కవిత్వం

మంచుపూల పగటికల

జనవరి 2014

అంతులేనంత అద్భుతమైన ఆవిర్భావంగా
ఇరుకు సందులే లేనంత విశాలంగా
దారులంతా విత్తనాలుగా వెదజల్లిన సిద్ధాంతాలుగా
పచ్చటి పచ్చికంతా తలలూపుతూ చాటిచెప్పే నిజాలుగా
ఆకాశమంత పరిజ్ఞానం భూమికి అణువణువునా పంచినట్లుగా
విశ్వవ్యాప్త వసుధైక కుటుంబశైలి
మక్కువగా పేర్చిన హారంగా విరాజిల్లినట్లుగా
కాలక్రమంగా కాలాలు…
నాగరికత చక్రాలపై దొర్లిపోతున్నట్లుగా
ప్రతి మేఘం ధరిత్రికోసమే పురుడుపోసుకున్నట్లుగా
నింగి నుండి వర్షించగా
ఆయుధాల అవసరమే రాని అవనిగా
అంతర్మధనాల ఆలకింపులే లేని అంతరాత్మలుగా
చేయి చేయి కలిసి నడిచే సుదీర్ఘ ప్రయాణంగా
ఒకరికొకరు ఆపద్బాంధ సేతువులుగా
ఒకరికొకరు వినమ్ర క్రియాధాతువులుగా
పరిమితులు లేని పరిశుభ్రమైన అభివ్రుద్ధి
మనుగడకు గీటురాయిగా
ఎటునుండి చూసినా…
శాంతి, సౌభ్రాత్రుత్వం
ఎటునుండి విన్నా…
శ్రమ, ఐకమత్యం
కనురెప్పలపై ముద్రించిన మంచుపూల పగటికల
వాస్తవాల నిప్పుసెగకు కరిగి రెప్పదాటిపోయిందిలా!