కవిగా ‘శత కిరణాల’తో సాహితీ యాత్ర మొదలెట్టి, సినీ విమర్శకుడిగా నలుగురి నోళ్ళలో నాని, మంచి గీత రచయితగా అందరి గుర్తింపు పొంది…
రామ్ గోపాల్ వర్మ గారిని ఒక్కసారి కలిస్తే చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునే ఫేజ్ నుంచి ఏకంగా వర్మ ప్రాణస్థానంలో ఆప్త మిత్రుని హోదా సంపాదించి, ‘వోడ్కా విత్ వర్మ’ అనే పుస్తకంతో సంచలనం సృష్టించిన ప్రముఖ సినీ విమర్శకుడు, కవి, గీత రచయిత సిరాశ్రీ గారితో వాకిలి ముఖాముఖం:
1. సిరాశ్రీ గారు ముందుగా మీ పరిచయం- మీ నేపథ్యం- చదువు, బాల్యం, కుటుంభం వివరాలు, మీ కలం పేరు గురించి.. వగైరా…
- జననం రాజమండ్రి. చదువు ఏలురులో కొంత, మచిలీపట్నంలో ఇంకొంత, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలోనూ, హైద్రాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోను మరికొంత. చివరగా అందుకున్న పట్టాలు- ఎం బీ ఏ; ఎం ఏ (తెలుగు సాహిత్యం). మా తండ్రి గారు కొన్నాళ్లు ఆర్మీలో పనిచేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ పీ స్టేట్ జెనరల్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. మా అమ్మ సంస్కృతం లెక్చరెర్. నా పూర్తి పేరు సి. రాం శ్రీకాంత్. దాని హ్రస్వ నామం సిరాశ్రీ. అదే కలం పేరు అయ్యింది. ఈ పేరు నాకు ఆంధ్రా యూనివర్సిటీలో స్నేహితులు పెట్టారు. ఊరుమ్మడి బతుకులు, ప్రాణం ఖరీదు మొదలైన రచనలు చేసిన రచయిత సీ ఏస్ రావు గారు నాకు పెదనాన్న.
2. మీరు అందరికీ ఒక ఫిలిం క్రిటిక్, ఒక లిరిసిస్ట్ గానే తెలుసు. తెలుగు కవిత్వంతో/సాహిత్యంతో మీకున్న అనుబంధం, మీ మొదటి కవిత్వ సంకలనం “శత కిరణాలు” గురించి వివరంగా చెప్పండి?
- ఫిల్మ్ క్రిటిక్ అవ్వడం చాలా యాధృచ్చికంగా జరిగింది. నిజానికి అది నా చాయిస్ కాదు, నాకు వచ్చిన చాన్స్ మాత్రమే. దాదాపు 500 పైగా చిత్రాలను సమీక్షించాను. క్రమంగా వేరొకరి కళాత్మక సృజనలో చెడుని ఎత్తి చూపడం అంతగా నచ్చలేదు. సమీక్షలన్నాక మంచి ఒక్కటి చెప్పి కూర్చుంటే సరిపోదు. పైగా చెడుని ఎక్కువగా ఎత్తి చూపినప్పుడే క్రిటిక్ గా పేరెక్కువ వస్తుంది. నాచురల్ గా సమీక్షల నుంచి దూరమవ్వడానికి అదొక కారణం. ఇక సాహిత్యంతో నాకున్న అనుబంధం నేను ఫిల్మ్ క్రిటిక్ అవ్వడానికి దాదాపు దశాబ్దం ముందుది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి పద్యాల మీద ఆసక్తి మొదలయ్యింది. శతక పద్యాలు అంతకన్నా చిన్నప్పుడే మా అమ్మమ్మ వల్ల నోటికి పట్టినా వాటి అర్ధాలు క్రమంగా హై స్కూల్ వయసులో తెలిసాయి. ఇంటర్ లో ఉండగా నాగఫణి శర్మ గారి సహస్రావధానంలో పృచ్చకుడిగా పాల్గొన్నాను. ఐదు రోజులు ఆ సాహితీ క్రతువులో మునిగి తేలే సరికి ఒక శతకం రాసేసే శక్తి వచ్చింది. ఐదు నెలల్లో 100 పద్యాలు పూర్తిచేసాను. దానికి ‘శత కిరణాలు’ అని మా అమ్మగారు నామకరణం చేసారు. అది నా తొలి రచన.
3. సాహిత్యంలో మీ తొలి పరిచయాల గురించి?
- సాహిత్యంలో నేను మొట్టమొదట దగ్గర నుంచి చూసింది మా పెదనాన్న సీ ఎస్ రావు గారిని. సినీ, నాటక, నవలా సాహిత్యం వారి ద్వారానే పరిచయం అయ్యింది నాకు. ఆ తర్వాత మాడుగుల నాగఫణి శర్మ గారి అవధానాలు చూడడం, పాల్గొనడం. తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారితో కలిసి దాదాపు రెండేళ్లు ఒక పత్రిక కోసం పని చేసే అవకాశం దక్కడం, అలా పద్యంలోనూ, వచనంలోను దిగ్గజాలైన ఈ ఇద్దరూ తెలియకుండానే నన్ను కొంతవరకు ప్రభావితం చేసారు. తర్వాత పరిచయాలు, ప్రభావాలు ఎన్నో.
4. మీరు చదివే సాహిత్యం ఎక్కువగా ఏమై ఉంటుంది? ఏ భాషది? మీకు బాగా నచ్చిన రచయితలు, ప్రభావితం చేసిన పుస్తకాలేమిటి? తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ…
- ఎక్కువగా తెలుగే చదువుతాను. ఇంగ్లీషులో నాన్ ఫిక్షన్, హిస్టరీ, ఫిలాసఫీ, ఆకల్ట్ సైన్స్ ఎక్కువగా ఇష్టపడతాను. శ్రీ శ్రీ కవితలు, జాషువా కావ్యాలు, ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, సినారే కవిత్వం, ముళ్లపూడి రచనలు, మల్లాది ఆధ్యాత్మిక కథలు, యండమూరి వ్యక్తిత్వ వికాసం, కుష్వంత్ సింగ్ హాస్య రచనలు, సర్వేపల్లి రాధాకృష్ణ “రెలిజియన్ అండ్ సొసైటీ”, డోరిస్ ఏగీ “ఎడ్గర్ కేసే”, బ్రియాన్ వీస్ “మెనీ మాస్టర్స్ మెనీ లైవ్స్”, భైరప్ప ‘పర్వా..’ ఇలా చెప్పుకుంటూ పోతే నా లైబ్రరీ లో ఉన్న 2000 పుస్తకాల లిస్టు రాయాలి.
5. మీరు కవిత్వం ఎక్కువగా చదువుతుంటారా? కొత్తతరం తెలుగు కవులు రాస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం?
- చదువుతాను. నాకు కవిత్వమైనా ఏదైనా క్లుప్తంగా ఉంటూ తీవ్రత (ఇంటెన్సిటీ) ఉంటే ఇష్టపడతాను. అది ఏ రసమైనా సరే. చాలా మంది రాస్తున్నారు కానీ క్లుప్తత, తీవ్రత కొందరి రచనల్లోనే ఉంటున్నాయి. ఆ రెండింటి మీదా దృష్టి పెడితే జనంలోకి దూసుకెళ్ళే విలువైన సాహిత్యం పుడుతుంది.
6. తెలుగు సినిమా పాటల్లో సాహిత్య విలువలు తగ్గాయని చాలామంది గొడవపెడుతున్నారు:-) అది మీరు నమ్ముతారా? చిక్కటి కవిత్వంతో కూడిన తెలుగు సినిమా పాటలకు ఇప్పటికీ తగినంత ఆదరణ ఉందనుకుంటున్నారా?
- విలువలు తగ్గుతున్నాయన్న కంప్లైంట్ ప్రతీ తరం తమ తర్వాతి తరం పై చేస్తూనే ఉంటుంది. “తగ్గడం” అనేదానికన్నా “మారడం” అనేది సత్యం. మార్పు జరుగుతున్న విషయం నమ్మాల్సిందే, అంగీకరించాల్సిందే. చిక్కటి కవిత్వం అంటే ఇక్కడ రెండు రకాలు. “ఫాల నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ ధరుని దహియింపగా…పతిని కోలువడి రతీ దేవి దుఃఖిత మతియై రోదించగా….” అంటూ “ఆడవే మయూరి…” పాటలో ఉండే పదాల ఒరవడి ఉండకపోవచ్చు. కానీ “డమరుకం” లో ‘నేస్తమా..నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం…” గాని “ఖలేజా”లో ‘సదాశివా సన్యాసి…” గాని ఆదరణ పొందలేదు??!!
7. మీరు ఇప్పటి వరకు దాదాపు పది పదిహేను సినిమాలకు పైగానే పాటలు రాసారు. ఇంతవరకు రాసిన పాటల్లో అత్యంత శ్రమించి, అనుభూతికి లోనై రాసిన పాట గురించి చెప్పండి? అలాగే సాహిత్యపరంగా మీకు బాగా సంతృప్తినిచ్చిన పాటల గురించి చెప్పండి.
- శ్రమించి రాస్తే అనుభూతి రాదు. అనుభూతి చెందుతున్నప్పుడు శ్రమ ఉండదు. “ఇట్స్ మై లవ్ స్టోరీ” లో ‘నిన్నలా లేదే మొన్నలా లేదే…’, “అహనా పెళ్లంట” లో ‘నువ్వే నచ్చావు…”, “సత్య 2″ లో ‘నువ్వు లేక..’, ‘ఏవేవో పిచ్చి ఊహలే..’, “రిపోర్టర్” లో ‘మానవతకు గొడుగై..’ అంటూ జర్నలిజం పై రాసిన పాట సాహిత్య పరంగా సంతృప్తినిచ్చాయి.
8. మీకోసం మీకు నచ్చినట్టు ఎంతో ఇష్టంగా రాసుకున్న పాటను మనసుచంపుకుని పూర్తిగా మార్చవలసి వచ్చిన సందర్భాల గురించి? సినిమా పాటలు రాయడంలో మీకు ఎదురైన అడ్డంకులు, ఇబ్బందుల గురించి?
- ఇప్పటి దాకా అలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు. బహుశా ఇంకో రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఉండొచ్చు.
9. మీరు పాటలు రాసేటప్పుడు ఏమైనా నియమాలు పెట్టుకుంటారా? ఉదా: తేలికైన అచ్చ తెలుగు పదాలనే వాడాలని.
- అలాంటిదేమీ లేదు. సహజంగా ట్యూన్ ని బట్టి, అందులో ఉన్న తీవ్రత స్థాయిని బట్టి పదాలు నిర్ణయింపబడతాయి. అయితే ఒక చిన్న నియమం మాత్రం పెట్టుకున్నాను. పాట పల్లవి రాసి అది మొదట నా వైఫ్ కి వినిపిస్తాను. తనకు అర్థమైతే అందరికీ అర్థమైనట్టే అనుకుంటూ ఉంటాను. నేటి సినీ ప్రేక్షకులని రిప్రసెంట్ చేసే టేస్ట్ తనది. అన్నిటికీ మించి డైరెక్టర్ టేస్ట్ ని అనుసరించే పాట ఫైనల్ అవుతుంది. ఈ విషయాన్ని “సత్య-2″ ఆడియో వేడుకలో “ఈ పాటలన్నీ నా సిరాలోంచి కాదు వర్మ గారి శిరస్సులోంచి వచ్చినవే” అని చెప్పాను. నిజానికి అది అందరు దర్శకులకి వర్తిస్తుంది.
10. మీ సాహిత్య జీవితంలో మీ అమ్మ గారి ప్రభావం చాలా ఉందని విన్నాను. మీ అమ్మ గారే మీకు గురువు అని కూడా విన్నాను. మీ అమ్మ గారి గురించి?
- మా అమ్మ వ్యాకరణ విద్యాప్రవీణ ఉదయలక్ష్మి గారు సంస్కృతం అధ్యాపకురాలుగా చేసి రిటైర్ అయ్యారు. సంస్కృతంతో పాటూ తెలుగులోనూ విశేషమైన పాండిత్యం ఉంది. అది నాకు చాలా ఉపయోగపడింది. పైగా ఆమెకు పాత సినిమా పాటలమీద ఉన్న ఆసక్తి నాకు సంక్రమించింది. అలాగే మా తండ్రిగారు నన్ను “మర్ద్”, “ఘరానా మొగుడు”, “గ్యాంగ్ లీడర్”, “బాషా”, “శివ” లాంటి యాక్షన్ సినిమాలకు తీసుకెళ్తే, మా అమ్మగారు “కంచుకోట”, “బందిపోటు”, “కాళిదాసు”, “దేవదాసు” లాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు (ఇలాంటి పాత సినిమాలన్నీ ఏలూరులో కేసరీ టాకీస్ అని ఉండేది. అందులో వచ్చేవి). మొత్తానికి ఇద్దరి ప్రభావం నా మీద ఉంది. చదువులో మెరిట్ స్టూడెంట్ ని కావడం చేత నా ఎంటర్టైన్మెంట్ కి ఎప్పుడూ ఢొకా ఉండేది కాదు.
11. పాతతరం సినిమా పాటల గురించి, మీకు నచ్చిన పాటల రచయితల గురించి చెప్పండి. పాత పాటల్లో మీకు బాగా నచ్చిన అంశాలు ఏమిటి?
- పాత పాటల్లో ఎక్కువగా తెలుగు పదాలు వాడే అవకాశం ఉండేది. నిజానికి అప్పటి కవులంతా ఎక్కువ స్వేచ్చను ఎంజాయ్ చేసారని నా ఫీలింగ్. ఎక్కడో ‘హలొ హలొ ఓ అమ్మాయి..’, ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్..’, ‘హలో మేడం సత్యభామ..’ లాంటి పాటల్లో తప్ప చిన్న ఇంగ్లీషు పదం కూడా వినిపించేది కాదు. ఆత్రేయ గారి క్లుప్తత, సినారె అచ్చతెలుగు సొగసు, సముద్రాల భావగర్భితమైన తత్వం ఇలా చాలా చెప్పుకోవచ్చు.
12. మీరు ఇతర భాషల పాటలు వింటారా? మన తెలుగు సినిమా పాటల్లో పరభాషా పదాలు చాలా ఎక్కువ వుంటాయని కొందరంటారు. మీరేమంటారు?
- వింటాను. మొదటి తరంలో సినిమా పాటకి గీతరచయితే హీరో. తర్వాత తరంలో గాయకుడు హీరో. ఆ తర్వాత సంగీత దర్శకుడు హీరో. ఇలా ఒక్కో కాలం ఒక్కో విభాగాన్ని ప్రధానం చేస్తుంది. ప్రస్తుతం సంగీత దర్శకుడి పరంగానే సినిమా పాట ఎక్కువగా గుర్తింపబడుతోంది కనుక అర్థానికంటే, శబ్దానికి ప్రాధాన్యం పెరిగింది. అందుకే కొత్త కొత్త శబ్దాల కోసం పరభాషా పదాల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ బట్టే ప్రోడక్ట్ కదా!!!
13. వెబ్ పత్రికల్లో మీరు రాస్తున్నకాలమ్స్ గురించి చెప్పండి. “ఇండియా బెల్స్” వెబ్ పత్రికలో మీ కాలం కి రెస్పాన్స్ ఎలా ఉంది?
- చాలా బాగుంది. ఆ వెబ్ సైట్ ని ప్రస్తుతం ఒక సింగపూర్ కంపెనీ కొనుగోలు చేసింది. కాలమిస్టుగా కంటియూ అవుతున్నా.
ఇప్పుడు కాస్త వోడ్కా కిక్కు గురించి…
14. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక్కసారి కలిస్తే చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునే ఫేజ్ నుంచి ఏకంగా వర్మ ప్రాణస్థానంలో ఆప్త మిత్రుని హోదా సంపాదించి, వర్మ గారి సినిమాలకు పాటలను కూడా రాయడం వరకు ఎదిగిన రచయిత మీరు. రామ్ గోపాల్ వర్మతో మీ ప్రస్థానాన్ని “వోడ్కా విత్ వర్మ” పుస్తకంలో అందర్నీ ఆకట్టుకునేలా రాసారు. మీరు “వోడ్కా విత్ వర్మ” రాయకపోతే రామ్ గోపాల్ వర్మ రాసుకున్న “నా ఇష్టం” అసంపూర్ణంగా మిగిలేదని కూడా కొందరంటారు. “వోడ్కా విత్ వర్మ” రాయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది? వోడ్కా.. రాయడానికి గల నేపధ్యం చెప్తారా? వర్మ గారి మీద మరో కొత్త పుస్తకం రాసే ఆలోచన ఏమైనా ఉందా?
- ఆయనకు నేను మొట్టమొదట పరిచయం అయినప్పుడు సినీ సమీక్షకుడిని. అనుకోకుండా నేను ఆయనకి గీత రచయితను కూడ అవ్వడంతో తరచూ కలిసే అవకాశం, అవసరం ఉండేది. అప్పుడు ఆయన చెప్పే కబుర్లు గాల్లో కలిసిపోకుండా అక్షర బధ్ధం చేయాలనే ఆలోచనలోంచి “వోడ్కా విత్ వర్మ” పుట్టింది. వర్మ గారు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంటారు కనుక మరో కొత్త పుస్తకం ఎప్పుడైనా రాయొచ్చు. అప్పటికప్పుడు అనిపిస్తే మొదలు పెడతాను. అంతే….నేను ఏదీ చాలా ముందుగా అనుకుని చెయ్యను.
15. ఈ పుస్తంలో కొన్ని సెన్సిటివ్ విషయాలను చర్చించారు. ఈ పుస్తకం చదివి వర్మ గారు గానీ వారి కుటుంబసభ్యులు గానీ నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
- నొచ్చుకున్న సందర్భం ఉంటే వారి కుటుంబ సభ్యుల నుంచి నాకు రేవతి (వర్మ గారి కుమార్తె) పెళ్ళికి పిలుపు వచ్చేది కాదు. ఆ ఒక్క పిలుపు చాలు ఎవ్వరూ నొచ్చుకోలేదని అర్థం కావడానికి.
16. సాధారణంగా పుస్తకాలు పుస్తకాల షాపుల్లో, లైబ్రరీలలో మాత్రమే దొరుకుతాయి. కానీ మీరు పుస్తకాలను వైన్ షాప్ ల వరకూ తీసుకెళ్ళారు మీ పుస్తకం “వోడ్కా విత్ వర్మ” వైన్ షాప్ యజమానులు కూడా వాళ్ళ షాపుల్లో వోడ్కా తో పాటు అమ్మకానికి పెట్టారని విన్నాము. మీ కామెంట్?
- హా..హా..హా… కొంత మంది వైన్ షాపు యజమానులు ఆర్ జీ వీ మీద ఉన్న అభిమానంతో ఆ పని చేసారు. ఆలోచన కొత్తగా ఉందని ఆనందించా. నిజానికి పుస్తకాల షాపుల్లో వైన్ అమ్మడానికి లైసెన్స్ కావాలి కానీ, వైన్ షాపుల్లో పుస్తకాలు అమ్మడానికి అక్కర్లేదుగా?!!
17. రామ్ గోపాల్ వర్మ ఒక పెద్ద పెను ఉప్పెన. ఆయనను అభిమానిస్తూ సినిమా రంగంలోకి వచ్చారు. ఆ ఉప్పెనలో మీ పేరు కొట్టుకుపోతుందేమోనని ఎప్పుడైనా అనుకున్నారా? నా ఉద్దేశ్యం “పెద్ద చేట్టు కింది చిన్న చెట్టు”లా ఆయన పొడ మీమీద ఉన్నంత సేపు మీ ఎదుగుదల కేమైనా ఇబ్బందీ… గట్రా…
- “వోడ్కా విత్ వర్మా” రాసాక నాకు అమెరికా నుంచి కూడా పిలుపులొచ్చాయి. బాల్టిమోర్, కాకస్విల్లే లాంటి ప్రదేశాల్లో “మీట్ అండ్ గ్రీట్ విత్ సిరాశ్రీ” లాంటి కార్యక్రమాలు పెట్టారు. సినీ పరిశ్రమలో ఎందరికో ఆప్తుణ్ణయ్యాను. దర్శకులు బోయపాటి శ్రీనివాస్ ఒక ఆడియో ఫంక్షన్లో ప్రత్యేకంగా పలకరించి మరీ ఆ పుస్తకం గురించి ప్రశంసించడం మర్చిపోలేనిది. మీ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది అనుకుంటా. )
18. ఫిలిం క్రిటిక్ గా మీకు ఎదురైన సమస్యలు, విమర్శలు, మిమ్మల్ని అసంతృప్తికి గురి చేసిన సందర్భాలు వున్నాయా?
- తమ అభిమాన హీరో సినిమా బాగోకపోయినా, పక్క హీరో సినిమా బాగున్నా ఆ కసిని అభిమానులు సమీక్షకుల్ని ఈమెయిల్స్ లో బండ బూతులు తిట్టి తీర్చుకోవడం కామన్. కొత్తల్లో ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలావాటైపోయి ఎవరూ తిట్టకపోతే తిట్టట్లేదేంటని అసంతృప్తికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
19. మీ సాహితీ యాత్రలో మిమ్మల్ని బాగా సంతోషపెట్టిన సందర్భాలు ఏమిటి?
- ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. ఎందుకంటే సాహితీ యాత్ర అంటేనే సంతోషపెట్టే విషయం. సంతోషంలో సంతోషాన్ని ఏరి చెప్పడం అనేది సముద్రంలో ఏ నీటి బొట్టు బాగుందో చెప్పడం అంత కష్టం.
21. మీరు కవిగా ఉండటానికి ఇష్టపడతారా? లేక విమర్శకునిగా ఉండటానికి ఇష్టపడతారా?
- కవిగా
22. ఒక లిరిసిస్ట్ గా, ఒక ఫిలిం క్రిటిక్ గా, ఒక కవిగా ఇప్పటి దాకా మీరు దాటిన మజిలీలని ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది?
- ఇంకా ఇక్కడే ఉన్నానా…
23. మీరు మొదటి సారి మొన్న జూలై లో అమెరికా వెళ్ళారు కదా? అక్కడి తీపి/చేదు అనుభవాల్ని పంచుకోండి.
- అక్కడి అందరు తెలుగువారి ఆత్మీయతా ఎంతో తీపి. వారందర్నీ వదిలి తిరిగిరావడం చేదు.
డియర్ సిరాశ్రీ,
మీ బుక్ వోడ్కా విత్ వర్మ చదివాను, ఎంతో శోధించి ఎక్కడ విస్గులేకుండా రాసారు.
మీకు నా ధన్యవాదాలు
చాలా సంతోషం…’వోడ్కా’ విత్ వర్మా అని టైటిల్ పెట్టి ‘విస్కి’స్తే బాగుండదుకదా…:-)
సూపెర్బ్ సర్!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
సర్…….. వర్మ గారు మీ వల్ల మారిపోయారని ,
వర్మ గారు తను మారుతూ ,అందర్నీ ఆశ్చర్య పరుస్తారు ….
మీరు మారుతూ ,మార్చే వారిని మార్చేశారని కొందరి కామెంట్
మీ పేరులోని అక్షరాల మధ్య గ్యాప్ లేకపోవడం వలన మిమ్మల్ని ఎం డీ శ్రవణ్ కుమార్ అని సంబోధించాలో లేక ఎం డీ ఎస్ రావణ్ కుమార్ అని సంబోధించాలో తెలియట్లేదు.. ..ఎందుకో గాని నాకు రెండో పేరే నచ్చింది:-)) అయినా ఏ గొడవా లేకుండా ‘కుమార్ గారు!” అని సంబోధిస్తా….కుమార్ గారు! మీ కామెంట్ చదవగానే రామ్ గోపాల్ వర్మ లాగే అర్థమయ్యీ అవ్వనట్టు అనిపించింది..చివర్లో నవ్వు బొమ్మ వేసారు కనుక నన్ను పొగిడారని మాత్రం అర్థమయ్యింది…అందుకే నాలుగు నాలుగు సార్లు చదివే ప్రయత్నం చేసాను… బోధపడింది మీ ప్రశంస ఏమిటో…కృతజ్ఞుడను…ఎవరు ఎవర్నీ మార్చలేరు….కొందరు కొన్నాళ్లు కొందరి ప్రభావంలో ఉంటారు..అంతే…:-)
సర్ ,
మీరు ఎలా సంబోదించిన నేను మీ అబిమానిని ,
కొందరి పరిచయాలతో ప్రభావాలు ప్రవాహాలయి ఎప్పుడూ సంతోషపెడుతుంది ,సంతోషపెట్టినట్లు నమ్మకంలోనైనాఉంచుతుంది.
నేను మీ ట్వీట్లు ,సమీక్షలు ,enjoy చేస్తున్నాను
am a happy fan
సిరాశ్రీ గారు,
ఇంటర్వ్యూ బాగుంది. మీ గురించి మరింత తెలుసుకునే అవకాశం కలిగింది.
అభినందనలు!
రామక్రిష్ణ
ధన్యవాదాలు రామకృష్ణ గారు
సూపర్బ్ సిరాశ్రి
ధన్యవాదాలు సర్
మీరు మరిన్ని రచనలు చేయాలి . మేము చదవడానికి వెయిటింగ్ . థాంక్స్ అండి .
తప్పకుండా:-) థాంక్ యూ
బహుముఖ ప్రజ్ఞ ఉన్న సినీ రచయిత సిరాశ్రీ గారి తో రవి గారు నిర్వహించిన ఇంటర్వ్యూ చాలా బాగుంది.
నారాయణ.