కవిత్వం

పక్షిరెక్కల చప్పుడు

మార్చి 2014

మహావృక్షాల గుబురు తలలపై
వయ్యారంగా వూగే కొబ్బరాకు కొనలపై
ముళ్ళను అలంకరించుకున్న గులాబీ కొమ్మలపై
పక్షులు అతి సున్నితంగా వచ్చివాలుతాయి

అవి రెక్కలు ముడుచుకుని
తత్వవేత్తల్లా తలలు వాల్చి కూర్చున్నప్పుడు
వాటి రెక్కల్లోకి ప్రచండ గాలుల
వేగాన్ని ఆవాహన చేస్తాయి

కాలం కలిసిరానప్పుడో లేక
కొత్త కాలాన్ని వెతుక్కుంటూనో
పక్షులు గూళ్ళను, ఊళ్ళను వదిలేసి
కొండకోనల్నీ, మహా సముద్రాల్నీ దాటి
గుంపులు గుంపులుగా ఎగిరిపోతాయి
కొత్త ఆకాశాన్నీ, అడవులను వెతుక్కుంటూ
పక్షులు వలస పోతాయి

ఆశ కోల్పోయినప్పుడల్లా నేను
ఆకాశంలో వెలిగే చందమామను చూస్తాను
అక్కడ వెన్నెల కొమ్మలపై ఊగుతూ
ఒక పిచుక పిల్ల నా కోసం పాడుతూ వుంటుంది
ఎక్కడెక్కడో వజ్రాలను వెతుక్కుంటూ వెళ్లి
నేను చీకటి అగాధాల్లోకి కూలిపోయినప్పుడల్లా
ఎక్కడి నుండో వచ్చివాలుతుంది మహా గండభేరుండ పక్షొకటి నా పక్కన

దాని రెక్కల మధ్య దాక్కొని
మండే సూర్యున్ని అందుకునేందుకు సహాసిస్తాను
పక్షులు అనాది సంకేతాల్ని వేటినో
తమరెక్కలపై రాసుకుని మన మధ్య ఎగురుతున్నాయ్
వాటి రెక్కల్లో తుఫాను గాలుల హోరు
సంకేతాల్ని చదవగల వాళ్ళ చేతులు కూడా
పక్షుల రెక్కల్లా విచ్చుకుంటాయ్
ఎగిరేందుకు సహాసించినప్పుడే కదా
ప్రపంచం విశాలంగా కనపడేది
ఎగిరినప్పుడే కదా మన రెక్కలపై రాసిన
అనాది సంకేత సందేశాలు మెరిసేది