చర్చ

మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవుతుందా?

ఫిబ్రవరి-2014

కధలతో బంధం ఊహ తెలిసీ తెలియని వయసులోనే మొదలవుతుంది మనందరికీ. అమ్మ చెప్పే మాటలను ఊ ఊ అంటూ కధలుగా వింటాం. ఊహ తెలిసే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కథలు జీవితం నుంచే పుడతాయని అర్థం చేసుకుంటాం. అవును, సాహిత్యం జీవితాన్ని ప్రతిబిమంచిపనుడే కల కాలం పాఠకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. తొలి తెలుగు కథ “దిద్దు బాటు” నుంచీ ఈ నాటి అస్తిత్వ వాద కథా సాహిత్యం వరకూ కథలన్నీ జీవితాన్ని ప్రతి బింబించేవే! కొన్ని జీవితాల్ని దిద్దేవి కూడానూ!

కథా సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అది క్లుప్తత! ఎంతో పెద్ద విషయాన్ని చెప్పాల్సి వచ్చినా దాన్ని కొద్ది మాటల్లో క్లుప్తంగా రెండు మూడు పేజీల్లో ముగించాలి. నవలా సాహిత్యాన్ని కున్న సౌలభ్యం ఈ విషయంలో కథలకు లేదు.

ఎంతోమంది తెలుగు రచయితలు కథా సాహిత్యానికి తర తరలా నుంచీ కొత్త వన్నెలు అద్దుతూనే ఉన్నారు. కొడవటి గంటి కుటుంబరావు, శ్రీపాద,చాసో,రావి శాస్త్రి, భరాగో వంటి సీనియర్లే కాక కేవలం కథా సాహిత్యానికే పరిమితమైన ఎంతో మంది రచయితలూ జీవన సౌరభాన్ని, జీవిత మకరందాన్ని కథల్లో భద్రంగా పొందు పరిచి ఉంచారు. కథా సాహిత్య పరిపుష్టి కి నిర్మాతలు వాళ్ళే ! యువ, జ్యోతి,విజయ,రేపు,ప్రభవ మహిళ, వనిత,వంటి మాస పత్రికలు ఇపుడు ఉనికిలో లేక పోయినా ఎంతో ఉత్తమ కథా సాహిత్యాన్ని పాఠకులకు అందించాయి.ప్రతి ఇంటా ఈ పత్రికలు రాజ్యమేలుతుండేవి. వీటికి మహరాజ పోషకులు మధ్య తరగతి మహిళలే!

ఒకప్పుడు కథల్లో మధ్య తరగతి జీవితం అద్భుతంగా ప్రతిబింబించేది. కొ.కు కథల్లో చదువు సంస్కారం కలిగిన ఎన్నో పాత్రలు మధ్య తరగతి వే! నీతికి బంధాలకు కట్టుబడి , అపార్థాల మధ్య నలిగే జంటల్నీ, సమాజం విధించిన కట్టు బాట్లను తోసి రాజని మనావ సహజ బలహీనతల్నే అనుసరించే ఎన్నో పాత్రల్నీ, ఇంట్లో పెంపకానికి, బయట ఎదురుకొవలసి వచ్చిన పరిస్థితులకూ మధ్య సందిగ్ధంలో పడి ఏది కరెక్టో తేల్చుకోలేని మధ్య తరగతి మనుషులెందరో ఆయన కనిపిస్తాయి. ఉమ్మడి కుటుంబం లో నలిగే వాళ్ళు ఎందరో! ఒక సరస్వతి,ఒక రాధ, ఒక రంగయ్య తాత మనవడు,సూరి, రాజేశ్వరి, సరితా దేవి, సరోజ… వీళ్ళంతా ఫక్తు మధ్య తరగతి మనుషులే!

భరాగో , శ్రీపాద ల కథల నిండా మధ్య తరగతి విశ్వరూపం దాలుస్తుంది.

వీళ్ళే కాక అసంఖ్యాక కథా రచయితలు మధ్య తరగతి మంద హాసానికి కథల్లో పెద్ద పీటే వేశారు.

ఇవాళ కథలు రాస్తున్న వాళ్ళేమీ తక్కువ సంఖ్యలో లేరు. ఎన్నో కథలు. వైవిధ్యమైన కథలు. కథంటే ఇలాగే ఉండాలన్న నిర్వచనాల హద్దులు చెరిపేసి కొత్త పుంతలు తొక్కిన కథలు ఇవాళ వస్తున్నాయి.

అస్థిత్వ వాదాలు, సైన్స్ ఫిక్షన్, మాండలికాలు ప్రధానం గా సాగే ప్రాంతీయ వాద కథలు… నగరం జీవితాల్ని ఎలా కబళిస్తుందో ఒళ్లు జలదరించేలా ఆవిష్కరించే కథలు, ప్రవాసాంధ్ర జీవితాల కథలు… రోజూ పుట్టుకొస్తున్నాయి.

వీటిలో మధ్య తరగతి ఇంకా బతికి ఉందా? అదేదో ఒక కథలో ఉక్రోషపు కోపం వచ్చిన మిడిల్ క్లాసు సుబ్బారావొకడు “గుడిసెలూ జిందాబాద్, మేడలూ
జిందాబాద్, పెంకుటిళ్ళు డౌన్ డౌన్” అంటాడు.

జీవితపు బండిని చచ్చేలా లాగుతూ, చెంచాడు భవసాగరాలు అతికష్టం మీద ఈదుతున్నా, సునాయాంగా లాగేస్తున్నట్టు పోజు పెట్టే ఆ సుబ్బారావులు, వారి భార్యలు, .. ఇంకా కథల్లో బతికిఉన్నారా?

మధ్య తరగతికి ఇప్పుడు నిర్వచనం మారింది. ఒకప్పుడు సైకిల్ మధ్యతరగతి వాహనమైతే ఇవాళ కనీసం మారుతీ కారు ! కానీ.. మేకప్ మారినా, లోపల సంఘర్షణ అలాగే ఉంది. అది మధ్య తరగతి ఆస్థి!!

ఇవాళ వస్తున్న నగరీకరణ కథల్లో, ఇంకా అనేక రకాల కథల్లో ఈ మధ్య తరగతి ఇంకా తొంగి చూస్తూనే ఉందా?
అలాటి కథలు ఇంకా రావలసిన అవసరం ఉందా?

ఇవాళ జీవితంలో వేదననూ, నలిపివేతనూ, చిత్రించే అలాటి కథలు ఏ యే రచయితలు రాస్తున్నారు? మీ దృష్టికి వచ్చిన అలాటి కథలేమిటి? వాటిని మీరు స్వాగతిస్తారా? మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవడం కథా సాహిత్యాన్ని కృత్రిమంగా మార్చేస్తుందా?

పాఠకులుగా, రచయితలుగా .. మీరేమంటారు?