సిలికాన్ లోయ సాక్షిగా

సింగిల్ మామ్

జనవరి 2014

సిలికాన్ లోయ సాక్షిగా – 8

అపార్ట్ మెంట్ మారి సంవత్సరం కావస్తూన్నా అలీసియా తో అప్పుడప్పుడూ ఫోను లో మాట్లాడుతూనే ఉన్నాను. తనవతలి నుంచి స్పానిష్ లోనూ, ఇట్నించి నేను ఇంగ్లీషులోను. తనకు నేను మాట్లాడేది అర్థమయినా కాకున్నా తన గొంతులో ఆనందం కోసమైనా మాట్లాడుతూ ఉంటాను.

“ఇవేళ వాల్ మార్ట్ కి వెళ్తూ అలీసియాని కలిసొచ్చాను. మా ఇద్దరి ఫ్రెండు ఆంటోనియా గుర్తుందా! అలీసియాతో బాటూ మనింటికి వస్తూండేది. వాళ్ల చిన్నమ్మాయి మన అపార్ట్ మెంటు లోనే అద్దెకి ఉంటూందట.” అన్నాను సూర్యతో.
ఆఫీసుకి వాకబుల్ గా ఉన్న అపార్ట్ మెంటు కావడం వల్ల మధ్యాహ్నం భోజనానికి వచ్చెళుతున్నాడు.

“అదే కదా, నిన్న కారు పార్కింగు దగ్గర ఎవరో నిధి వయసు అబ్బాయి కనిపించాడు. నాకప్పుడు ఎవరో సరిగా గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆంటోనియా మనవడు వాడు.” అన్నాడు సూర్య.

***

నిధి సంతోషంగా పరుగెత్తుకొచ్చింది. “మమ్మీ ఎవరొచ్చారో చూడూ”

పక్కన తన చెయ్యి పట్టుకుని నిలబడ్డ ముద్దొచ్చే రెండేళ్ల పాప ను చూడగానే భలే ముచ్చట వేసింది.

“హల్లో…బంగారం…” అన్నాను.

“తిన పేరు బంగారం కాదమ్మా, ఇసబెల్లా” అంది నిధి నవ్వుతూ.

ఆ వెనకే పదినిమిషాల్లో వాళ్లమ్మ వచ్చింది. నన్ను చూస్తూనే దగ్గరకు వచ్చి హత్తుకుని

“హౌ ఆర్యూ ప్రియా, మా అమ్మ ఎప్పుడూ నీగురించే చెప్తుంది” అంది.

“మొన్నే కనిపించింది అలీసియా వాళ్లింట్లో. ఎప్పుడొచ్చారీ అపార్ట్ మెంటు లోకి” అన్నాను.

“ఒక నెలైంది. మరలా ఎప్పుడేనా వస్తాలే. ఈ పిల్లని మా అమ్మ దగ్గర దించి నేను జాబ్ కి వెళ్లిరావాలి” అంది.

“మరి మీ అబ్బాయి” అన్నాను.

“వాడు స్కూలు నించి రోజూ అమ్మ వాళ్లింటికి నడిచి వెళ్లిపోతాడు. అమ్మ వెళ్లి పికప్ చేసుకుంటూంది వాణ్ణి. వీకెండ్ కదా ఇక అక్కడే ఉన్నాడు.” అంది.

“వీకెండ్ లో కూడా వర్క్ చేస్తున్నావా!” అన్నాను.

బదులుగా “తప్పదుగా” అని చిన్నగా నవ్వింది.

***

ఆంటోనియా చిన్న కూతురు మెరాల్డా. చాలా అందంగా ఉంటుంది. చాలా చురుకైంది కూడా.

ఈ పిల్ల గురించి ఆంటోనియా ఓ సారి చెప్పి బాధ పడింది. “తన కాళ్లమీద తను నిలబడే ప్రయత్నంలో బయట ఉంది ఎన్ని కష్టాలైనా పడ్తుంది కానీ, నా దగ్గర నాలుగు రోజులు ఉండమంటే ఉండదు.”

“మంచిదేగా ఆంటోనియా, పిల్లలు వాళ్ల జీవితాల్లో వాళ్లు స్థిరపడి నీకు బరువు కాకుండా ఉన్నందుకు సంతోషించాలి ఇంకా” అన్నాను.

“నిజమేలే. కానీ స్వతంత్రంగా ఉండాలనుకోవడమొక్కటే కాదు కదా, వాళ్ల జీవితాలు వాళ్లు చక్కదిద్దుకోగలగాలి.” అని నిట్టూర్చి “పెళ్లి చేసుకోమంటే నన్నా జంజాటం లోకి నెట్టొద్దు” అంది.

కానీ ఇద్దరు పిల్లల తల్లయ్యింది. మొదట పిల్లాడి తండ్రి వాడికి మూడేళ్లప్పుడు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు.

ఇప్పుడు మరో అబ్బాయితో కలిసి ఉంటూంది. మళ్లీ గర్భవతి. ఇప్పుడైనా పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. వినట్లేదు.”అంది.
“నాకింకా ఈ దేశపు పరిస్థితులు, పద్ధతులు తెలీవు కానీ, మీ చిన్నమ్మాయి ఇక్కడి సమాజంలో పెరిగిన పిల్ల. తన ఉద్దేశ్యం, తన జీవితాన్ని నిర్దేశించుకునే హక్కూ తనకు ఉన్నాయి, నువ్వింకా మీ దేశం లో లాగా ఆలోచించి వర్రీ కాకు.” అన్నాను.

***

సూర్య ఆఫీసు లో ఫామిలీ పార్టీ జరిగింది. తిరిగి వచ్చేసరికి ఎనిమిది కావస్తూంది. కారు పార్కు చేసి వస్తూండగా మెరాల్డా కారు కనిపించింది.

నిధి నా చెయ్యి పట్టుకుని లాగింది.”ఏంటమ్మా” అన్నాను.

మెరాల్డా కొడుకు క్రిస్టఫర్ కారులో కూర్చుని ఫోను తో ఆడుకుంటున్నాడు. దగ్గిరికెళ్లి “ఏమిటిరా, మీ అమ్మేది?” అన్నాను.
వాడి పక్కన కారు సీట్లో వాడి చెల్లెలు నిద్రపోతూంది.

“అమ్మ ఇంటి తాళాలు అడిగేందుకెళ్లింది.” అన్నాడు.

మేం ఇంటి తాళం తీసుకుని లోపలికొచ్చేక, “అయ్యో సెల్ ఫోను కారులో మరిచి పోయేనట్లున్నాను.” అన్నాడు సూర్య.

“నేను తెస్తాలే” అని కారు దగ్గిరికి మళ్లీ వచ్చేను నేను.

ఈ సారి మెరాల్డా కూడా కారులో కూర్చుని ఉంది.

“అంతా ఓకేనా” అని పలకరించాను.

తను కారు దిగి నా దగ్గిరికి వచ్చి హీన స్వరంతో “ప్రియా, కాస్సేపు మా పిల్లలు మీ ఇంట్లో ఉండొచ్చా” అంది.

“అదేవిటి, అలా అడగాలా” అని, “నువ్వెక్కడికైనా వెళ్లాలా?” అన్నాను.

“లేదు, నేను కారులో ఉంటాను. ఫర్వాలేదు” అంది.

“నువ్వు చెప్పేది నాకు సరిగా అర్థం కావడం లేదు, సర్లే, అవన్నీ ఇంటికెళ్లి మాట్లాడుకుందాం, ముందు ఇంటికిరా బయటసలే చల్లగా ఉంది” అన్నాను.

“థాంక్యూ” అంటూ మీ “ఆయన ఆఫీసు నించి వచ్చేసినట్టున్నారుగా ఫర్వాలేదా , మేమంతా డిస్టర్బెన్సేమో” నానుస్తూ అంది.

“ఏం పర్లేదులే.” అన్నాను.

పాపని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పుతూ “క్రిస్టఫర్, నిధితో కలిసి తన గదిలో ఆడుకో కాస్సేపు” అన్నాను.

“ఊ చెప్పు” అన్నాను మెరాల్డా కి కాఫీ కప్పు అందిస్తూ.

“ఏం, లేదు మా ఇంటావిడ రాత్రి పదిగంటల నించి ఉదయం ఎనిమిది గంట వరకూ మాత్రమే అద్దెకిచ్చింది.” అని చిన్నగా నవ్వింది.

మెరాల్డా దగ్గర నాకు నచ్చేదదే. కష్టమైన సమస్యని కూడా చెదరని చిర్నవ్వుతో చెప్తుంది.

“ఊహూ..నాకు అర్థం కాలేదు” అన్నాను.

ఈ పిల్ల వాళ్ల నాన్న, నేను విడిపోయి ఆర్నెల్లయ్యింది. అతనికీ నాకూ పడలేదు. రిసెషన్ వల్ల నా ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు ఏవో చిన్నా చితకా రెండు ఉద్యోగాలు చేస్తున్నాను ఈ పిల్లల్ని పోషించడానికి.

మీలాగే డబల్ బెడ్రూము అపార్ట్ మెంటు వాళ్ల దగ్గర సబ్ లీజు కి ఒక గది అద్దెకి తీసుకున్నాను. కానీ వాళ్ల టైమింగ్ ప్రకారమే వచ్చి వెళ్లాలి. నే ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే మరో మార్గం లేదు.” అని
“అయినా రోజూ ఇలాంటి ఇబ్బంది లేదులే. ఇవేళ మా అమ్మ, నాన్న పని మీద శాన్ ఫ్రాన్సిస్కో కి వెళ్లారు. లేకపోతే రోజూ ఈ సమయం వరకూ అక్కడ గడిపి వచ్చేదాన్ని. వాళ్ల ఇంటి తాళం మా ఇంటి లో ఉండిపోయింది. అదీ సంగతి.” అంది.

“ఇట్స్ ఓకే” నీకెప్పుడు కావాలన్నా వచ్చి ఉండొచ్చు నాదగ్గర” అని, “నిన్ను అభినందించాలి ఎవరైనా, సమస్యలేవైనా చిర్నవ్వుతో చెప్తావు, ఇతరుల మీద ఆధారపడకుండా సాల్వ్ చేసుకుంటావు” అన్నాను.

“అదే నా తాపత్రయమూ”. అసలిలా మీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది అంది.

“హేయ్, ఫీల్ ఫ్రీ” అని భుజం తట్టాను.

“ఈ దేశంలో పిల్లల బాధ్యతలో తండ్రీ సమానంగా బాధ్యాత వహించాలనుకుంటా కదా” అన్నాను.

“నిజమే కానీ, పెళ్లి చేసుకుని, డైవోర్స్ తీసుకుంటే ఇక్కడి చట్ట ప్రకారం అవన్నీ వర్తిస్తాయి.”అని మరలా

“కానీ అలాంటి ప్రొటెక్షన్ కోసం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, పైగా ఇలా విడిపోయినప్పుడు లాయర్లూ, తలకాయ నొప్పులూ. నా పిల్లలు నాకు పూర్తిగా స్వంతం. వీళ్ల తండ్రులు కావాలనుకుంటే వచ్చి చూసెళతారు. లేకపోతే లేదు. నాకు వాళ్ల మీద ఎటువంటి ఎక్స్ పెక్టేషనూ లేదు. వీళ్లిద్దరూ “నా” పిల్లలు” ” అంది వత్తి పలుకుతూ.

“అలాగని నువ్వనుకుని వాళ్లకు బాధ్యత తగ్గిస్తున్నావేమో” అన్నాను.

“బాధ్యతైన వాళ్లైతే విడిపోరు కదా, నా నించి వెళ్లిపోవడమంటే పిల్లల నుంచి కూడా వెళ్లిపోవడమనే తెల్సు కదా వాళ్లకి.” అని

“ప్రియా, కాస్త మంచి ఉద్యోగం దొరికితే ఈ పిల్లలకు ఒక బేబీ సిట్టర్ ని పెట్టుకుంటాను. నీ ముఖంలో మా అమ్మ ముఖంలో కనిపించిన లాంటి వర్రీ కనిపిస్తూంది. ఇది అమెరికా. ఇక్కడ నా లాంటి యువతులు సగానికి పైగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఇక్కడ సర్వ సాధారణం. కొంచెం పర్సనల్ బాధ ఉంటుందనుకో, కానీ సమాజం పరంగా అసలిది సమస్యే కాదు. కాబట్టి పెద్దగా నాకూ, పిల్లలకూ ప్రెజర్ లేదు” అని నవ్వింది మళ్లీ.

తన ముఖంలోని ఆత్మ విశ్వాసం ఎంతగానో నచ్చింది నాకు. “గుడ్ లక్, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి” అన్నాను.
నిధి నిద్రపోయింది ఆడుతూనే.

క్రిస్టఫర్ వాళ్లమ్మ చెయ్యి పట్టుకుని నిద్ర ముఖంతో మెట్లు దిగుతున్నాడు. మెరాల్డా భుజమ్మీద పసిపాప నిద్దట్లో హాయిగా నవ్వుతూంది.

*** * ***