కవిత్వ ప్రపంచం

“నా గొంతులో నేనే ఇమడటం లేదు” – ఒక ప్రవాస వేదన

ఫిబ్రవరి-2014

1987 లో అనుకుంటా –  యింకా అప్పటికి లేలేత చిగురుటాకు లాంటి రిక్కల సహదేవరెడ్డి (విరసం అజ్ఞాత సభ్యుడూ, సిర్సిల్ల లో   విప్లవోద్యమ నాయకుడూ)  బూటకపు యెంకౌంటర్ లో పోలీసుల చేతిలో హత్య కాలేదు. విరసం సిటీ యూనిట్ తరపున ‘ప్రతిఘటనా సాహిత్యం’ అనే అంశం పై సభ నిర్వహించాం. అందులో ప్రముఖ కవి కె.శివారెడ్డి ‘నల్లటి మట్టికుండ’ అనే దీర్ఘకవితను అద్భుతంగా చదివి వినిపించారు. ముందు ఆయనే రాసారు అనుకున్నామంతా! చదవడం అయిపోయాక,  మేమంతా గొప్ప భావోద్విగ్న స్థితిలో కళ్ళు చెమర్చి ఉన్నప్పుడు, చెప్పారు శివారెడ్డి ఆ పద్యం గ్రీకు దేశపు మహాకవి యానిస్ రిట్సాస్ దని. అట్లా పరిచయమయ్యారు యానిస్ రిట్సాస్ మాకు! ఆ పద్యం ప్రజాసాహితిలో ప్రచురితమయ్యాక సహదేవరెడ్డి అది చదివి నాకో  ఉత్తరం పంపాడు (సెల్ ఫోన్ కాదు లాండ్ లైన్లు కూడా అందుబాటులో లేని కాలమది) “అన్నా ఈ పద్యం నన్ను తీవ్రంగా కదిలించింది, ప్రభావితం చేసింది – ఇంకా ఈ కవివే వేరే పద్యాలు కూడా పంపగలవు – పరిచయం చేసిన శివారెడ్డి సారుకు నా విప్లవాభివందనాలు చెప్పగలవు” – సరిగా యిట్లే కాదు కానీ యిదే అర్థం వచ్చేటట్టు రాసాడు. తర్వాత శివారెడ్డి సారు ని కల్సి సహదేవుడిట్లా రాసాడని చెప్పాను. “రిట్సాస్ వి మరికొన్ని పద్యాలు అనువాదం చేద్దాం  నాన్నా” అన్నారు సారు చెమర్చిన కళ్లతో! తర్వాత నెలకో రెన్నెళ్ళకో సహదేవుడు చంపబడ్డాడని తెల్సి హతాశులమయ్యామంతా! తీరని దుఃఖం లో మునిగిపోయాం. కిరణ్ , ప్రకాష్ , నేనూ కలిసి విరసం సిటీ యూనిట్ తరఫున సహదేవుని కోసం “రక్తచలన సంగీతం” తీసుకొచ్చాం!

1909 మే 1 న గ్రీస్ దేశం లో మోనెమ్వాసియా లో జన్మించిన యానిస్ రిట్సాస్ 1990 నవంబర్ 11 న తను చివరి శ్వాస దాకా కవిత్వానికీ , శ్రామిక వర్గ రాజకీయాలకూ అంకితమైన మహాకవి. 1931 లో కమ్యూనిస్తు పార్టీ లో చేరిన రిట్సాస్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గ్రీకు ప్రతిఘటన సైన్యంలో భాగమయ్యాడు. 1935 లో రష్యన్ మహాకవి మయకోవ్ స్కీ ప్రభావంతో పిరమిడ్స్ అనే పద్య సంకలనం ప్రచురించినా, 1936 లో ప్రచురించిన ‘యెపిటాఫ్ ‘ రిట్సాస్ కవితా ప్రయాణంలో ఒక మైలు రాయి. సాంప్రదాయ గ్రీకు సాహిత్యంతో తెగతెంపులు చేసుకుని ప్రజల భాషలో ప్రజల ఆకాంక్షలని ప్రకటించిన ‘యెపిటాఫ్ ‘ కు  ప్రపంచ సాహిత్యం లోనే  గొప్ప స్థానముంది. 1936 లో ఇయేనిస్ మెటాక్సాస్ మితవాద నియంతృత్వ ప్రభుత్వం గ్రీస్ లో అధికారం లోకి వచ్చి ‘యెపిటాఫ్ ‘ ను తగులబెట్టింది. తర్వాత కాలం లో 1941-45 ల్లో రిట్సాస్,  జాతీయ విమోచనా సంస్థ లో భాగమై పోరాడారు. 1950 లో ప్రముఖ గ్రీకు సంగీతకారుడు మైకిస్ థియోడరాకిస్ రిట్సాస్ ‘యెపిటాఫ్ ‘ కు స్వరం కట్టాడు. అప్పటినుండీ అది గ్రీకు వామపక్ష రాజకీయవాదులకు అది గీతమైంది (anthem).

జీవితాంతం వామపక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించిన రిట్సాస్ అనేక సార్లు నిర్బంధించబడ్డాడు. మితవాద నియంతృత్వ ప్రభుత్వాలచే జైళ్ళలో, నిర్బంధ శిబిరాల్లో   బంధించబడ్డాడు. ప్రవాసాల్లోకి నెట్టబడ్డాడు. అష్టకష్టాలూ పడ్డాడు. అయినా ఎక్కడా రాజీపడలేదు. తను నమ్మిన విశ్వాసాలనుండి దూరం కాలేడు.

రాజకీయంగా క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నా కవిత్వాన్ని యేనాడూ మర్చిపోలేదు. కవిత్వంలో అనేక ప్రయోగాలు చేసాడు. అధివాస్తవిక పదచిత్రాలతో, కలల్ని చిత్రిస్తూ, ఆకాంక్షలని, స్వేచ్చ ను గానం చేస్తూ కవిత్వం లో యెప్పుడూ కొత్త పుంతలు పోయాడు. ప్రయోగాలు చేసాడు. గ్రీకు దేశపు మహాకవిగా ప్రఖ్యాతి పొందాడు. కమ్యూనిస్టు కావడం వల్ల  9 సార్లు నోబెల్ బహుమతి పరిశీలనలో చివరి దాకా వచ్చి బహుమతి పొందలేదు. తనకి లెనిన్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు “నాకిది నోబెల్ కన్నా గొప్ప” అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఆయన రాజకీయ విశ్వాసాల కారణంగా ఆయన కవిత్వాన్ని ప్రభుత్వం అనేక సార్లు నిషేధించింది.

1948 ఆకురాలు కాలంలో,  లిమ్నోస్ దీవి పైన కోంటోపౌలి గ్రామంలో రాజకీయ ఖైదీల నిర్బంధ శిబిరంలో బందీగా ఉన్నప్పుడు, యానిస్ రిట్సాస్ తనకందుబాటులో ఉన్న ప్రతి కాగితమ్ముక్క మీద రోజుకో పద్యం రాసాడు. అట్లా బయటికొచ్చినవే యీ “ప్రవాస లేఖలు”. వీటిలో ఒక కొత్త రిట్సాస్ దర్శనమిస్తాడు మనకు. చాలా సులువైన భాషలో , సులువైన పదాలతో, చుట్టూ ఉన్న ప్రకృతీ, మనుషులూ ఆధారంగా, 150 మంది దాకా బంధించబడ్డ  నిర్బంధశిబిరం లో  సాగుతున్న తన జీవితం గురించి రాసిన పద్యాలివి, ఈ పద్యాలతో పాటు   కైటీ డ్రోసో (నా ప్రియమైన చిన్నారి కైటొలా అని సంబోధిస్తాడామెను) అనే అమ్మయికి  కవిత్వం రాయడం గురించి చాలా ఉత్తరాలు రాస్తాడు. “ నీ పద్యాల్లో చాలా మంచి పదచిత్రాలున్నాయి. కానీ పద్యాలు మాత్రం ప్రారంభమూ ముగింపూ లేకుండా ఉన్నాయి. వాటికి పరిపూర్ణత లేదు. నేనిట్లా అంటున్నానని మరోలా అనుకోవద్దు. కానీ నువ్వో గొప్ప కవివై చిరకాలం నిలిచే కవిత్వం రాయాలని నా కోరిక! పద్యానికి ప్రారంభం చాలా ముఖ్యం. పదచిత్రాలూ, ఉత్ప్రేక్షలూ కవిత్వ సామగ్రీ, సాధనాలు తప్ప అవే సర్వస్వం కాదు. కేవలం అలంకరణలే పద్యాలు కావు. శుష్క అలంకరణలని మానుకోవాలి. హృదయాన్ని కప్పి ఉంచకు. హృదయం లేక పోతే కవిత్వం లేదు. కేవలం హృదయమే కవిత్వం కాకపోయినా, దాన్ని  మాత్రం కోల్పోకు.   వ్యర్థపదాల ప్రలోభం నుండి నిన్ను నువ్వు కాపాడుకో! యెందుకంటే అది వాచాలతకు (verbosity)  దారి తీస్తుంది. అట్లా అని భావావేశాన్ని, ప్రాప్తకాలజ్ఞతను (spontaneity) శుష్కంగా రసరహితంగా, పదచిత్రాలు లేకుండా చెప్పకు. నీ కవిత్వ సామగ్రి, పదాలు,చిత్రాలు, ఉత్ప్రేక్షలు,  నీ భావావేశాన్ని పరిపుష్టం చేయాలి. దానికో పరిపూర్ణమైన అర్థాన్నీయాలి” అని రాసాడామెకు.

రిట్సాస్ తన ప్రవాసంలోని నిర్బంధ శిబిరం నుంది రాసిన పద్యాల్లో సులభమైన  పదాల్లో , పదచిత్రాల్లో గాఢమైన తన ఆవేదననూ, పరిస్థితినీ, ఒంటరి తనాన్ని అద్భుతంగా పలికిస్తాడు. పదాల పటాటోపాలు లేకుండా చాలా సులువుగా సూటిగా హృదయాన్ని తాకేటట్టు రాసిన ప్రవాస పద్యాల్లో మచ్చుకు ఒక రెండు :

యెన్నో ముళ్ళున్నాయిక్కడ –

నలుపువీ, జేగురు రంగువీ, బూడిద రంగువీ – యెన్నో

పగలంతా గుచ్చుకుంటాయి – రాత్రి కలల్నీ గాయపరుస్తాయి.

రాత్రులు ముళ్ళతీగల్ని దాటుకుని దూకి వెళుతూ
చీలికలు పీలికలైన  చీరకొంగుల్ని వదిలిపోతాయి.

ఒకప్పుడు మనకెంతో  అందంగా తోచిన పదాలు
పాత సందుక లో ముసలి బట్టల్లా వెలిసిపోతాయి

కిటికీ అద్దాల మీద సూర్యాస్తమయాలై మసిబారుతాయి

మనుషులు నడుస్తారిక్కడ

జేబుల్లో చేతులు పెట్టుకునో, లేదూ

యేదో ఈగను తరుముతున్నట్టు చేతులూపుతూనో -

ఈగలు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి

ఖాళీ గ్లాసుల అంచులమీదో,
లేదా లోపల మచ్చల మీదో
వాలడానికి –
అనంతంగా,  నిరంతరంగా
వాటిని నిరాకరించే నిర్ల్యక్ష్యాలని

పదే పదే సవాలు చేస్తూ ….

అక్టోబర్ 27, 1948

 

మనం

తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే

గాలి బలంగా మళ్ళీ మూసేస్తుంది

మూసివేత వెనుక , ఒక్కొక్కరమూ
తాళం చెవులకోసం వెతుక్కుంటాం

మహా ఐతే మనకు వున్నదల్లా ఒక నీటి కూజా
యెవరికీ ఇల్లంటూ లేకపోయినా,

యెట్లా మాట్లాడాలో తెలియట్లేదు నాకివాళ

ఉత్తమ పురుషలోనే మాట్లాడుతానింక -

మనల్ని మనమే కొట్టుకుంటే అది రెండింతలు చేదు!

ఈ పగటిపూట,  ఓ బస్సు వెళ్ళిపోయిందలా -
పొలాల్లో అపరిచితుడెవరో పలకరించాడు

నెనర్లందిద్దామనుకున్నా ఆయనకు – మాట్లాడలేక పోయా!

ముసిరిన మేఘాల్ని చూడడం మరిచిపోయాను

చుట్టూ బాదాము చెట్లన్నీ గోధుమ ఊదారంగుకి మారిపోయినై

బహుశా ఇక్కడ ఆకు రాలు కాలం  కాబోలు -

యెడతెరపి లేకుండా ఈగలు ఝమ్మంటున్నై
రాస్తున్న కాగితమ్మీద ముసురుకుని వాలుతూ ,,,,

యేమయింది –
ప్రకృతంతా  గోధుమ ఊదారంగులోకి మారితే?

మట్టియిళ్ళలో చీమలు వెచ్చగానే ఉంటాయి.
నా గొంతులోకి యింకా నేనే యిమడలేకపోతున్నా

నా పాదాలు సాగిపోతున్నై – బాగా చలిగా ఉందిక్కడ!

వాళ్ళు నన్నే గమనిస్తున్నారు సుదీర్ఘంగా
బహుశా యేదో తప్పుచేసి ఉంటాను.