కథ

ఒక ప్రయాణం..

మార్చి 2014

ఈరోజు చాలా ఆనందంగా ఉంది.. నా బాధ్యతను నేను సరిగా నిర్వహించానన్న ఆనందమో.. లేక నేను గెలిచానన్న గర్వమో అర్థం కాలేదు.. సెలవు పూర్తయ్యాక ఆఫీసుకు ఇదే మొదటిరోజు.. బస్సు ఎక్కాను.. మనసు ఏదో పాత జ్ఞాపకాలను తోడుతూ ఉంది…

జీవితమే ఒక ప్రయాణం.. ఈ మాట చాలాసార్లు వినుంటాం. కానీ ప్రయాణమే ఒక్కోసారి జీవితాన్ని రుచి చూపిస్తుంది. మన జీవిత కాలంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం.  అక్కడ ఎందరో పరిచయమూ అవుతారు.  కానీ అందరూ గుర్తుండరు. కొందరే ఎప్పటికీ గుర్తుండిపోతారు…! అందుకు పెద్ద సంఘటనలే అవసరమవకపోవచ్చు.. వాళ్లు చెప్పే ఒక మాట మనసును తాకడమో.. ఆలోచన రేకెత్తించడమో చేస్తాయి.. అవే వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి.

రశ్మి.. నా మేనకోడలు.. అదంటే నాకు చాలా ఇష్టం. దానికీ అంతే. .

వదినకు నొప్పులొస్తున్నాయని అన్నయ్య ఫోన్ చేస్తే వెళ్లాను. నేనే వెళ్లేసరికి ప్రసవమైంది. టవల్లో చుట్టిన రశ్మిని తీసుకొచ్చి నర్స్ నా చేతిలో పెట్టింది. అచ్చంగా చందమామను కోసుకొచ్చి నా చేతికందించినట్టుంది. ఇక ఆరోజు నుంచి ఆఫీసు సమయంలో తప్ప మిగతా సమయమంతా అది నా దగ్గరే ఉండేది.

దాని మొదటి పుట్టినరోజు, మొదటి రోజు స్కూలు, దాని మొదటి డాన్స్, అన్నీ నాకిప్పటికీ గుర్తే. స్కూలు నుంచి రాగానే ఆరోజు జరిగినవన్నీ నాకు చెప్పాల్సిందే. దానికి ఆరేళ్ల వయస్సులో అన్నయ్య, వదిన కారు ప్రమాదంలో చనిపోయారు. చిన్నప్పటి నుంచీ నా దగ్గరే పెరగడం వల్ల దానికి వాళ్లు లేరనే లోటు తెలియలేదు. దాని కోసం నేనూ పెళ్లి చేసుకోలేదు. దానికెందరు ఫ్రెండ్స్ ఉన్నా.. బెస్ట్ ఫ్రెండ్ ని మాత్రం నేనే. ఏ సలహా అయినా నన్నే అడుగుతుంది. ఆఖరుకు ఏ డ్రెస్సు కొనాలన్నా అత్తా.. నువ్వే సెలక్ట్ చేయవా..  అంటుంది.

రశ్మి మంచి స్టూడెంట్. ప్రతి క్లాసులోనూ ఫస్టే. దానికి పెద్ద బిజినెస్ వుమన్ కావాలని చిన్నప్పటి నుంచీ కోరిక. ఎంబీఏ చేయడానికి బెంగుళూరులో ఫ్రీ సీట్ వస్తే అక్కడ చేర్పించాను. మంచి కాలేజ్. వెళ్లడానికి తెగ మారాం చేసింది. దాన్ని ఒప్పించడానికి బ్రహ్మ రుద్రాదులు దిగొచ్చినట్లైంది.

చేర్పించడానికి వెళ్లి తనతోపాటు రెండు రోజులుండి వచ్చాను. నేను ఊరికి బయలుదేరే రోజు ఒకటే ఏడుపు. నాకూ దిగులుగా ఉన్నా.. దాని భవిష్యత్తు కోసం దిగమింగుకోక తప్పలేదు.

ఇంటికొచ్చానన్న మాటే కానీ.. మనసు మనసులో లేదు. నా దిగులు చూసి శాంతి రోజూ కొంతసేపు నాతో గడిపి వెళ్లేది. శాంతి ఆఫీసులో కొలీగ్. 25 సంవత్సరాలుగా కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. మంచి స్నేహితురాలు కూడా.

రోజూ ఎనిమిదింటికి రశ్మి ఫోన్ చేసేది. ఆరోజు ఏం చేసిందో.. ఎవరేమన్నారో మొత్తం చెప్పేది. నేనూ వారం వారం వెళ్లి చూసొచ్చేదాన్ని కొన్ని రోజుల తరువాత వెళ్లడం కుదరలేదు. ఫోన్ మాత్రం చేస్తుండేదాన్ని. తన రూంమేట్ శ్రద్ధ కూడా తెలుగమ్మాయి కావడంతో రశ్మి తను కూడా మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పడూ తనతో కూడా మాట్లాడేదాన్ని.

ఇలా చూస్తుండగానే మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. సెలవల్లో తను వస్తుందని తెగ సంబర పడ్డాను. కానీ టూర్ వెళ్తున్నా.. ఇంటికి రాలేనని చెప్పింది. కొంచెం నిరాశ చెందినా సర్ది చెప్పుకున్నాను.

ఒకరోజు రశ్మికి ఫోన్ చేస్తే.. ఫోన్ కలవడం లేదు. ఎన్నిసార్లు చేసినా కలవడం లేదు. శ్రద్ధకు ఫోన్ చేస్తే తను ఇంటిదగ్గర ఉన్నానంది. టూర్ విషయం అడిగితే అసలు విషయం బయట పెట్టింది. దాంతో నాకు కళ్లు తిరిగినట్టయ్యాయి.

‘ఆంటీ.. రశ్మి సుమన్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది. తనతో కలిసి వాళ్ల ఊరెళ్లింది. అందుకే ఇంటికి రాలేదు. మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టమంది. కానీ మీకు చెప్పకుండా ఉండలేక పోయాను.. సారీ ఆంటీ’ అని చెప్పింది.

నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. రశ్మి నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచి పెట్టిందని కన్నీళ్లు ఆగలేదు.

శ్రద్ధ, రశ్మి గొడవ పడుంటారు. అందుకే తను అబద్ధం చెప్పుంటుంది. రశ్మి నాకు అబద్ధం ఎందుకు చెబుతుంది? అని మళ్లీ కాల్ చేశాను. తను ‘లేదాంటీ.. నేను నిజమే చెబుతున్నాను. ఈ మధ్య తను మీతో ఎక్కువగా మాట్లాడక పోవడానికీ ఇదే కారణం’అని చెప్పింది.

రశ్మి మీద ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘ఇన్ని రోజులు కన్నకూతురిలా పెంచుకుంటే ఇది ఎంత పని చేసింది? డ్రెస్సులు, కాలేజీల విషయంలో నా సలహా కావాలి  కానీ ప్రేమ, అతనితో కలిసి ఊరెళ్లడానికి మాత్రం నా అనుమతి తీసుకోవాలనిపించలేదా?

ఈ విషయం తెలిస్తే చుట్టుపక్కల వాళ్లేమనుకుంటారు? నా పెంపకంలో లోపం ఉందనుకోరా?

ఆఫీసులో అందరికీ నా మొహం ఎలా చూపించాలి? వెంటనే దానికి పెళ్లి చేసేస్తేనో?’

రాత్రంతా ఇవే ఆలోచనలు…

తన దగ్గరికి వెళ్దామనుకున్నాను. కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

ఆరోజు సాయంత్రం రశ్మి దగ్గరి నుంచి కాల్ వచ్చింది. ‘ఫోన్ పనిచేయట్లేదత్తా.. అందుకే  కాల్ చేయలేదు. మళ్లీ నువ్వు కంగారు పడతావని వేరే ఊరొచ్చి మరీ కాల్ చేస్తున్నాను.’ అని ఏదో మాట్లాడుతోంది. నేను మాత్రం ఊ కొడుతూ విన్నా..

‘ఏంటి అత్తా.. సరిగా మాట్లాడడం లేదు.. ఒంట్లో బాలేదా?.. నా మీద బెంగ పెట్టుకున్నావా’

‘లేదు. నువ్వు బెంగుళూరెప్పడొస్తున్నావ్? నేను నిన్ను కలవడానికి వస్తున్నా..’

‘ఇంకో రెండు రోజులు పడుతుంది.’

‘సరే.. ఉంటా..’ అని పెట్టేశాను. ఇప్పటికీ నిజం చెప్పలేదని కోపం.

మరుసటి రోజు యథావిధిగా ఆఫీసుకు వెళ్తున్నాను.  ఇంటి నుంచి ఆఫీసుకు నాకు 1.30 గంట ప్రయాణం. బస్సు ఎక్కి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నా..

  పల్లెటూరికి చెందిన తల్లీ కూతుళ్లు బస్సెక్కారు (ఊరి పేరు సరిగా గుర్తులేదు). పల్లెటూరు అనగానే సినిమాటిక్ గా ఏంలేదు. తల్లి పట్టులా కనిపించే చీర (బహుశా బెనారస్ వంటిదనుకుంటా) , అమ్మాయి మామూలుగానే చూడీదార్ లో.. తలకు నూనె, చామనఛాయకు మనం అందంగా అని భావించే రంగుకు మధ్యలో ఉంది.  తల్లి ముఖం బాధగా, అమ్మాయి నీరసంగా ఉంది. (మొదట ఎండవల్ల అదోలా ఉందనుకున్నా..బాధ అని చివరికి అర్థమైంది).

బస్సు బాగా నిండుగా ఏం లేదు కానీ సీట్లు మాత్రం నిండిపోయాయి. తల్లి అమ్మాయికి బాలేదని సీటులో కొంచెం స్థలం ఇవ్వమని అడుగుతున్నపుడు వాళ్లను చూశాను. నిజంగానే ఆ అమ్మాయి ఒక్క కుదుపుకే కింద పడేలా ఉంది. కానీ సీటులో కూర్చున్నావిడ కొంచెం ఘాటుగా సమాధానమిచ్చేసరికి పాపం ఇద్దరూ బాధపడ్డారు. నేను లేచి సీటు ఇస్తుంటే.. నా పక్కన కూర్చున్నావిడ నేను దిగుతున్నాను మీరు కూర్చోండి అని లేచి సీటిచ్చింది. నేను కొంచెం సర్దుకుని కూర్చునేసరికి ముగ్గురికీ సీటు సరిపోయింది.

అమ్మాయి మధ్యలో కూర్చుని వాళ్ల అమ్మ ఒడిలో పడుకుంది. మామూలుగా వాళ్ల వైపుకి చూస్తే.. ఆ అమ్మాయి కళ్ల కొనల నుంచి నీరు కారుతోంది. కానీ ఏడుస్తున్నట్టు మాత్రం లేదు (బహుశా ఏడ్చే ఓపిక లేకపోయుండొచ్చు). చిన్నగా వాళ్ల అమ్మని కదిలించాను. ఏమైంది మీ అమ్మాయికీ జ్వరమా అని?

ఆమె ఏం మాట్లాడలేదు. చిన్నగా నవ్వింది. ఏం చేయాలో తోచక ఏంలేదూ.. ఆమె కళ్లల్లో నుంచి నీరు కారుతుంటే అడిగాను అని చెప్పాను సంజాయిషీగా.

అప్పుడామె ‘ఏంది బిడ్డా మళ్లీ ఏడుస్తున్నవా? ఇగ చాలు బిడ్డా.. నీకు నేనున్న గదా.. నువ్వు గిట్లయిపోతే.. ఎట్ల జెప్పు? అంది. ఈసారి ఆమె కళ్లలోనూ నీళ్లు కారాయి.

నాకేం చేయాలో తోచలేదు. కాసేపు మాట్లాడకుండా కూర్చున్నాను. తరువాత ఆమే మొదలు పెట్టింది. ‘ఏం లేదు బిడ్డా.. నాకు ఇద్దరు పిల్లలు కొడుకు చిన్నపుడే పోయిండు. ఇది రెండోది. పెళ్లి ఆగిపోయింది’ అంది.

ఎందుకు? ఏమైంది.. అన్నాన్నేను.

‘మా ఆడబిడ్డకు ఇద్దరు బిడ్డలు.. ఒక కొడుకు. వాడికిచ్చి చేద్దామని చిన్నపుడే అనుకున్నం. వాళ్లేమో 6 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ల సచ్చిన్రు. ఇద్దరు ఆడబిడ్డల్ని మా బావగారి కొడుకులే చేసుకుండ్రు. ఈన్ని సూసుకునేకీ, సదువు జెప్పించనీకి ఎవరికీ ధేర్నం సరిపోలేదు. మాకు మూడెకరాల పొలముంది. వడ్లు పండిస్తం.. కూలీ జేసుకుంటం. ఎట్నాగు సేసుకునేది నా బిడ్డనే కదాని నా పెనిమిటి గీడ హాస్టళ్ల ఉంచి మరీ ఆనికి సదువు జెప్పించిండు. ఆడూ బా సదువుతడు. మంచిగ  కంపూటర్స్  సదివిండు. ఇద్దరికీ సదువు జెప్పిచ్చుడు కష్టమై దీన్ని ఇంటర్ సదివినాక మాన్పించినం. ఇప్పుడాడికి మంచి ఉద్యోగమొచ్చింది. సేతి నిండా సంపాదిత్తున్నడు. ఆడపిల్లని ఇంట్ల ఎన్ని రోజులని ఉంచుకుంటం. పెళ్లిజేసి బరువు దింపుకుందమనుకుని నా పెనిమిటిని

అడుగమని పంపిన. ఆయన కాళ్లుజేతులు ఊపుకుంటొచ్చిండు. గాడు దీన్ని జేసుకోనంటున్నడే అని ఏడ్వబట్టె. నాకు ఏం సమజు కాక నేను మాట్లడతా అని గీడకొచ్చిన. నేనూ వస్తా అంటే.. దీన్నీ వెంటేసుకొచ్చిన. ’ అని చెప్పింది.

‘అతను ఇప్పుడు చేసుకోనంటున్నాడా ’ అని అడిగా.

‘గంతే కదమ్మా.. జేసుకుంటనంటే మాకెందుకుంటదీ ఏడుపు’ అని సమాధానమిచ్చింది.

‘ ఎందుకు చేసుకోనంటున్నాడు?’ అని అడిగాను.

‘ఆడిక్కడ వానితో పన్జేసే పిల్లను పేమిత్తాండంట. ఆ పిల్ల దీనికంటే అందంగుంటదంట. నీ కూతురు నల్లగుంటది. అయినా ఇంటర్ సదివిన దాన్ని నేనెట్ల జేసుకుంటననుకున్నవత్తా అన్నడు. నిన్ను సదివించనీకే దీన్ని మాన్పించినం కదరా అంటే.. నన్ను సదివించమని నేనడిగిన్నా మిమ్మల్ని? అయినా మీరు సదివించదానికి అయిన డబ్బు తిరిగిచ్చేస్తా.. నేను మాత్రం దీన్ని సచ్చినా జేసుకోను ఏం చేసుకుంటరో చేసుకోండి.. అని మొకం మీదనే జెప్పిండు’ అని చెప్పింది.

‘మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా’ అన్నాను.

‘ఏమనిస్తం బిడ్డా.. ఆడు పేమిత్తన్నా అని మాయమాటలు జెప్పలే. చేసుకుంటా అనీ చెప్పలే.. మేమే వీళ్ల చిన్నపుడు అనుకున్న మాటలు నిజమవుతాయని ఆశపడి వాడ్ని చదివిచ్చినం. వాడూ అవసరమున్నంత వరకు మంచిగ మాట్లాడి ఇప్పడు మీకు చేతనైంది చేసుకోమంటున్నడు.. తప్పంతా మా దగ్గర పెట్టుకుని గిప్పడు వాన్నంటే.. వాడు మాత్రం ఎందుకూరుకుంటడు బిడ్డ.’ అంది.

‘మరిప్పుడేం చేద్దామనుకుంటున్నారు?’

‘చేసేదేముంది బిడ్డా..! వీళ్ల నాయన ఎవరికోకరికిచ్చి పెళ్లి సేద్దామంటున్నడు. నాకిష్టం లేదు బిడ్డ.. అప్పుడే నా బిడ్డ సదువుకుంటా అన్నప్పుడే ఆ పడే కస్టమేదో ఇంకొంత పడుంటే ఈ దినమొచ్చేటిది కాదు. నా కూతురు మనసు సెడింది. గిప్పుడు పరువు పోద్దని ఎవనికో ఒకనికిచ్చి చేసి.. వాడు సరైనోడు కాకపోతే నా కూతురు గొంతు కోసినట్టవుతది. నేను అట్ల కానివ్వ.. నా బిడ్డని సదివిత్త.. తరువాత దానికి నచ్చినోనితో  పెళ్లి జేత్త. మా ఆయనని నేనొప్పిత్త..’ అని చెప్పింది.

‘నా సవంతి కంటే నాకింకేం వద్దు బిడ్డా..  అది నిండుగ నవ్వుతుంటే.. నా కదే సాలు.. ఎంత కస్టమైనా ఇట్టే మరసిపోతా.. ఏం బిడ్డా.. నేనేమైన తప్పుగా సోంచాయించిన్నా…?’ అని ఆమే అడిగింది.

నేను చిన్నగా నవ్వి.. లేదు.. అని చెప్పా..

స్రవంతి.. ఇంత బాగా చూసుకునే వాళ్లుంటే.. నిన్ను ప్రేమించని అతని గురించి నువ్వు బాధపడి, మీ అమ్మని బాధ పెట్టడమెందుకు? బాగా చదువుకో.. అని చెప్పాను. (నాకు తెలిసి నేను ఈ మాటలు చెప్పాల్సిన పని కూడా లేదనిపించింది. ఆతర్వాత.)

పల్లెటూరు.. పైగా చదువుకోలేదు..  అయినా కూలీ చేసుకునే ఆమె ఎంతగా ఆలోచించింది. ఎంతమంది బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఇంతలా ఆలోచిస్తున్నారు. తమ పిల్లల ఇష్టాలను పట్టించుకుంటున్నారు. ఒక చదువు లేని సాధారణ మహిళ ఆలోచన నిజంగా నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. సిటీల్లో కంటే పల్లెల్లోనే పరువు అనే జాఢ్యం ఎక్కువ అయినా.. ఆమె తన కూతురి కంటే ఏదీ ఎక్కువ కాదనిచెప్పింది. చివరగా ఆమె చెప్పిన మాటలు ఇంకా బాగా నచ్చాయి.

నా మనసు కొంత కుదుటపడింది. ఆఫీసుకు 4 రోజులు సెలవు పెట్టి, బెంగుళూరుకు వెళ్లాను. ఎప్పటిలాగానే రశ్మి నవ్వుతూ ఎదురొచ్చింది. చూసి చాలా రోజులయ్యేసరికి పట్టుకుని ఏడ్చింది. తను చూసిన వాటి గురించి తెగ మాట్లాడేస్తోంది. నేను నవ్వుతూ వింటున్నా..

చివరికి తను ప్రేమిస్తున్న విషయాన్నీ చెప్పింది. నేను నవ్వుతూ నాకు తెలుసన్నా..

‘నీకిష్టం లేకపోతే చేసుకోను అత్తా.. ’

‘మరి తనతో కలిసి వాళ్ల ఊరెందుకెళ్లినట్టో..?’ అన్నాన్నేను.

‘నేను అందుకు వెళ్లలేదత్తా.. నీకు తెలుసుగా నాకు బిజినెస్ అంటే ఎంత ఆసక్తో.. వాటి వివరాల కోసం వెళ్లాను.’

‘ మరి నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు?’

‘తరువాత చెబుదాం లే.. అనీ..’ అంటూ నసిగింది.

‘కానీ నేను చదువును నిర్లక్ష్యం చేయలేదు.. ఇది నిజం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

‘నేను నిన్ను తీసుకెళ్లడానికి రాలేదు రశ్మీ.. నువ్వు మొదట నాకు చెప్పలేదన్న కోపం వచ్చింది. కానీ, ఇప్పుడు లేదు. నాకు ఈ విషయం తెలియగానే అతని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడే తనని కలిసి మాట్లాడాను. అతనితో మాట్లాడాక నాకూ అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడింది.  ఇక పెళ్లి విషయానికొస్తే.. మీరిద్దరూ సెటిల్ అయ్యాకే..’ అన్నాను.

సంతోషంతో నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.

అదే నా సంతోషానికి కారణం. నాకిప్పుడు గెలిచానన్న భావన. కాదు కాదు.. ఒక పల్లెటూరి మహిళ నాకో మార్గాన్ని చూపింది. సగటు తల్లిదండ్రుల్లా కాకుండా కాపాడింది.!

*******



32 Responses to ఒక ప్రయాణం..

  1. March 4, 2014 at 1:25 am

    people we can read and write are not the educated actually , the people who are having human
    values and who can think on behalf of other side and most impotent thing is who can think
    on behalf of losers are the educated. so we should not call ”palleturu vaallu’

  2. March 4, 2014 at 1:33 am

    బస్సు లో ప్రయాణం చేస్తున్న తల్లి పల్లెటూరు ది అని తానూ చదువుకున్న దాన్ని అని అనుకోవడం తనకు విషయాలు
    బాగా తెలుసు , ఆమెకు ఏమీ తెలియదు అని అనుకోవడం మన చదువులు మనకు నేర్పిస్తున్న అవగాహన అదన్న
    మాట.

    • Anu
      March 6, 2014 at 8:20 pm

      pentaiah గారూ.. మీ స్పందనకు కృతజ్ఞతలు.. అంతేకదండీ.. ప్రస్తుతం అందరూ కాకపోయినా దాదాపుగా చాలామంది భావన అదే కదా..

  3. Venkata Siva Kumar Kaku
    March 5, 2014 at 12:03 pm

    chaala bagundi

    • Anu
      March 6, 2014 at 8:21 pm

      Venkata Siva Kumar Kaku గారూ థాంక్యూ….!

  4. March 8, 2014 at 8:59 pm

    బాగుంది

    • Anu
      March 9, 2014 at 2:05 pm

      dr.kasula linga reddy గారూ థాంక్యూ..

  5. Nanda Kishore
    March 13, 2014 at 12:30 am

    రెండు సంఘటనల మధ్య సంవిధానం మరి కాస్త స్పష్టంగా చెప్పడానికి ఆస్కారం ఉన్నట్టు అనిపించింది. బాగుంది, ఇంకా బాగా రక్తి కట్టించగల భావోద్వేగం కలిగిన కధ, ముఖ్యంగా ప్రధాన పాత్ర పడిన సంఘర్షణ చదువరి మదిలో ముద్ర వేయకుండానే మీరు త్వరగా ముందుకు తీసుకువెళ్లినట్టు అనిపించింది. ఈ చిన్న సద్విమర్శ మినహా మిగాతా కధ చాలా బాగా నడిపారు.

    • Anu
      March 13, 2014 at 3:46 pm

      Nanda Kishore గారూ.. నా కథను శ్రద్ధగా చదివి, మీ విలువైన సూచనలు అందించినందుకు ధన్యవాదాలు! ఇకపై రాసే కథల్లో మీ సూచనలను దృష్టిలో పెట్టుకుంటాను.

  6. buchireddy gangula
    March 14, 2014 at 3:49 am

    బాగుంది –అనుగారు
    —————–బుచ్చిరెడ్డి గంగుల

    • Anu
      March 14, 2014 at 2:20 pm

      థాంక్యూ… బుచ్చిరెడ్డి గంగుల గారూ….!

  7. April 4, 2014 at 7:51 pm

    అనుషా ..
    నీ కథ ఇప్పుడే చదివాను. బాగా రాసావు , నిజం. మనకి కొన్నిప్రయాణాలు అనుకోని ములుపులు కి కారణం అవుతాయి, ఎవరి నిన్చైనా ,నేర్చుకోవచ్చుజీవన పాఠాలు , మన జీవనప్రయాణం లో ..
    ఇంకా ఎన్నో మంచికథలు నీ కలంనుంచి రావాలనికొరుకుంటూ

    వసంత లక్ష్మి , పి

    • anu
      April 8, 2014 at 3:46 pm

      థాంక్యూ వసంత లక్ష్మి గారూ… మీ అభిప్రాయానికీ.. ఆకాంక్షకూ..

  8. Sumesh
    April 7, 2014 at 3:58 pm

    గుడ్ వన్ … చాలా బాగుంది

    • anu
      April 8, 2014 at 3:47 pm

      థాంక్యూ సుమేష్ గారూ…

  9. Sridhar Reddy
    April 18, 2014 at 12:48 pm

    గుడ్ వన్ …

    • anu
      April 29, 2014 at 3:31 pm

      థాంక్యూ శ్రీధర్ రెడ్డి గారూ..

  10. Praveenkumar
    May 3, 2014 at 2:03 pm

    కథ చాలా భాగుంది,1).ఇప్పుడున్న సమాజంలో మన ఆలోచన ధోరణి చదువుకున్న వారికి ,చదువుకొని వారికి విషయ పరిజ్ఞానంలో తేడా ఉండచ్చు కాని జీవితం అవగాహనన మీద కాదు,2).నిజ జీవితంలో ప్రయాణాలు, పండగలు వంటి కార్యక్రమాల్లో జరిగే చర్చల్లో
    జీవితానికి సంబంధించి ఎన్నో నగ్న సత్యాలు తెలుస్తాయి.

    • anu
      May 10, 2014 at 6:40 pm

      థాంక్యూ ప్రవీణ్ కుమార్ గారూ.. నిజానికి జీవితం మీద అవగాహన చదువుకున్న వారికంటే చదువుకోని వారికే ఇంకా ఎక్కువగా ఉంటుందేమో!

  11. Venkatesh Veeramalla
    May 4, 2014 at 12:08 pm

    కథ చాల బాగుంది ..అను మేడం గారు….నిజంగా పల్లెటూరి వారు ఇలాగే ఉంట్టారు కదా..,చదువుకోక పోయీన బ్రతకడం తెలిసిన వారు వారు కదా మేడం…..,

    • anu
      May 10, 2014 at 6:41 pm

      హా.. నిజమే..

      థాంక్యూ వెంకటేష్ వీరమల్ల గారూ..

  12. suresh
    May 10, 2014 at 1:36 pm

    బాగుంది. నిజానికి కథ కన్నా దానిని అల్లిన విదానము నచ్చింది. భవిష్యత్తు లో మంచి రచయిత కాగలవు అనిపిస్తుంది. ఒక స్నేహితునిగా ఇది న అభిలాష .

    • anu
      May 10, 2014 at 6:42 pm

      మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు.. సురేష్ గారూ..

      • suresh
        May 10, 2014 at 9:36 pm

        నేను కూడా ఒక కథను ఈ పత్రికలో పెట్టధలుచుకున్నాను. ఏమైనా సలహా మీ వద్ద నుండి పొందవచ్చ? ఇతరులకు కూడా స్థానం ఉందా ?

        • anu
          May 11, 2014 at 3:18 pm

          నేనూ ‘ఇతరులు’ కేటగిరీనే.. మీ కథను వాకిలికి నేరుగానే పంపించవచ్చు.

          http://vaakili.com/patrika/?page_id=27 లింక్ లోని సూచనలను చూడండి.

          • suresh
            May 12, 2014 at 3:06 pm

            నా మది లో ఉన్న ఒక వృత్తాంతమును ఒక కథ లా మళిచి వ్రాయుటకు బహుశా ఈ వాకిలి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను……మీ సహాయమునకు నా కృతజ్ఞతలు.

  13. శారద సింగిరెడ్డి
    May 15, 2014 at 2:03 am

    చక్కగా రాసారు, ముగించే వరకు ఆపాలని అనిపించ లేదు

    • anu
      May 23, 2014 at 6:05 pm

      థాంక్యూ.. శారద సింగిరెడ్డి గారూ..

  14. VASUKATAM
    August 23, 2014 at 6:17 pm

    మీ కథ చాల బాగుంది మీ నుంచి మరిన్ని కథలు ఆశిస్తున్నా…………….

  15. Veera Reddy Kesari
    July 27, 2015 at 3:26 pm

    అనూష గారు మీ కధ చాలా బావుంది .. తల్లి తండ్రులు పిల్లలను మరి గారాబంగ పెంచిన ఇలాంటి ప్రొబ్లెమ్స్ వస్తాయి.. !! #VeeraReddyKesari

  16. April 7, 2017 at 8:24 pm

    “పరువు, జనాలు ఏమనుకుంటారో” ఇవన్నీ సగటు మనిషి జీవితంలో పెద్ద రోల్ ప్లే చేసేస్తాయి. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఇవన్నీ మన జీవితాల్ని వెనక్కి లాగటమే కాని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు పనికిరావని అర్థమవుతుంది.

    పెద్దగా క్లాసులు ఇవ్వకుండా చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్‌గా చెప్పారు.

  17. VOOLAPALLI,S.MURTY.
    April 10, 2017 at 10:48 pm

    కథ లో కొత్తదనం ఉంది .దెబ్బలాటలు ఏడుపులు హీరోఇజంస్ లేకుండా సూటిగా కథ చెప్పిన విధానం చాలా బాగుంది .

Leave a Reply to Veera Reddy Kesari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)