కవిత్వం

మనమింతే

మార్చి 2014

రాలిపోయిన గతాన్నీ
దుమ్ముకొట్టుకుపోయిన స్వగతాలనూ
పునశ్చరణ అద్దాలలో పదిలపరచి
ప్రతినిమిషం అగుపించేలా
కనురెప్పలకే వేళ్ళాడదీసుకుంటాం

బుసలు కొట్టే అహం పడగ నీడ కింద అనుక్షణం
ఆచ్ఛాదనే లేని అంతరంగాలకు
పొరలు పొరలుగా పేరుకుంటున్న
నాగరికత చెద పుట్టల నాచుపొదలు చుట్టుకుంటూ
పడుతూ లేస్తూ కింద పడ్డా పై చేయి మాదంటూ
లేని మీసాలు సవరించు కుంటాం

ఊపిరి ఊసులాడే క్షణం నుండే
నా అనే ఐరావతాన్ని అధిరోహించి
బుడిబుడి రాగాల కపట నాటకాలు
నీలాంటి వారినీ నీలా లేని వారినీ
నీలోని నిన్నూతుడిచేసుకుంటూ
కాలికింద అగాదాల్లో
కనిపించని కధలను తొక్కిపట్టి
మనను మనమే హిమాలయాలు చేసుకుంటాం.

ఏదో ఒక ఉషోదయం
హఠాత్తుగా ప్రతి అణువూ ఒక అద్దంగా మారి
లోలోపలి ఆదిమజాతిని ప్రదర్శించే వేళ
లేజర్ కిరణాలుగా మారిన నిజాయితీ చూపులకు

కవచకుండలాల్లా తగిలించుకున్న కపట స్వభావాలు
కరిగి ప్రవాహమై నదులై సముద్రాలై
నిన్ను నువ్వే ప్రక్షాళించుకునే వేళ
కాలిన వాసనల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ
అప్పుడు గుర్తొస్తుంది మరచిపోయిన మానవత్వం

(2013 రంజని కుందుర్తి ఉత్తమ కవిత అవార్డ్ పొందిన కవిత)