కవిత్వం

వస్తున్నారు ఇండియన్లు మిక్స్ కో నుండి

డిసెంబర్ 2013

దిగి వస్తున్నారు ఇండియన్లు మిక్స్ కో నుండి

నీలి బరువులు మోసుకుంటూ
వేకువలో ఆరిపోయే తారల వంటి
అరకొర కరదీపికలతో
భయకంపిత మైన పుర వీధులు వాళ్ళను స్వాగతిస్తున్నవి
వాళ్ళ చేతుల్లో ఉన్నది గుండె దడల శబ్దం
అది పడవ తెడ్లలా గాలిని తాడిస్తున్నది
వాళ్ళ కాళ్ళ నుండి అరికాళ్ళలా రాలిపడుతున్నవి
రోడ్ల ధూళి లో వారి చిరు పాదముద్రలు
మిక్స్ కో లో తొంగిచూచే తారలు
మిక్స్ కో లోనే ఉండి పోతాయి
ఇండియన్లు వాటిని అక్కడే పట్టేసుకుంటారు
వాళ్ళు బుట్టల్లో నింపుకునేది
తెల్లని స్పానిష్ బాయనెట్ భారీ పూల గుత్తులను
తెలతెల్లని కోళ్ళను
మనకన్నా మౌనతరం వాళ్ళ జీవితం
వాళ్ళు రొప్పుతూ దిగివచ్చేటప్పుడు
వాళ్ళేసవ్వడీ చేయరు
కాని,ఒక్కోసారి వారి పెదవుల మీద
నున్నని సర్పం బుసకొడుతుంటుంది .

 

(‘మిక్స్ కో’గౌటమాలా సిటీ సమీపం లోని ఒక మునిసిపల్ ప్రాంతం.’మిక్స్ కో’
అంటే వాళ్ళ భాష లో ‘మబ్బుల్లోని నివాసం’.ఇండియన్లు ‘మాయా’ సంస్కృతికి
చెందిన నేటివ్ అమెరికన్లు.)

 

మూలం: మిగ్వెల్ ఏంజెల్ ఆస్టూరియాస్ ,నోబెల్ లారియట్, గౌటమాలా.
అనువాదం: నాగరాజు రామస్వామి.