కడిమిచెట్టు

ప్రజ్ఞా పారమిత – జేన్ ఆస్టిన్

ఫిబ్రవరి-2014

చార్లొటి బ్రాంటి లాగా ఆమె ఉద్వేగం నిండిన రచన చేయలేదు. జార్జ్ ఇలియట్ లాగా దిగంతాలను చూడలేదు. తనకు తెలిసిన, తాను మెలిగిన మనుషుల గురించే, పైపైన చూస్తే పైపైనిదనిపించే పద్ధతి లో చెప్పారు . ఆమె నాయికా నాయకులు ఉదాత్తతకో విజ్ఞానానికో పేరు మోసినవారు కానే కారు. మరి ఆమె ఏమి రాశారు?

హృదయానికీ మేధస్సుకీ సమన్వయం కుదిరేలా చేసుకోవటం ఆలోచించగలవారందరికీ అందీ అందక వేధించేదే. బ్రతకటం లో కళ ఎంత , శాస్త్రం ఎంత, రెండిటినీ కలిపిఉంచగల వీలెంత? గొప్ప కళాకారిణి జేన్ఆస్టిన్ రెండు వందల ఏళ్ల క్రితం చెప్పినదే ఇది అంతా.

పరిమితమైన పరిధిలో ఆమెకనబరచినది అపరిమితమైన ప్రజ్ఞ . ఎంత సానబట్టిఉంటారో ఊహించలేనంత మెరుపు ఆమె వాక్యాలలో. అసలు అప్రయత్నంగానే ఆ వజ్రనిశితమైన బుద్ధినుంచి వచ్చాయేమోననీ అనిపిస్తుంది. పాత్రలు వారికి ఏది సహజమో అలాగే ప్రవర్తిస్తాయి. ఇంకా, ఆ స్వభావాన్ని చిత్రించేందుకు ఆమె ఎక్కువ రంగులు కలుపుకోరు కూడా. రెండు మూడు వాక్యాలలో గతాన్నీ భవిషత్తు నీ వర్తమానం తో తెచ్చి ముడి వేస్తారు.

ఆమె గతించిన సంవత్సరమే జన్మించిన విమర్శకుడూ, ఇంచుమించు అభిమానీ అని చెప్పదగిన George Henry Lewes రాసిన వ్యాసం చాలా మేరకు సరిగ్గా అనిపించింది. కాకపోతేఆయన జేన్ ఆస్టిన్ స్థానాన్ని ప్రధాన సాహిత్య స్రవంతి లో ఎత్తున, ఒక మూలగా చెబుతారు. ఆయన దర్శనం అంతవరకే వెళ్లింది. నిజంగానే ఆమె తన జీవితకాలం లో సుమారయిన విజయాన్నే చూశారు. ఐరిష్ రచయిత్రి మేరియా ఎడ్జ్ వర్త్ వంటివారు ఆమె కంటె ఎక్కువ స్థితిలో ఉండేవారు. పెద్ద పెద్ద కుడ్య చిత్రాలవంటి నవలలు రాసిన వాల్టర్ స్కాట్ అప్పటి సాహిత్యానికి చక్రవర్తి. జేన్ ఆస్టిన్ రచనను ఆయన ఇష్టపడి మెచ్చుకునేవారు. ఆ ప్రశంస లు ఆమె నవలల ని ప్రమోట్ చేయటం లో వాడుకునేవారట. [కాలం గడిచాక ఆయన నవలలని ఆమె మెచ్చుకున్నవి గా చెప్పే స్థితీ వచ్చింది] ఆ తర్వాతి 19 వ శతాబ్దపు సాహిత్యమూ గొప్ప గౌరవాన్ని ఇవ్వలేదు కూడాను. డికెన్స్ ఏలిన దశాబ్దాలలో విల్కీ కాలిన్స్ వంటి వారికే సరయిన గుర్తింపు రాలేదు. ఈమె ను ఇంచుమించు విస్మరించారు. బ్రాంటి సోదరీమణులు , జార్జ్ ఇలియట్ తక్కిన చోటుని పంచుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం కష్టాలనీ క్లిష్టతలనీ ఆమె నిర్లక్ష్యం చేశారనిపించటం. నెపోలియన్ తో ఇంగ్లీష్ వారు యుద్ధం చేసే రోజులలో ఆ సంగతే తన రచనలలో ఎత్తుకోరు ఆమె. అది అలా రాయదలచుకోనితనం, తానై గీసుకున్న పరిధి ఒక కారణం. వేణువు సన్నాయి లాగా మ్రోగనవసరం లేదు, దాని దినుసు వేరే .

ఇరవైయవ శతాబ్దం, ముఖ్యంగా దాని ఉత్తరార్థంలోనే ఆమె వన్నే వాసీ తెలిసివచ్చాయి
సమకాలీనమైన కథలను ప్రతిభ ఉట్టిపడేలా రాయటం లో ఆమె ఇంచుమించు మొదటివారు. సభ్యత, నియమాలు…వీటికి ఆమె ఇచ్చిన నిర్వచనాలు ఈ రోజుకీ చెల్లుతాయి. స్త్ర్రీ పురుషుల విషయం లో సమాజం వేర్వేరు తీర్పులు ఇస్తుందనే విషయాన్నీ ఆమె కదిపారు. విమర్శ ఏమిటంటే ఆమె ‘ భద్రంగా ‘ ఉండటం గురించి మాట్లాడారని. ఎంత అరాచకంగా ఉంటే అంత గొప్ప రచనేమోనన్న భ్రాంతి బలిష్టంగా ఉన్న ఇప్పుడు అలా ఎందుకు ఉండాలన్నారో తెలుసుకుని ఒప్పుకోవటం కష్టమే. నిజానికి ఆమె తర్వాతి తరం రచయిత్రి ఛార్లొటీ బ్రాంటి ఆమె ను ఘాటు గానే దుయ్యబట్టారు. తీవ్రత అంటే ఏమిటో తెలియదు అనీ ఏ సంఘటననీ ఆరుబయటకి తీసుకురారనీ. నిజమే, ఆమె ఎటువంటి తపననూ ఎక్కడా తీవ్రంగా చిత్రించలేదు. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లో ప్రేమించినవాడు మోసం చేస్తే మంచానపడిన మేరియన్ గురించి చెప్పటంలోనూ సం యమనం పాటిస్తారు.అక్కర లేక అయితే కాదు, అది ఇంకొక పాత్ర రూపంలో [కల్నల్ బ్రాండన్ ] చూపిస్తారు. దుఃఖపడటాన్ని రొమాంటిసైజ్ చేయదలచుకోరు ఆమె. సమస్యకు నివారణ ముందు చెబుతారు, ఇక పరిష్కారం చెప్పకుండా వదిలే పనే లేదు. నిజ జీవితం లోఉంటాయా అలాంటి పరిష్కారాలు? సమాధానం ఏమిటంటే సాహిత్యం ఎప్పుడూ ఒక సూచన, ఒక వైద్యం. నిజజీవితపు నేలబారుతనాన్నీ నిరాశనూమాత్రమే చెప్పి ఊరుకోవటాన్ని ఆమె ఇష్టపడినట్లు లేరు.

వాతావరణ కల్పన చాలా తక్కువగా కనిపిస్తుంది ఆమె రచనలో, అదీ నిజమే. సుందరమైన ఇంగ్లీష్ పల్లెటూళ్ల వర్ణన జోలికే వెళ్లరు ఆమె. ప్రకృతితో నిమిత్తం లేకుండా నాలుగు గోడ ల మధ్య నడిచే కథ చెప్పటమే కష్టం. అది కష్టమని తెలియకపోయేలా రాయటం ఇంకా కష్టం. ఇక్కడే ఆమె ఒక నాటకకర్త అనిపిస్తారు. షేక్ స్పియర్ తర్వాత పాత్ర చిత్రణ ఆమెలాగా చేసినవారు లేరంటారు. మన తిక్కన్న గారితోనూ పోల్చుకోవచ్చు. ఏ చెరిపివేతా లేకుండా స్పష్టంగా సరిగ్గా గీస్తారు మనుషులని. ఆమెని పారడీ చేసిన ఆస్కార్ వైల్డ్ కూడా ఆమె ప్రభావం లోంచి తప్పించుకోలేకపోయారు. ఆమె నాటకం రాస్తే ఆయన ‘ లేడీ విండర్ మియర్స్ ఫాన్ ‘ అయిఉండేదేమో అనుకుంటాను. ఆమె రచనా పద్ధతి ఫ్లూయిడ్ గా ఉంటుంది .పెద్ద పెద్ద వాక్యాలతో చిన్న అధ్యాయాలు, ఎక్కడ అధ్యాయం ముగిస్తారో ఒక పేజీ ముందే తెలిసిపోతూ ఉంటుంది, అది ఆమె ముద్ర. నాజూకైన ,పదునైన అధిక్షేప హాస్యం అంతర్లీనంగా ఉంటూ ఉంటుంది ఆమె కథనం లో.

ఆ పందొమ్మిదో శతాబ్దపు తొలి సంవత్సరాలలో స్త్రీలకే కాదు, పురుషులకీ అవకాశాలు తక్కువే. వివాహం ఒక ఉపాధి గా ఉన్న కాలం అది. ఇంగ్లండ్ గొప్పవంశాల వారికి ధనం ప్రసక్తి లేని వివాహాలు చేసుకుని బతికే సామాజిక పరిస్థితులు లేవు. ఆ ‘ నిధివేట ‘ లని ఆమె వెటకారంచేస్తారు. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకోవద్దని హెచ్చరిస్తారు . అయితే దాదాపు అన్ని నవలలలోనూ ముఖ్యపాత్రలు అనుకూలమైన పరిస్థితులలోనే స్థిరపడతాయి. ఇదొక వైరుధ్యమని ఫిర్యాదు ఆమె పైన . ప్రత్యేకించి సహాయ పాత్రల విషయంలో , ఒక స్థితి తప్పనప్పుడు దాన్ని వీలయినంత తక్కువ నొప్పితో చేరే మార్గం చెబుతున్నారా అని ఉక్రోషం వస్తుంది కూడా. తన పాత్రల మీద మమకారం[[అది నేరమేమీ కాదు ] వివాహమంగళం గా పర్యవసిస్తుందనుకోవలసిందే. ఆధునిక దృష్టితో చూస్తే ఆమె రొమాంటిక్ కామెడీ లు రాశారు . ఆమెను బాహాటంగా విమర్శించినా జార్జ్ ఇలియట్ శ్రేష్టకృతి ‘ మిడిల్ మార్చ్ ‘ మీద ఆమె ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి.

“అరుదుగా, చాలా అరుదుగా పూర్తి సత్యం అనేది మనుషులకి అందుతుంది. కొంచెం మార్పుతోనో , ఇంకొంచెం పొరబాటుతోనో కలిసి ఉండని సత్యం తెలియటం మరీ అరుదైనది’’అంటారు. సత్యపు పాక్షికతనీ సాపేక్షతని అంగీకరిస్తూనే ‘ వినా దైన్యేన జీవనం ‘ గడపగల మెళకువనీ మెలకువనీ చెప్పగల సాహిత్యం ఆమెది. సంఘటనలూ సందర్భాలూ ఆమె రచన ఇచ్చే యంత్రలాభం [ మెకానికల్ అడ్వాంటేజ్ ] వలన సరళం అవుతాయి , సాహిత్యం లోనూ వాస్తవ ప్రపంచంలోనూ. ఈ మధ్యన ‘ game theory ‘ నీ ఆమె రచనలకి విజయవంతంగా వర్తింపజేశారు. William Deresiewicz 2012 లో ‘ ఆ ఆరు జేన్ ఆస్టిన్ నవలలు నాకేమి నేర్పాయి? ‘ అని ఒక పుస్తకం రాసుకొచ్చారు, అది పెద్ద సక్సెస్. ఆమె ఎంత విశ్వసనీయమైనవారో నొక్కి చెప్పాలని కాదు, గుర్తు చేయాలని .

ఆమె నవలలు ఏవీ ఔటాఫ్ ప్రింట్ అవవు. ఆంగ్ల సాహిత్యవిద్యార్థులకే కాదు, సాధారణమైన పాఠకుల కోసం కూడా.
Northanger Abbey అప్పటి గోథిక్ నవలల మీద పారడీ. [ఆ కాలపు ] వాస్తవికతని చిత్రించని రచనల పట్ల ఆమెకి ఎంతమాత్రమూ సానుభూతి లేనట్లే. ఆశ్చర్యకరంగా ఆమె రాసిన కాలాన్ని అధిగమించి ఆమె నవలలు నిలిచి ఉన్నాయి. మానవ స్వభావాన్ని దాని అతి సున్నితమైన స్థాయిలో ఆమె ఒడిసిపట్టుకోగలగటం దానికి కారణం అయిఉండాలి.
సెన్స్ అండ్ సెన్సిబిలిటీ ఉద్వేగాన్నీ వివేచననూ ఎలాగ తూకం వేసుకుని ఆలోచించాలో చెప్పదలచిన రచన. ఆ కత్తిమీది సాము ని ఆమె ఒడుపుతో చేసి చూపిస్తారు. పదమూడేళ్ల కిందట దక్షీణభారతం లో సినిమాగా వచ్చినప్పుడూ ఆ త్రాసు సరిగానే పనిచేస్తూ ఉన్నట్లుంది. నవల లోని ఏ పాత్రనూ ఏ ముఖ్యమైన సన్నివేశాన్నీ వదలకుండా , 2000 సంవత్సరానికి అన్వయించి తీసిన ఆ సినిమా [కండుకొండే కండుకొండేన్ ( ప్రియురాలు పిలిచింది ) ] అక్షరాలా రక్తి కట్టింది. ఆలోచనామగ్నమైన టాబూ ముఖం ఎలినార్ పాత్రకి కి గొప్పగా న్యాయం చేసింది. పాతరోజులలో అయితే నూతన్ సరిపోయిఉండేవారనిపిస్తుంది.

మాన్స్ ఫీల్డ్ పార్క్ కొంత విలక్షణమైన నవల. స్థూల దృష్టికి అది జడ్జిమెంటల్ గా కనిపించే అవకాశమూ ఉంది.నాయిక ఫానీ ప్రైస్ ని తన పెరిగిన పరిసరాలకంటే ఉన్నతురాలిగా చూపించటం లో వింతేమీ లేదు. కాని ఆమె ఆ వాతావరణాన్ని అయిష్టం గా చూడటం అప్పటి ఆదర్శవాదాన్ని . పక్కకి నెట్టటమే. ఫానీ ప్రైస్ అందుకు చాలామందికి నచ్చదు. ఆమె ‘ యోగ్యత ‘ ని నమ్ముతారు, దాన్ని సాధన తో తెచ్చుకోవచ్చుననే నమ్మకమూ కలిగిస్తారు. మార్క్ ట్వేన్ ‘ ప్రిన్స్ అండ్ద పాపర్ ‘ లో టాం కాంటీ తండ్రిని అలాగే ద్వేషింపజేస్తారు.[ ఆమెని తీవ్రంగా విమర్శించినవారిలో మార్క్ ట్వేన్ ఒకరు] ఈ రెండు చోట్లా దరిద్రం మనసులలో , దయ లేకపోవటం లో, సిగ్గుమాలిన స్వార్థం లో.

ఎమ్మా నవల జేన్ ఆస్టిన్ కల్పనా చాతుర్యపు పరాకాష్ట. ‘ ఎవరికీ నచ్చని నాయిక ని సృష్టిస్తున్నాను ‘ అన్నారట ఆమె రాయబోతూ. కాని ఎమ్మా ధూర్తత్వంలోని అమాయకతని ఇష్టపడి తీరతాము. తెలిసీ తెలియని జ్ఞానం తో పక్కవారి జీవితాలను సవరించబోయే ఎమ్మావుడ్ హౌస్ ప్రపంచ సాహిత్యం లోని ఆహ్లాదకరమైన పాత్రల లో ఒకటి. రచయిత్రి సుఖాంతమైన కథలే చెప్పారు కనుక ఆ సరదా కి ఏమీ భంగం రాదు కూడా. అవవలసినంత అల్లరీ అయిపోయాక ఆమెని నీడలా కాచుకునే నైట్ లీ అంతంత పెద్ద ఫిర్యాదులేమీ చేయకుండానే పెళ్ళాడుతాడు ఆమెని. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లో కల్నల్ బ్రాండన్ కి మరొక రూపం నైట్ లీ. ప్రేయసిని, వయసులో చిన్న అవటమూ ఒక కారణంగా లాలించి క్షమించి దగ్గరికి తీసుకునే పురుషులు వీళ్లు.

పర్సుయేషన్ చివరి నవల. నాకు ఇది విశ్వనాథ వేయిపడగలు లో ప్రస్తావించిన నవల కూడా. అనారోగ్యం వలనా సమయం లేకా ఎక్కువ చిత్రిక పట్టని నవల అంటారు. బహుశా అందువల్లనే ఎక్కువ సహజంగానూ అనాయాసమైనది గానూ అనిపిస్తుందేమో కూడా. నా వరకు ఇది ఆమె మాస్టర్ పీస్. ఎవరో వద్దని నచ్చజెపితే విని కెప్టెన్ వెంట్ వర్త్ కి దూరమవుతుంది ఆన్ ఇలియట్. కాలాంతరాన తిరిగి కలుసుకుని ఒకరినొకరు కనుగొంటారు ఇద్దరూ. ఈ లోపున ఆన్ పరిణతి లోతుగా, మాధుర్యపూరితంగా ఉంటుంది. చెప్పుకోదగిన విషయం ఆమె ఒకప్పటి తన నిర్ణయానికి అమితంగా పశ్చాత్తాప పడకపోవటం. తన పట్ల తన ఒప్పుదల అది, జేన్ ఆస్టిన్ తాత్వికత కి ఇది అపురూపమైన ప్రారంభం. ఆయుర్దాయం ఉండిఉంటే వచ్చి ఉండగల ఆ తర్వాతి రచనలని కోల్పోయాము.

ఆమె పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన, ‘ ప్రైడ్ అండ్ ప్రజుడిస్ ‘. ఆనవలల వరసలో ఉత్తమమైనదని అనిపించదు నాకు. బహుశా నేను దాన్ని నా యౌవనం గడిచిపోయాక చదవటం ఒక కారణమయి ఉండవచ్చు. ఆ నవల మొదలుపెట్టిన సంప్రదాయం జార్జెటి హేయర్ విజయవంతం గా కొనసాగించారు. ఈ రోజుకీ వెలువడే రీజెన్సీ రొమాన్స్ లకి ఒరవడి ఆ నవల పెట్టినదే. జేన్ ఆస్టిన్ ని చేసుకునే అపార్థాలకూ ఆ నవలే కారణం ఆ విధంగా.

జోన్ ఐకన్ అనే ప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ కి వీరాభిమాని. చాలా సీక్వెల్ లు రాశారు. రకరకాలయిన ‘ మళ్లీ చెప్పే ‘ నవలలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.

ఇంగ్లీష్ లో ఎన్నోసార్లు సినిమాలుగా, టీ వీ సీరీస్ గా వస్తూనే ఉంటాయి ఆమె నవలలు.

మనకి లభ్యమయే పోర్ ట్రైట్ లో లాగానే ఆమె స్ఫురద్రూపిఅట. అవి వివేకం చిందిపోయే కవళికలు . బంధువులూ స్నేహితులూ అందరూ గుమిగూడి వినోదించేవేళ ఒక కనీకనబడని మూలలో కూర్చుని విప్పారిన కళ్లతో గమనించి రాసినట్లు ఉంటాయంటారు ఆమె రచనలు. ఆ సంపన్న గృహాలలోని సౌకర్యవంతమైన ఆసనాల మధ్య జన్మించిన ఆమె రచన దేశకాలాలని అధిగమిస్తూనే ఉంది.

జేన్ ఆస్టిన్ కి కాపీరైట్ లేదు, ఆన్ లైన్ లో ఉచితంగా దొరుకుతాయి ఆమె రచనలుఅన్నీ.. చదవనివారు ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చదువుతూ, డార్సీ ప్రపోజల్ ని ఎలిజబెత్ బెన్నెట్ అంగీకరించిందనే ఆనందాన్ని చెప్పుకోవటానికి , .మా అమ్మాయి స్నేహితురాలు ఏడాది క్రితం అర్థరాత్రి కాల్ చేసింది. ఆమెకి ఇంకొక రెండువందలేళ్లు ఢోకా లేదనిపించింది. .