కవిత్వం

కోరిక

25-అక్టోబర్-2013

గుక్క పట్టి ఏడుస్తుంది. కటిక నేల మీదికి దొర్లి కాల్జేతులు కొట్టుకుంటుంది.
అంతా అయిపోయాక ఒక మెత్తని అద్దం నవ్వై ఒళ్లోకి ముడుచుకుంటుంది.
ఎందుకేడ్చావంటే ఏం చెబుతుంది పాప? ఏదో చెబితే మాత్రం, అది నిజమా!

నేనూ అంతే. ఏం కావాలో తెలియదు. తెలిసిందేదీ చివరిది కాదు. కోసుకుపో
తుంటుంది, రూప రస గంధాల్లేనిది, ఏ నిరూపణకు నిలవనిది, నా కన్న ముందే
వచ్చి ఇక్కడ వుండినది, తనతో కలిసి కాలడమే గాని పొమ్మనడానికి వీల్లేనిది,

ఒకటి కాకుంటే ఇంకోటి. రూపాల దేముంది, రస గంధాలూ అంతే. ఇదిగో ఇదే,
ఇదే, ఇదొక్కటే, ఇంకేదీ కాదు, ఇదే చివరిదని ఏ ఒక్కటీ అనిపించదు. కన్నీటిని
ఆరనివ్వదు, ఇక సెలవని ఇష్టంగా చేతులూపుతూ వెళ్లి పోనివ్వదు నవ్వుతూ

(18-10-2013)