కవిత్వం

ఆకాశాన్ని పిండేయాలి

నవంబర్ 2013

మైనంవొత్తి చివరిరక్తపు బొట్టులో
తన భవిష్యత్తును వెదుక్కుంటూ
దీపశిఖ చివరి అంచుమీద
తెలియాడుతున్నది రాతిరి.
ఉదయంలోగిలికి చేరడానికి
ఎడతెగని ఒక సంఘర్షణ.

వెదుకులాట
అన్నింటిలోకి గొప్ప ఉద్యమం.

దేన్నోదాన్ని సాధించాలి కదా?
ఏవైనా కావొచ్చు -
కలలో, కౌగిళ్ళో, కలత నుండి కాసింత విరామం పొందడానికి తగవులో,
తగవుల్లోంచి స్వేఛ్ఛలోకి విహంగాల్లాగా బార్లా చాపుకున్న రెక్కలతో మార్పుల్లోకి,
మానసిక వికాసాల్లోకి.. దేనికోసమైనా కావొచ్చు.

పాము కుబుసం విడిచినట్టు
అన్ని సందిగ్ధతలని వొదులుకోవాలి.
బంధాల లోహ పరిష్వంగాల నుండి విముక్తం కావాలి.
ఈ రాతిరికి కాసింత ఇంధనం కావాలి.