చలువ పందిరి

“कोइ ये कैसे बताये..”

జనవరి 2014

ప్రముఖ ఉర్దూకవి, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ మొదలైన పలు పురస్కారాల గ్రహీత, ఎన్నో అద్భుతగీతాల సృష్టికర్త “కైఫీ ఆజ్మీ”. ఈ సిరీస్ మొదట్లో ఆయనది “కుచ్ దిల్ నే కహా” అనే ‘అనుపమ’లోని గీతాన్ని గురించి రాసాను. కైఫీ ఆజ్మీ రాసిన మరికొన్ని ప్రముఖ సినీగీతాలు…

* “ధీరే ధీరే మచల్” (అనుపమ), * “భీగి భీగి ఫజా..” (అనుపమ), * “కర్ చలే హమ్ ఫిదా జానొతన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో..”(హకీకత్), * “వక్త్ నే కియా క్యా హసి సితమ్..”(కాగజ్ కే ఫూల్), * చల్తే చల్తే యు హి కోయీ మిల్గయా..”(పాకీజా), * “తుమ్ ఇత్నా జో” (అర్థ్), * “ఝుకీ ఝుకీ సీ నజర్ (అర్థ్), * “కోయీ యే కైసే బతాయే..” (అర్థ్), * “ఓ బేకరార్ దిల్..” (కొహ్రా), * “ఆజ్ సోచా తొ ఆసూ భర్ ఆయే..” (హస్తే ఝక్మ్), *బహారో మేరా జీవన్ భీ సవారో..” (ఆఖ్రీ ఖత్) మొదలైనవి.

సంచలనాత్మక దర్శక,నిర్మాత మహేష్ భట్ తీసిన ‘అర్థ్’ చిత్రం కొరకు కైఫీ ఆజ్మీ మూడు గజల్స్ రచించారు. అర్థ్ చిత్రంలో “తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో..”, “తేరీ ఖుష్బూ మే బసే ఖత్..”, “తూ నహీ తో జిందగీ మే..”, “ఝుకీ ఝుకీ సీ నజర్..”, “కోయి యే కైసే బతాయే..” అనే ఐదుగీతాల్లో చివరి మూడింటికీ కైఫీ సాహిత్యాన్ని అందించగా వాటికి ప్రముఖ్ గజల్ గాయకుడు, సంగీత దర్శకుడు జగ్జీత్ సింగ్ స్వరాలనిచ్చారు. ఒక గజల్ ని ఆయన భార్య చిత్రా సింగ్ పాడగా మిగిలిన నాలుగూ కూడా జగ్జీత్ పాడారు. ఈ ఆల్బమ్ లోని అన్ని పాటలూ సినీసంగీతప్రేమికులందరికీ ఎంతో ప్రియమైనవి. కైఫీ ఆజ్మీ రచించిన మూడింటిలో ఒకటైన “కోయీ యే కైసే బతాయే..” గీతాన్ని గురించే ఇవాళ చెప్పుబోయేది! అప్పట్లో పాటలన్నీ చిత్రకథనో, కథానాయకుడు లేదా నాయకురాలి మనోభావాలను తెలియజేసేలాగ సందర్భానుసారంగా ఉండేవి. ఈ గీతం కూడా అలాంటిదే.

మహేష్ భట్ తీసిన చిత్రాల్లో “అర్థ్” చిత్రం ఎన్నో పురస్కారాలనూ, ప్రశంసలను అందుకుని, భట్ తీసిన మేటి చిత్రాల జాబితాలో నిలుస్తుంది. ఈ చిత్రకథకు భట్ జీవితంలోని కొన్ని ఘటనలే ఆధారమని అంటారు. ఇందర్ జీవితంలో ‘కవిత’ అనే సినీనటి ప్రవేశం వల్ల పూజ,ఇందర్ అనే భార్యాభర్తల మధ్య కల్లోలం ఏర్పడుతుంది. విడిపోయిన ఆ భార్యాభర్తల బంధం చివరికి ఏమౌతుంది? తన జీవితానికి ఓ అర్థాన్ని నిర్ణయించుకుంటూ పూజ తీసుకునే నిర్ణయం ఏమిటనేది చిత్ర సారాంశం. ఈ చిత్రం క్లైమాక్స్ చాలా బావుంటుంది. ఈ చిత్రంలో పూజ గా నటి ‘షబానా అజ్మీ’ నటన అత్యద్భుతం. ఈ ఒక్క సినిమా చాలు ఆమె అభిమానిగా మారిపోవడానికి. కేవలం కళ్లతో వంద మాటల అర్థాన్ని ప్రదర్శించగల సహజ నటి ఆమె. కవిత గా తనది చిన్న పాత్రే అయినా, ప్రేక్షకులను మెప్పిస్తారు మరో మేటి నటి స్మితాపాటిల్.

కథానాయకురాలు పూజ, తన భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసిన తర్వాత చాలా మానసిక వేదనకు గురౌతుంది. తన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండి ఏమి చేయాలో తెలీక మధనపడుతుండగా, అమె స్నేహితులు కాస్త జనంలోకి వచ్చి మనసు మరుల్చుకోమని చెప్పి, తమకు తెలిసిన ఒక పార్టీకి పంపిస్తారు. అక్కడ ఒంటరిగా కూర్చున్న పూజకు రాజ్ అనే గాయకుడు పరిచయమౌతాడు. అతను ఆ పార్టీలో ఈ గీతాన్ని పాడుతుండగా ఇందర్, తన కొత్త స్నేహితురాలు కవితతో ఆ పార్టీకి వస్తాడు. ఆ సందర్భంలో పూజ మనోభావాలు ఎలా ఉంటాయో తెలియజెప్పే పాట ఇది. అంతేకాక రాజ్ దృష్టికోణం నుండి ఆమెను చూపిస్తాడు దర్శకుడు ఈ గీతంలో! ఎంతో అర్థవంతంగా సాగే ఈ గీతం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. ముఖ్యంగా ఎవరైనా జంట విడిపోయారనే వార్తలు విన్నప్పుడు గీతంలోని “है जनम का जो ये रिश्ता तो बदलता क्यों है?” అనే వాక్యం పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు.. !

ఈ పాటలో ఒకటి రెండు వాక్యాలకు తప్ప మొత్తానికి స్వేచ్ఛానువాదం అక్కర్లేదు. అందుకని చాలావరకూ వాక్యార్థాన్నే రాసాను.

“कोइ ये कैसे बताये..” వాక్యార్థం:

कोइ ये कैसे बताये के वो तनहा क्यों है
वो जो अपना था, वहीं और किसी का क्यों है
यही दुनियां है तो फिर, एसी ये दुनियां क्यों है
यही होता है तो, आखिर यही होता क्यों है?

ఆమె ఒంటరితనాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు?
తనదైన మనిషి వేరొకరికి ఎలా సొంతమవగలరు?
ఇదే లోకం తీరైతే, లోకమీ తీరుగా ఎందుకుంది?
ఇదే జరిగేటట్టయితే, అసలిలా ఎందుకు జరుగుతుంది?

इक ज़रा हाथ बढ़ा दे तो, पकड़ ले दामन
उस के सीने मे समा जाए, हमारी धड़कन
इतनी कुरबत है तो फिर फासला इतना क्यों है?

కాస్తంత చెయ్యి అందిస్తే ఆమెకు దగ్గరవ్వగలను
నా గుండెసవ్వడి ఆమె హృదయానికి వినబడగలదు
ఇంత చేరువలో ఉంటే మరి అంత దూరమెలా ఉంది?

दिल-ए-बरबाद से निकला नही अब तक कोइ
इक लुटे घर पे दिया करता है दस्तक कोइ
आस जो टूट गई है फिर से बंधाता क्यों है?

పగిలిన హృదయపు శిధిలాల్లోంచి ఎవరూ బయటపడలేదింతవరకూ
కొల్లగొట్టబడిన మనసుగది తలుపులను ఎవరో తడుతున్నారు..
భగ్నమైన ఆశలను మళ్ళీ చిగురింపజేస్తున్నారెందుకు?

तुम मसर्रत का कहो या इसे गम का रिश्ता
कहते है प्यार का रिश्ता है जनम का रिश्ता
है जनम का जो ये रिश्ता तो बदलता क्यों है?

దీనిని సంతోషకరమైన బంధమను లేదా దు:ఖమయమైన బాంధవ్యమను..
ప్రేమబంధాన్ని జన్మజన్మల బంధమంటారు కదా
ఇది జన్మజన్మలబంధమే అయితే మరెందుకు మారిపోతుంది?

***

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:

‘అర్థ్’ పూర్తి చిత్రం లింక్:

http://www.youtube.com/watch?v=wBqXGxr-ChU