చలువ పందిరి

సాహిర్

మార్చి 2014

चलो एक बार फिर से.. :

“..मुझसे पहले कितने शायर, आए और आकर चले गए,
कुछ आहें भरकर लौट गए, कुछ नग़मे गाकर चले गए
वो भी एक पल का किस्सा थे, मै भी एक पल का किस्सा हूँ
कल तुमसे जुदा हो जाऊँगा, जो आज तुम्हारा हिस्सा हूँ”
అన్న “సాహిర్” నాకెంతో ప్రియమైన హిందీ సినీకవులలో ఒకరు..!

సాహిర్ ఇంకా ఏమన్నాడంటే..

“ये दुनियाँ जहाँ आदमी कुछ नहीं है
वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं हैं
यहाँ प्यार की कद्र ही कुछ नहीं है
ये दुनियाँ अगर मिल भी जाये तो क्या हैं”
(ప్యాసా)

“ये पुरपेच गलियाँ, ये बदनाम बाज़ार
ये ग़ुमनाम राही, ये सिक्कों की झन्कार
ये इस्मत के सौदे, ये सौदों पे तकरार
जिन्हें नाज़ है हिन्द पर वो कहाँ हैं..”
(ప్యాసా)

“इस को ही जीना कहते हैं तो, यूँही जी लेंगे
उफ़ ना करेंगे, लब सी लेंगे, आँसू पी लेंगे
गम से अब घबराना कैसा, गम सौ बार मिला”
(ప్యాసా)

సాహిత్యానికీ, కవిత్వానికీ, హిందీ చిత్రగీతాలకూ ఆయన చేసిన సేవలకు గానూ గత ఏడాది భారత తపాలాశాఖ ద్వారా సాహిర్ లుధియాన్వీ స్మృతిలో ఒక స్టాంప్ కూడా విడుదలైంది! కనుమరుగౌతున్న మానవతావిలువలు, అర్థంలేని రాజకీయ చదరంగాలు, భగ్నహృదయాలు, ప్రేమ, అన్నింటికన్నా విలువైన జీవితం గురించిన నేపథ్యాలతో ఎన్నో కవితలూ, పాటలు రాసాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నవాడు, జీవితాన్ని దగ్గర నుండి చూసినవాడు, రెండుసార్లు భగ్నప్రేమికుడైపోయి చివరిదాకా ఒంటరిగా మిగిలిపోయినవాడు కావడం వల్లనే ఆయన రచనలకు ఆ విలువల జిలుగులు! ముఖ్యంగా అందమైన ఉర్దూ పదాలెన్నింటినో ఈయన పాటల ద్వారానే తెలుసుకున్నా నేను.

మరికొన్ని సాహిర్ లుధియాన్వీ పాటలు:

* తుమ్ అగర్ సాథ్ దేనె కా వాదా కరో
* నీలే గగన్ కె తలే
* న మూ ఛుపాకే కె జియో
* కిసీ పత్థర్ కీ మూరత్ సే మహోబ్బత్ కా ఇరాదా హై(హమ్రాజ్)
* కభీ కభీ మేరే దిల్ మే
* మేరే ఘర్ ఆయీ ఎక్ నన్హీ పరీ
* మై పల్ దో పల్ కా శాయర్ హూ(కభీ కభీ)
* జానే వో కైసే లోగ్ థే జిన్ కే ప్యార్ కో ప్యార్ మిలా..
* యే దునియా అగర్ మిల్ భీ జాయె తో క్యా హై..
* జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా హై..
* జానె క్యా తూ నే కహీ..(ప్యాసా)
* అల్లా తేరొ నామ్..
* మై జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా..
* అభీ నా జావో ఛోడ్ కే..
* జహా మే ఐసా కోన్ హై..(హమ్ దోనో)
* ఓ మేరే జొహరా జబీ..
* ఆగే భీ జానే నా తూ..(వక్త్)
* మన్ రే తు కాహే న ధీర్ ధరే..
* సంసార్ సే భాగే ఫిర్తే హో..(చిత్రలేఖ)

ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో..! గంభీరమైనవే కాదు ఈయన ఖాతాలో సరదా పాటలు కూడా బోలెడున్నాయ్..! మరి ఇలాంటి హేమాహేమీల్లాంటి పాటల్లోంచి ఏది ఎన్నుకోవాలా అని ఆలోచిస్తే ‘Gumrah’చిత్రంలోని “చలో ఎక్ బార్” తట్టింది. ఈ పాటకు కూడా చిన్న కథ ఉంది. “గుమ్ రాహ్”, “హమ్ రాజ్” రెండు చిత్రాల పాటలూ ఉన్న ఒక కేసెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. అటుఇటు, అటుఇటు ఎడాపెడా తెగ వినేసేవాళ్లం. అందులో మూడొంతులు పాటలు ‘మహేంద్ర కపూర్’ పాడినవే! ఆ కెసెట్ ద్వారా నాకు సాహిర్, మహేంద్ర కపూర్ ఇద్దరూ బాగా ఇష్టమైనవాళ్ళయిపోయారు. ముఖ్యంగా ఈ “చలో ఎక్ బార్..” పాట.. అందులోని ఉర్దూ పదాలు వినడానికి చాలా అందంగా తోచేవి. कशमकश, पेशकदमी, दिलनवाज़ी, तार्रुफ़, ताल्लुक మొదలైన పదాలన్నీ భలే తమాషాగా ఉండేవి. వీటిని వేదనాభరితంగా మహేంద్రకపూర్ పలుకుతూంటే గొంతు కలిపేసేదాన్ని. అప్పట్లో అర్థాలు తెలీవు కానీ ఎందువల్లో బాగా నచ్చేసేది ఈ పాట. అర్థం తెలిసాకా మాత్రం “సలాం సాహిర్ సాబ్” అనుకోకుండా ఉండలేకపోయాను!

ఇంతకీ ఈ ‘gumrah’ సినిమ కథ ఏమిటో తెలుసా? ఈ కథనే క్లైమాక్స్ కాస్త మార్చి “అభినందన” పేరుతో మన తెలుగులో తీసారు. రెండు ముగింపుల్లో ఏది కరక్టు? ఏది న్యాయం? అన్న పాయింట్ పక్కన పెడితే ఆయా కాలమాన పరిస్థితులను బట్టి రెండు సినిమాలూ బాగా ఆడాయి. ఈ పాట వచ్చే సందర్భం ఏంటంటే ఒకప్పుడు తన భార్య ప్రేమించిన ప్రియుడిని ఓ అమ్మాయి భర్త ఇంటికి పిలుస్తాడు. అప్పుడా ఇల్లాలు సంగ్దిగ్థం, కలవరం ఒకవైపు, భర్త కుతూహలం ఒక వైపు ఉండగా; మధ్యన పెద్ద పియానో వద్ద కూచుని, సీరియస్ గా వాయించేస్తూ ఆ భగ్నప్రేమికుడు ఈ పాటను పాడతాడు! అశోక్ కుమార్(భర్త) సీరియస్ గా గుప్పుగుప్పు మని పైప్ లోంచి వదిలే పొగ సింబాలిక్ గా అనిపిస్తుంది..! మహేంద్రకపూర్ పాడిన అద్భుతమైన గీతాల్లో ఒకటిది. చిరస్థాయిగా నిలిచిపోయేలా సంగీతాన్ని సమకూర్చినది రవి. దు:ఖపూరితమైనదైనా, మరువలేనిదీ గీతసాహిత్యం.

“चलो एक बार फिर से.. ” వాక్యర్థం:

ప: चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों
రా..! మరొక్కమారు అపరిచితులమైపోదాం మనమిద్దరం..

1 చ: न मैं तुमसे कोई उम्मीद रक्खूँ, दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाये मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कशमकश का राज़ नज़रों से

चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों

అప్పుడిక నీ అనుగ్రహాన్ని నేను ఆశించాల్సిన అవసరమూ ఉండదు
నువ్వు నా వంక అపార్థపు దృష్టితోనూ చూడనక్కర్లేదు
అప్పుడిక నా మాటల్లో నా హృదయపు తడబాటూ కనబడదు
నీ చూపుల్లో నీ మనసు ఊగిసలాటా వెల్లడి కాదు

రా..! మరొక్కమారు అపరిచితులమైపోదాం మనమిద్దరం..

2 చ: तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराये हैं
मेरे हमराह भी रुसवाइयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साये हैं

चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों

ఏదో ఇబ్బంది నిన్ను కూడా ముందడుగు వెయ్యనివ్వడం లేదు కదా..
ఈ అందాలన్నీ పరాయివే అని నాక్కూడా లోకం చెబుతోంది
గతం మిగిల్చిన అపనిందలు కూడా నాకిప్పుడు తోడైయ్యాయి
గతించిన రాత్రుల స్మృతుల నీడలు నీక్కూడా తోడున్నాయిగా..

రా..! మరొక్కమారు అపరిచితులమైపోదాం మనమిద్దరం..

3 చ: तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर
ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसे अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ दे कर छोड़ना अच्छा..

चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों

పరిచయం జాడ్యమైపోతే దాన్ని మరచిపోవడమే నయం
బంధం బరువైపోతే దాన్ని తెంచివెయ్యడమే మంచిది
ముగింపు దాకా తేలేకపోయిన కథను
ఒక అందమైన మలుపు తిప్పి వదిలెయ్యడమే మంచిది..

రా..! మరొక్కమారు అపరిచితులమైపోదాం మనమిద్దరం..

ఈ పాటను క్రింద లింక్ లో చూడవచ్చు: