కవిత్వం

మట్టి గాజులు

డిసెంబర్ 2013

అమ్మ గురుంచి రాయటానికి
ఎందుకంతలా ఆలోచిస్తావ్
ఆమె కోసం…
ఓ రెండు కవితా వాక్యాలకై
ఎందుకలా నీకు నువ్వే
పదే పదే చించి పారేసుకున్న కాగితమవుతావ్

* * *

అంతవరకు…
అనంత ఆకాశాన్ని ఈది
నోట కరిచి తెచ్చిన
నాలుగు నమ్మకపు నూకలను
గూటిలోని పిల్లలకందిస్తున్న
పిట్ట కళ్ళలోని వాత్సల్యాన్ని
నీలోకి నింపుకో

రెక్కల చాటు పిల్లలకై
పిడుగై మీద పడుతున్న గ్రద్దను
ఎగిరెగిరి తన్నినప్పుడు
రాలిన కోడిపెట్ట ఈకను
నీ పుస్తకాల్లో దాచుకో

కాసింత మాతృత్వపు తడి వుండాలేగాని
ఏది కవిత్వమై నీ ముందు వాలదు

అదుగో… ఆ మడిలో
అటు పొద్దు ఇటు తిరిగే వరకు
రెప్పల వెనుక కన్నపాపలనుంచుకొని
నడుమొంచిన కొడవలై
కాలాన్ని కోస్తూ సాగిన
ఆమె పాద ముద్రలను
నీ మదిలో ముద్రించుకో

నిన్నెప్పుడో…
ఇక్కడే ఈ నేలపైనే
ఇనుప పాదాల దౌర్జన్యాన్ని
ఎదురొడ్డి నిలిచి నేలరాలిన మట్టి గాజులను
నీ శ్వాసలోకి తీసుకో

* * *

నిత్యం… నడిచే నదుల్లా సాగే వాళ్ళను
దోసిళ్ళలోకి తీసుకోని
నీలోకి ఆవాహన చేసుకో

అపుడు…
నీ గుండెలోని కవిత్వపు సడి
కళ్ళలో ఉబికిన నీటి చుక్కై
కాగితంపై పడి
కరవాలమై తళుక్కున మెరుస్తుంది!!



7 Responses to మట్టి గాజులు

  1. erathi sathyanaarayana
    December 1, 2013 at 6:49 pm

    అమ్మ ప్రేమ విప్లవం ప్రేమల కలబోత

  2. రెడ్డి రామకృష్ణ
    December 1, 2013 at 8:02 pm

    శ్రీనివాసరావు మొయిద గారు ,అమ్మని కొత్తగా చూపించారు. అమ్మకేవలమ్ ప్రేమ అనురాగాలమయం అనే భావన నుండి ప్రేమతో పాటు అమ్మలోని పోరాట శక్తిని చూపించేరు .ప్రేమ ఎక్కడుంటుందో పోరాటము అక్కడ ఉంటుంది .పోయమ్ బాగుంది.అభినందనలు.
    . .

  3. moidasrinivasarao
    December 1, 2013 at 9:50 pm

    Danyavaadaalu satyannaaraayana gaaru, raamakrishna gaaru.

  4. Narayana Garimella
    December 2, 2013 at 7:22 am

    ‘ఎంతో విలువైన/ప్రేమమయమైన మట్టిగాజులను మరియు
    గాజులు ధరించిన చేతి పిడికిడుల బలాన్ని’
    ఇలా ప్రస్తావించడం చాలా బాగుంది మొయిద శ్రీనివాస్ గారు.

    అభినందనలు.

    నారాయణ గరిమెళ్ళ.

  5. moidasrinivasarao
    December 2, 2013 at 4:48 pm

    ధన్యవాదాలు నారాయణగారు

  6. December 2, 2013 at 8:48 pm

    నిత్యం… నడిచే నదుల్లా సాగే వాళ్ళను
    దోసిళ్ళలోకి తీసుకోని
    నీలోకి ఆవాహన చేసుకో…

    చాలా నచ్చింది ఈ భావం.

    పోరాడే వారిని తల్లి కోడిలా కాపాడే ఎందరో తల్లులకు నమస్కరిస్తూ..
    మీకు అభినందనలు శ్రీనివాస్ గారు..

    • moidasrinivasarao
      December 3, 2013 at 1:27 pm

      Thank u kkk.varma garu

Leave a Reply to moidasrinivasarao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)