కథ

గొర్రెల స్వామ్యం!

నవంబర్ 2013

అమెరికను కంపెనీలో ఓ మీటింగు జరుగుతోంది. పదిహేను మంది ఉద్యోగులు వున్నారు. అందులో, ఇద్దరు ఆడ మేనేజర్లు. ఇద్దరు మొగ మేనేజర్లు. మిగిలిన పదకొండు మంది ఇంజనీర్లు. వారిలో ముగ్గురు ఆడ ఇంజనీర్లు. ఒకరి తర్వాత ఒకరు మాట్టాడుతూనే వున్నారు. అందరూ కలిసి, ఏం చెయ్యాలా, ఎలా కంపెనీ లాభాలు పెంచాలా అని తీవ్రంగా చర్చిస్తున్నారు.

ఆ గదిలో ఆ పదిహేను మందీ కాకుండా, ఒక మూడేళ్ళ అమెరికను పాపాయి కూడా వుంది. మీటింగు మధ్యలో, ఆ పాపాయి, “డాడీ” అని చిన్నగా గొణిగింది. అదే సమయంలో వాళ్ళ నాన్న ఏదో మాట్టాడుతున్నాడు. మాట్టాడుతున్నది ఆపి, “కాస్సేపుండు స్వీటీ” అని కూతురికి చెప్పి, మళ్ళీ మాట్టాడాడు. మాట్టాడ్డం అయిపోయాక, “ఏంటమ్మా?” అని కూతుర్ని అడిగాడు. ఆ పిల్ల ఏదో నెమ్మదిగా చెప్పింది. అక్కడ ఆ పిల్ల కూర్చుని, వాళ్ళ నాన్న ఇచ్చిన ఏవో చిన్న పళ్ళు తింటూ, కాగితం మీద రంగు పెన్నులతో గీసుకుంటోంది. ఏదో స్టాంపు పెట్టుకుని, వాళ్ళ నాన్న బుక్కులో స్టాంపులు వేసుకుంటోంది. మధ్యలో వాళ్ళ నాన్నని, తన బొమ్మ ఇమ్మని నెమ్మదిగా అడుగుతోంది. చూడ్డానికి సరదాగా వుంది.

చాలా సార్లు, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటి దగ్గిర చూసే వాళ్ళు లేక, తమ కంపెనీలకి తీసుకువస్తూ వుంటారు. కొంత మంది పిల్లలు మహా చికాకు కలిగిస్తారు. కొంత మంది బుద్ధిగా, ముచ్చటగా వుంటారు. ఆ పిల్లలు కంపెనీ కాయితాలూ, కలాలూ, ఇవీ అవీ చాలా స్వాతంత్రంతో వాడేసుకుంటారు. ఆ పాపాయి తింటున్న పళ్ళూ, రంగు పెన్నులూ, పేపర్లూ, అన్నీ కంపెనీవే.

అది చూస్తుంటే, ఇంటర్నెట్లో చదివిన జోకు ఒకటి గుర్తొచ్చింది సమీర్కి. ఒక తండ్రి, ఇంట్లో ఫోను బిల్లూ, ఇంటర్నెట్ బిల్లూ, ఆ నెల చాలా ఎక్కువగా వచ్చాయని ఎగురుతున్నాడు. “నేనస్తమానూ మా కంపెనీ ఫోనూ, ఇంటర్నెట్టే వాడతాను. ఇంట్లో ఎవరింత పెద్ద బిల్లు వచ్చేలా అవి వాడారూ?” అని కేకలేస్తున్నాడు. ఉద్యోగం చేసే తల్లి కూడా, తన కంపెనీ ఫోనూ, కంపెనీ ఇంటర్నెట్టే తప్ప, ఇంట్లోవి వాడనని విన్నవించుకుంది. ఉద్యోగస్తులైన పిల్లలిద్దరూ, “మేము కూడా మీ పిల్లలం కామా? మా ఆఫీసుల్లోవే వాడుకుంటాము” అన్నారు. “మరి బిల్లు ఇంత ఎక్కువగా ఎలా వచ్చింది?” అని, అందరూ అక్కడే ఇల్లు ఊడుస్తున్న పని మనిషి వేపు చూశారు.

దానికి, ఆ అమ్మాయి, “అదేటండీ, నా వేపు అలా చూస్తారూ? మీరంతా మీ కంపెనీలవి వాడితే, నేనూ అంతే. ఈ ఇల్లేగా నా కంపెనీ” అంది. ఆ కుటుంబ సభ్యులు వెర్రి మొహాలు వేశారు.

సమీర్, తనలో తానే, నెమ్మదిగా నవ్వుకున్నాడు. కంపెనీ వస్తువుల్ని వాడుకోవడం ఉద్యోగులందరికీ అలవాటే.

సమీర్ రెండు చెవుల తోటీ మీటింగు విషయాలు వింటూ, రెండు కళ్ళతో ఆ పాపాయిని చూస్తున్నాడు. అప్పుడు వచ్చింది పర్సనల్ డిపార్టుమెంటు నించీ ఆ మెయిలు. దాని సారాంశం – ఆ మధ్యాన్నం కంపెనీలో ఒక మీటింగు జరుగుతుందనీ, అందరు ఉద్యోగులూ దానికి రావాలనీ. మీటింగులో, కంపెనీకి కుక్కల్ని తీసుకు రావొచ్చా, తీసుకు రాకూడదా అని చర్చిస్తామనీ, కంపెనీలోకి కుక్కల్ని తీసుకురావడం మీద కొంత మంది ఉద్యోగులకి అభ్యంతరాలు వున్నాయనీ కూడా వివరణ వుంది.

సమీర్ గతుక్కుమన్నాడు. ఆ మెయిల్లో తన పేరు ఎక్కడన్నా వుందేమోనని, పట్టి పట్టి చూశాడు. ఎక్కడా లేకపోవడంతో, కొంచెం తేరుకున్నాడు. ఎందుకంటే, ఆ కుక్కల గురించి ఆ ఆరోపణ చేసింది సమీరే! అతనికి కుక్కలతో చాలా చెడ్డ అనుభవాలున్నాయి. బొత్తిగా భరించలేని అనుభవాలు. దేనికయినా సిద్ధం కానీ, కుక్కలతో సావాసానికి ఏ మాత్రం సిద్ధంగా లేడు. పైపెచ్చు ఆ ఆలోచనే అతనికి ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది.

రెండ్రోజుల కిందట, కంపెనీకి ఓ ఉద్యోగి తీసుకువచ్చిన కుక్క, సమీర్ చెయ్యి నాకేసింది పక్క నించి. మొహం మీద ఓ విసుగు నవ్వు మొలిపించి, దాన్ని ఆ ఉద్యోగికి చూపించి, బాత్రూమ్కి పరిగెత్తుకెళ్ళి, చెయ్యి శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కున్నాడు. వెంటనే, తన సీటు కెళ్ళి, పర్సనల్ డిపార్టుమెంటుకి ఆ ఆరోపణ పంపించాడు కుక్కల మీద.

ఎవరన్నా అడిగితే, “కుక్కలంటే నాకు అయిష్టం అని కాదు. వాటితో శుభ్రం వుండదు. చిన్నతనంలో మా నాన్న ఒక కుక్కని చాలా ఏళ్ళు ఇంట్లో పెంచాడు. చాలా అవస్తలు పడ్డాం. ఇంటి నిండా దాని బొచ్చూ, దాని కంపూ, దాని చొంగా. కుక్కలతో సహజీవనం వద్దు బాబోయ్ అనిపించింది చిన్నప్పుడే” అని చెబుతూంటాడు.

ఆ మధ్య, సమీర్ నాలుగేళ్ళ కూతురి స్నేహితురాలు తన కుక్కతో వాళ్ళ ఇంటికి వస్తానంటే, సమీర్ వద్దన్నాడు. “వాటి వాసనా, బొచ్చూ భరించకూడదు” అన్నాడు.

ఓ కుక్కని పెంచుకోవాలని సమీర్ కూతురికి చాలా మోజే, స్నేహితురాల్ని చూసి. అయితే, ఆ పెంచే పని తన నెత్తిన పడుతుందని, వాళ్ళమ్మ ఒప్పుకోలేదు.

ఆ మధ్య ఆఫీసులోనే ఒక మీటింగులో, సమీర్ ఏదో మాట్టాడుతూ వుంటే, సడన్గా ఏదో అతని మీదకి ఎక్కింది. ఏమిటా అని చూస్తే, అది కుక్క! అతని పక్కన కూర్చుని వున్న ఇంజనీరు, ఆ కుక్కని కంపెనీకి తీసుకువచ్చాడు. అది కూడా మీటింగుకి వచ్చింది. అంతవరకూ, ఆ ఇంజనీరు కాళ్ళ దగ్గిర కూర్చుని వుంది. కాస్సేపటికి దానికేం పుట్టిందో, సమీర్ ఒళ్ళో కాళ్ళు పెట్టి, అతని మొహంలోకి చూసింది. సమీర్ తేరుకుని, కుక్క వాడి వేపు ఇబ్బందిగా చూశాడు. ఆ ఇంజనీరు దాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు, “అబ్బే, ఇదేం చెయ్యదండీ” అంటూ. ఆ కుక్క కూడా ఒక మెంబరు అక్కడ. అస్సలు అరవలేదు.

కంపెనీలో చాలా మంది కుక్కల్ని ఆఫీసుకి తెస్తారు. అవి వాళ్ళ క్యూబ్లో కాపురం వుంటాయి. ఎవర్నీ సాధారణంగా ఏమీ చెయ్యవు. కానీ సమీర్కి గత అనుభవాలు కొంచెం వేరుగా వున్నాయి.
కొన్నేళ్ళ కిందట సమీర్ పని చేసిన ఒక కంపెనీలో, వాళ్ళ వైస్ ప్రెసిడెంటు ఒక రోజు తన కుక్కని కంపెనీకి తెచ్చాడు. అది వాడి తోటే ఆఫీసంతా తిరిగింది. ఒక రోజు దూరంగా వున్న సమీర్ని చూసి, గట్టిగా అరుస్తూ, పరిగెత్తుకుంటూ, అతని మీదకి ఎక్కేసింది. కొయ్యబారిపోయాడు. కర్రలా నిల్చుండిపోయాడు.

దాని యజమాని, అలా నించున్నవాణ్ణే, “ఏం చేశావూ?” అని అడిగాడు.

సమీర్ తెల్లబోయి, “నేనా చేసింది? కుక్క నా మీదకి ఎక్కిందా, నేను కుక్క మీదకి ఎక్కానా?” అన్నాడు.

“ఎప్పుడూ మా టామీ అలా అరుస్తూ, ఎవరి మీదకీ వెళ్ళదు. ఏమయిందో మరి” అన్నాడు కుక్కవాడు అతిశయంగా, సమీర్నే అనుమానిస్తూ. అతడు చాలా సార్లు, దాన్ని మీటింగులకి తీసుకొచ్చేవాడు. “పడుకొని దొర్లూ” అని వేలితో, దానికి సంజ్ఞ చేసి, దాని విన్యాసం అక్కడున్న వాళ్ళందరికీ గర్వంగా చూపించేవాడు.

ఆ కుక్క మీద సమీర్కి కోపం. అది కనబడ్డప్పుడల్లా, దాని వేపు కోపంగా చూసేవాడు. అది, “నీ మొహం లే” అన్నట్టు, పట్టించుకోకుండా, కంపెనీకి అంతా, తనే వైస్ ప్రెసిడెంటయినట్టు తిరిగేది. కొన్నాళ్ళకి దాన్ని తీసుకురావడం మానేశాడు దాని యజమాని, దాని కేదో జబ్బొచ్చిందని.

అదే కంపెనీలో, సీఈవో కూడా తన కుక్కని ఆఫీసుకి తెచ్చేవాడు. అది ఒక చిన్న దూడ సైజులో వుండేది. దాన్ని గొలుసుతో కట్టి తన గదిలో పెట్టుకోడు ఆ సీఈవో. అది ఆఫీసంతా తిరుగుతూ, ఒక సారి సమీర్ పక్క క్యూబ్లో వుండే ఓ ఇంజనీరు తన సాండ్విచ్ని బల్ల మీద పెట్టుకుంటే, ఆ సీఈవో కుక్క ఆ సాండ్విచ్ ఎత్తుకుపోయింది.

దాన్ని చూసినప్పుడల్లా, “దొంగా” అనేవాడు సమీర్ తెలుగులో. ఆ అమెరికను కుక్కకి తెలుగు రాదు.

ఆ సీఈవోని వాళ్ళ కంపెనీ ఉద్యోగం లోంచి పీకే వరకూ, దాని బాధ వదలలేదు సమీర్కి.

ఒక సారి ఇండియాలో వున్న తన స్నేహితుడికి ఆ కుక్కల ఘోష వెళ్ళబుచ్చుకున్నాడు సమీర్.

దానికి ఆ స్నేహితుడు, “అయ్యో! ఇక్కడా పరిస్థితి అలాగే వుంది నాయనా! కుక్కని పెంచుకోడం గొప్ప విషయం అయిపోయింది. ఏదో పుస్తకంలో రాసినట్టు, ‘కుక్కలు సోఫాల మీదా, మనుషులే నేల మీదా’. కొంత మందైతే, కుక్కల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, పిల్లల్ని పక్కన పెట్టుకుంటారు. మా పేపర్ యజమాని అయితే కుక్కని తనతో పాటు ఆఫీసు బిల్డింగుకి తీసుకువస్తాడు. అది దర్జాగా అన్ని అంతస్తులూ తిరుగుతూ వుంటుంది. ఉద్యోగులందరూ దానికి, ఇసింటా అసింటా తప్పుకుని, దారి ఇస్తూ వుంటారు” అన్నాడు కోపంగా.

అప్పటికే ఉన్న బెంగ ఇంకా ఎక్కువైంది సమీర్కి. “బాగా చెప్పావు. ఈ కుక్కల, నక్కల సంస్కృతి ప్రపంచంలో అన్ని దేశాలకీ పాకుతోంది. మనుషులకి తిండీ, గుడ్డా లేకపోయినా, జంతువుల కోసం సంస్థలు! వాటికి విరాళాలు ఇచ్చే పెద్దలు! ట్రాఫిక్లో తమ కార్ల దగ్గిరకి వచ్చి అడుక్కునే బాల బిచ్చగాళ్ళని విదిలించి కొడతారు. కుక్కల్నే కాదు, అన్ని రకాల్నీ పెంచుతున్నారు” అన్నాడు సమీర్ కోపంగా.
ఒక సారి, స్నేహితుల ఇంటికి వెళ్ళాడు సమీర్, ఏదో డ్యాన్సు ప్రోగ్రాం టికెట్లు అమ్మడానికి. వాళ్ళ కుక్క అరుస్తూ, పరిగెత్తుకుని మీదకి వచ్చింది. అప్పటికి సాధించిన గొప్ప అనుభవంతో, కదలకుండా అలాగే నిల్చున్నాడు. ఆ కుక్క, యజమానులు పిలిస్తే, దూరంగా వెళ్ళింది. “మా కుక్క అలా చెయ్యదు ఎప్పుడూ” అని వాళ్ళ గొప్పలు.

‘కుక్క’ అంటే చాలు. బొడ్డూ చుట్టూ వంద ఇంజెక్షన్ల భయం గుర్తొస్తుంది. చిన్నప్పుడు రామూ గాడికి అలా జరిగింది. అంతకు ముందు సమీర్కి జరిగేదే గానీ, ఎలాగో తప్పింది. ఎప్పటిదో గుర్తు! చిన్న కుక్క పిల్ల తన మానాన తను నడుచుకుంటూ పోతోంటే, దాన్ని చూస్తే సమీర్కి ముద్దొచ్చింది. సరదా పుట్టింది. దాని మొహం మీద, “జు,జు,జు,జూ” అంటూ వేళ్ళు ముడిచి దానికి చూపిస్తూ దాని వెంట పడ్డాడు. ఆ పిల్లాడేం అఘాయిత్యం చేసేస్తాడో అని భయపడిందేమో, మొహం మీదకొచ్చిన అర చేతిని కసుక్కున కొరికింది.

“అమ్మో!” అని అరుస్తూ, ఇంటి వేపు పరిగెత్తాడు. ఇంట్లో చెబితే, “వెధవా, వూర కుక్కల వెంట పడతావా?” అని తల్లి రెండు తగిలిస్తుందేమో అనీ, “అదేం పిచ్చి కుక్కో, నడు డాక్టరు దగ్గిరకి” అంటూ, రామూ గాడికి లాగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు పొడిపిస్తుందేమో అనీ, పెద్ద భయం పుట్టింది. కుక్క పిల్ల పళ్ళు కొంచెం గాటు పడ్డాయి గానీ, రక్తం రాలేదు. నొప్పిని దాచేసుకుని, ఏమీ ఎగరనట్టే తిరిగాడు. రోజూ పొద్దున్నే లేచి, “ఏమన్నా పిచ్చెక్కిందేమోనని” అద్దంలో చూసుకునేవాడు. కొన్నాళ్ళకి అద్దం చూడ్డం మర్చిపోయాడు.

ఈ జంతువుల పెంపకం పిచ్చి కుక్కల తోటీ, పిల్లుల తోటీ, ఆగలేదు. సమీర్ పని చేసిన పాత కంపెనీలో ఒకమ్మాయి ఒక ‘ఎలక’ని పెంచుకునేది. “ఎలకని పెంచుకోవడం” ఏమిటని ఒకటే ఆశ్చర్యపడ్డాడు సమీర్.

“ఆ ఎలక నిన్ను గుర్తు పడుతుందా?” అని ఆ అమ్మాయిని అడిగాడు.

“నేను గదిలోకి వెళ్తే, ఉత్సాహంగా ఇటూ, అటూ ఎగురుతుంది. అక్కడ ఓ బిస్కట్టు ముక్క పడేస్తే, తీసుకుని తింటుంది. గట్టిగా పిలిస్తే, సోఫా కింద నించి, బయటికి వచ్చి, నన్ను చూసి, మళ్ళీ వెళ్ళిపోతుంది” అని సంతోషంగా చెప్పుకుంది.

“మీ ఎలకని ఏమని పిలుస్తావూ?” అనడిగాడు సమీర్ కోపం తొక్కిపట్టి.

“దానికి మా నాన్న పేరే పెట్టుకున్నాను, ఆయన జ్ఞాపకార్థం. రాబర్ట్ దాని పేరు” అని గొప్పగా చెప్పింది.

నవ్వాడు. ఆగని నవ్వుని, బలవంతంగా ఆపుకున్నాడు కూడా. “మరి నీ రాబర్టుకి గర్ల్ ఫ్రెండు సంగతేమిటీ? వాడికో ఆడ ఎలక తోడు కావాలి కదా? ఏం చేస్తావూ?”

“అదా? దాందేముందీ? ఆడ ఎలక వున్న వాళ్ళు తెలియజెయ్యండి అని లోకల్ పేపర్లో ప్రకటన ఇస్తే సరి. బోల్డు మంది జవాబిస్తారు. అదీ ఒక సమస్యేనా?” అంది తేలిగ్గా.

“వెళ్తా” అని చీదర పడి కదిలాడు.

ఆ అమ్మాయే, తన పిల్లికి ఏదో జబ్బు చేసిందనీ, పిచ్చిగా ఎలక మీదకి వురికిందనీ, పిల్లి వైద్యానికి తను సంపాదించే డబ్బు అంతా అయిపోతోందనీ, దిగులు పడింది. పిల్లికి మెడికల్ ఇన్స్యూరెన్సు తీసుకోవాలని నిశ్చయించుకుంది. “పిల్లికీ, ఎలక్కీ స్నేహం కలపాలని నేనసలు ప్రయత్నిస్తున్నాను. ఇదీ అర్థం చేసుకోదు. అదీ అర్థం చేసుకోదు. పిచ్చి మొహాలు” అని తిట్టింది వాటిని మురిపెంగా.
ఆ పిచ్చి మొహాన్ని చూసేసి వచ్చాడు సమీర్. “ప్రపంచంలో పేద ప్రజలకి లేని వైద్య సౌకర్యాలు పెంపుడు జంతువులకున్నాయి” అని విడ్డూరపడ్డాడు.

సమీర్కి తెలిసిన ఒక కుటుంబం, పందిని పెంచుకుంటున్నారు. వాళ్లకి ఒక పెద్ద ఫార్మ్ వుంది. అందులో 23 బాతుల్నీ, రెండు మేకల్నీ, ఒక గాడిదనీ కూడా పెంచుతున్నారు. ఆ ఇంటాయన నోటితో ఈల వేస్తే, ఆ జంతువులన్నీ పరిగెత్తుకు వస్తాయట. వాటికి ఆ ఇంటాయన తిండి పెడతాడు. ఆ తర్వాత అవి ఆ ఫార్మ్లో తిరుగుతూ వుంటాయి.

“ఆ జంతువులతో ఏం చేస్తారూ? వాటి వల్ల ఉపయోగం ఏమిటీ?” అని అడిగాడు సమీర్ తెల్ల మొహంతో.

“అబ్బే! ఉపయోగం కోసం కాదు, ప్రేమ కోసం పెంచుకుంటాం” అన్నాడాయన.

ఆయన కూతురు, “మా పంది, కీ బోర్డు వాయిస్తుంది, తెలుసా?” అంది గర్వ పడి పోతూ.

“ఎలా వాయిస్తుందీ? నేర్పావా?”

“ఏం లేదు. ఒక రోజు గేరేజీలో కీ బోర్డు కింద పడేసి, దాని మీద ఇంత తిండి పడేస్తే, ఆ పంది ఆ తిండి తింటూ, ఆ బోర్డు మీద వున్న కీలని నొక్కింది. సంగీతం వచ్చింది” అంది ఆ పిల్ల. అదే సంబరం ఆ పిల్లకి.

“పందే మా పిల్ల కాటుక డబ్బా తినేసింది ఓ రోజు” అంది జంతువుల చాకిరీతో విసిగిపోయిన ఆ పిల్ల తల్లి.

“నీ పంది పేరేంటీ?” అనడిగాడు కుతూహలంగా సమీర్ ఆ పిల్లని.

“లిబ్బీ! మా నాయనమ్మ పేరు పెట్టుకున్నాను” అందా పిల్ల మురిసిపోతూ.

పిల్లుల్ని పెంచుకునే వాళ్ళు ఏ నాటి నుంచో తెలుసు సమీర్కి. కుక్కనీ, పిల్లినీ కలిసి పెంచుకునే వాళ్ళున్నారు. ఆ పిల్లి, ఆ కుక్కతో సమానంగా పోట్టాడుతుంది. కుక్కేమో తప్పించుకుని పోవడానికి చూస్తుంటే, పిల్లి దౌర్జన్యం చేస్తుంది. వాళ్ళు నవ్వులు.

ఇక తొండల్నీ, సాలీళ్ళనీ, పాముల్నీ, అడ్డమైన క్రిమి కీటకాల్నీ, పెంచుకునేవాళ్ళూ కనబడుతున్నారు. ఒక టీవీ షోలో, ఒకడు కోతిని పెంచుకుంటాడు. అది వాడితో కలిసి టీవీ చూస్తుంది. అది వాడి చేతి లోంచి అయిస్క్రీంని లాక్కుని తింటుంది. కుక్కలతో మొహం నాకించుకునే వాళ్ళ కంటే, ఇది కాస్త నయమేలే అని సమీర్ ఆత్మ నీరసంగా రాజీ పడింది. పిల్ల మీద ప్రేమని కంపెనీలో అందరి ముందూ ప్రదర్శించిన ఆ తండ్రి, ఒక రోజు కుక్కతో ఆడుతూ కనబడ్డాడు.

“బేబీ ఏదీ?” అన్నాడు సమీర్.

“డే కేర్ సెంటర్లో వుంటుందిగా? సెంటర్కి హాలీడే అయితేనే ఆఫీసుకి తెస్తా.”

“కుక్కలకి కేర్ సెంటర్లు లేవా?”

“నో, నో, దీన్ని వదల్ను. నా చేతులే దీనికి కేర్ సెంటర్. సమీర్! మంచి అయిడియా ఇచ్చావు. పెట్స్కి కేర్ సెంటర్లు ప్రారంభిస్తే, అదీ అవసరమే. బిలియన్ డాలర్ల ట్రేడ్!
ఆఫీసు మీటింగులో అంతసేపు గతంలోకి వెళ్ళిపోయాడు సమీర్.

కుక్క పక్క వాడి ఒళ్ళో ఒరిగి వుంది!

ఊర కుక్కల విషయం, వెబ్లో ఒక రచయిత్రి రాసిన “కుక్కల పండగ” అనే బ్లాగు చదివినప్పుడు బాగా గుర్తొచ్చింది. ఆ రచయిత్రి వూళ్ళో యేడాదికో సారి “కుక్కల పండగ” చేస్తారట. ఆ రోజు, అన్నిళ్ళ వాళ్ళూ, బోలెడు పిండి వంటలు చేసి, వీధి కుక్కలకి పడేస్తారట! జంతువుల మీద ప్రేమ వుంటే వాటి కడుపు మాడకుండా అలా కాస్త తిండి పెట్టాలి. అది నచ్చింది సమీర్కి.
చివరికి మీటింగు ముగిసింది. తన క్యూబ్కి వెళ్ళి, లంచ్ ముగించి, కుక్కల మీద చర్చల మీటింగుకి బయలుదేరాడు సంతోషంగా.

సమీర్ వెళ్ళేటప్పటికే, ఆ మీటింగు మొదలయిపోయింది. ఆ మీటింగుకి ఉద్యోగులే కాకుండా, వాళ్ళ కుక్కలు కూడా వచ్చాయి. అదేదో ‘కుక్కల ఉద్యమం’ లాగా, కంపెనీల్లో తమ ప్రవేశానికి ఆ కుక్కలు ఉద్యమిస్తున్నట్టూ, అనిపించింది అతనికి.

“నేను పెళ్ళి మానేసి, ఒక కుక్కని పెంచుకుని హాయిగా బతుకుతున్నాను. వాటిని కూడా మనుషుల్ని చూసినట్టు, చూడాలి. లేకపోతే, నాకు చాలా బాధ కలుగుతుంది” అంది ఒక ఉద్యోగిని జుట్టు ఎగరేస్తూ.

“మా కుక్క ఏమన్నా అరిచిందా? కరిచిందా? అది మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా లెక్క” అని పోరాడాడు ఒకాయన.

“మన కంపెనీలో ఎగ్జిక్యూటివ్లందరికీ కుక్కలున్నాయి తెలుసా?” అన్నాడింకొకాయన.

“కుక్కల్ని పేరేట్టి పిలవాలి. మనిషిని ‘మనిషీ’ అంటారా? కుక్కకి పేరు వుండదా? మా జూలీని కుక్క అంటే నేను సహించలేను. ఒప్పుకోను” అంటూ ఇంకొకావిడ ఆక్రోశం.

చివరికి, ఆ మీటింగు హెడ్, “కుక్కల్ని కంపెనీకి తీసుకు రావడానికి వ్యతిరేకంగా వున్న వాళ్ళు చేతులెత్తండి” అన్నాడు.

సమీర్, జెండా లాగ చెయ్యెత్తాడు. అతను తప్పితే, ఎవ్వరూ చెయ్యెత్తలేదు. కుక్కలంటే ఇష్టం లేని ఉద్యోగులు కూడా చేతులెత్తలేదు. ఆ కుక్కల యజమానుల మనోభావాల్ని దెబ్బ తీయలేరట! తన లాంటి కొంత మంది ఇండియన్లు చెయ్యెత్తుతారని సమీర్ ఆశించాడు గానీ, ఒక్కరూ చెయ్యెత్తలేదు.

వచ్చింది ఒకే ఒక్క ఓటు. రావిని ఎనభై ఓట్లు!

“కుక్కల్ని కంపెనీకి తీసుకురావొచ్చు” అని కంపెనీ హెడ్ రూలింగు ఇచ్చేశాడు.

కుక్కల ప్రేమికులు సమీర్ వేపు, వెటకారం చూస్తూ, బయటికి నడుస్తున్నారు.

ఒక ఇంజనీరు అన్నాడు, “మిస్టర్ సమీర్! నీ ప్రపోజల్కి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క పెట్టావా?”

సమీర్ ఊరుకున్నాడు.

ఆ పక్కనే ఒక యువతి జుట్టు ఎగరేస్తూ, తన కుక్కని లాక్కుంటూ నిలబడింది. “ఇది మెజారిటీ! తెలుసా మిస్టర్?” అంది.

ఇంకో ఇంజనీర్ రూట్ మార్చుకుని వచ్చేశాడు.

“……డెమోక్రసీ! తెలుసా? ప్రజాస్వామ్యం! ప్రజాస్వామ్యం అని తెలుసుకో మిస్టర్ సమీర్!”

సమీర్ కళ్ళు చింత నిప్పులయ్యాయి. ఆగ్రహంతో ఊగాడు. “ప్రజాస్వామ్యం కాదు, ఇది మంద స్వామ్యం! గుంపు స్వామ్యం! గొర్రెల స్వామ్యం! ఒక గొర్రె ఎటు పోతే, గొర్రెల మంద అటే పోతుంది. గొర్రెలు మనుషుల్లాగ మారవు గానీ, మనుష్యులు గొర్రెల్లా తేలిగ్గా మారగలరు. మాసాక్రసీ అనే మాట వినలేదా మీరెవ్వరూ? మాస్ ఆక్రసీ! ఇది మనుషుల డెమోక్రసీయా? మాసాక్రసీకి సిగ్గు పడండి!”

సమీర్ ఆగ్రహానికి, చుట్టూ వున్న ప్రజాస్వామ్యం ప్రజలు కొయ్యబారారు!

***** * *****



2 Responses to గొర్రెల స్వామ్యం!

  1. November 1, 2013 at 6:56 pm

    మా ఇంటి దగ్గర్లో ఒకావిడ రెండు పాముల్ని పెంచుకుంటోంది. దాని వెనుక కథ కూడా వింతగా ఉంది! వాళ్ల క్లోసెట్ లో ఒక పాము వచ్చి
    ఉంటోందట. దాన్ని ఎన్ని సార్లు వదిలించుకుందామన్నా మళ్ళీ వచ్చి చేరిందట. సరే పోన్లే అని దాన్ని అలాగే ఉంచుకుని , పాపం ఒక్కతే అయిపోతుందని, ఇంకో పాముని తోడు గా తెచ్చి పెట్టారు. వాటిని స్వయంగా చూశాను నేను !మరొకళ్ళు పెద్ద సైజు బల్లిని పెంచుతున్నారు.

    నాకోటి మాత్రం అనుభవంలో అర్థమైంది. కుక్క(ల్ని)ని వెంటేసుకుని తిప్పే అమెరికన్లతో పొరపాటున పలకరింపుగా “నైస్ డాగ్” అన్నామా… అలా మనల్ని కూడా వాకింగ్ తీసుకెళ్ళి కుక్క తాలూకు ఆటోబయాగ్రఫీ వినిపించేస్తారని ! :-)

  2. November 2, 2013 at 7:42 am

    భలే ఉంది మీ కథ! కథనంలో హ్యూమర్ చాలా బాగుంది.

    బాగా నవ్వు తెప్పించిన కొన్ని వాక్యాలు-
    >> అది, “నీ మొహం లే” అన్నట్టు, పట్టించుకోకుండా, కంపెనీకి అంతా, తనే వైస్ ప్రెసిడెంటయినట్టు తిరిగేది.>>
    >> ఆ అమెరికను కుక్కకి తెలుగు రాదు. >>
    >> రోజూ పొద్దున్నే లేచి, “ఏమన్నా పిచ్చెక్కిందేమోనని” అద్దంలో చూసుకునేవాడు. కొన్నాళ్ళకి అద్దం చూడ్డం మర్చిపోయాడు.>>

Leave a Reply to వేణు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)