కవిత్వం

కావడి కుండలు

మార్చి 2014

జననం మరణానికీ
మరణం మళ్ళీ జననానికీ
కారణం అయినట్లు

ఆకాశాన్ని అందుకున్న
సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకి
మళ్ళీ నడిసంద్రం లోకి జారినట్టు

గమనం నిశ్చలమై నిలిచి
ఆ స్థిరత్వం మళ్ళీ చలనమవుతూ
నిలకడని నడక పూరించినట్టు

మిగలముగ్గి నేలరాలిన ఓ పండు
చిరు మొక్కగా ప్రాణం పోసుకుని
మరెన్నో పళ్ళకి సృష్టికర్త అయినట్టు

అలిగి దూరమై ,అంతలో చేరువై
సూర్యుడి చుట్టూ భూమి
పదే పదే ప్రదక్షిణలు చేసినట్టు

నిశిరాత్రిలోకి నిష్క్రమించిన వెలుగు
వేకువై వికసించి మళ్ళీ చీకటి వైపుకి
పయనం ప్రారంభించినట్టు

ఆకుపచ్చని వసంతగానం
నిశ్శబ్దంగా శిశిరం లోకి రాలి పడి
మరలా సరికొత్త రాగాన చిగురించినట్టు

ఒకే కర్రకి కట్టబడిన కావడి కుండల్లా
ఒకే నాణంలో ఇమిడిన రెండు ముఖాల్లా
రూపాలు మార్చుకుంటాయి మంచి చెడులు
ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తూ !!!