గాయపడి నెత్తురు స్రవిస్తున్న ఆ పావురాన్ని
చేతుల్లోకి తీసుకుని తలపై నిమురుతున్నాను
రాతికాలంనాటి గరుకైన స్పర్శ
దుఃఖపు కండ్ల స్పర్శ
పావురం బెదిరిపోతుంది
రెక్కలను దగ్గరకు ముడుచుకుని
తలని నా చేతుల్నుంచి విదిలించుకుంటుంది
ఎలాగో గాయపడి
ఈ నా చేతిల్లోకి చేరి
దీనంగా నన్నే చూస్తున్న పావురాన్ని నమ్మించటం ఎలా ?
వొక అంతః సంఘర్షణ నాలో..
నాలుగు రోజులుగా
ఎటూ కదలకుండా
నన్ను శోధించుకోవడమనే పనిలో నిమగ్నమై
మౌనంగా రాసుకుంటున్నాను
నా గది లోపల..
ఎక్కడో- ఏ మూల నుంచో
గతపు గాయాల సలపరింత
తిరగబెడుతూ.. వీస్తో…
రాయడం మాత్రం ఆపట్లేదు
అక్షరాలు పదాలుగా
పదాలు వాక్యాలుగా అల్లుకుంటూ అల్లుకుంటూ..
అలవాటుగా వెనక్కి తిరిగి చూసుకుంటే -
అన్నీ కలగాపులగంగానే..
మచ్చికైన కాసిన్ని ఈ అక్షరాలూ
పంజరంలో పక్షుల్లా విలవిలలాడుతూ..
2
పద్యానికీ సంకెళ్లా ?
పద్యం
పావురం
రెండూ ఉండాల్సింది
బయటే గానీ
లోపల కాదు
ఖచ్చితంగా చెప్పగలను
ఆ పావురం పంజరంలోనే గాయపడింది
తోటి జీవి సామీప్యతనూ
పంజరంగా తలచిన
ఆ పావురం – నన్ను ఓడించింది
3
నేనుండాల్సింది
లోపల కాదు
నన్ను శోధించుకోవాల్సిందీ
గది లోపలా కాదు
4
నా కళ్ల ఊహాక్షేత్రంలో
నిన్నటి నాలుగు గోడల పద్యం
పావురంగా ఎగరటాన్ని యిప్పుడు చూస్తున్నా..
సింబలిజం చాలా రకాలుగా విస్తరింపబడి ఉంది కవిత్వంలొ…అది తెలుగైనా ఆంగ్లమైనా! మీరు సింబలిజాన్ని చాలా చక్కగా వాడుకున్నారు. గాయపడ్డ పావురాన్ని చివరిగా ప్రత్యక్ష సింబలిజంలోకి లాగేసి పాఠకుణ్ణి ఓదార్చటం అభీనందనీయ ప్రయోగం. ఆ పావురం ఏమయిందో కూడా ఓ మాట చెప్పుంటే కవిత పూర్తయ్యేది. గొప్ప కవిత్వదిశగా మీ ప్రస్థానానికి శుభాభినందనలు.
ఒక గదిలో ఏకా౦త౦గ కుర్చొని కవిత చదువుతున్నభావ౦లోకి పాఠకుణ్ణి తీసుకెళ్లారు. భావోద్వేగ౦ నిశ్శబ్ధ౦గా భూమి పొరల క్రి౦ద ప్రాకినట్లు ప్రాకి౦ది. చిట్టచివరగా పద్యాన్ని పావుర౦గా ఎగిరేలా చేస్తూ ఇచ్చిన ముగి౦పు ఆశావాదానికీ, స్వేచ్చకు ప్రతీక! ఎక్సలె౦ట్ పోయమ్!
బాగుంది
బాగుంది
బాగుంది
ఎలాకావాలనుకుంటే అలా ఎగరేసుకోమని పావురంలాంటి పద్యాన్ని కళ్ళముందు పెట్టావు
అభినందనలు
మంచి కవిత మౌలీ గారు
బాలసుధాకర్ మౌళి గారూ,
మీ కవిత ఎత్తుగడే (1 ఆద్యంతమూ ) చాలా గొప్పగా ఉంది. అలాగే ముగింపూ బాగుంది. 2, 3 ల్లో మీరు వాచ్యం చేసినవి Suggestive గా వదిలేస్తే బాగుండేది. అయినా, ఈ కవితలో మంచి భావుకత ఉంది. అభినందనలు.
బాగుంది మౌళి గారూ.. మీ హృదయాన్ని ఆవిష్కరించారు.. అభినందనలు.
another beautiful poem from you thammudu ..
మచ్చికైన కాసిన్ని ఈ అక్షరాలూ
పంజరంలో పక్షుల్లా విలవిలలాడుతూ..// అద్భుతమైన భావన . గొప్పకవిత మౌళి గారూ
spoortikaramaina maatalnu irchina mee andarikee danyavaadaalu….