అనుభవంలేని జీవితాన్ని అక్కడి నవలల్లో చదువుతున్నప్పుడు నాకు ఆ కొత్తలోకం బాగా నచ్చేది. అట్లా సాహిత్యం పట్ల కలిగిన ప్రేమ సామాజిక అసమానతల పునాదిని పరిచయం చేసింది. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో వింటున్న పాటల పరిచయం వల్ల లయాత్మక కవిత్వం నన్ను అమితంగా ఆకర్షించింది. అట్లా నాదే అయిన లోకాన్ని నేను సృష్టించుకున్న. స్నేహాలు, సినిమాలు, తిరుగుళ్ళు నా జీవితంలో చాలా తక్కువ. సాహిత్యాన్ని ఆలంబన చేసుకొని ఎదుగుతూ వచ్చాను. కవిత్వం లాంటదేదో రాయడం పదవతరగతి నుంచే ఆరంభమైంది.అప్పుడు నేను వాడుతున్న లక్సు సబ్బు వాళ్ళింట్లో కుక్కలకు మాత్రమే వాడుతారన్న మిత్రుడి మాటలు చేసిన గాయం ఇంకా మానలేదు. తరగతి గది సంతృప్తినివ్వలేదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిన అద్భుతమైన గ్రంధాలయం నాకు ఆప్తమైంది. గబన్‌,దేవదాసు,బలిపీఠం,ఈ దేశం నాకేమిచ్చింది?, నీ బాంచెన్‌ కాల్మొక్త ఇట్లా ఎన్నని చెప్పను? దాదాపుగా మొత్తం గ్రంధాలయాన్ని చదివేశాను. తరగతిగదిలో తెలుగువాచకంలో దాచుకొని ‘పెంకుటిల్లు’ చదువుతున్నప్పుడు శ్రీధర్‌ సారు కొట్టిన దెబ్బ చెంపమీద మిగిలేవుంది. దాదాపు ఇదే సమయంలో మహాప్రస్థానం, భారమితి, మండేసూర్యుడు, నాదేశం నాప్రజలు,ఆగమగీతి,మైదానం,ప్రేమలేఖలు, కాలాతీత వ్యక్తులు, మరీచిక, రాజు-మహిషి, శిలాలోలిత లాంటి మంచి సాహిత్యాన్ని నాకు పరిచయం చేసిన మా చిన్నన్న కాసుల ప్రతాప్‌రెడ్డి నా రచనా వ్యాసాంగానికి మొదటి గురువు. ఆనాటికే పుష్పవిలాపం,కుంతీవిలాపం, మహాప్రస్థానం చలం పీఠికతో సహా కంఠతా చెప్పగలిగిన స్థాయి నాది.

నాగార్జునసాగర్‌లో ఇంటర్మీడియట్‌ చదివిన రెండు సంవత్సరాల కాలంలో రుద్రవీణ,తిమిరంతో సమరం, చరమరాత్రి కథలు, శృంగార నైషధం,పోతన మహాభాగవతం, భారతి పత్రికలతో సహవాసం. ఒక అమూర్త సమసమాజ ఆకాంక్షల ప్రతినిధిగా మిత్రుల గర్తింపు, పరాచికాలు. నెహ్రూ, దీపావళి, ఉగాదిల మీద ఛందోబద్ధ కవిత్వం, సామాజికాంశాల మీద వచనకవిత్వం, పట్టు సడలిన విక్రమార్కుడు కథలోలె కొన్ని ప్రిమిటివ్‌ రచనలు. అది ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో చేరేనాటికి ఒక స్పష్టతని సంతరించుకున్నది. కవిత్వం జీవితంలో విడదీయరాని భాగమైంది. కాని, వైద్య విద్యార్థులకు ఇట్లాంటి వ్యాపకాలకు సమయం దొరకదు. అనాటమీ చదవాలా, అనాటమీలో ఫెయిలైన కేశవరెడ్డి అంతరంగం(సిటీ బ్యూటిఫుల్‌) చదవాలా అన్న మీమాంస. వ్యక్తి ఎదుగుదలకు స్వేచ్ఛనివ్వని వ్యవస్థలో జీవిత ఆకాంక్షలకి, బ్రతుకుదెరువుకీ మధ్యవున్న వైరుధ్యాన్ని పరిష్కరించుకోలేక వైద్యవృత్తిని స్వీకరించి, పిల్లల వైద్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసి పీకలలోతు కారిరిజంలో మునిగిపోయిన కాలంలో నా వెన్నుతట్టి 1997లో నా మొదటి కవితాసంకలనం ‘జలపాతశబ్దంలోకి’ ని వెలుగులోకి తెచ్చిన చిన్నన్న ఇప్పటికీ నాకు ప్రేరణ. ఈ మెత్తం కవిత్వం నేను అంతకుముందు హైదరాబాద్‌లోఉస్మానియా మెడికల్‌ కాలేజిలో చదువుతున్నప్పుడు రాసింది. ఆ కాలంలో కె.శివారెడ్డి, వి.వి.నారాయణ స్వామి, విమలల సాంగత్యం నాకు వచన కవిత్వం మీద పట్టును పెంచింది. విద్యార్థి ఉద్యమాలతో సాన్నిహిత్యం స్పష్టమైన సామాజిక,రాజకీయ దృక్పథాన్నిచ్చింది. విస్తృతంగా చదువుకునే అవకాశాన్ని, ఆవశ్యకతనీ కల్పించింది.

1994 నుండి జనగామలో పిల్లల వైద్యంలో మునిగి కాలంతో పోటీపడుతూ, వృత్తికీ-ప్రవృత్తికీ మధ్య ఎండనీడల ఆటాడుతూ నన్ను సంపూర్ణంగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా నా రెండో కవితా సంకలనం ‘ఎన్నాద్రి’ 1997 లో వచ్చింది. నూతన ఆర్థిక విధానాలు కొనసాగుతున్న ఈ కాలంలో విప్లవ సాహిత్యానికి ఒక నమూనాగా ఎన్నాద్రి నిలబడిందని విమర్శకులు కొనియాడిన సంకలనం అది. ‘రోగాల్ని నయం చేయడంకాదు ఇప్పుడు కావాల్సింది, రోగాల్ని సృష్టిస్తున్న ఈ వ్యవస్థని మార్చడం’ అన్న డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌, డాక్టర్‌ కోట్నీస్‌లు నా ఆదర్శం. కళ కళకోసం కాదు, కళ సామాజిక ప్రయోజనం కోసమని నినదించి దారులు తొక్కతూ తెలుగు సాహిత్యానికి మార్గనిర్దేశత్వం వహించిన మహాకవి శ్రీశ్రీ నాకు ఆదర్శం. ఈ ఆదర్శాల వెలుగుల్లో నన్ను నేను మైక్రోస్కోపు కింద పెట్టుకుంటే ‘Health for all by 2000A.D.’  విఫలమై ప్రజారోగ్యం గాలిలో దీపమైన చందం నా ‘అందని చందమామ’ అయింది. ఈ దీర్ఘ కావ్యం 1998 లో విడుదల అయ్యింది. ఒక ఇన్‌సైడర్‌గా వైద్య వ్యవస్థ మీద ఇది తొలి కావ్యం.

మెదడు పొరలకంటిన ‘రక్తాశ్రువులు’, కోట్నీస్‌ అమర్‌ కహానీ నన్ను ఏదో ఒక దానికి పరిమితం కానివ్వలేదు. రాయాలనెప్పుడూ నేను కవిత్వం రాయలేదు. నా ఉద్వేగాల్ని, దుఃఖాల్ని, ఒంటరితనాన్ని ప్రకటించడానికి కవిత్వం రాశాను. అసమ సమాజంలోని దుర్మార్గాన్ని, అహేతుకతను సహించలేనప్పుడు రాశాను. దాదాపు రెండేండ్లు ఒక్క కవిత కూడా రాయకుండా ఉన్న నేను మా బాపు చనిపోయినప్పుడు మళ్ళీ రాశాను. రెండేండ్ల నా కొడుకును కాన్వెంట్‌ చదువుల నిమిత్తం నాకు దూరంగా హైదరాబాద్‌లో ఉంచాల్సివచ్చినప్పుడు రాశాను. క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ అన్నట్టు అదంతా నా ‘ఉద్విగ్న మానస సంభాషణే’. ఇంటర్మీడియట్‌ తర్వాత తెలుగు వచనం రాయడం మర్చిపోయిన నాకు తెలుగు కథకులను, నవలకారులను చూసినప్పుడో, విమర్శకులను చూసినప్పుడో అబ్బురమనిపించేది. ఇంత పగడ్బందీగా అక్షరాల్ని ఎట్లా పేరుస్తారా అని ఆశ్చర్యం వేసేది. academic గా తెలుగు సాహిత్యాన్ని చదువుకోలేదన్న ఒక complex నాలో వుండేది. అట్లాంటి సమయంలో శ్రీరామకవచం సాగర్‌ కొంత ఒత్తిడి చేసి రెండు పుస్తకాల మీద సమీక్షలు రాయించి ‘ప్రకృతి సాహితి’లో వేసుకున్నడు. బాగా రాశానని complaints పొందుతున్న సందర్భంలో ఒక లబ్ధప్రతిష్ఠుడైన కవి యొక్క కవితాసంపుటిని సమీక్ష చేయమన్నడు. బలహీనమైన కవిత్వముందని చెప్పాల్సి వచ్చి, అదే రాశాను. అది ఇప్పటికీ వెలుగు చూల్లేదు. తెలుగు సాహితీకారులకు విమర్శని అంగీకరించే ప్రజాస్వామిక దృక్పథం లేదని అర్థమయ్యింది. చాలా కాలందాక మళ్ళీ విమర్శ తెరువు పోలేదు.

మా అన్న కాసుల ప్రతాపరెడ్డి ‘గుక్క’ కవితాసంపుటిలో మా ఇద్దరి ఉమ్మడి అనుభవాలు కొన్ని వ్యక్తమైనవి. చాలా కాలం తర్వాత భిన్నమైన కవిత్వాన్ని చదివినట్టనిపించింది. నా అభిప్రాయాల్ని వ్యక్తం చేయాలనిపించి, రాసి ‘చినుకు’కు పంపాను. వైద్యవృత్తి నిత్యం అశాస్త్రీయ ఆలోచనతోటి, మూఢ నమ్మకాలతోటి ప్రజలు ఎట్లా ఇబ్బందుల పాలౌతున్నారో చూసే అవకాశం కల్పించింది. ‘తెలుగు నవల-వ్యాపారధోరిణి’ లో యండమూరి కక్షుద్ర సాహిత్యంమీద విరుచుకు పడ్డ ప్రతాపన్న ‘ఎల్లమ్మ’ కథలో చూపిన ముగింపు, దానిమీద అంపశయ్య నవీన్‌, దార్ల వెంకటేశ్వర్‌ రావు చేసిన వ్యాఖ్యానాలు చూసినంక ఖచ్చితంగా నా అభిప్రాయాల్ని చెప్పాలనిపించింది. బహుశ, కాసుల ప్రతాపరెడ్డితో నాకు సంబంధం లేకుంటే రాసేవాడిని కాదు కావచ్చు. తర్వాత మళ్ళీ 2011 దాకా నేను వచనం తెరువు పోలేదు.

వచనం రాయడానికి కావాల్సిన ఎడతెరిపి నా వృత్తి నాకు కల్పించలేదు. అదే సమయంలో కవిత్వం మీద తప్ప నాకు వచనం మీద ఆసక్తి కలుగలేదు. సుంకిరెడ్డితో వున్న సాన్నిహిత్యం వల్ల, అతని కోరిక కాదనలేక ‘తెలంగాణ చరిత్ర’ ను సమీక్షించాను. అది చూసిన ‘కందెన’ వెంకట్‌ రెడ్డి కోరిక మేరకు ఒకట్రెండు రాజకీయ వ్యాసాలు రాసిన. శ్రీశ్రీ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన కవి శివసాగర్‌ చనిపోతే రాసిన. నిజానికి అంతకు మందే ‘జనగామ రచయితల సంఘం’ సభ్యుల అవగాహన కోసం శివసాగర్‌ మీద రాయాలనే ఆలోచనతో వుంటి. సాహిత్య సమావేశాల్లోను, సాహిత్య పత్రికల్లోను అకవిత్వం పాలు ఎక్కువైనప్పుడు, కవుల్లో భావదారిద్య్రం చూసినప్పుడు ‘ఆధునిక వచనకవిత్వంలో వస్తు,శిల్పాలు’ రాయాలనిపించింది.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో వచ్చిన మంచి సంకలనాలను(తెలంగాణ కవిత, మునుం,జులూస్‌) పరిచయం చేయాలనిపించి కొంత, సంపాదకుల కోరిక మేరకు కొంత సమీక్షలు రాయడానికి కారణమైనవి.కథలు రాయాలనిపించినా కవిత్వానికే పరివితమౌదామనే, గత పదేండ్లుగా నా అనుభవాల్ని కథలకు ప్లాట్‌గా వాడుకొమ్మని ప్రతాపన్నకు చెపుతుండే వాన్ని. నేను చెప్పినదేదీ తను రాయలేదు. ఇప్పటికి (2012) వచనం రాయగలననే నమ్మకం కుదిరింది. పెండింగ్‌ ప్లాట్స్‌ను కథలుగా మలుస్తున్నా. నేను రాసిన మొదటి కథ ‘ముసుగు’ ముంబైవన్‌ పత్రిక నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ‘ప్రయాణం’ ‘సాంకేతిక దోపిడి’ కథలు విమర్శకుల ప్రశంసలు పొందినవి.

వివిధ వేదికలమీద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల విశ్లేషణలతో ప్రసంగాలు చేయడం జీవితంలో ఒక భాగమైంది. సాహిత్య తపనతో జనగామలో ‘జనగామ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి, గౌరవ అధ్యకక్షుడిగా కొనసాగుతున్నాను. మనుషుల్ని, సమాజాన్ని మార్చేది సాహిత్యమేనని నా ప్రగాఢ విశ్వాసం.
సాహిత్యకారులతో సజీవ సంబంధాలంటే ఇష్టం. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో మిత్రులతో కలిపి నెలకొల్పిన 100 పడకల అధునాతన ‘APEX HOSPITALS’ MANAGING DIRECTOR గా తీరిక లేని కాలాన్ని గడుపుతున్నాను.

“మనిషి దూడను స్టేటస్‌ కొయ్యకు కట్టేసి
బతుకు పొదుగునుంచి డబ్బుల్ని పితుకుతన్నప్పుడు
విలువల ఎన్నాద్రై గుండె ఆకలి తీర్చిన
కవిత్వానికి దండంపెడతా-
ఎడారి బతుకులో
ఆశల నారుమడి ఎండి నెర్రెబారుతున్నప్పుడు

గుండె చెరువు నిండి
కన్నీటి అలుగుదుంకిన
కవిత్వానికి దండంపెడతా.” (ఎన్నాద్రి)

 

(2013 సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు అందుకుంటున్న సందర్బంగా)