కాశీ మజిలీలు

ఆ నెమలెంటిక ఇప్పటికీ…

జనవరి 2014

“ఒరేయ్ లెగరా ఏబ్రాసినా కొడకా, తెల్లారి సేలా సేపయ్యింది. లెగవేరా ? కోటిపెల్లికి పంటికట్నాకి బుల్లిగాడొచ్చేశాడు, పండుగాడు పెదబుజ్జిగాడు రేవులో తానానికెళ్లారు తమ్ముడు సేనికాడికెళ్లి గట్టుకన్నం కట్టేసొత్తాడు. ఈ లోపులో నువ్వు పయనమాడెయాలి. లెగరొరేయ్ సన్నాసి”

నాన తిట్టిన తిట్లన్నీ ఇనపడుతున్నాయి అయినా ఇంకా మెళుకువ రానట్టు, నటిత్తానే పడుకున్నాన్నేను. గాజులు సప్పుడు కూడా ఇనబడింది. అమ్మ కూడా లెగిసే ఉంటాది. కొంపదీసి తపేల్తో నీలట్టుకూని రాట్లేదు కదా! అని దుప్పడి పైకెత్తి సూశాను!

చిలక్కర్రకి తగిలించిన పాల తపాలా తీసి అందులో సకానికి నీలేసి నాన చేతికిచ్చింది మాయమ్మ. కచ్చితంగా ఈడిపుడు ఆ నీలు తీసుకొచ్చి నా మోకానికేసి కొడతాడు డౌట్ లేదు అనుకుంటానే దుప్పటి ఇంకాత గట్టిగా తన్నిబెట్టి పట్టుకున్నాను. ఇంకా దగ్గరికి రాట్లేదేటా అని తలెత్తిసూత్తే మా నాన పెదగేది కాడ మోకాళ్లమీద కుచ్చూని , చేతిలోకి నీలు తీసుకుని పొదుగుమీద రెండుసార్లు కొట్టాడు ఆ తరవాత ఇంకా మిగిలిన నీలు లేగదూడ మూతిమీద చిలకరించి, ఇంకూని తపేలాలో మిగిల్చి చుయ్ మని ఓ రెండు దారల్లాగాడు . పాలు తియ్యడం ఎప్పుడూ సూత్తాను గనక పితికేటప్పుడు తపేల్లో ఎన్ని నీలున్నాయో అంచనా ఏసెయొచ్చు. వొట్టి కాళీ తపేల్లోపాలు పిండితే ఒకలాగా , నీలున్నదాట్లో పిండితే ఇంకోలాగా సప్పుడొత్తాది.

“అమ్మా! నాన తప్పేల్లో నీలేట్టాడే” అని గట్టిగా అరుత్తూ లెగిశాన్నేను. అప్పుడు మాయమ్మ నాన్ని తిడతాది కదా! నాకు భలే సర్దాగా ఉంటాది . అమ్మ నాన్ని, నాన అమ్మని తిట్టుకుంటుంటే భలే నవ్వొత్తాది నాకు.

“దొంగనాకొడుకు, పాముచెవుల్నాకొడుకు ఎలాగినపడిందిరా నీకు? ఉప్పుడు దాకా పడుకూనే ఉన్నావ్ కదా” అంటూ మళ్ళీ నన్ను తిట్టుకున్నాడు.

మానాన నన్ను తిడితే నాకెందుకో నచ్చుతాది. ఇంకా అలాగే ఏదో ఒంకన తిట్టుకుంటూనే అరుగుమీద కొంకుడుకాయలు చిదగ్గొట్టాడు.అయ్యన్నీ సెంబులో ఏసి నానబెట్టి బుజ్జమ్మీద తుమాలేసుకుని. పాచి మొకంతో టీ తాగుతున్న నన్ను సంకలో సెయ్యెట్టి రేవుకాడికి లాక్కెళ్ళిపోయి పాంచాలు మీద కుచ్చోబెట్టి తలంటేశాడు . నేను తానంసెయ్యడం అవకుండానే పెదబుజ్జిగాడొచ్చేశాడు రేవుకాడికి.

ఒరేయ్ కాసోడా నువ్వింకా తానంసేత్తా ఉన్నావేట్రా? ఇందాక పంటొచ్చింది మొదల పంట్లో , నల్లోడు , మా సినబుజ్జిగాడు , బుల్లిది, సినపాప …..అందరూ ఎలిపోయారు. రాణీ పిల్ల కూడా ఆ పంటే ఎక్కేసిందిరా అని వాగుతానే వున్నాడు . ఆ సివరి మాట మాత్రం ఇనపడింది నాకు.

అప్పుడు దాకా కళ్ళు మూసుకుని ఉండి, అప్పుడు కళ్ళు తెరిస్తే! సీన్ మానానకి అర్ధమయ్యిపోయింది . చిన్నగా సెంబుతో ఓ మొట్టు మొట్టాడు. “ఒరేయ్ పెద బుజ్జిగా నువ్వు గాని మావోడు గాని ఇంకోసారి రాణీ దాని గురించి మాటాడారో సందాల తీర్తం లో రాయిసెట్టు కాడ కట్టేతాను” అన్నాడు . ఏమీ మాటాడకపొడమే మంచిదని నేను నోరిప్పలేదు. ఈ లోపు ఎవడో బుడుంగున రేవులో దూకేసాడు. కళ్ళు మీదున్న కొంకుడునురగ తుడుసుకుని ఎవర్రా అని సూత్తే ! మా రాంగాడు.

“ఇద్దరం బేగా సేసెసొత్తాంలే నువ్వింటికెళ్లు” అని మానాన్ని పంపించేశాను. మళ్ళీ మానాన పిలిసి, మా అమ్మ అరిసేదాకా మేమిద్దరం రేవులోనుండి బయటకి రాలేదు. ఒళ్ళు సరిగ్గా తుడుసుకోకుండానే ఇత్త్రీ బట్టలేసుకుని, పండుగని ఒండిన పప్పన్నం తినేసి, అడక్కుండానే మా అమ్మకి ముద్దిచ్చేసి , పంటెక్కడానికి రేవుకాడికి వొచ్చేశామ్ మళ్ళీ .

అందరం పంటెక్కేశాక “ఒరేయ్ కాశి రామడా! ఓ సారి యేటిగట్టెక్కి సూడ్రా ఎవరన్నా వొత్తున్నారేమో” అన్నాడు సుబ్బన్నమాయ .

మావోడు ఏట్లోకి పది సార్లు . ఏటి గట్టుకు పదిసార్లు తిరిగాక ఎవల్రాట్లేదు మాయ ! పంటి తీసేయ్ ఎలిపోదాం అన్నాడు. ఇంకా మా రాంగాడు ఎక్కేశాక , పంటి పోనీద్దామని తెడ్డెస్తే “ఆగండల్లా నేను వొత్తూన్నాను” అంటూ వొత్తంది నామాడోళ్ళ రాణిది.

“ఓలేయ్ రాణీ దాణా నీకెంత సోకే ! నువ్వూ మీ బాబూ సందాల పంటికి రండి మేమెల్లిపోతాం” అన్నాడు సుబ్బన్నమాయ.

అలాగంటానే నాయొంకు సూశాడు సుబ్బన్నమాయ . మాయా తెడ్డేయ్ ఎలిపోదాం అన్నాను . మరి అది రాదా అన్నాడు రాణీ దానొంకు సూసి . మల్లె దాన్ని వొదిలేసిపోతే ఆళ్ళమ్మ తిడతాదిరా సూరీడా అన్నాడు. ఆగైతే ఎక్కించుకుందాం అని నేనే దిగెల్లి, నా నిక్కరు పిర్రలు కనపడేదాకా ఎత్తుకుని నీట్లోకి దిగితే , “కాసోడొద్దుబాబా “ నువ్వేరారా బుల్నాన్న అన్నాదది.

“అయ్యిడీయమ్మా తంట” అనుకుని సుబ్బన్నమాయ రాణీ దాన్ని పంటెక్కించాడు.

అది పంటెక్కాక ఆ మూలా , ఈమూలా తిరిగి కడకి నా పక్కకొచ్చి కుచ్చుంది. మా రాంగాడు, పెద బుజ్జిగాడు గోల మొదలెట్టారు. రేవులో మా పంటి అటిటూ ఊగుతుంటే ! ఒంగోని అది నీళ్ళు అందుకునేది. అందరూ ఓ పక్కకి రావోద్దని సుబ్బన్నమాయేమో అరుస్తున్నాడు. మా పంటి కోటిపెళ్లి రేవులోకి ఒత్తందనగా ముత్తేసరం రేవులో నుండి వొత్తున్న నామలు కూడా కనపడ్డాయి .

ఒడ్డుకొచ్చేసాం , కోటిపెళ్లి తీర్ధం గుడికాన్నుంచి రేవుదాకా పాక్కోచ్చేసిందపుడే. బుడగలోళ్లూ, కళ్ల జోల్లు అమ్మేవాళ్లూ అందరూ రేవుదగ్గరే దుకాణాలు ఏసేశారు. తీర్ధానికి ఎప్పుడొచ్చినా మేమందరం దర్శనానికెళ్లొచ్చేసి ఆ తరవాతే అన్నీ కొనుకుంటాం. పెద్దోళ్ళందరూ సందాల కర్రసాము టయానికి వొత్తారు. ఈ లోపు మేము తీర్దం మొత్తం చూసేసి , ఇసకలంకలు తిరిగేసి , జీళ్లూ కజ్జూరాలు తినేసి మద్దేలదాకా బలే గడిపేత్తాం. మాతో పాటు ఒకలిద్దరు పెద్దోలొత్తే ఏ పేకాటకాడో కుచ్చుంటారు.

కోటిపెళ్ళంతా మావోల్లే ఉంటారు గనక ఎవరన్నా తప్పిపోతారు అని బయముండదు మాకు . వొచ్చినోళ్ళందరూ తలోదిక్కికీ ఎలిపోయారు. రాణీది మాత్రం నేను గుడికాడికెళ్తే గుడికాడికి , రేవుకాడికెళ్తే రేవుకాడికి నాకూడా రంకు మొగుల్లాగా తిరిగుతుంది. మొత్తానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజంతా నాసుట్టూ అది , దాని సుట్టూ నేను తెలీకుండా తిరుగుతాం. నాలుగూ ఐదు గంటలకి నీరెండపడ్డాక , సుబ్బన్నమాయ అందర్నీ కేకేత్తాడు. ఒకలు ఎనక, ఒకలు ముందు మొత్తానికి అరగంటకల్లా అందరం చేరిపోయి పంటెక్కేసాం . సీతగాలి రేవుమీద తిరుగుతుందనగా మా రేవులో దిగిపోయాం. యేటిగట్టెక్కుతూ ఎవలెవలు ఏమేమి కొనుకున్నామో చూసుకుంటే , మా రాంగాడు నాకు సెక్క పెన్ను , నేనేమో ఆడికి నొక్కుడు కప్ప కొనుకున్నాము .

ఇంకా మాయమ్మకి జీళ్లూ , కజ్జూరం కూడా కొనుకున్నాం. ఓలేయ్ రాణీ దానా నువ్వు దిగలేదాయే అన్నాడు సుబ్బన్నమాయ. ఆ మాట ఇనపడి ఎనక్కి తిరిగి సూత్తే అదింకా పంట్లోనే ఉన్నాది. నేనూ పెదబుజ్జిగాడు ఎనక్కెల్లి రాణీదాన్ని దింపాం. నువ్వేం కొన్నావ్ అని అడిగాడు పెదబుజ్జి గాడు , ఏం సూపెడతాదా అని ఆశగా సూతున్నాను నేను . ఒక కాటిక బరిని సూపించింది. మా సెల్లికి కొన్నాను అన్నాది. మీ రాజు మాయకి ఏం కొన్నావ్ ? అని అడిగాడాడు! రాణీ ది మాటాల్లేదు. నీట్లో తడిపిన నెమలెంటికి మెడమీద రాసి ఇది నీకే కొన్నాను అనేసి, ఏటి గట్టుకి పరిగెట్టేసింది. కితకితలెత్తి అది లాక్కుని మళ్ళీ ఎనక్కెల్లి రేవులో ముంచి తీసి , అది పొడారిపోయేదాకా నేను గట్టెక్కలేదు. నా ఐదో తరగతి ఐపోయి పద్నాలుగేళ్లయింది. ఆ నెమలెంటికి ఆర్లేదు. నేనింకా గట్టెక్కలేదు.

తర్వాత పదో తరగతిలో గంగపిల్లతో కోటిపెళ్లికెళ్లినా మా రాణీది ఇచ్చిన నెమలెంటికి మారేవొడ్డున తడిగానే ఉంది. తరవాత ఇంటరయిపోయి, ఇంజనేరయిపోయాక్కూడా మా రేవోడ్డున రాణీదిచ్చిన నెమలెంటిక పొడారలేదు. ఇంకా నా డైరీలో తడి తడిగా నన్ను తాకుతానే నాతో రానిది , అదే మా రాణీది మళ్ళీ కితకితలు పెట్టింది.

*** * ***