అవధాని డిగ్రీలో చేరబోతున్న పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు, అతని వేలువిడిచిన మేనమేమ భూషణం బాగా చదువుకుని సంఘంలో పేరు ప్రతిష్టలున్న పెద్దమనిషి. భూషణం బావ రామచంద్రం టెన్నిస్ ఛాంపియన్, ఆస్థి భార్య తరఫున వచ్చినదే అయినా ఆస్థిపరుడు మరియూ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. వీరు ముగ్గురూ ఏలూరులో ఉన్న పని చూసుకుని పొద్దుపోయే వేళకు రామచంద్రం సెకండ్ హాండ్ ఫోర్డ్ కారులో తణుకు బయలుదేరుతారు. బయలుదేరిన ఆరుమైళ్ళలోపే ఆగిపోయిన కారు మరి రెండు చోట్ల ట్రబుల్ ఇచ్చి ముందుకు కదిలినా తణుకుకు పదిహేను మైళ్ళదూరంలో నల్లజర్ల అడవిలోకి అడుగుపెట్టాక పూర్తిగా మొరాయించి ఆగిపోతుంది.
అడవిలో ఒంటరిగా రాత్రిగడపలేక పైగా తణుకులో పొద్దున్నే కలెక్టర్ గారింట పెళ్ళికి వెళ్ళాలి కనుక కారుని ఎలాగైనా రిపేరు చేయాలని శతవిధాల ప్రయత్నిస్తూ రహదారికి కొంచెం దూరంలో ఉన్న పొదలలో కర్రకోసం వెతుకుతున్న రామచంద్రాన్ని పాము కాటేయడంతో అక్కడికక్కడే కూలిపోతాడు. అడవిలో చిరుతపులి తిరుగుతుందని విని భయపడుతున్న అవధాని ఏదో మంటని చూసి దెయ్యమనుకుని స్పృహ కోల్పోతాడు. రామచంద్రాన్ని రక్షించుకోలేకపోతున్నానని తాముకూడా దిక్కులేనిచావు చావబోతున్నామని భూషణం దదాపు ఖరారు చేసుకునే తరుణంలో పాముల వాడు సిద్దయ్య అతని కూతురు సూరీడు కనిపించి రామచంద్రాన్ని ప్రాణాపాయం నుండి తప్పించి వారికి ఆశ్రయం ఇస్తారు. అలా తమని కాపాడిన వారిద్దరితో ఈ పట్నవాసపు పెద్దమనుషులు ఇద్దరూ ఎలా ప్రవర్తించారనేది కథకు ముగింపు.
దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన “నల్లజర్ల రోడ్” కథ స్థూలముగా ఇదీ, ఈ కథ 1964 లో ఆంధ్రపత్రికలో ప్రచురించబడినది. అయితే ఈ కథ జరిగిన కాలం మాత్రం 1940 అనుకోవచ్చు ఎందుకంటే తన జీవితంలో పాతికేళ్ళ క్రితం జరిగిన ఈ కథ/సంఘటనను అవధాని గారు ఊరి చివర కట్టుకున్న తన తోట బంగళాలో రచయిత మరికొందరు మిత్రులకు ఇచ్చిన విందు అనంతరం కబుర్లలో చెప్పినట్లుగా రాశారు. ఈ కథను పైపైన చదవడానికి ప్రయత్నించే నవతరం పాఠకులకు ములకథలో పాత్రలెవరు రచయిత చెప్పే కథలో పాత్రలెవరు అని చిన్న కన్ఫూజన్ వచ్చే అవకాశముంది కనుక శ్రద్దగా చదవ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఈ కథ ప్రచురించిన గత నలభైతొమ్మిదేళ్ళలోనూ ఇప్పటికే ఆన్ లైన్లోనూ పత్రికలలోనూ ఎన్నో వ్యాసాలు వచ్చే ఉంటాయి అయినా ఈ కథ గురించి ప్రత్యేకంగా నాకు రాయాలనిపించడానికి గల కారణం ఈ తరం యువతకు ఒక మంచి కథను పరిచయం చేయాలని. మొదటి సారి తిలక్ కథలు పుస్తకం చదివినపుడు మొదట ఉన్న కథలలో నాకు కొన్ని కథలు అస్సలు నచ్చలేదు ఒక కవిగారు రాసిన కథలు కనుక భావుకత్వంతో నింపేసి ఉంటాయని ఆశించాను కానీ ఈ కథలలో మనుషులలోని కుళ్ళును కళ్ళకు కట్టినట్లు చూపించేవే ఎక్కువ. పైగా కథ అంటే ఒక స్థిరమైన ఫార్మాట్ లో ఉండాలని ఆశించేవారికి ఈ కథల పుస్తకంలోని కొన్ని కథలు కొరుకుడు పడవు నాలుగులైన్లలో ఒక చిన్న సంఘటన చెప్పి దానికి సమాజంలో వివిధవృత్తులు నేపధ్యాలలో ఉన్నవాళ్ళు ఎలా స్పందిస్తారో రాసేసి అదే ఓ కథ అంటారు. అలాంటి కథల మధ్య వైవిధ్యమైన కథనంతో ఉన్న ఈ కథ నాకు మొదటిసారి చదవగానే చాలా నచ్చేసింది.
మనుషులలోని వ్యక్తిగత స్వార్ధం ఎలా ఉంటుందనేది మేడిపండు విప్పి చూపించినట్లుగా తిలక్ గారు ఈ కథలో స్ఫుటంగా మనకు చూపిస్తారు. అలాగే మనుషులు ద్వంద్వ ప్రవృత్తితో సంధర్బానుసారంగా తమ తమ విలువలను నీతినియమాలను తమకనుగుణంగా ఎలా మార్చుకుని ప్రవర్తిస్తారో కూడా గమనించవచ్చు. ఈ కథలో నాకు నచ్చిన మరో అంశం ప్రకృతి వర్ణన, సాధారణంగా అందరూ అందంగా వర్ణించే వెన్నెలనీ రాత్రులనీ ప్రకృతినీ పరిస్థితులని పట్టి మనస్థితిని బట్టి ఎంతటి భయంగొలిపేవిగా ఉంటాయో తిలక్ గారు వైవిధ్యంగా ఆకట్టుకునేలా వర్ణిస్తారు.
మొదటి సారి ఈ కథ చదివినపుడు “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు.” అంటూ మొదలయ్యే మొదటి లైన్ చదివి కథలోని శ్రోతలకు మల్లే నేను కూడా నవ్వుకున్నాను. కానీ సబ్జెక్ట్ తెలిసిన తరవాత కథలోని వర్ణనలు ఆకట్టుకున్నాయి. తెల్లవెంట్రుకలని వెండిదారాలతో పోల్చడం దగ్గర నుండి వెన్నెలని కాష్టభస్మంతోనూ పున్నమి నాటి ఎర్రని చంద్రుడిని మాననివ్రణంతో పోల్చడం వరకూ, అడవిలో ఆకుల మధ్యనుండి పడుతున్న వెన్నెలను నేలపై పాకుతున్న వందలకొద్ది కట్లపాములలా కొండపాములలా వర్ణించడం నుండి మృత్యువుతో పోరాడుతున్న మనిషిలోని రక్తకణాలు చేసే యుద్దం గురించి వర్ణించడం వరకూ కూడా చాలా వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటాయి.
అలాగే కథలోని సిద్దయ్య సూరీడు ల పాత్రలు కూడా నాకు చాలా ఇష్టం. మంచితనానికి స్వచ్ఛతకు మానవత్వానికి మారుపేరులా ఉంటాయా రెండు పాత్రలూనూ. అసలైన స్వేచ్ఛకు నిర్వచనం చెప్పేవిధంగా బతుకుతున్న సూరీడు, కన్నకూతురి నిర్ణయాన్ని సమర్ధిస్తూ తనకి అండగా నిలబడే సిద్దయ్య పాత్రలు రెండూ కూడా 1964 ప్రాంతంలోనే రచయిత చాలా ఉదాత్తంగా మలిచారు అనిపించింది. ఇక అవధానిగారి కథ మీద కన్నా కాలుతున్న కొవ్వొత్తులపై ఆసక్తి చూపుతూ అవి ఎక్కడ అయిపోతాయో తాము చీకట్లో కూర్చోవాల్సి వస్తుందో అని విపరీతంగా భయపడే ఆచారి పాత్ర కానీ, అవధానిగారు కథనుండి దారి మరలి ఉపన్యాస ధోరణికి వెళ్తుంటే మళ్ళీ కథలోకి లాక్కొచ్చే నారాయణ పాత్ర కానీ, సంఘటన జరిగి పాతికేళ్ళుదాటినా ఆ అమాయకపు జీవితాల గురించి దిగులుపడుతూ అసలు తను చెప్పేసంఘటనను కథ అనడమే అవమానంగా భావించే అవధాని గారి పాత్రగానీ అన్నీకూడా కథ చదివిన చాలారోజుల వరకూ గుర్తుండిపోతాయి.
ఇక భూషణం రామచంద్రం లాంటి వాళ్ళని మనం ఇప్పటికీ ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం కథ రాసి ఇన్నినాళ్ళు అయినా కూడా వాళ్ళలాంటి వాళ్ళలో పెద్దగా మార్పు వచ్చినట్లు మనకి కనపడదు. అన్నిటికన్నా మిన్నగా రచయిత ఆ అడవి గురించి రాసినది చదివి ఆ దారెంట ప్రయాణిస్తుంటేనో దగ్గరలో ఉంటేనో ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలను చూసి రావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను ఏదైనా అడవి మీదుగా ప్రయాణించాల్సి వచ్చిన ప్రతిసారీ కూడా ఆ పరిసరాలను పరికించి చూస్తూ ఈ కథ గుర్తు తెచ్చుకుని “ఇక్కడ ఎందరు సిద్దయ్యలు సూరీడులు ఉండి ఉంటారో” అని అనుకోని సంధర్బం లేదు అనేది పరమసత్యం. నాకు అమితంగా నచ్చిన ఈ మంచి కథను మీరూ చదివి ఆస్వాదించండి.
ఈ కథలో నాకు నచ్చిన కొన్ని లైన్స్.
“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలియదు”
“హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు”
“వీడి ఖర్మ! ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది”
“అతను భార్యనెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి ఇచ్చిన ముప్పైనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలిక జిజ్ఞాసువులు చాలామంది బాధపడేవారు పాపం”
“మొదటినుండి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాం చేస్తోంది”
“ఇప్పుడు రోడ్లూ, టెలిగ్రాఫ్ తీగలూ, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్నీ, క్రూరమృగాల్నీ నాశనం చేశాయి. వాటితోపాటు వీరవరులూ, స్వధర్మనిరతులూ కూడా మాయమైపోయారు.”
“వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్టభస్మంలాగా భయపెడుతోంది.”
“మృత్యువుతో ముఖాముఖి. ముష్టాముష్టి యుద్దం చేస్తున్నాడు రామచంద్రం…… అవతలి ఒడ్డున ఈ బ్రతుక్కి యీ మధ్యకి యీ రహస్యానికి అవతలి తీరాన.”
“అసలే అడవి. … అందులో కాళ్ళముందు శవం. శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖ జీవితానికీ, నౌకర్లకీ, అబద్దాలకీ, బేషజాలకీ అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి యింతకన్న ఆపద ఏముంది?”
“ఆ నిముషంలో స్వార్దంకన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలూ, ఆశయాలూ అన్నీ ఆ ప్రాథమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంతవరకే. ప్రతీ మనిషి లోపల్లోపల ఒక పాము!”
“సిద్దయ్య తదేకమైన తత్పరతతో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది. భౌతికమైన ప్రపంచాన్నే శాసించే మనస్సుయొక్క శక్తిని నాకు చూస్తోన్నట్టు అనిపించింది.”
“ఇష్టం లేకపోతే కాపురమెట్టా చెయ్యడం బాబూ నా కర్ధంకాదు”
“ఒడ్డూ పొడుగూ నల్లటి పెద్ద జుట్టువున్న ఆమె ఆ అడవిలాగ స్వచ్ఛంగా, ప్రాకృతికంగా కనిపించింది.”
“పది రూపాయల నోట్లు రెండూ ఉదయపు చల్లని గాలిలో పావురాలలా పల్టీలు కొట్టుతున్నాయి”
కథ లింక్ (కౌముది సౌజన్యం తో):
థ్రిల్లర్ కథగా మొదలయ్యి, మనసు చేదుగా మారుస్తూ ముగుస్తుంది. కథలో చివరి వరకూ సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ పరిగెట్టించే కథనానికి దాసోహమనాల్సిందే. well written Venuji!!
థాంక్స్ మురళీ.. ఎస్ కథనం చాలా బాగుంటుంది..
బావుందండి..బాగా రాసారు. చక్కని కథని ఎన్నుకున్నారు. ఇంకా రాయాలి మరి..:)
థాంక్స్ తృష్ణ గారు, హహ తప్పకుండా ప్రయత్నిస్తానండీ..
ఇది చదివినట్లు గుర్తు .మేలు చేసిన వాళ్ళకే కీడు చేస్తారు . చక్కగా వ్రాసారు వేణు గారు
థాంక్స్ శశిగారు, ఇది మళ్ళీ మళ్ళీ చదివించే కథ అండీ చదివేసినా పర్లేదు మళ్ళీ చదివేయండి )
వేణు గారూ, బాగా చెప్పారు – “భూషణం రామచంద్రం లాంటి వాళ్ళని మనం ఇప్పటికీ ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం కథ రాసి ఇన్నినాళ్ళు అయినా కూడా వాళ్ళలాంటి వాళ్ళలో పెద్దగా మార్పు వచ్చినట్లు మనకి కనపడదు” అని.
మేలు చేసిన వారిని చూస్తే తలతిప్పుకుని పోయే ఈ కాలంలో చక్కని కథని పరిచయం చేశారు. అభినందనలు
ధన్యవాదాలు రాధ గారు
తిలక్ కథల్లో నాకు ఇష్టమైన కథ ఇది. దీని విశేషాలను మీరు బాగా వివరించారు.
ఒక సమస్య సతమతం చేస్తున్నపుడూ, అది తొలగిపోయాకా మనస్తత్వంలో, ఆలోచనల్లో ఎంత తేడా వస్తుందో ; ప్రయారిటీలు ఎలా మారిపోతాయో ఈ కథ కళాత్మకంగా, ఉత్కంఠభరితంగా చెపుతుంది.
కథలోని సారం ఒక్క వాక్యంలో చాలా బాగా చెప్పారు వేణు గారు.
నా వ్యాసం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ, థాంక్స్.
తిలక్ గారి కథలలోని శైలిని వైవిధ్యాన్ని బాగా పరిచయం చేసారు. థాంక్సండీ
ధన్యవాదాలు వర్మ గారు.
బాగుంది మీ పరిచయం .కథ కూడా బాగుంది .థాంక్స్ అండి మంచి కథ గురుంచి చెప్పి చదివేలా చేసినందుకు .తణుకు కు దగ్గర కాదుకాని కథలో నల్లజర్ల నిజంగానే మా జిల్లాలో ఉంది మాకు దగ్గరే .ఆ రోజుల్లో అది అడవిలానే ఉండేదట .
ధన్యవాదాలు రాధిక గారు… కథలో తణుకునుండి పదిహేను మైళ్ళు అంటాడనుకుంటానండీ అంటే దదాపు పాతిక కిలోమీటర్లు బహుశా మీరు చెప్పినది అదే ప్లేస్ గురించి అయుంటుందండీ. ఏలూరు నుండి తణుకు వెళ్ళే రూట్ లో తగుల్తుంది ఈ నల్లజర్ల అని చెప్తారు రచయిత.