కథ

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

మార్చి 2014

ఆది విజయవాడ రైల్వే స్టేషన్ , ప్ల్యాట్‌ఫార్మ్ రెండు పై బెంగుళూరు వెళ్లే ట్రైన్ కోసం ఫ్యామిలీ తో సహా ఎదురు చూస్తూ వున్నాడు అనంతు. ఇంకా కొంచెం మనీ తీసి కొడుకు పాకెట్ లో పెట్టాడు తండ్రి తిరుమల రావు. “నా దగ్గర వున్నది సరిపోతుంది కదా” అన్నాడు తండ్రి తో. “కొత్త ఉద్యోగం, కొత్త ఊరు,కొత్త మనుషులు, అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు కదా, వుంచుకో ” అంది ఆప్యాయం గా తల్లి సులోచన. అనంతు ఈ సంవత్సరమే సిద్దార్ద ఇంజినియరింగ్ కాలేజ్ లో ఇంజినియరింగ్ పూర్తి చేసాడు. క్యాంపస్ సెలెక్షన్ లో బెంగుళూరు లో ఉన్న ఒక మల్టీ నేషన్ కంపనీ లో జాబ్ వచ్చింది.

ఇదే మొదటి సారి అనంతు విజయవాడ దాటి బయట ఊరు వెళ్ళడం, బుగ్గ పట్టుకొని “వేళ కి భోజనం చెయ్యాలి, సినిమా లు ఎక్కువ చూడకు, గొడవలు గట్రా జోలి కి అస్సలే వెళ్లొద్దు, సగం రేతిరి దాకా టీవీ చూస్తూ కూర్చోవద్దు” అంటూ బామ్మ పాఠం చెపుతోంది. ఎప్పుడూ వ్యతిరేకం గా ఊగే తల ఈ సారి మాత్రం చాలా శ్రద్ద గా సరే అంది బామ్మ చెప్పిన ప్రతీ మాట కి. ఇంతలో “మీరు మాట్లడినివి చాలు, ఇప్పుడు నా మాటలు వినండి” అంటూ రైల్వే అనౌన్స్మెంట్, అక్కడ వున్న ధ్వని కాలుష్యం లో అది కూడా కలిసిపోతూ.

అందరు బ్యాగ్ లు భుజాన వేసుకొని సిద్దం అవుతూ వున్నారు. నా చెయ్యి పట్టుకొని ఏడ్చినంత పని చేస్తోంది చెల్లెలు దేవి, ఇక రోజూ నేను ఎవరి తో ఫైట్ చెయ్యాలి అని. అక్కడ వున్న శబ్ధ కాలుష్యాన్ని కూడా చిన్నది చేసేలా,అందరినీ బయపెడుతూ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చేసింది బెంగుళూరు వెళ్ళే ట్రైన్. ఫ్యామిలీ మొత్తం ఒక్క సారి ప్రేమ తో చుట్టేసింది, సెంటిమెంట్ ని సిమెంట్ లా గుండె లో గట్టి గా దాచుకొని, అందరికి టాటా బై బై లు చెప్పి , కొత్త ఉద్యోగం నింపిన ఉత్సాహం తో ట్రైన్ ఎక్కేసాడు .

“ట్రైన్ దొంగలు ఎక్కువ గా వుంటారు, సామాను జాగ్రత్త అనంతు” అని కిటికీ అవతల నుంచి బామ్మ వేసిన కేక తో బ్యాగ్స్ అన్ని జాగ్రత్త గా లోపల తోసేసి, చాలా సంతోషం గా కిటికీ పక్కన కూర్చోన్న తనకు, కృష్ణా నది పై నుంచి వీస్తున్న చల్ల గాలి ఎంతో హాయి గా బై బై చెపుతున్నట్టు అనిపించింది. ప్రకాశం బ్యారేజి దాటి దూరం గా వెళ్తుంటే కొంచెం ఆందోళన కలిగింది. కానీ తెలిసిన స్నేహితులు, దగ్గర బందువులు, సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి చెప్పిన గొప్ప మాటల గుర్తు తెచ్చుకుంటే , ఓ అందమైన ప్రపంచం లోకే వెళ్తున్నందుకు ఒకింత గర్వం గానే అనిపించి ధైర్యం తెచ్చు కున్నాడు.

“బాబు, ఒక చిన్న రిక్వెస్ట్” అని ఓ పెద్దాయన పలకరింపు తో ఈ లోకం లోకి మళ్ళీ వచ్చాడు . అతని వైపే చూస్తున్న అనంతు తో ” నాకు, మా ఆవిడ కి అప్పర్ బర్త్ లు వచ్చాయి. నేను ఎలాగో అలా ఎక్కెస్తాను, మా ఆవిడ అంత పైకి ఎక్కాలి అంటేనే చాలా కష్టం” అని ఇబ్బంది పడుతూ వుంటే , “పర్లేదు సర్ నేను పైకి వెళ్తాను, మీరు ఈ క్రింది బర్త్ తీసుకోండి” అన్నాడు. ఆ టైమ్ లో తోటి వారి కోసం ఏదో గొప్ప త్యాగం చేసిన ఫీలింగ్ కలిగింది అనంతు కి .

ఇంతలో ఒంటి మీద చిరిగి పోయిన చెడ్డీ తో , స్టేషన్ లో వున్న దుమ్మంతా ఒంటి మీద నింపుకొని , ఒక చిన్న గుడ్డ ముక్క చేత్తో పట్టుకొని, ప్రతి ఒక్కడి కాలు పైకి లేపి మరీ తుడిచేస్తున్నాడు బోగీ అంతా , ఒక పదేళ్ళ కుర్రాడు. తుడవడం మధ్య మధ్య లో ఆపి ఎవరైన డబ్బులిస్తరేమో అని, ప్రతి ఒక్కడి వైపు ఆశ గా చూస్తున్నాడు, . “కొంత మంది అస్సలు అక్కడ ఏమీ జరుగుతుందో తెలియనట్టు వాళ్ల పని లో వాళ్ళు ఉంటే, కొందరు తమ ఆస్తి ఏదో అడుగుతున్నట్టు ఫేస్ చిరాకు గా పెడుతుంటే, మరొకడు చేతి లో రూపాయి పెట్టి పండగ చేసుకో అనే ఎక్స్‌ప్రెషన్”. ఇవన్నీ చూస్తూ కూర్చోడం అనంతు వల్ల కాలేదు, ఆ కుర్రాడి బుజాల మీద చెయ్యేసి, పైకి లేపి పాకెట్ లోంచి 1000/- తీసి చేతి లో పెట్టి , “ఇంక ఎప్పుడూ ట్రైన్ లో ఇలా కనిపించకు” అని చెప్పాడు వాడి తో. వాడు సంతోషం గా తల ఊపుతూ వెళ్ళి పోయాడు, వెయ్యి రూపాయలకు ఆ మాత్రం అయిన ఊపాలి కదా అన్నట్టు.

అక్కడ వున్న అందరూ అనంతు ని సినిమా హీరొ లా చూశారు. “నేను హీరొ ని కాదు అంత కన్నా గొప్ప అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ని” అని మనస్సులో అనుకున్నాడు. అందరూ వాళ్ళు తెచ్చుకున్న డిన్నర్ తింటూ ఉంటే, అనంతు కూడా అమ్మ కట్టించిన పెరుగన్నం మామిడి కాయ పచ్చడి తో కలిపి లాగించేశాడు. బామ్మ మాటలు గుర్తొచ్చి బ్యాగ్స్ అన్ని ఇంకా కొంచెం లోపలికి తోసేసి, దుప్పటి తీసుకొని పై బర్త్ ఎక్కెసాడు . నిద్ర రావడం లేదు, ఆలోచనలన్నీ జీవితం లో రాబోతున్న గొప్ప మార్పు గురించే, అది తాను నాలుగు సంవత్సరాలు గా కల లు కన్న సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అనే ఆనందం.

అనంతు బెంగుళూరు స్టేషన్ లో దిగి, ఇంధ్ర సేనా రెడ్డి సినిమా గుర్తు చేసుకొని , చేతి లో ఉన్న బ్యాగ్స్ పక్కన పెట్టి నేల ని ముద్దు పెట్టుకున్నాడు. తల పైకి ఎత్తగానే ఎదురు గా చాలా మంది చేతి లో పూల మాలల తో, పెదవుల పై చిరు మందహాసం తో అనంతు వైపే వస్తున్నారు. “నేనేమి రాజకీయ నాయకుడిని కాదు, పెద్ద సినిమా స్టార్ ని కాదు” అంటూ అయోమయం లో ఉండగానే, ఆశ్చర్యం గా అందరూ పూల మాలలు తెచ్చి మెడ లో వేసారు. ఇంకొకడు ఏకంగా అనంతు కాళ్ళ మీద పడి మొక్కేస్తున్నాడు. “ఏంటయ్యా నాకెందుకు మొక్కుతున్నావు” అని నిలదీసే లోపలే , పక్కనే మరొకడు ” మీలాంటి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ల వల్లే మేమంత హ్యాపీ గా జీవిస్తున్నాం” అని అన్నాడు.

ఆ మాట చెప్పేటప్పుడు వాళ్ల కళ్ళలో ఉద్వేగం కనిపించింది. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అయ్యినందుకు గర్వం గా అనిపించింది. ఒకామే చేతి లో చంటి బిడ్డ తో వచ్చి నా బిడ్డకీ మీరే పేరు పెట్టాలి అంది అనంతు తో, అక్కడ వున్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళు లా అనిపించారు. కానీ బలవంతం మీద “సాయి” అని పేరు పెట్టాడు , అనంతు ఉద్దేశ్యం “సాయి” అంటే “సా”ఫ్ట్‌వేర్ “యి”oజీనీయర్ అని, తనకి వచ్చిన ఆలోచనకి తానే మనస్సులో చప్పట్లు కొట్టుకున్నాడు. ఇంత లో డామ్ అని ఒక పెద్ద శబ్దం, ఆనందం తో అందరూ బాణసంచా కాలుస్తున్నారు, మన ఊరికి కొత్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వచ్చాడు, సంబరాలు మొదలు పెట్టండి అనే మరో పెద్దాయన కేక.

చాయ్ చాయ్ అంటూ శబ్దం వినిపిస్తూ వుండడం తో, కల లో నుంచి ఇల లోకి వచ్చిన అనంతు రెండు కళ్ళు రెండు చేతుల తో గట్టిగ నలుపుతూ మెల్ల గా తెరిచి చూశాడు , తాను ఇంకా ట్రైన్ లో వున్నాడు, ట్రైన్ ఆగి పోయి ఉంది, ఇప్పుడు జరిగింది అంతా కల అని తాను పూర్తి గా నమ్మి , మళ్లీ ఈ లోకం లోకి వచ్చేందుకు కాస్త టైమ్ పట్టింది. పక్కన ఎవరో మాట్లాడుతూ వుంటే తెలిసింది ట్రైన్ లో దొంగలు పడ్డారు, చైన్ లాగి ఉడాయిన్చారు అని. వెంటనే కిందకి దిగి తన బాగ్ చూసుకున్నాడు , డబ్బులు పోతాయి అని కాదు, అంత కన్నా గొప్పదైన అపాయంట్‌మెంట్ లెటర్ అందులో ఉంది, అదే అనంతు బయం. అపాయంట్‌మెంట్ లెటర్ ని చూసుకొని ఊపిరి పీల్చుకున్నాడు.

ఏమీ జరిగిందో తెలుసుకోవాలి అని కుతూహలం తో అలా బయటకి వెళ్ళాడు . ఒకావిడ పర్స్ పోయింది అని గగ్గోలు పెడుతోంది , కానీ ఆమె, ఆమె మాట తీరు, ఆమె వంటి మీద ఉన్న నగలు చూస్తే అలాంటి పర్స్ లు ఒక వంద కొనుక్కుంటుంది లే అని లైట్ తీసుకున్నాడు. పక్కనే ఒక ముసలాయన ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఎంత డబ్బు ఉంది మూట లో అని అడిగాడు ముసలాయన తో పోలీస్. నాలుగు వేల దాకా ఉంది సార్ అన్నాడు చాలా బాధ గా. పక్కనే వున్న ఆమెను చూపిస్తూ , అదిగో ఆమెది ఇరవై వేలు పోయింది, నీది పొతే ఎంత అన్నట్టు . “అయితే నన్నేమీ చెయ్యమంటావు సర్, మూడు నెళ్ళు నైట్ వాచ్ మన్ గా పని చేసి దాచి పెట్టుకున్న డబ్బులు నావి, ఏదో ఒకటి చెయ్యండి సర్” అన్నాడు.

పోలీసుల కు ముసలాయన డబ్బు డబ్బులా కనిపించ లేదు, పక్కకి నెట్టెసి ఇరవై వేలు పోయిన ఆమె దగ్గర డీటేల్స్ తీసుకుంటున్నారు ముందు గా, ఎందుకంటే ఆమె ఆ ఊరి MLA కి దూరపు బందువు అట. ఇదంతా చూసి అనంతు కి కొంచెం ఆవేశం వచ్చినా, కంట్రోల్ చేసుకొని, ఏడుస్తున్న మూసలాయాన్ని పైకి లేపి, అతని కన్నీళ్ళు తుడిచి, వాళ్ళ నాన్న జేబు లో పెట్టిన అయిదు వేలు తీసి ముసలాయన చేతి లో పెట్టాడు . “బాబు ఇంత డబ్బు నాకిస్తున్నవెంటీ , వద్దు బాబు మీకు ఇబ్బంది అవుద్ది” అన్నాడు.

పర్లేదు తాత, నేను సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ని ఇట్టే సంపాదించేస్తాను అని ధైర్యం గా చెప్పాడు. అప్పుడు ఆ ముసలి వాడు ” అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ పైన వున్న ఆ దేవుడి కన్నా గొప్ప” కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు . అక్కడ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ కొట్టారు అనంతు చేసిన సహాయాన్ని చూసి, “తోటి వారికి సహాయం చేయడం మన ధర్మం” అని ఆ టైం లో గుర్తు కి వచ్చిన నీతి వాక్యం అందరికీ చెప్పి ట్రైన్ ఎక్కుతూ , ముసలాయన చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేసుకున్నాడు, “అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ పైన వున్న ఆ దేవుడి కన్నా గొప్ప”. ఆ మాట ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ప్రశాంతం గా నిద్ర పొయాడు
రిసీవ్ చేసుకోడానికి స్టేషన్ కి దూరపు బందువు సంతోష్ వచ్చాడు. గత నాలుగు సంవత్సరాలు గా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు సంతోష్. ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకొని అక్కడ నుంచి బయలు దేరారు . సంతోష్ ఇదివరకటి లా ఎక్కువ గా మాట్లాడడం లేదు, చాలా మౌనం గా ఉన్నాడు. ఒకప్పుడు ఊళ్ళో సంతోష్ ని వస పిట్ట అనే వాళ్ళు, ఇప్పుడేంటి ఈ పిట్ట “కు” “కు” కూడా అనడం లేదు అనుకుంటూ తన వెనుకే నడుస్తున్నాడు అనంతు.

ఇద్దరు ముగ్గురు ఆటో వాళ్ళు తమ లో తాము పోటి పడుతూ వచ్చి “ఆటో కావాలా సర్?” అని అడుగుతున్నా, పట్టించుకోకుండా , స్టేషన్ బయట దాక నడిపించి , సిటి బస్సు ఎక్కించాడు. పక్క వీధి కి వెళ్ళాలి అన్నా , ఆటో అనే వాడు , సిటి బస్సు ఎందుకు ఎక్కించాడో అర్ధం కాలేదు. రూం కి చేరుకోగానే , ఒకతను నిద్ర పోతూనే పలకరించాడు, ఇంకొకడు బాత్ రూమ్ లోంచే హెలో అన్నాడు, మరొకడు అనంతు బాగ్ లాక్కొని బామ్మ తన కోసం పెట్టిన జంతికలు పాసి ముఖం తోనే తినేస్తున్నాడు.

రూం మొత్తం ఒక సారి అలా చూసాడు, ఒక రూమ్ లో చికెన్ ఎముకల తో నిండిన ప్లేట్స్ , మరో రూం లో తాగి పడేసిన బీర్ బాటల్స్. అప్పుడు అర్దం అయ్యింది సంతోష్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో, రాత్రి తాగింది ఇంకా దిగినట్టు లేదు వీడికి అనుక్న్నాడు అనంతు . “అరే నువ్వు త్వరగా రెడీ అవ్వు, మీ కంపనీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు” సంతోష్. సరే అంటూ తల ఊపి, బాగ్ ని ఒక కార్నెర్ లో పెట్టి, ఇంకా తన దగ్గర మిగిలిన 2000/- ని ఒక సారి చూసుకున్నాడు.

ఫైనల్ గా ఫస్ట్ డే ఆఫీసు లో, అనంతు తో పాటు చాలా మందే జాయిన్ అయ్యారు ఆ రోజు. అందరి కళ్ళల్లో అదే కాంతి కనిపిస్తోంది. ఒకరిని ఒకరు పలకరింతలు, కంపనీ గురించి సీనియర్ లు ఇస్తున్న లెక్చర్ లు, చాలా కొత్త కొత్త విషయాలు, అంతా గమ్మత్తు గా అనిపించింది. ఎప్పుడు కావాలన్నా బటన్ నొక్కితే వచ్చే కాఫీ, టీ లు , అది చూసి అద్బుతం అని నోటి మీద వేలు వేసుకున్నాడు.

లంచ్ బ్రేక్ లో అందరి కీ ఏదో ఒక కూపన్ ఇచ్చారు, అది చూపిస్తే ఫ్రీ మీల్స్ అంట, ఉత్సాహం తో వెళ్ళాడు. బోలెడన్ని వెరైటీ లు కల్ల ముందు కనిపించే సరికి, పొట్ట లోపలికి వెళ్ళి పోయింది త్వరగా నింపెయ్యమని. ప్లేట్ లో ఎక్కడ ఈసుమంత కూడా ఎంప్టీ లేకుండా నింపేసాడు, అప్పుడు కావాలంటే ఇంకో సారి వెళ్ళొచ్చు అని అనంతు కి తెలీదు. మహా అయితే ఇంట్లో ఒకటి లేదా రెండు వెరైటీ లు , ఇక్కడ పంచభక్ష పరమన్నాలు, ఫుల్ గా లాగించేసాడు .

ఫోన్ రింగ్ అయ్యింది, లిఫ్ట్ చేసి “చెప్పండి సంతోష్” అన్నాడు . “అండీ , సర్ ఇలాంటివి ఏమీ వద్దు, సాయంత్రం పార్టీ ఓకే కదా ” అన్నాడు. ఈవ్నింగ్ ఆఫీసు కి వచ్చి పిక్ చేసుకున్నాడు. స్నేహం కోసం ఏమైనా చేస్తారు అని గొప్ప గా అనిపించింది అనంతు కి. బెంగుళూరు సిటీ కొత్తగా ఉంటే చూస్తూ కూర్చున్నాడు. ఆ టైమ్ లో సిటీ లో ఉన్న ట్రాఫిక్ ని పెద్దగా గమనించ లేదు, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు , ఆ ట్రాఫిక్ పెద్ద గా ఇబ్బందీ అనిపించ లేదు అనంతు కి .

రూమ్ కి వెళ్లే సరికి, రవి ఆల్‌రెడీ ఆఫీస్ నుంచి వచ్చేసాడు, మనోహర్ జంతికలు అన్నీ ఒకే సారి తినేసరికి అజీర్తి చేసి ఆఫీసు కి సెలవు పెట్టాడు. పార్టీ కి అరేంజ్మెంట్స్ చెయ్యాలి అని అనంతు వైపు చూసాడు సంతోష్ , ” ఎంత కావాలి అని అడిగాడు ?”. “నీ దగ్గర ఎంత ఉంది అని”" ఎదురు ప్రశ్న మనోహర్ నుంచి. ఒక 2000/- ఉంది అన్నాడు. “అదేంటి న్యూ జాబ్ లో జాయిన్ అవ్వడానికి సిటీ కి వస్తూ 2000/- జోబి లో పెట్టుకొని వచ్చావు” అన్నాడు సరిపోవు అన్నట్టు సంతోష్ .

ట్రైన్ లో జరిగిన కథ అంతా బ్రీఫ్ గా చెప్పాడు. సరే ఒక 1500/- ఇవ్వు , అడ్జస్ట్ చేసుకుందాము, కానీ ఫస్ట్ సాలరీ వచ్చాక, ఇంకా పెద్ద పార్టీ ఇవ్వాలి , అందరూ ఒకే సారి అన్నారు,.మిగిలిన 500/- నెల అంతా ఎలా మేనేజ్ చెయ్యాలి అనే అనుమానం మది లో మెదిలినా , ఫస్ట్ టైం ఇచ్చే పార్టీ కదా, స్మైల్ తెచ్చుకొని కానిచ్చేసాడు .

ట్రైనింగ్ అంటూ, మీటింగ్స్ అంటూ నెల రోజులు గడిచి పోయాయి. తన తో పాటే జాయిన్ అయిన మిగత వాళ్ళు కూడా ఈ ముప్పై రోజులు మొదటి జీతం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది,” నా డబ్బు, నేను సంపాదించిన డబ్బు అని గర్వం గా చెప్పుకొనే డబ్బు. తన అకౌంట్ లో 20000/- క్రెడిట్ అయ్యినట్టు మెసేజ్ రావడం తో “. ఒక్క సారి గట్టి గా అరిచాడు అనంతు.

ఇంటి నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్న డబ్బులు, నాన్న స్పెషల్ గా పాకెట్ లో పెట్టిన డబ్బులు ఎప్పుడో అయిపోవడం తో కంపనీ లో చేరిన రెండో రోజే తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు 5000/- ఆ రోజే ఇచ్చేయ్యాల్సి వచ్చింది. బామ్మ తన కోసం చేసిన మొక్కు తీర్చడం కోసం మొదటి 1000/- లు వేణుగోపాల సామి గుడి హుండీ లో వేసేసాడు. ఎప్పుడో పెట్టుకున చిన్న ఆశయం, సమాజ సేవ అనే పేరు తో , మరో 2000/- ఒక చ్యారిటీ కి ఇచ్చేసాడు .

మొదటి స్యాలరీ కాబట్టి ఆఫీస్ లో సహా ఉద్యోగుల కు పిజ్జా పార్టీ కి మరో రెండు వేలు కర్చు అయిపొయింది . మిగిలిన 10000/- బాలన్స్ తో రూమ్ కి వెళ్లే సరికి, ఆ నెల ఎక్స్‌పెండిచర్ కి లెక్కలు కట్టి నువ్వు 5000/- కట్టాలి అన్నారు. మరి సిటీ కి నడి బొడ్డు లో ఉండే అపార్ట్‌మెంట్ లో ఫ్లాట్ ఆది, రెంట్ వాసి పోతే, మేంటెనెన్స్ తాట తీసేలా ఉంది. మనకి ఇంత కాస్ట్లీ హౌస్ అవసరమా అంటే, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లు లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి, చుట్టూ పక్కనే నాలుగు గర్ల్స్ హాస్టల్ లు వున్నాయి అనే సమాదానం. అంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రూమ్ మేట్స్ కి పార్టీ పేరు తో మరో మూడు వేలు ముద్దు గా ఖర్చు అయిపోయాయి.

మిగిలిన రెండువేల తో నెల అంతా ఎలా గడపాలి అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లే సరికి ఆఫీస్ ట్రాన్స్‌పోర్ట్ యూస్ చేసుకొనే వాళ్ళు 1200/- కట్టాలి అనే ఇన్ఫర్మేషన్ తో నవ్వాలో ఎడ్వాలో అర్దం కాలేదు అనంతు కి. ఇంతలో ఊరి నుంచి ఫోన్ ,అటు పక్క నుంచి నాన్న, అమ్మ, బామ్మ, చెల్లి. “ఏరా మొదటి స్యాలరీ తో ఏమీ చేద్దాము అనుకుంటున్నావు అనే నాన్న ప్రశ్న” విని గుండెల్లో పిడుగు పడినట్లు అనిపించింది, అమ్మ ఫోన్ లాక్కోని “అరే , ఫస్ట్ శాలరీ తో మీ నాన్న కి మంచి డ్రెస్ కొని పంపు రా “అని రెకమెండేషన్. “ఏరా మనవడా మీ బామ్మ కోసం ఏమైన కొన్నావా లేదా ?”, “అన్నయ్యా , నాకు ఏమీ కొన్నావు అని” చెల్లి సెంటిమెంట్. అటు వైపు నుంచి కురిసిన కోరికల వర్షం తో జేబు లో మిగిలిన 800/- తడిసి ముద్దయ్యాయి.

సడన్ గా ఫోన్ కట్ అయ్యింది, దేవుడు కరుణించాడు అనుకున్నాడు, వెంటనే వేరే ఫోన్ , కస్టమర్ కేర్ చెప్పిన మాట “ఈ నెల మీరు కట్టవలసిన్ బిల్ 799/- మాత్రమే” విని గొంతు లో వేళక్కాయ పడినట్టు అనిపించింది అనంతు కి . ఫోన్ బిల్ కూడా కట్టెయ్యగా మిగిలింది ఆ నెల కి 1/- మాత్రమే. వెంటనే చ్యాలెంజ్ సినిమా గుర్తు వచ్చింది, చిరంజీవి లా నేను కూడా ఒక్క రూపాయి తో ఏమైన చెయ్యగలనా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అనంతమైన ఆకాశం వైపు చూస్తూ అనంతు.

అక్కడ ఆకాశం లో ఇలా తన జీవితం లో తోలి ఘట్టాన్ని వివరించిన అనంతు మాటలు విని అంతా నిశ్శబ్దం అలుముకుంది. యమ ధర్మ రాజు కంట నీరు పెట్టుకున్నాడు . సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితాన్ని తప్పు గా అర్ధం చేసుకున్నాను అని, బాధ తో చిత్రగుప్తుడు వెల్లికిలా పడుకొని చిన్న పిల్లాడి లా వెక్కి వెక్కి ఏడ్చాడు. “ఈ ఆబాగ్యుడి పాపాలా నేను ఇన్నాళ్లు లెక్క కట్టింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాపాలు లెక్క కట్టి నేను ఎంత పాపం చేశాను” అని క్రుంగి పోయాడు. అక్కడ విచారణ జరుగుతున్న మిగతా పాపుల్లో పోలీస్, డాక్టర్స్, పాలిటిషియన్స్, సినిమా వాళ్ళు, ఫార్మర్స్, బిసినెస్స్ మేన్ , కామన్ పీపుల్ ఎందరో ఉన్నారు. వాళ్ళందరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ కష్టాలు విని నోళ్ళు వెళ్ళ బెట్టారు.

వీల్లందిర్ని చూసి ఇప్పటి వరకు నేను చెప్పింది ఆరంభం మాత్రమే, చివరి దాకా చెపితే చతికిల పడిపోతారు అన్నాడు అనంతు. “అన్నం ఉడికింది లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు, కాబట్టి ఇక అవసరం లేదు. నీ విషయం లో నేను తీర్పు చెప్పెయ్యగలను” అన్నాడు యముడు. “కాదు యమ సర్, సపోస్ బిర్యానీ వండుతున్నాము అనుకోండి, ఒక్కో ముక్క గట్టి గా ఉంటుంది, మరో ముక్క మెత్త గా ఉంటుంది, సో ఉడకడం లో తేడా ఉంటుంది, ఆ టైమ్ లో ఒక గట్టి ముక్క పట్టుకొని చూస్తే, ఆది ఉడికింది అంటే, మిగత ముక్కలు ఉడికినట్టే.

ఇంకా నా లైఫ్ లో గట్టి ముక్కల్లాంటి సిచుయేషన్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఖచ్చితం గా అవి కూడా విని మంచి తీర్పు చెప్పాలి” అని గట్టిగా అడిగాడు అనంతు. అనంతు ఇచ్చిన బిర్యానీ ఉదాహరణ అర్ధం కాకపోయినా, సింపుల్ గా చెప్పమని, ఇంక ఏడిపించొద్దు అని రిక్వెస్ట్ చేసాడు యముడు.

“ఒక సారి కూరగాయల మార్కెట్ కి వెళ్ళాను. టోమోటొ కిలో పది రూపాయలు అందరికి, ఒక్క సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ కి మాత్రం కిలో 25 రూపాయలు. అదేంటి రేట్ లో తేడా అంటే, మీకేం సర్, బాగా సంపాదిస్తున్నారు గా అని ఎదురు సమాధానం. బార్బర్ షాప్ లోనూ అదే వరస, దోచుకుంటున్నారు సర్ ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ని ప్రతి ఒక్కడు.

సొంత ఊరి లో 5000/- అయ్యే పని, ఈ సిటీ లో 500000/- పెట్టిన అవ్వదు సర్. పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళి, ఇచ్చిన టైమ్ లోపల వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చే సరికి ఏ అర్ద రాత్రో అవుతుంది. పడుకున్నా కల లో రేపు ఆఫీస్ లో వర్క్ గురించే, నిద్ర కూడా బారం అయిపోయింది సర్. సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే జీవితాంతం సంపందించిన దాంట్లో సగం జీతం బాంక్ కి కట్టెయ్యాలి. ఒక 20 ఏళ్ల తర్వాత అంటే దాదాపు మనం పొడానికి ఇంకో 5 ఏళ్లు ఉన్నాయా అనే టైమ్ లో ఆ ఇల్లు మన సొంతం అవుద్ది. రాజ కీయ నాయుకుడి నుంచి చిన్న బడ్డీ కొట్టు వాడి దాకా ప్రతి వాడు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ డబ్బు ని దోచుకోవాలనే ఆశ.

వాళ్ళకి అర్దం కావడం లేదు సర్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంత నరక యాతన పడితే ఆ డబ్బులు వస్తున్నాయో. పేపర్ లో జీతం చాలా ఉంటుంది, అన్ని కటింగ్ లు పోగా చేతి లో మిగిలేది చింతకాయ గింజంత జీతం. ఆ జీతం తీసుకొని బయటకి వస్తే దోచుకోడానికి చూసే కళ్ళు ఎన్నో. మీకేమాయ్య ప్రతి సంవత్సరం జీతం బాగా పెరుగుద్ది కదా అంటరేమో! జీతం ఎంత రేట్ లో పెరుగుతుంది అంత కన్నా పది రెట్ల రేట్ తో అవసరాలు పెరుగుతున్నాయి సర్.

ఒక విషయం చెప్పనా సర్, సినిమా వాళ్ళు రాజా కీయాల్లో ట్రై చెయ్యోచు. రౌడీ లు సినెమాల్లో ట్రై చెయ్యోచు. సామాన్యుడు సైతం బిజినెస్ లో ఎదగొచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గా జీవితం మొదలు పెడితే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గానే అంతం అయిపోవాల్సిందే సర్. మాకు వేరే ఆప్షన్ లేదు సర్” అని ఉద్వేగం తో చెపుతున్నాడు అనంతు. ఇక ఆపు అంటూ, ఆ మాటలు విన్న యమ ధర్మ రాజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అరిచాడు . “ఇంక చాలు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం అర్దం అయిపోయింది. భూమి మీదే నరకం చూస్తున్న మీకు, మళ్లీ శిక్ష అవసరం లేదు. ఏదైన పాపాలు మీరు చేసినా , సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గా బ్రతికి మీకు మీరే శిక్ష అక్కడే వేసుకుంటున్నారు” అన్నాడు .

ఆవేశం గా చిత్ర గుప్తుడు ఇంతకు ముందు లెక్క కట్టిన అనంతు పాపల చిట్టా ని చించేసాడు. అనంతు ని చూపిస్తూ “ఎవరాక్కడ, ఈ అమాయకపు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ని వెంటనే స్వర్గం లో దించి రండి” అన్నాడు. చిత్రగుప్త వైపు చూస్తూ , మన నరకం ఎంట్రెన్స్ లో ఒక బోర్డ్ పెట్టించండి. దాని మీద “సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ కి నరకం కి ప్రవేశం లేదు” అని రాయించండి అని ఆదేశించాడు. గుండెంత దుఖం తో నిండి పోవడం తో నరకం కి నెల రోజులు సెలవు ప్రకటింఛి విశ్రాంతి తీసుకున్నాడు యముడు . “ఏమండి , ఈ రోజు ఏదో మీటింగ్ వుంది తొందరగా వెళ్ళాలి అన్నారు” అని ధర్మపత్ని కేక, పెట్టుకున్న అలారం కన్నా గట్టిగా వినిపించడం తో తనకు వచ్చిన వింత కల లోంచి బయటకి వచ్చాడు. కల చెత్తగా వున్నా, అందులో నిజం వుంది అనుకుంటూ, తన రొటీన్ జీవితం కి ఆ రోజు కూడా గుడ్ మార్నింగ్ చెప్పెసాడు .

*** * ***



4 Responses to సాఫ్ట్ వేర్ ఇంజనీర్

  1. Janakiram Attuluri
    March 2, 2014 at 7:35 pm

    శివ, కథ చాల బావుంది…..

  2. May 16, 2014 at 5:57 pm

    ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీరువేనా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇతకళ ఉందా అంటే నమ్మబుద్ది కావడం లేదు కథ సూపర్

  3. Veera Reddy Kesari
    December 10, 2014 at 4:54 pm

    “ఒక విషయం చెప్పనా సర్, సినిమా వాళ్ళు రాజా కీయాల్లో ట్రై చెయ్యోచు. రౌడీలు సినెమాల్లో ట్రై చెయ్యోచు. సామాన్యుడు సైతం బిజినెస్ లో ఎదగొచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గా జీవితం మొదలు పెడితే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గానే అంతం అయిపోవాల్సిందే సర్. మాకు వేరే ఆప్షన్ లేదు సర్”

    # శివ, కథ చాల బావుంది….. :)

    • Siva
      August 3, 2015 at 2:58 pm

      ధన్యవాదాలు … !

Leave a Reply to Janakiram Attuluri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)