కవిత్వం

కొన్ని అలలు కొన్ని వలలు

నవంబర్ 2013

నిలబడి ఎదురుచూసిన రాత్రులన్నీ దేహం పేజీల్లో దాక్కుని ఉన్నయి
కల చెదిరి కన్ను తెరిచిన ప్రతిసారి చీకటి విషమేదో నరాలలోకి ఇంకుతున్నట్టు ఉండేది
ఎండిన చెరువులాంటి దుఃఖం ఎన్నిసార్లు మనసు మత్తడి మీద దుంకులాడిందో
అలకల అలలమీద తేలుకుంటూ సముద్రంతో సంభాషిస్తున్నప్పుడల్లా
చేప ముల్లులాంటి గాయమేదో ఒంటిని పొడుస్తనేఉన్నది
కొంచం ఓర్చుకొని బాధల్ని తట్టుకోవడం నేర్చుకున్నాక
స్వరం పాలపిట్టలా మారిపోయింది

కొత్తగా మాటల చేదును మింగుతున్న రోషం తగ్గడం లేదు
పగ్గం ప్రజల చేతుల్లోకి చేరుకున్న నిశీది సమయాన
పానకం లాంటి మత్తేదో ఈ మట్టి మీదకు బండరాయిలా దొర్లుకుంటూ వచ్చింది

కోరిక పచ్చదనం కోల్పోని చెట్టు
చిగుర్లలోంచి నిశబ్దంగా కదులుతూ కాలం మండలకు వేలాడుతుంది

పసిగట్టవలసినవి గొంతు నడకల్ని
నినాదాల్లోని అబద్దపు దారాల్ని వడికి
తెగిన పోగుల్ని ప్రజలముందు బట్టబయలు చేయాలి
నిజాన్ని పర్రెలువారిన నేలమీద జండాగా ఎగరేయ్యాలి

ఇంకా మించిపోయింది ఏమిలేదు
గీసిన గీతలు అట్లనే ఉన్నయి
రెండు పునాదుల మీదనుంచి నూతన సంస్కృతి
బయలుదేరే వేళయింది



3 Responses to కొన్ని అలలు కొన్ని వలలు

  1. November 21, 2013 at 3:08 pm

    ఎండిన చెరువులాంటి దుఃఖం ఎన్నిసార్లు మనసు మత్తడి మీద దుంకులాడిందో …ఇక్కడ నాకు చొంత్రదిచ్తిఒన్ కనిపిస్తంది. ఎండిన చెరువు లో మత్తడి కుదురదు. అదిపోతే కవిత బాగుంది

  2. chinnarivemuganti
    November 28, 2013 at 5:53 pm

    నా కవిత కు కామెంట్ పెట్టనందుకు ధన్యవాదములు మీ ప్రాంతీయాభిమానానికి సలాములు

  3. dasaraju ramarao
    December 20, 2013 at 9:01 pm

    తెలంగాణ పోరాట నేపధ్యం లో ఏ తెలంగాణ కవి అయినా బలంగానే పలుకుతడు.తెంపిన దారపు పోగుల లాంటి నిజాల్ని మార్మికతగా అల్లిన వేముగంటికి అభినందనలు…

Leave a Reply to chinnarivemuganti Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)