కథన కుతూహలం

కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్

ఫిబ్రవరి-2014

అశాంతికి కారణమైన అహాన్ని చంపుకోవడానికి అన్నింటినీ త్యజించి ఏకాకులుగా జీవించే ఋషులు, మహర్షులు నడిచిన బాటలో నడవాలని మనం తపన పడతాం. అయితే ఇలా ఏకాంతవాసులుగా మారిన వారికంటే కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే వారికే ఎక్కువగా సత్యదర్శనం లభిస్తుందని తెలియచేస్తుంది స్టీఫన్ త్సయిక్ కథ (నవలిక) ‘విరాట్’.

అన్ని బంధాలకు దూరంగా తనను తాను పోషించుకుంటూ స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు. ఇతరులకు సేవ చేసేవాడు, తన మన: శ్శక్తిని, శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసి ఫలితాన్ని భగవంతుని చేతికిచ్చేవాడే నిజమైన స్వతుంత్రుడని విరాట్ పాత్ర ద్వారా మనకి విశదపరిచిన త్సయిక్ ఆస్ట్రియా వాసి. యూదు జాతీయుడు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. విరాట్ నవలిక దాదాపు 40 భాషల్లోకి అనువదించబడి లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.

తొలి పరిచయం లోనే విరాట్ మానవమాత్రుడుగా అనిపించడు. ప్రేమమూర్తి, దైవాంశ సంభూతుడు అనిపిస్తాడు. అయినా కూడా ఎన్నో సమస్యలతో సతమతమౌతాడు. అవన్నీ తనకు తానే తెచ్చిపెట్టుకున్నట్లు అనిపిస్తుంది కాని ఆలోచిస్తే అవన్నీ మానవుడు మాననీయుడు అవడానికి విదుల్చుకుంటున్న ఒక్కో పొర అనిపిస్తుంది. లోకంలో ప్రేమ, త్యాగం, మంచితనం ఉండాలంటూనే వాటికి మించినది కర్తవ్య నిర్వహణ అంటాడు విరాట్.

***

వీరవాఘ రాజ్యంలో జీవిస్తున్న విరాట్ గొప్ప యోధుడు, ప్రతిభాశాలి, పవిత్రుడు, శాంతస్వభావి. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు గారి బావమరిది రాజ్యాన్ని కాజేసి తాను రాజవ్వాలనే దుర్బుద్ధితో కొంతమంది సైనికులని తన వైపుకు తిప్పుకుని అర్థరాత్రి అకస్మాత్తుగా రాజుపై దండెత్తుతాడు. రాజు యోధుడైన విరాట్ సహాయాన్ని కోరగా రాత్రికి రాత్రే శత్రువుల మీదికి దూకి వాళ్ళను తెగ నరుకుతాడు విరాట్. చీకట్లో జరిగిన యుద్ధంలో తాను ఎవరెవరిని చంపాడో చూడాలని వెళ్ళిన విరాట్ కి తన అన్న శవం కనపడుతుంది. తన తల్లి కడుపున పుట్టిన అన్నని స్వయంగా తెగనరికానన్న క్షోభతో ఇక కత్తి పట్టనని ప్రమాణం చేస్తాడు. విరాట్ ని అర్థం చేసుకున్న రాజు కనీసం తన రాజ్యానికి న్యాయనిర్ణేతగా ఉండమని అభ్యర్థిస్తాడు. అంగీకరించిన విరాట్ ధర్మబద్ధంగా తీర్పులు ఇస్తూ గొప్ప న్యాయాధికారిగా కీర్తి గాంచుతాడు. అతను ఎవరికీ మరణశిక్ష విధించేవాడు కాదు.

ఒకరోజు కొంతమంది కొండప్రాంతపు వాళ్ళు ఒక యువకుడిని బంధించి తెచ్చి విరాట్ ముందు నిలబెడతారు. పదకొండు మందిని హత్య చేసిన అతన్ని శిక్షించమని కోరతారు. “నిజమేనా” అని అడిగిన విరాట్ ప్రశ్నకు ఆ యువకుడు సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. “సరైన సమాధానం ఇవ్వడం లేదు అయినా నిన్ను దయతలచి పదకొండు సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తున్నాను” అంటాడు విరాట్. అంతవరకూ మౌనంగా ఉన్న ఆ యువకుడు ఆవేశపడుతూ “ఇది దయ ఎలా అవుతుంది? ఒక్కసారిగా నన్ను చంపకుండా బంధించి జీవచ్ఛవంలా గడిపేట్లు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా చెరసాల జీవితం గడిపితే ఈ శిక్ష ఎంత అమానుషమో తెలుస్తుంది” అంటాడు.

మనసు వికలమైపోయిన విరాట్ ఒక నెలపాటు తాను జైలు శిక్ష అనుభవించి దానిలోని బాధను తెలుసుకోవాలనుకుంటాడు. నెలరోజులు అజ్ఞాతవాసంలోకి వెళుతున్నానని రాజుకి, కుటుంబ సభ్యులకి చెప్పి ఒక లేఖ రాసుకుని జైలుకి వెళతాడు. విరాట్ ని చూసి ఆశ్చర్యపోతున్న ఆ యువకుడితో “నువ్వు చెప్పిన మాటల్లో సత్యం ఉంది. తనకు అనుభవంలో లేని శిక్షలను ఇతరులకు వేయకూడదు. నెల రోజులు నేను నీకు బదులుగా శిక్ష అనుభవిస్తాను. నెల రోజుల తర్వాత వచ్చి ఈ లేఖను రాజుగారికి ఇవ్వు అయితే నువ్వు నెల తర్వాత వస్తానని మాట ఇవ్వు” అంటాడు. ఆ మాటలకు యువకుడు భోరున ఏడుస్తాడు పశ్చాత్తాపంతో.

చీకటిలో ఒంటరిగా మమతానురాగాలకు, రాగద్వేషాలాకు దూరంగా ఉన్న విరాట్ కు కొద్దిరోజుల్లోనే మనసు నిర్మలం అయిపోతుంది. జైలు జీవితం సంతోషంగా అనిపించసాగింది. కాని ఒకరోజు ‘నెల తర్వాత ఖైదీ రాకపోతే’ అన్న ఆలోచన – ఈ ఆలోచన కలగగానే అతనికి ఒక్కసారిగా భయం కలిగింది. మనశ్శాంతిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల తర్వాత రాజుతో ఆ యువకుడు వచ్చి విరాట్ ని విడిపిస్తాడు. ఈ సంఘటనతో విరాట్ కీర్తి రాజ్యమంతా ప్రాకుతుంది.

తన సింహాసనం ప్రక్కనే విరాట్ కి స్థానాన్ని ఇచ్చిన రాజుతో “న్యాయాధికారి పదవి నుండి నన్ను తప్పించండి. ఒకరి గురించి మరొకరికి న్యాయం చెప్పే అధికారం భగవంతుడికి తప్ప మరెవ్వరికీ లేదు. నేను ఇంట్లో ప్రశాంతంగా జీవించదలుచుకున్నాను” అని శలవు తీసుకుంటాడు.

ధ్యానం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మెలుగుతూ, దీనులకి సహాయం చేస్తూ సంతోషంగా గడుపుతున్న విరాట్ కు ఒకరోజు తన ఇంట్లో పనిచేస్తున్న బానిస ఆక్రందనలు వినపడతాయి. బానిస సరిగా పనిచేయలేదని రక్తం వచ్చేట్లు కొడుతున్న కొడుకుని పిలిచి బానిసని పంపించెయ్యమని చెప్తాడు. కొడుకు మండిపడుతూ “బానిసలు లేకపోతే మీ పనులు ఎవరు చేస్తారు? మీరు ఏనాడైనా పని చేశారా?” అని నిలదీస్తాడు. “ఇకనుండి మన పనులు మనమే చేసుకుందాం” అన్న విరాట్ కు “అది మా అభీష్టం కాదు. అలాంటప్పుడు మా అభీష్టాలపై ఆంక్షలు పెట్టి మమ్మల్ని మీరెలా శాసిస్తారు?” అన్నారు కొడుకులు అందరూ. కొడుకుల కళ్ళల్లోని దురహంకారాన్ని చూసిన విరాట్ “శాసించే వాడు ఇతరుల స్వాతంత్ర్యాన్ని అణచివేస్తాడని మీరు చెప్పింది నిజమే కాని ఆత్మని బానిసను చేసుకోవడం అన్నింటికన్నా నీచమైనది. శ్రమించేవాడి దగ్గరే భగవంతుడు ఉంటాడన్న విషయం నాకు అవగతమైంది” అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.

నిర్జన నదీ తీరంలో కుటీరం నిర్మించుకుని అడవిలో దొరికే పండ్లతో కడుపు నింపుకోసాగాడు. కొన్ని ఏళ్ళ తర్వాత ఒకరోజు ఓ వేటగాడు, కుటీరం ముందు మెరుస్తున్న శరీరంతో కూర్చుని పశుపష్యాదులతో మాట్లాడుతున్న విరాట్ ని చూసి పరుగు పరుగున వెళ్ళి అందరికీ వింతని తెలియచేస్తాడు. విరాట్ ని చూడటానికి జనం గుంపులుగా రాసాగారు. రాజుకి విషయం తెలిసి విరాట్ ని చూడటానికి వచ్చి “మీ జీవితం ద్వారా జ్ఞానులు ఎలా జీవించాలో తెలియచేస్తున్నారు” అన్నాడు.
“ఏకాంతవాసం చేసేవాడు తనకు తాను తప్ప ఇతరులకు బోధించలేడు. నేను చేస్తున్న పని వివేకమైనదో కాదో నాకు తెలియదు. నా జీవితాన్ని పాపాలకు దూరంగా గడుపుతున్నా- అంతే” అని అంటాడు. అతడు గొప్ప జ్ఞాని అన్న కీర్తి మళ్ళీ రాజ్యమంతా ప్రాకిపోతుంది.

కాలం గడిచే కొద్దీ పాపకర్మలకు పాశ్చాత్తాప పడేవాళ్ళు, జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు అడవికి వచ్చి విరాట్ కుటీరం ప్రక్కన కుటీరాలు నిర్మించుకోసాగారు. ఒకరోజు విరాట్ కుటీరం వదిలి అడవిలోకి వెళ్ళినపుడు ఒక సాధువు శవం పడి ఉండటం చూస్తాడు. అతనికి అంత్యక్రియలు జరిపించడానికి గ్రామస్తుల సహాయం తీసుకుందామని దాపున ఉన్న గ్రామానికి వెళతాడు. గ్రామంలో నడుస్తున్న విరాట్ తనవైపు నిప్పులు కక్కే కళ్ళతో ద్వేషంగా చూస్తున్న ఓ స్త్రీని గమనించి ఆశ్చర్యపోతాడు. ఆమె చూపులకు వణికిపోతాడు. ‘ఆమెకి నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నన్ను అలా చూస్తుంది? కనుక్కోవాలి’ అనుకుని ఆమె దగ్గరకి వెళ్ళి “నేను మనుషులకి దూరంగా బ్రతుకుతున్నాను. నేను నీకు ఏ హానీ చేయలేదు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావు?” అని అడుగుతాడు. “కుటుంబంతో హాయిగా గడుపుతూ మమ్మల్ని పోషిస్తున్న నా భర్తకు సంసార బంధనాలు మిధ్య అనే భ్రమ కల్పించావు. నా భర్త మమ్మల్ని గాలికి వదిలేసి నీ బాటన నడవడానికి వెళ్ళాడు. నా ముగ్గురు బిడ్డలు తిండిలేక మరణించాడు” అంటూ ఆరోజే చనిపోయిన మూడవ బిడ్డ శవాన్ని చూపిస్తుంది. నోట మాట రాక నిశ్చేష్టుడైన విరాట్ ని “ఒక పని చేసే ముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, పరిణామాలెలా ఉంటాయో అని ఆలోచించలేని వాడివి నువ్వేం మహాత్ముడివి?” అని నిలదీస్తుంది.

విరాట్ భయంతో కంపించిపోతాడు. మనిషి అపాదమస్తకం వణికిపోతాడు. అతనికి జ్ఞానోదయమయింది.

కుటీరాన్ని వదిలి రాజు దగ్గరకి వెళ్ళి ‘పని లేకుండా ఖాళీగా ఉండాలనుకోవడం లేదనీ, ఏదైనా సేవ చేసే అవకాశం కల్పించమనీ’ అంటాడు. ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వబోయిన రాజుతో ‘సేవలు చేయించుకునే వాడు స్వతంత్రుడు కాదు. సేవ చేసే వాడే నిజమైన స్వతంత్రుడు’ అన్న విరాట్ మాటలకు రాజు అహం దెబ్బ తింటుంది. విరాట్ కి పిచ్చెక్కిందేమో పరీక్షించాలనుకున్న రాజు అతన్ని కుక్కల సంరక్షకుడిగా నియమిస్తాడు. ఆ పనిని సంతోషంగా స్వీకరించిన విరాట్ ని చూసి ప్రజలందరూ అతనికి నిజంగానే పిచ్చెక్కిందనుకుంటారు రాజుతో సహా. కుటుంబ సభ్యులు అసహ్యించుకుని అతన్ని వదిలేస్తారు. అతను మరణించినపుడు అనాధ ప్రేతలను దహనం చేసేవాళ్ళు అతన్ని దహనం చేస్తారు. కుక్కలు మాత్రం రెండు రోజులు అన్నం తినకుండా రోదిస్తాయి.
ఇదీ క్లుప్తంగా కథ.

సంసార బంధనాలను వదిలి దూరంగా కార్యశూన్యుడుగా బ్రతికే వ్యక్తి కూడా తెలిసో తెలియకో ఏదో ఒక కర్మని ఆచరిస్తూనే ఉంటాడు. దానికతడు బాధ్యుడు అవుతాడన్న నిజాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించాడు త్సయిక్. తాత్త్విక ప్రసంగాలు ఇస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన జిడ్డు కృష్ణమూర్తి, కిళ్ళీ బడ్డి నడుపుకుంటూ జీవనం గడిపిన నిసర్గదత్త చెప్పిందీ ఇదే. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన భర్త బుద్దుడిని, ‘కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మోక్షాన్ని పొందలేమా – మోక్షసాధనం కోసం సంసారాన్ని త్యజించాలా?’ అని అడిగిన యశోధరకి బుద్దుడు చెప్పిన సమాధానమూ ఇదే.

ఈ నవలని తెలుగులోకి పొనుగోటి కృష్ణారెడ్డి గారు అనువదించారు. ఈ నవలికని కృష్ణారెడ్డిగారు తను పదో తరగతి చదివే రోజుల్లోనే చదివారట. తెలుగులోకి తీసుకురావాలనే తపనతో ఎవరితోనైనా అనువాదం చేయించాలనుకుని సాధ్యం కాక తనే ఆ పనికి పూనుకున్నారట. కృతకృత్యులయ్యారు. ఈ పుస్తకం కినిగే లో దొరుకుతుంది. లింకు: http://kinige.com/kbook.php?id=147&name=Virat 

*********