కవిత్వం

మహబూబ్ ఘాట్

జనవరి 2014

బస్సు కిటికీ అద్దంల
మా ఊరును పటం గట్టి చూపే ఘాటు

ఆడి దాంక
ఉరికురికి వొచ్చిన నల్ల జెర్రివోతు రోడ్డు
ఆడి కొచ్చుడాలిశెం … ఈడిగిల వడ్తది
అడీని పూరా తనే ఎత్తుకున్నంత ఫికర్ తో
వొంకలు పెట్టుకుంట ఎక్కుతది
డోంగ్రెగాం లనే షురూ దాని ఏశాలు

ఏమైతేంది ఆ గాట్ల మీద
ఎంత మెల్లంగ వోతే అంత సంబురం

మలుగుతున్న బస్సుల నించి చూస్తే
గాట్ల మీన్నించి పచ్చలు గుమ్మరిచ్చినట్లు
కుప్పలు కుప్పలుగ ఉండేది అడివి

ఇప్పుడంత ఎలితెలితి
ఉట్టి అడియాశ అని తెలిసినా
అవ్వల్ల … ఎంత గానమో ఈ అడివాశ
మొదాల్లకు నరికిన టేకు మొట్లల్ల సుత
నునులేత ఆకులు పలుకరిస్తయి

కొండెంగలు కోతులు
రోడ్డు పొంటే కుక్కల వతు
తోకలూపుడొక్కటే తక్వ
అరటి పండ్లకు మక్కంకుల కాశపడి
మోరలు జాపి

బస్సు గటుకెయి మలగాల్నని
మా నిమ్మలను సూడాల్నని
గాట్లెక్కుతున్న ప్రతిసారి గంతే కాయిషు … గట్లెందుకో?

గప్పట్ల … గాట్ల మీన్నించి చూస్తే
గుట్టలూ మీద బుర్జులూ
వాటి పొంటి అద్దాలోలె చెరువులు గొలుసు కట్టినట్లు
ఎంత చక్కగ ఊరు పుదిచ్చిరో మారాజులు

గిప్పుడా బురుజులెట్ల కూలెనో
చెరూలగొల్సు లెవడెత్క పాయెనో
మనసంత వొడి పెట్టినట్లైతది

ఆఖరి ఘాటు ఎక్కినంక
అంత దూరంల మసక మసక
పోచంపాడు గంగను మొక్కి
మలుపుల షేకు సాయిబు లొద్దిల
దండం పెట్టి దక్షినేస్తెనే
మనసు సుదురాయించేది
గండం గట్టెక్కెనని

***

వారీ … రాజన్నా!…
ఇప్పుడా అడివటుంచు గాట్లే లేవు
కోతులు కొండెంగలేడ
నీ మహబూబు లేడు షేకు సాయిబు లేడు
అదంత మరిసి పొవే
ఇప్పుడిది బైపాస్ వే

మనసును కాదు
కూలవడ్డ సీటును ఎనుక కనుకో
ఫాల్తు కలలు కనకు
తియ్యో కునుకు



3 Responses to మహబూబ్ ఘాట్

  1. Ramakrishna
    January 9, 2014 at 6:58 am

    పోయెమ్ బాగుంది.

  2. dasaraju ramarao
    January 12, 2014 at 7:53 pm

    “ఇప్పుడంత ఎలితెలితి
    ఉట్టి అడియాశ అని తెలిసినా
    అవ్వల్ల … ఎంత గానమో ఈ అడివాశ
    మొదాల్లకు నరికిన టేకు మొట్లల్ల సుత
    నునులేత ఆకులు పలుకరిస్తయి.”……మీ కవిత్వంలో నిజాయితీ,సుస్పష్టమైన చూపు ,తెలంగాణ నుడికారం వున్నది. పోయెం లో ఆర్ద్రత , చివర సెటైర్ ముక్తాయింపు గుడ్ ….అభినందనలు

  3. January 13, 2014 at 9:23 pm

    థాంక్యూ రామకృష్ణ గారు.
    దాసరాజు రామారావు గారు మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply to Ramakrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)