కథ

సాంత్వనములేక

జనవరి 2014

“మోహ్.” ఇందాక డ్రైవర్స్ లైసెన్స్ తీసుకెళ్ళాడుగదా, పేరు చూడకుండా ఎందుకుంటాడు?

“మో?”

అక్కడి కొచ్చేవాళ్ళకి జీవితాలమీద ఆశ వుండకూడన్నట్లుగా పెయింటింగులూ, ఫోటోలూ లేకుండా కావాలనే నిర్జీవం చెయ్యబడ్డట్లుగా వున్నది ఆ గది. ఆ గదిలో మోహ్‌తోబాటు ఒక తెల్ల అమెరికన్ మాత్రమే వున్నాడు. తోడుగా మాత్రం కాదు. ఎదురుకుండా వున్న అతడిని తేరిపారజూశాడు మోహ్. తెలుగు సినిమాలో చూపించే ఇంటరాగేషన్ దృశ్యాలు గుర్తొచ్చి మోహ్ వెన్ను జలదరించబోయి ఆగిపోయింది.

“మోహ్” – ‘హ్’ని వత్తి పలికాడు మోహ్.

“లైక్ లారీ, కర్లీ, మో?”

ఆ ప్రశ్న సుందరం గొంతులో ప్రతిధ్వనించింది. పేరులోనే సుందరం. మనిషి మాత్రం నల్లగా, మొహమ్మీద స్ఫోటకపు మచ్చలతో ఎత్తుపళ్ళతో కలలో కొచ్చేలా వున్నాడు. ఇటు పల్లే గానీ అటు పట్నమూ గానీ ఒక ఊరినించీ వచ్చాడు మోహ్. టీవీ మొహం అసలే తెలియదు. అత్తెసరు మార్కులతో ఇంగ్లీషు గట్టెక్కించి, ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడే చేరినవాడికి హాలీవుడ్ సినిమా కారెక్టర్స్ త్రీ స్టూజెస్ గూర్చి ఏం తెలుస్తుంది?

“మో కాదు. మోహ్”

“మోహన్ అని చెప్పలేవురా లం…కొడకా!” అరిచాడు సుందరం.

అవాక్కయ్యాడు మోహ్. అప్పటిదాకా అతణ్ణి అలా తిట్టినవాడెవడూ లేడు. కష్టమ్మీద నోరు పెగల్చుకుని “నా పేరు మోహన్ కాదు” అన్నాడు.

“కాకపోతే మోహన్రావ్”

“అది కూడా కాదు.”

“మరేంటి బే?” ఆ కంఠం కోపంతో పొంగి పొర్లబోతోంది.

“మోహ్”

“నన్నేమనుకుంటున్నావ్‌రా గాడ్ద కొడకా” గాలిలోకి లేచిన సుందరం చెయ్యి తన చెంపని తాకికానీ ఆగదనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మోహ్. ఆ చేతి విసురు గాలి, తానున్న విమానాన్ని ఓ ఆకాశహర్మ్యం వైపు మళ్ళకుండా పైలట్ తప్పిస్తున్నప్పుడు తిరిగి మొహానికి తగిలిన భావన.

“స్టే కామ్. కెప్టెన్‌కి చాలా అనుభవం వుంది. హి ఈజ్ డూయింగ్ హిజ్ బెస్ట్” ఎయిర్ హోస్టెస్ చెబుతోంది. మోకాళ్ళమధ్యలో తలపెట్టుకొమ్మన్న ఆవిడ సూచనలను పాటిస్తే, బయటకు చూస్తున్న కళ్ళని అందరిలాగా విమానంలోకి లాగి దైవప్రార్థనకోసం వాటిని కుట్టేస్తే చాచిన విమానపు రెక్కకు ఆ ఎత్తైన భవనం అందకపోవడాన్ని అతడు చూడగలిగేవాడా? ఆ రెక్క నిరాశకు గురై వుంటుందా? మిగిలిన ప్రయాణీకులు కళ్ళు మూసుకుని ఎంత అసామాన్యపు దృశ్యాన్ని మిస్ అయ్యారు! ఆ సమయంలో మోనాకూడా గుర్తుకు రాకుండా ఏదో అద్భుతాన్ని రికార్డు చేస్తున్నట్లుగా ఆ దృశ్యాన్ని మెదడులోకి ఎక్కించడం – ఎవరికి చూపడానికి, ఎవరికి చెప్పడానికి – అతనికొక్కడికేనా సాధ్యమయింది, లేక వేరెవరి కయినా కూడానా?

“బి కామ్. వుయ్ ఆర్ డూయింగ్ ఎవిరిథింగ్ వుయ్ కెన్” తెల్ల ఓవర్‌కోటు వేసుకుని మెడలో స్టెతస్కోప్ తగిలించుకున్న డాక్టర్ చెబుతున్నాడు మోహ్ భార్యనుద్దేశించి.

అద్దాలగదిలో మాస్క్ తగిలించుకుని ఈ ప్రపంచాని కావల అంచుని వెదుకుతున్నట్లు మోనా మొహం నిశ్చలంగా వుంటే వాట్ కెన్ యూ డూ? ప్రపంచానికే కాపిటల్ అయిన వాషింగ్‌టన్‌లో ఛిల్డ్రన్స్ హాస్పిటల్. అమెరికాలోకూడా ఎక్కడా అంతుచిక్కని వ్యాధులున్న పిల్లల తల్లిదండ్రులకి అది చివరి ఆశాద్వీపం.

ఏడేళ్ళ మోనా – మొనాలిసా. నాలుగు నెలల్లో ఎంతతేడా! సముద్రపుటొడ్డును తాకే అలల్లాగా జ్వరం రావడం, పోవడం. అమావాస్యపుటలలకి తగ్గిపోతోందన్న ఆశ. పౌర్ణమి అలలకి విసిరేసినట్లుగా వచ్చి హాస్పిటల్ కౌగిలిలో చేరడం. అంత అనుభవజ్ఞులుకూడా ఈ మందనీ, రెండ్రోజుల తరువాత ఇంకో మందనీ మారుస్తూనే వున్నారు. మోహ్‌కు అర్థమైంది ఒకటే. అన్ని పున్నములూ ఒకే వెలుగునివ్వవని. కొన్ని అలలకి మోనా ఆవలి తీరాన్ని చేరిందనే అనుకున్నాడు. అస్థిపంజరం బొమ్మని గీసి దానికి మోనా అని పేరుపెడితే – ఆ బెడ్డుమీదున్న పిల్లలా వుంటుంది.

మోనాకి కుట్టిన దోమో లేక లోపల జొరబడ్డ బాక్టీరియానో ఋషులకి వరమిచ్చివుంటే వాళ్ళకి మోక్షం తొందరగా వచ్చేది. అమ్మో! అకాల మృత్యుహరణమే కాదు, అకాల మోక్షహరణం కూడా ముఖ్యమే. మంత్రాలు రాసిన వాళ్ళు తెలివైన వాళ్ళు – పూజ అయిన తరువాత తీర్థాన్నిస్తూ – ‘అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం ‘ అనడంలోని అర్థం – మొదటగా అకాల మృత్యువునుండీ కాపాడడానికి. ఆ తరువాతే వ్యాధులను అంటకుండా చెయ్యడానికీ, అన్ని పాపాలనీ కడిగివెయ్యడానికీను. ధర్మార్ధకామాలని పూర్తిగా అనుభవించకుండా మోక్షమా? అందునా కామానికి అవకాశమివ్వకుండా! విశ్వామిత్రుడు కూడా మేనకని పంపినందుకు ఇంద్రుడికి కృతజ్ఞతని తెలిపేవుండాలి!

“ఒరేయ్ కామం!” సుందరం హుంకరించాడు. తన చెంపకు తగుల్తుందనుకున్న చెయ్యి పక్కకు వెళ్ళిన తరువాత మోహ్ చెవిలోపడ్డ మాటలవి.

“నా పేరు కామేశ్వర్రావండీ” వినయంగానే సమాధానమిచ్చాడు మోహ్‌తో బాటు సుందరం పట్టుకొచ్చినవాడు. వాడు కూడా మోహ్‌తోబాటు కొత్తగా జాయిన్ అయినవాడే.

“అండీ ఏమిట్రా వెధవనాయాల! సార్ అనమని చెప్పలా? అండీ అంటే ఏమిటో తెలుసా? ఒరేయ్ మో, నువ్వు పాంటు విప్పరా!” ఆజ్ఞాపించాడు.

మోహ్ సందేహించేసరికి సుందరానికి కోపం తలలోనుంచీ బయటికొచ్చి అతని తలని పూర్తిగా చుట్టేసింది. “నీయమ్మ” అంటూ బెల్టు తీశాడు. మోహ్ చటుక్కున పాంటు గుండీలను విప్పేసరికి అది కుప్పలా నేలకు వాలింది. సుందరం గట్టిగా నవ్వాడు. “అదుగో, వాడి కాళ్ళమధ్యదాన్ని దాస్తోందే, అదీ అండీ అంటే.” వాడి బుర్రలో హఠాత్తుగా ఓ ఆలోచన జొరబడ్డది. “కొంపదీసి నీపేరు మొహమ్మదారా?”

వెంఠనే తలని విసురుగా అడ్డంగా ఆడించాడు మోహ్.

“అండీ తియ్యరా, అవునో, కాదో నేన్చెప్తా” అరిచాడు సుందరం. తప్పదన్నట్లు అండర్‌వేర్‌ని కిందకు జార్చాడు మోహ్. గొప్ప సత్యాన్నేదో కనుక్కోబోయి పొందిన భంగపాటుతో “సరే, పైకి లాక్కో” అన్నాడు.

నిరాశని కప్పిపుచ్చుకోవడానికి చుట్టుపక్కలా చూశాడు సుందరం. ఏ కీలుకా కీలు తియ్యబడ్డ టేబుల్ ఫాన్ కనిపించింది. దాన్నుంచీ వేళ్ళాడుతున్న వైర్లని చూసేసరికి వాడి మెదడులో ఒక ఐడియా బుసకొట్టింది. ఫాన్ బేస్ దగ్గరున్న రెండు వైర్లనీ వూడబెరికాడు. ఆ రెండు వైర్లనీ ఇన్సులేషన్ తొలగించబడి రాగి వైరు పూర్తిగా కనిపిస్తున్న రెండుచివర్లను జాగ్రత్తగా ఒకదానికొటి తగలకుండా వుండేలా ఇన్సులేషన్ వున్నచోట ఒక చేత్తో పట్టుకుని ఆ వైర్ల రెండో చివర్ల వున్న ప్లగ్గుని రెండో చేత్తో పట్టుకుని గోడకువున్న ప్లగ్గులో పెట్టాడు. ఇప్పుడు, ప్లగ్గులో లేని రెండు చివర్లనీ ఒక్కో చేత్తో పట్టుకుని, “ఒరేయ్ కామంగా, ఆ న్యూస్ పేపర్ని వాడి చేతికి చుట్టరా” అన్నాడు.

ఆ పేపర్ని అతని చేతులకి చుట్టకపోయినా కామేశ్వర్రావుకి ముచ్చెమటలు పోశాయి. చేతులు వణుకాయి. ఆ పేపర్ చుట్టబడ్డ చెయ్యి అతనిది కానందువల్ల మూర్ఛపోలేదు. మోహ్ మాత్రం ఆ చెయ్యి తనది కానట్లు చూస్తున్నాడు.

“మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో నేర్చుకోబోయేది, న్యూస్ పేపర్ ఇన్సులేటర్ అని. అంటే, దానిలోనుండీ కరెంటు ప్రవహించదన్నమాట. దాన్ని మనమిప్పుడు ఋజువు చేస్తాం.” అంటూ పైకి కనిపిస్తున్న కాపర్ వైర్ల చివర్లని న్యూస్ పేపర్ చుట్టబడిన చెయ్యికి ఆ పేపర్ మీద చెరోవైపూ అంటించాడు. ఏమీ కాలేదు. “నేను చెప్పానా?” అని గర్వంగా, ఆ పేపర్ ఇన్సులేటర్ కాకపోతే ఎంత ప్రమాదం అయ్యేదో నిరూపించడానికని, ఆ రెండు వైర్లనీ ఒకదానికొకటి అంటించాడు.
అతననుకున్నట్టుగా నిప్పురవ్వలూ రాలేదు, పెద్ద శబ్దంతో ఫ్యూజూ పోలేదు. పక్కనే వున్న లైట్ స్విచ్ని వేసి, గదిలో బల్బు వెలగకపోవడం చూసి, “కరెంటు పోయినట్టుంది – బతికిపోయావ్‌రా” అని గోడకువున్న ప్లగ్గుని పీకి ఆ వైర్లని పక్కకు విసిరేసి, “ఒరేయ్ కామం!” అని పిలిచాడు.

“యస్సర్” అన్నాడు కామేశ్వర్రావ్.

“వాడి కాళ్ళమధ్య చెయ్యిపెట్టిచూడరా. నాయాలు అండీ తడుపుకున్నాడేమో!” కామేశ్వర్రావ్ సందేహించేసరికి వాడి కాలర్ పట్టుకుని, “చెయ్యిపెట్టి చూస్తావా, మొహంపెట్టి చూడాలనుందా?” గర్జించాడు సుందరం.

ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా వున్న సందులోని యింటిలోని ఆ గదిలో వుంటున్నది సుందరం ఒక్కడేలాగా వున్నది. అయినా అక్కణ్ణించీ పారిపోవాలని ఆ ఫ్రెషర్లు ఇద్దరిలోనూ ఎవరూ అనుకోలేదు – పుట్టగానే ప్రతీ పిల్లకీ, పిల్లాడికీ ఊపిరాడాలంటే ముందు ఏడవడం తప్పదన్నట్టుగా వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ డిగ్రీకోసం రాగింగ్ భరించక తప్పదన్న ఎవరి శాసనాన్నో పాటిస్తున్నారు గనుక.

చెయ్యి పెట్టి చూసి, “తడిగా లేదు సార్” అన్నాడు కామేశ్వర్రావ్.

ఇంకా కొత్తగా, వింతగా ఏం చేయించాలా అని ఆలోచిస్తున్న సుందరం, “ఒరేయ్! కామానికి మోహం అవసరమా లేక మోహానికి కామం అవసరమా?” ఒక రేడియో శ్రోత ధర్మసందేహాన్ని ఉషశ్రీ ముందుంచినట్లుగా కామేశ్వర్రావ్‌ని అడిగాడు.
“మోహానికి కామం అవసరం సార్!” అన్నాడు వాడు.

“కరెక్టుగా చెప్పావ్! ఒరేయ్, కామం, నువ్వు వాణ్ణి వెనకనించీ వాటేసుకోరా!” ఆజ్ఞని జారీ చేశాడు సుందరం. అందులో తన తప్పేమీ లేదన్నట్లు మొహం పెట్టి తల దించుకుని మోహన్ వెనక్కు వెళ్ళి భుజమ్మీద చేతులేశాడు కామేశ్వర్రావ్.
“అలా కాదురా నీయబ్బ! వాడి నడుం చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకో. ఆ. అలా. ఇప్పుడు నడుం ఊపు!” గాండ్రించాడు సుందరం. కామేశ్వర్రావ్‌లో చలనం లేకపోయేసరికి వాడి వెనక్కు వెళ్ళి పాంటుని నడుం దగ్గర పట్టుకుని, దానితో వాణ్ణి బలంగా ముందుకి తోసీ వెనక్కు లాగీ చూపించాడు. “ఎప్పుడూ కుక్కల్నిట్లా చూడలేదుట్రా?” ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అడిగినట్లడిగాడు. బట్టలున్న కుక్కలు అలా వుండడాన్ని ఊహించుకుని ఫక్కున నవ్వాడు మోహ్.

“ఏందిరా, నవ్వులాటగా వుందిరా? నీయబ్బ. ఎందుకు నవ్వావురా నువ్వు?” అని ఓండ్రిస్తూ రూంలో చుట్టుపక్కల చూశాడు. ఆ సమయంకోసమే వేచివున్నట్లుగా పేముబెత్తం కనిపించింది. దాన్ని గాలిలో ఝళిపిస్తూ మోహ్ మీదకు దూకాడు. “ఆ పాంటుని తీసి పక్కన పారెయ్యరా. లేకపోతే కాళ్ళకి అడ్డమొచ్చి పడతావ్. చొక్కా కూడా వూడదియ్. ఆ బనీనెందుకురా? తియ్ అది కూడా!” ఆజ్ఞాపించాడు.

తలని చుట్టేసిన కోపం పాముల్లాగా మారి వాటి విషాన్ని వాడి వంటినిండా కక్కింది. ఖలునకు నిలువెల్ల విషము అని గదా అన్నాడు బద్దె భూపాలుడు!

శరీరం విషంతో నిండిపోతే మనుషులిలా వుంటారా? మోనా శరీరంలోకి ఆ విషమెలా ప్రవేశించిందో ఎవరికీ అర్థంకావట్లేదు. ఏ విషమో అసలు ఎవరికీ తెలియట్లేదు. యండమూరి తులసీదళమూ, చేతబడులూ గుర్తుకొచ్చాయ్. అమెరికాలో దశాబ్దానికి పైగా వున్న తరువాత చేతబడి అన్న ఆలోచన రావడమే అత్యంత ఆశ్చర్యకరం. అయినా, అంత శక్తులున్నవాళ్ళు చేతబడులకే ఎందుకు పూనుకుంటారో!? తమకే అనంత ఆయువునో, ధనాన్నో, సౌందర్యవతులతో సంభోగాన్నో కోరుకొవచ్చుగా! కాదు. తాము బాగుపడడం కంటే ఇతరులు చెడిపోవడం ముఖ్యం.

డాక్టర్లు ట్రై చెయ్యని మందులు లేవు. మలేరియాతో మొదలుపెట్టి, తరువాత వరుసాగ్గా టీబీకి, టైఫాయిడ్‌కి, జాపనీస్ ఎన్సెఫలైటిస్‌కీ, ఎన్ని మందులు గుప్పించారు?

స్కూల్ తెరిచిన రెండు వారాలకే జ్వరం మొదలు. స్కూల్ మానేసి వారం రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి. మళ్ళీ స్కూల్. మళ్ళీ జ్వరం. రెండువారాలపాటు. అలా రెండుమూడుసార్లయిన తరువాత స్కూలంటేనే భయమేస్తోందేమో, ఒక ఏడాది పాటు స్కూల్ పోతే మాత్రమేమిటి, ఇంట్లో వుంచి చూడమని డాక్టర్ల సలహా. ఇంట్లోనే కూర్చున్నా మళ్ళీ జ్వరం. డిసెంబర్ మొదలవుతూ వుండగా ఫామిలీ డాక్టర్లు చేతులెత్తేసి మోనాని వాషింగ్టన్లోని ఛిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించమన్నారు. దేశంగాని దేశంలో, స్నేహితులనే బంధువులుగా భావిస్తున్నచోట – మోనాకే గాక మోహ్ భార్యకు కూడా ఓసారి జ్వరం వచ్చేసరికి ఆ స్నేహితులే డబ్బులేనివాడి బంధువుల్లాగా దూరంగా వెళ్ళిపోయారు.

మంచమ్మీద బల్లిలా అతుక్కుపోయి మోనా.

గాజుగోడలోనుండీ మోనాని చూస్తూ, దానికే బతికున్న బల్లిలాగా అతుక్కుని చూస్తూ మోహ్ -

బల్లిలాగా విమానం నీళ్ళమీద ఆగినప్పుడు – గాలిలోకి లేచి పది నిముషాలు కాకుండానే రెండు ఇంజన్లూ ఆగిపోవడంవల్ల, వెనుదిరిగి ఎయిర్‌పోర్టుకి వెళ్ళడానికి వీలుకాకపోవడంవల్ల పైలట్ ధైర్యంగా విమానాన్ని ఎగిరే పక్షిలాగా మార్చి- అందులోని ప్రయాణీకుల నందరినీ దగ్గర్లోవున్న మోటార్ బోట్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చినప్పుడు, విమానం రెక్కలమీద మోకాలిలోతు నీళ్ళల్లో నిలబడడంవల్ల పాంటు ఇంకా తడిగానేవుంది. అందరిలాగానే మోహ్ కూడా బయటికెళ్ళి టాక్సీలో ఇంటికెడదామనుకునేటంతలో -

“సర్! ప్లీజ్ కమ్ విత్ మి” గొంతులో వినపడని ఆజ్ఞ కళ్ళతో కట్టేస్తుండగా తప్పించుకోవడం అసాధ్యం. అది కూడా ఆ కళ్ళు, గొంతు, మానవ రూపంలో వచ్చిన ప్రభుత్వాని వవడంవల్ల. కేవలం కొన్ని సెకండ్ల తరువాతనించీ ఆ ఫెడరల్ అధికారీ, మోహ్ ఆ గదిలో. కాదు కాదు. రికార్డులని వెలికిదీసి వివరాలని పరిశోధించడానికి ఆ అధికారి డ్రైవర్స్ లైసెన్స్ పట్టుకెళ్ళినప్పుడు కొంతసేపు మోహ్ ఒంటరిగానే వున్నాడు ఆ రోజు జరిగిన అద్భుతాన్ని మళ్ళీ మళ్ళీ మెదడులో రివైండ్ చేసి ప్లే చేసుకుంటూ.

“వాట్స్ యువర్ లాస్ట్ నేమ్?”

“పిడుగురాళ్ళ”

“ఇన్ యువర్ లాంగ్వేజ్ ఎవిరిథింగ్ హాజె మీనింగ్. వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యువర్ లాస్ట్ నేమ్?”

“థండర్ బోల్ట్ స్టోన్స్”

“అప్లైస్ వెరీ వెల్. వై డిడ్ యు గో టు పాకిస్తాన్?”

“ఐ వుడ్ లైక్ టు టాక్ టు మై లాయర్. ఐ యామె యుఎస్ సిటిజెన్!”

“అడిగిన దానికి సరిగా జవాబిస్తే లాయర్ అవసరం కూడా లేకుండా బయటపడతావ్. లేకపోతే నువ్విక్కడ వున్నావని కూడా ఎవరికీ తెలియదు.”

ఆ మాటలు అర్థమైన కాసేపటికి మోహ్ గొంతు పెగల్చుకున్నాడు. “ఐ యాం ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. పాకిస్తాన్ మా కంపెనీకి కస్టమర్.”

“వాళ్ళకి మీరు అమ్మేదేమిటి?”

“మా కంపెనీ శాటలైట్లో వున్న ట్రాన్స్‌పాండర్లని ఉపయోగిస్తూ వాళ్ళు అంతర్జాతీయంగా మాట్లాడుకోవడానికి వీలు కల్గించడం.”

“అక్కడ ఎవరిని కలిశావ్?”

“ఇన్‌ఫర్మేషన్ మినిస్టర్ సెక్రటరీ కలవమన్న వ్యక్తి ఉమర్-ఉల్-హక్‌ని”

“అల్‌ఖైదాలో ఇంకెవర్ని కలిశావ్?”

నోట మాట రాలేదు మోహ్‌కి. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇంతగా పాతుకుపోయిందా అల్‌ఖైదా? 9/11 తరువాత అమెరికాలో ఎవడైనా అనుమానాస్పదంగా వున్నా, ప్రవర్తించినా ప్రభుత్వానికి ఆచూకీ నివ్వవలసిన బాధ్యత ప్రతి పౌరునిదీ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. దేశరక్షణకై అధికారులకు దాదాపు అడ్డు అదుపులేని అధికారాలివ్వబడ్డయ్. తరువాత జరగబోయే కార్యక్రమం మెల్లగా మోహ్ మెదడులో రూపుదిద్దుకోసాగింది. “ఇక్కడినించీ తనని తీసుకెళ్ళేది – కళ్ళకి గంతలు కట్టి, ఆ క్యూబా దేశం పక్కనున్న గ్వంటానమో బేకి. ఆ తరువాత జవాబులను రాబట్టడంకోసం వాటర్ బోర్డింగ్ –”

వాటర్ బోర్డింగ్ అంటే ఏమిటో మూడు, నాలుగేళ్ళ క్రితం గామోసు పేపర్లో చదివిన తరువాత కానీ తెలియలేదు మోహ్‌కి. తెలిసిన తరువాత దానితో తనకి చిరకాల పరిచయం ఉన్నదని అతనికి అర్థమయ్యింది.

“ఇద్దరూ ఆ బోరింగ్ పంపుదగ్గరకి పదండ్రా.” ఓండ్రించాడు సుందరం. ఎద్దుల్ని తోలినట్టు గదిబయటవున్న బోరింగ్ పంపుదగ్గరకి తోలాడు. “మోహంగాడా, నువ్వా పంపు కింద తలపెట్టరా! అలా చూస్తావేరా గాడ్దకొడకా. కూర్చోరా దానికింద!”

ఎలా కూర్చోవాలో అర్థం కాలేదు మోహ్‌కి. నేలమీద చతికిలబడ్డా తల బోరింగ్ పంపు మూతిని దాటేసింది.

“నడుం వంచు బే!” కాలితో దాదాపు పొట్టలో తన్నబోయాడు. మోహ్ నడుం వంచి, తలని పంపు మూతికిందకి చేర్చాడు.

“చూస్తూ నిలబడ్డావేం రా కామంగాడా, కొట్టడం మొదలుపెట్టరా. ఇంకా స్పీడ్‌గా. ”

కామేశ్వరరావు జోరుని పెంచడంతో మోహ్ తలమీదుగా పడుతున్న నీరు మొహానికి పూర్తిగా తెరకట్టి గాలిని బయటే నిలిపేసింది.

“ఏందిరా తల బయటకి తీశావ్ దొంగనాయాల?” గాండ్రించాడు సుందరం.

“ఊపిరి ఆడడం లేదు సార్” గబగబా గాలిని తాగుతూ జవాబిచ్చాడు.

“తలని పంపుకింద పెట్టుబే! నువ్వెందుకురా పంపుకొట్టడం ఆపేశావ్?” ఈ అరుపులు కామేశ్వర్రావ్‌కి.

ఈసారి తలని బయటకు తియ్యకుండా చేతిని ఆడించాడు మోహ్ ఊపిరి అందట్లేదని చెప్పడంకోసం.

“చస్తాడేమో! ఆపరా! లే. లేచి ఆ బనీన్‌తో తుడుచుకో.” బనీన్‌తో తుడుచుకునేసరికి అది తడిసి ముద్దయ్యింది.

“ఆ బనీన్‌ని తలకు చుట్టుకోరా.” సుందరం మెదడు పుట్టలోంచి పాములు రావడం ఆగలేదు.

మోహ్ చొక్కా తొడుక్కున్నాడు. అది పొడిగానే వుంది. పాంటు వేసుకుంటుంటే సుందరం అడ్డుచెప్పలేదు. కానీ తడిసిన అండర్‌వేర్ వల్ల చూసేవాళ్ళకి పాంటు తడిసిందని తెలుస్తుంది.

ఎందుకు చాలనుకున్నాడో తెలియదుగానీ, “ఇంక పదండ్రా!” అన్నాడు. వాడితోబాటే ఆ ఇద్దరు ఫ్రెషర్సూ రోడ్డుమీద నడవడం మొదలుపెట్టారు. తలకు చుట్టిన బనీన్‌ని మోహ్ తియ్యబోతే, “అది తీస్తే నరుకుతా దొంగనాయాల” అని వార్నింగ్ ఇచ్చాడు.
వాడి రూంనించీ మెయిన్‌రోడ్డుకు వెళ్ళే ఆ సన్న మట్టిసందులో ఎదురుగా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఒకళ్ళు ఇరవయ్యోపడిలో ఇంకొకళ్ళు నలభయ్యోపడిలో వుండవచ్చు. వాళ్ళ మొహాలమీద చిన్న నవ్వు. ఇలాంటివెన్ని చూశారో! వాళ్ళిద్దరినీ దాటిన తరువాత ఒక పెద్దాయన ఎదురొచ్చాడు. ఆ ముగ్గురూ ఈ ముగ్గురినీ చూశారే తప్ప నోరుమాత్రం కదపలేదు.

మెయిన్‌రోడ్డు పక్కగావున్న టీస్టాల్ దగ్గరకొచ్చేసరికి దాని ముందున్న కొన్ని తలలు వీళ్ళవైపుకు తిరిగెయ్.

“ఏం తాగుతావ్ రా, కాఫీయా టీయా?”

యముడు ప్రాణం పొయ్యడం అంటే ఇదేనేమో! “కాఫీ.” ఆశ్చర్యాన్ని కనబడనీకుండా సమాధానమిచ్చాడు మోహ్.

“మూడు టీ” అన్నాడు సుందరం – “మమ” అనుకోగానే పుణ్యాలన్నీ చేరిపోయినట్టూ, పాపాలన్నీ తొలగిపోయినట్టూ భావించే భక్తుల్లాగా టీ ఇప్పించేసి మంచివాణ్ణని ప్రూవ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లుగా.

“హావ్ దిస్ కాఫీ”

గాజుగోడకు బల్లిలాగా అతుక్కుపోయి, నిశ్చలంగా మోనాని చూస్తున్న మోహ్ భుజంమీద చెయ్యి పడేసరికి తిరిగి చూశాడు – ఒక తెల్లాయన, రెండో చేత్తో కాఫీ కప్పుని పట్టుకుని. ఆయన్ని అక్కడ వారం పైగా చూస్తున్నాడు మోహ్. ఆయన మనవడు కాబోలు ఐసీయూలో వున్నాడు. వాళ్ళిద్దరి మధ్యా అవి మొదటి మూడు మాటలు.

కళ్ళకెదురుగా కనిపిస్తున్న తండ్రిని, తల్లిని మోనా నిర్జీవంగా చూస్తూ గుర్తుపట్టనప్పుడు కూడా మోహ్ గుండెలో వున్న తొలకని భాండం – సాధారణంగా తొలకదెప్పుడూ – అప్పుడు బద్దలయింది. ఆ భాండంలో అమృతమంత పదిలంగా వుంటాయి అతని కన్నీళ్ళు. అందుకే అతని కంట తడిని చూడని వాళ్ళు అతణ్ణి ఇన్సెన్సిటివ్ ఫెలో అంటారు. ఉప్పునీళ్ళకి మాత్రమే దేనికయినా ఉపశమనాన్ని కలిగించే శక్తి వున్నదని – అది కన్నీళ్ళ రూపంలో ఉండనీ, చెమట రూపంలో ఉండనీ, లేకపోతే సముద్రం రూపంలో ఉండనీ – అంటాడు ఐజాక్ డైన్సెన్ (Isak Dinesen). వాటిల్లో, ఎప్పుడో తప్ప మామూలుగా అందుబాటులో ఉండని సముద్రం తరువాత చెమటరూపం మోహ్‌కి చాలా ఇష్టమైనది. అందుకే చిరాకుని తగ్గించుకోవడంకోసం మైళ్ళకి మైళ్ళు పరుగెత్తుతూంటాడు. పుట్టి పెరిగిన వూళ్ళో అయితే సముద్రం ఎప్పుడూ అందుబాటులో వుండేది.

కానీ అప్పుడు మాత్రం ఆ అపరిచితుడి చొక్కాని తడిపింది ఉప్పుసముద్రమూ కాదు, ఘర్మజలమూ కాదు. అతడుకూడా తన చొక్కాని తడిపినందుకు కోపగించుకోలేదు, చిరాకు పడలేదు. కాఫీకప్పు లేనిచేత్తో మోహ్‌ని అక్కున చేర్చుకున్నాడు.
అక్కున చేరడానికి కాకపోయినా ఎరిగిన మనసొకటి దరిలో కావాలనిపించింది మోహ్‌కి ఆ టీస్టాల్ దగ్గర.

“నువ్వెక్కణ్ణించీ?” టీస్టాల్ ముందున్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మోహ్‌ని అడిగాడు. మోహ్ సుందరంవైపు చూశాడు.

“నువ్వు మాట్లాడితే ఎవరూ ఏమీ అనరు” మళ్ళీ అతనే అన్నాడు.

“బాపట్లనుంచీ.”

“నేనూ అక్కణ్ణించే. ఎంతమంది అన్నదమ్ములు?”

మోహ్‌కి గుర్తున్నంతవరకూ ఊహ తెలిసిన తరువాత అతని గుండెలోని అమృతభాండం చిలకడం అది మొదటిసారి. గడిచిన గంటలో ఆ నిముషాలు గడుస్తాయి, అపాయాలు దాటుతాయి అన్న ధీమా ఉన్న అతని గుండెలో ఆ భాండాన్ని కదిలించే సునామీ చెలరేగిందని అతనికి అప్పటిదాకా తెలియలేదు.

“ఆ నీళ్ళు చూడ్డానికేరా ఇదంతా” అప్పటిదాకా ఓడిపోయానని అనుకుంటున్న సుందరం విజయపతాక నెగురవేశాడు. ఆజ్ఞలని అమలుపరచిన మోహ్‌లోని యాంత్రికతని ధీరోదాత్తతకింద జమకట్టాడతను. ఏడిపించేవాడికి వాడి బకరా ఏడవకపోతే అందులో విజయం ఏదీ?

“ఎందుకేడుస్తున్నావ్?” అన్నాడా బాపట్ల సీనియర్.

“ఇప్పటిదాకా నా గూర్చి అడిగినవాళ్ళు మీరే సార్” అన్నాడు మోహ్.

“ఈపాటికి నాగూర్చి నాకంటే వీళ్ళకే ఎక్కువ తెలిసివుండాలి. ఇంక వీళ్ళు నానుంచీ రాబట్టేదేమిటీ? చిత్రవధ చేసినా సరే!” అనుకున్నాడు ఆ గదిలో మోహ్ ఎదుట వున్నతన్ని చూస్తూ.

ఒక మనిషిని మానసికంగా తుత్తునియలు – బ్రేక్‌డౌన్ – చెయ్యడానికి కాలక్రమంలో మానవుడు సానబట్టిన ఆయుధం చిత్రవధ – టార్చర్. “ఆ బ్రేక్‌డౌన్ అయితేనేగానీ వీడు నన్ను వదలడు” అన్న నిర్ణయానికొచ్చాడు మోహ్ ఎదురుగా వున్న అమెరికన్ ఇంటరాగేటర్ని చూసి. అందుకు కారణం తెలుసు గనుక నిట్టూర్చాడు. 9/11 తరువాత అతను భయపడ్డది ఇప్పుడు నిజమయింది.

నాలుగు గర్భస్రావాల తరువాత, పురిటిలోనే సంధికొట్టి పోయిన ఇంకో ఇద్దరి తరువాత పుట్టినవాడతను. నామకరణం ఇంకా కాకముందే అంతుపట్టని జబ్బుచెయ్యడంవల్ల, అతనిమీద కూడా ఆశని వదులుకున్నారు ఇంటిల్లిపాదీ.

ఆ యింటిలో నిరాశ ఉబ్బితబ్బిబ్బవుతున్నపుడు ఆ పిల్లాడి ఆరోగ్యంగూర్చి మొక్కుకున్న అతని తల్లి అనసూయమ్మ, జబ్బు నయమైన తరువాత వాడికి ఏ పేరుపెట్టాలో చెప్పింది. తలకాయలు పట్టుకున్నారంతా.

ఆవిడ పట్టుదలే నెగ్గి, జననమరణాల రిజిష్ట్రార్ ఆఫీసులో ఆ పేరే రిజిష్టర్ చేయించా డతని తండ్రి. అయితే, ఇంట్లో పిలిచేది మాత్రం మోహ్ అన్న పేరుతోనే అని కరాఖండిగా చెప్పాడు. స్కూల్లో మోహ్‌గానే పేరుని నమోదు చేయించాడు. ప్రాథమిక పాఠశాలలో జేరినప్పటినించీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయ్యేదాకా అతను మోహ్‌గానే అందరికీ తెలుసు.

మోహ్ పాస్‌పోర్టుకి అప్లైచేసినప్పుడు అందులో అతని పేరు అతనికి అలవాటైన పేరుకి – స్కూల్లో పేరుకి – వేరేగా బర్త్‌ సర్టిఫికెట్లోలాగానే వున్నా అతను పట్టించుకోలేదు. అయితే, అమెరికా చేరినప్పటినించీ, ప్రతీచోటా పాస్‌పోర్టులో ఉన్నట్టుగానే పేరు నమోదయింది – డ్రైవింగ్ లైసెన్సులోనూ, క్రెడిట్‌కార్డులమీదా, ప్రభుత్వ రికార్డులన్నిటిలోనూ, ఎయిర్ టిక్కెట్లలోనూ కూడా!

“సీ మిష్టర్ మొహమ్మద్ పిడుగురాళ్ళా – ”

మోహ్ ఆలోచిస్తున్నాడు. ఇంటికి వెళ్ళి మోనాని కౌగలించుకుని అతను ఎంతప్రమాదాన్నుంచీ తప్పించుకున్నాడో చెప్పడం ఇప్పుడిప్పుడే అయ్యేలా లేదు. వాళ్ళు చిత్రవధచేసినా తనలోని అమృతభాండం ఒలకదని అతనికి తెలుసు. చిత్రవధ చెయ్యడానికి కావలసిన పరివారమూ, పరికరాలూ, చెయ్యడంలో నేర్పరితనమూ వాళ్ళకున్నాయని కూడా అతనికి తెలుసు. విమానం నీటిలో మునిగిపోవచ్చు, బతికి బయటపడకపోవచ్చునని తెలిసినా ఒలకని అమృతభాండాన్ని చిలికించడానికి సాంత్వన వచనాలని పలికేదెవరు? శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. సాంత్వనము లేక ఉపశమనములేదు అన్నది మోహ్‌కి స్వానుభవం. బ్రేక్‌డౌన్ అయ్యాడనడానికి ప్రూఫ్ ఏడుపు. అతను ఏడుస్తూ మాట్లాడినా అందులో అల్‌ఖైదాగూర్చి కొత్తగా దొర్లే విషయాలేమీ ఉండవు. ఏడుస్తూ పలికేవేనా నిజాలు? అప్పటిదాకా అలవాటులేని పని – తన సాంత్వన వచనాలు తనే చెప్పుకోవడం – ఇప్పుడు సాధ్యమవుతుందా? ఆలోచిస్తున్నాడు.

*** * ***