కవిత్వం

చేరన్ కవితలు కొన్ని: అమ్మా, విలపించకు

జనవరి 2013

అమ్మా విలపించకు

నిను ఓదార్చడానికి

పర్వతాలు సరిపోవు

నీ కన్నీళ్లు నింపుకునే

నదులు లేవు

 

నీ భర్త తన భుజం మీదినుంచి

శిశువును నీకందించిన క్షణాన

తుపాకి పేలింది

 

నేలరాలిన నీ తాళిబొట్టు మీద

నెత్తురు చిందింది

 

విస్ఫోటనమైన బాంబు వేడికి

నీ అందమైన కలలన్నీ వాడిపోయాయి

 

నీ మంజీరాలనుంచి జారిపడినవి

ముత్యాలూ కాదు

కెంపులూ కావు

నెత్తుటి నేరాన్ని గుర్తించే

పాండ్య రాజు ఇంకెంత మాత్రమూ లేడు

 

నిద్రలేని రాత్రులలో

నీ బంగారుకొండ అసహనంగా కదలాడి

’అప్పా’ అని గొంతెత్తి ఏడ్చినప్పుడు

ఏం చెపుతావు?

చిన్నారికి చందమామను చూపుతూ

అడుగడుగూ వేస్తున్నప్పుడు

రొమ్ముకు ఆనించుకుని ఊరుకోబెడుతున్నపుడు

’అప్పా దేవుడి దగ్గరికెళ్లాడు’ అని మాత్రం చెప్పకు

 

ఈ దుఃఖం ఎడతెగనిదని చెప్పు

ఇంకా చిందుతున్న నెత్తురు కథ చెప్పు

అన్ని దుర్మార్గాలనూ అంతంచేసే

పోరాటం చేయవలసే ఉందని చెప్పు

 

అమ్మా అళాడీ, 1986

 

ఇంగ్లిష్: లక్ష్మి హోల్మ్ స్ట్రామ్

 

 

 

అడుగు

 

అడుగు పరిష్వంగంలోని సర్పాలను, రమించడమెట్లాగో.

ఉదయాన్నడుగు, భళ్లున తెల్లారడమెట్లాగో.

అడుగు వటవృక్షాలను, ఓపికకు అర్థమేమిటో.

నిద్రలో నడిచేవాళ్లనడుగు, స్వప్నాల వర్ణమేమిటో

అడుగు కాందిశీకులను బాష్పబిందువులే బందిఖానాలెలా అయ్యాయో

ఈ పట్నపు వీథుల్లో రాత్రులలో నడిచే స్త్రీలనూ నల్లవాళ్లనూ అడుగు

భయమంటే ఏమిటో

అడుగు ముక్కుపుడకలు పెట్టుకున్న ప్రేమికులను

వాంఛ జీవితం ముప్పైరోజులేనా అని

ఒకప్పుడు పున్నమిరాత్రుల్లో

వంతెన కింద పాలకడలిలో గానాలు వినిపించిన

చేపలన్నీ ఎక్కడ అదృశ్యం అయ్యాయో వర్షరుతువు నడుగు

భాషా ఏకాకిత్వం దేనికి జన్మనిస్తుందో ప్రవాసులనడుగు

నా జీవితపు మంచుకొనల మీద కణకణమండే

నిప్పుకణిక విసిరిన ఆమెనడుగు

లోలోపలి ఏకాంతపు వేదన ఏమిటో

ఆమెనడుగు

ఆమెనడుగు.

 

నన్ను

అడుగు

సాయంకాలపు చివరాఖరి రైలు వెళిపోయాక

రైలుపట్టాలు చలిలో వణుకుతూ పగిలిపోతున్నప్పుడు

ఒకేఒక్క రెక్కతో ఒకేఒక్క పువ్వుతో

నిరీక్షించడమంటే ఏమిటో

 

కీల్ 1995

ఇంగ్లిష్: లక్ష్మి హోల్మ్ స్ట్రామ్

తెలుగు: ఎన్. వేణుగోపాల్

 

ఈ కవితకు ముగింపు లేదు

ఈ కవితకు ముగింపు లేదు

ఈ పాట సంపూర్ణం కాదు

ఈ కోరికకు సాఫల్యం లేదు

జ్ఞాపకాలన్నీ ధ్వంసం కావడానికి నిరాకరిస్తాయి

భూమి భూమంతా లొంగిపోవడానికి తిరస్కరిస్తుంది

ప్రతి ముఖమూ నిలిచిపోనని మొరాయిస్తుంది

 

లోలోపలనైనా వెలుపలనైనా

పేరుగానో ఉనికిగానో

ఒక కల మాత్రం నిలిచే ఉంటుంది

రద్దయిపోవడానికి నిరాకరిస్తూ

 

అశాశ్వతత్వం ఎడతెగని దిమ్మరితనం

తమ సమ్మోహక కాంతిని పరుస్తాయి

 

ఇప్పుడిక

నేనేం పంపగలను

చేదుఫలం అంటని ఒంటరితనపు

మాధుర్యపు ఆశలో

ఈ కవిత తప్ప

 

 

 

ఇందక్ కవిదైయల్ ఎళుడి ముదిక్క ముడియాదు, 2004

ఇంగ్లిష్: లక్ష్మి హోల్మ్ స్ట్రామ్

తెలుగు: ఎన్ వేణుగోపాల్