పుస్తకమే నయం
కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని
సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది
ఈ ఆస్తిని యెప్పుడూ
మన గృహాంతర సంపద
చేయగల్గినామా
స్తిమితం అనేది
మన మానసవీధిని
కమ్మటం నిజం
అక్షరమే అనంత నిధి
ఆ యెరుకే
వొక సాటి లేని భాగ్యం
క్షితిపై మనీష
తన కాంతిని పూసిన
సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత
వసంత విరాజితం!
అనంతాక్షర
సౌరభాల గనులైన
కితాబుల మైత్రి ఓ వరం
(ఇవి పూర్తిగా ఛందోబద్ధమైన పద్యాలు. ఉత్పలమాలలు)
అక్షర అనంత నిధులతో జ్ఞాన మతాబుల వెలిగించే కితాబుకి,. చక్కని కితాబిచ్చారు. బాగుంది సర్,.
అక్షరమే అనంత నిధి ఐతే , పుస్తకం అనంతానంత నిధుల నిక్షేపమే కదా . అలాంటి పుస్తకాలతో చెలిమి మహా గొప్ప వరమే కదా
పద్యగర్భిత వచనకవితా సౌరభాల గనులు.
హరిప్రియ గారూ, భాస్కర్ గారూ! నా ‘అనంతాక్షర సౌరభాల గనులు’ మీకు నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు.
నిజానికి ఇవి ప్రయోగ పద్యాలు. పైకి వచన కవితల్లా కనిపిస్తాయి కానీ పూర్తిగా ఛందోబద్ధమైనవి. ఈ రెండు పద్యాలు ఉత్పలమాలలు. గణాలు భ, ర, న, భ, భ, ర, వ. యతిస్థానం 10వ అక్షరం. ప్రాస కూడా పాటించాను. ప్రాసాక్షరాలు ప్రారంభ పద్యంలో స్త, స్త, స్తి, స్తి. రెండవ పద్యంలో క్ష, క్షి, క్ష, క్ష. ఈ వివరాలన్నీ స్పష్టంగా తెలియాలంటే వీటిని ఇరవై ఇరవై అక్షరాల పంక్తులుగా అమర్చి చదవాలి. ఇటువంటి పద్యాలను ఇంతకు ముందు ఆరుద్ర గారు రాశారు. శ్రీశ్రీ గారు రెండో మూడో రాసినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు మరెవరూ రాయలేదు. ఇలాంటి 30 పద్యాతలో 2010లో నేను మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం అనే సంపుటిని వెలువరించాను. మరో పుస్తకాన్ని కూడా వెలువరించబోతున్నాను. ఇవి ఏకకాలంలో అటు వచన కవితలు, ఇటు ఛందోబద్ధమైన పద్యాలు కావటం వీటి ప్రత్యేకత.
మంచి ప్రయోగమండి, అభినందనలు.
భాస్కర్ గారూ,
ధన్యవాదాలు.
రవీ,
Your remark is a succinctly expressed nice epithet . Thanks .
ఛందో వచన పద్యాలు బాగున్నాయి సార్.
థాంక్యూ రాజ్ కుమార్ గారూ.
ఎలనాగ గారూ, వచన కవిత్వంలో ఎంచక్కని ప్రయోగం. మీరు చెప్పకపోయి ఉంటే ఈ గమ్మత్తును గమనించగలిగేవారం కాదేమో!
“సాక్షరుడైనవాడి మనసంత” — ఇక్కడ “మనసంతా” అని ఉండాలా? నేను పొరబాటుగా చదివానా?
మానస గారూ!
నా ప్రయోగ పద్యాలు మీకు నచ్చినందుకు సంతోషం,కృతజ్ఞతలు.
మీరన్నట్టు ‘మనసంతా’ అంటే బాగానే వుంటుంది. కాని అప్పుడు ఒక మాత్ర ఎక్కువైపోయి గణం చెడుతుంది (‘త’ లఘువైతే ‘తా’ గురువు). ‘మనసెంత’ అంటే ఇంకా బాగుండేది. కాని అప్పుడు వ్యంజన యతి (హల్లు యతి) కుదురుతుంది కానీ స్వర యతి (అచ్చు యతి) కుదరదు. రెండు రకాల యతులూ కుదరాలంటే సం స్థానంలో సా కాని, సై కాని సౌ కాని లేక వీటితో కూడిన సంయుక్తాక్షరాలైనా, ద్విత్వాక్షరాలైనా రావాలి. ‘సం’ అనేది ఆ పంక్తిలో 10వ అక్షరం కనుక అది యతి స్థానం అని ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ విధంగా ఇలాంటి ప్రయోగ పద్యాలను రాయటం కత్తి మీద సాము. కాబట్టే కొన్ని limitations.
జమండి, మీరు చెప్పక పోతే వచన మాత్రమే నని అనుకుండె వార్మ. చాలా బాగుంది సార్ మీ ప్రయోగం!
థాంక్స్ తిరుపాలు గారూ.