కవిత్వం

అనేక వచనాలు – ఒకే కావ్యం

డిసెంబర్ 2013

కోట్లాది గళాలు ఒక్కటై నినదించిన స్వరం ఇది
లక్షలాది కళ్ళు ఒక్కటై కన్న సామూహిక స్వప్నమిది
వేలాది ఏళ్ళ జన జీవన గీతమిది
నేల నుంచి నిలువుగా ఎగిసిన జయకేతనమిది

నిరంతర నదీ ప్రవాహ సంసృతి ఇది
జీవనసారాన్ని రాసిగా పోసిన సారవంతమైన పొలమిది
సంసృతం ,పార్శి ,ఉర్దూ ,తెలుగు విత్తనాలు
మొక్కనుండి వృక్షాలుగా ఎదిగిన నేల ఇది
కుండల జాడలే పదాలు
మగ్గం సవ్వడులే వాక్యాలు
కొలిమి మంటలే పద్యాలు
రుమాలు అరుపులే పాటలు
సామాన్యుల గుండె దరువే సంగీతం
సకల జనుల చమట చుక్కే సాహిత్యం

నీకు తెలుసో లేదో
పల్లెల్లో -పూరి గుడిసెల్లో
నులక మంచాల్లో -సత్తు కంచంలో ఎదిగి ఒదిగి
ఎంకి కొప్పు నెక్కిన ముద్దబంతిపువ్విది
చేలో వరిని -చేతుల్లో సిరిని
నుదిటి పై చంద్ర వంకల్ని
నవ్వులపై వేకువ కిరణాల్ని ప్రతిష్టించిన
మధుర వాణి కంటాభరనమిది
గొబ్బెమ్మ- అట్లతద్ది ఆటలతో
బతుకమ్మ- దసరా సంబరాలతో
నింగి నేలను ఏకం చేసిన
తంగేడు పూల పరిమళమిది
కాళోజి కవన మిది

శాతవాహన -కాకతీయ -కుతుబ్ షాలు
ఆసఫ్జా -ఆంగ్లేయులు -సబ్బండ వర్ణాలు
సమిష్టిగా నిర్మించిన సాంసృతిక సౌధం ఇది

గడిలు -గుడులు -కిల్లాలు -కోటలు
పచ్చని పొలాలు -పాలకంకులు -చెరుకు గడలు ఓ వైపు
బీడు భూములు -బంజరు నేలలు మరో వైపు
గద్దరు పాటలు -సుశీలమ్మ స్వరాలు -జానపద జావళీలు
బిన్న ప్రపంచాల సహజీవన సౌoదర్యo ఇది

గడ్క -సర్వపిండి -ఉస్మానియా బిస్కెట్ -బెల్ పూరి
బొబ్బట్లు -రాగిముద్ద -పూతరేకులు -పిజ్జా బర్గర్
అన్ని కలసిన సాంసృతిక సంగమ స్థలి ఇది

సాముహికతలో వ్యక్తి గతాన్ని
వ్యక్తి గతం కోసం సాముహికతని
కోల్పోయిన నవలోకమిది

కైలాస గిరిపై నెలవంకలు
సైబర్ టవర్స్ పై వర్చువల్ వెన్నెలలు
నిరాటంకంగా కురుస్తూనే ఉన్నాయ్

ఇప్పుడు మనం చూస్తుండగానే
దక్షణ తుఫాన్ ఈ భూమిని
కబళించే ప్రయత్నం చేస్తుంది
ఉత్తర సునామి ఆక్రమణ కోసం ఉవ్విళ్ళూరు తుంది
పశ్చిమ పవనం సుతిమెత్తగా మేజిక్ చేస్తుంది

వేల ఏళ్ళ నుండి
మన ఉగాదిని -మన కోయిలలని
కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం
ఈ నాల్గు దిక్కుల దగాలకి సాష్టాo గ పడతామా ?

నేస్తమా ఇది గుర్తుంచుకో
సంప్రదాయాలు- చదువులు
వేడుకలు- వాదనలు
వేదనలు -విజ్ఞానాలు
నిరంతర సంచలిత వచనాలే
సంసృతి మాత్రం కావ్యమే
మొక్కలు ఎదిగిన మృత్తికలు వేరువేరే కావొచ్చు
మన కాళ్ళు నడిచొచ్చిన నేల ఒక్కటే
మన గుండెలను నిలబెట్టిన మట్టి ఒక్కటే

ఇప్పటి దాకా
ఈ నేల ప్రాచీనత గురించే మాట్లాడుకున్నాం
చరిత్ర గత వైభవ శిదిలాలనే స్మరించుకున్నాం
కానీ ఇప్పుడు ఈ భూమి
నేటి కాలపు పారడైజ్ అని చాటుదాం
miniature of future world అని
ఫ్యూ జన్ మ్యూజిక్ ని వినిపిద్దాం



6 Responses to అనేక వచనాలు – ఒకే కావ్యం

  1. December 1, 2013 at 11:25 am

    కవితలో fluency and force ఉండటం విశేషం, అభినందనీయం.
    శ్రీలక్ష్మి గారూ, కంగ్రాట్స్.

  2. mercy margaret
    December 1, 2013 at 11:52 pm

    మంచి కవిత లక్ష్మి గారు ..

  3. moidasrinivasarao
    December 3, 2013 at 2:02 pm

    Poem bavundi madam

  4. Rajendra Prasad .M
    December 3, 2013 at 6:22 pm

    గడ్క -సర్వపిండి -ఉస్మానియా బిస్కెట్ -బెల్ పూరి
    బొబ్బట్లు -రాగిముద్ద -పూతరేకులు -పిజ్జా బర్గర్
    అన్ని కలసిన సాంసృతిక సంగమ స్థలి ఇది

    సాముహికతలో వ్యక్తి గతాన్ని
    వ్యక్తి గతం కోసం సాముహికతని
    కోల్పోయిన నవలోకమిది

    కైలాస గిరిపై నెలవంకలు
    సైబర్ టవర్స్ పై వర్చువల్ వెన్నెలలు
    నిరాటంకంగా కురుస్తూనే ఉన్నాయ్

    ఇప్పుడు మనం చూస్తుండగానే
    దక్షణ తుఫాన్ ఈ భూమిని
    కబళించే ప్రయత్నం చేస్తుంది
    ఉత్తర సునామి ఆక్రమణ కోసం ఉవ్విళ్ళూరు తుంది
    పశ్చిమ పవనం సుతిమెత్తగా మేజిక్ చేస్తుంది

    వేల ఏళ్ళ నుండి
    మన ఉగాదిని -మన కోయిలలని
    కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం
    ఈ నాల్గు దిక్కుల దగాలకి సాష్టాo గ పడతామా ?
    డియర్ సర్, థాంక్స్ ఫర్ యువర్ simplest presentation. కీప్ ఇట్ అప్. . Namassulu RP

  5. December 11, 2013 at 5:26 pm

    కవిత బాగుంది. అభినందనలు.

  6. D.Venkateswara Rao
    December 29, 2013 at 5:25 pm

    స్వరం స్వప్నం గీతం జయకేతనం సంసృతి
    పొలం నేల
    పదాలు వాక్యాలు పద్యాలు పాటలు సంగీతంసాహిత్యం
    ముద్దబంతిపువ్వు కంటాభరణం పరిమళం
    కవనం సాంసృతిక సౌధం
    పాటలు స్వరాలు జానపద జావళీలు
    సౌందర్యం సంస్కృతీ సంగమ స్థలి నవలోకం
    వచనం కావ్యం

    గత చరిత్ర అంతా బాగానే ఉంది కాని

    “వేల ఏళ్ళ నుండి మన ఉగాదిని -మన కోయిలలని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం
    ఈ నాల్గు దిక్కుల దగాలకి సాష్టాo గ పడతామా ?” అంటున్నారు

    పకృతి వైపరీత్యాలను శాసించే వరకు మన విజ్ఞానం అభివృద్ధి చెందలేదు

    “ఇప్పుడు ఈ భూమి నేటి కాలపు దివ్యోద్కానము /స్వర్గము అని చాటుదాం
    రాబోయే ప్రపంచానికి సూక్మాకారం అని సంగీత సమ్మేళనం అని వినిపిద్దాం” అన్నారు ఎలాగో చెప్పలేదు

Leave a Reply to M.V.Rami Reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)