పడుగు

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి

మార్చి 2014

ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు ‘ఎగిలి వారంగ’ మన పొన్నాల బాలయ్య ‘దందెడ’ భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు.

వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల దోపిడి, పీడన, అణచివేతల్ని తెలంగాణ సమాజం మీద ప్రయోగించిందో అట్లాంటి వాటినన్నిటినీ నిండుగా అనుభవించిన వాడు బాలయ్య. వీటికి తోడు ‘బోడిగుండు మీద తాటిపండు పడ్డట్టు’ బాల్యంలో తండ్రి మరణం, యౌవనంలో తల్లి మరణం అల్సర్‌,అపెండిక్సుల అనారోగ్య రూపాల్లో జీవితం పొన్నాలకు పరీక్షల మీద పరీక్షలు పెట్టింది. ఆపరీక్షలన్నీ నెగ్గుకుంటూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేసి ఉపాధ్యాయ వృత్తిల స్థిరపడ్డ బాలయ్య ఇయ్యాళ్ళ పేర్కొనదగ్గ కవిగా గుర్తింపు పొందిండు.అందు కు కవి శ్రమతో పాటు మరో రెండు ముఖ్య విషయాలు దోహదం చేసినవి. తెలంగాణ అందునా ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్‌లో పుట్టి పెరగడం ఒక ఎత్తైతే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అట్టడుగు తంతెమీద ఆవిర్భవించడం మరో ఎత్తు.ఈ రెండు అస్తిత్వాలు బాలయ్య జీవితాన్ని, కవిత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఒక ఉత్కృష్ట పాత్రని పోషించినవి. ఎవరైనాకవిత్వాన్ని, కళను జీవితానుభవంలోంచి తోడుకోవాల్సిందే. అనుభవం ఎంత విస్తృతమైందైతే, సంపన్నమైందైతే కవిత్వం,కళ అంత సజీవమౌతుంది. తన విస్తృత,సంపన్న జీవితానుభవంలోంచి ‘దందెడ’ సాయంతో సజీవ కవిత్వాన్ని తోడుకుంటున్నడుకవి. అందువల్లే దళిత భాషను, జీవితాన్ని సాధికారంగా కవిత్వంలోకి తెచ్చిన అతి కొద్దిమంది కవుల్లో ఒకడుగా నిలబడ్డడు.
‘శ్రమ జీవుల శిరస్సులన్నీ బ్రాహ్మణుల చేతుల్లో బంతులైన ‘ వైనాన్ని గుర్తించిండు. అందువల్లనే, ‘తుప్పుపట్టిన చెన్నె ఆరెలే మిగ్గు పూసుకొని దూసుకొచ్చే కవితా కత్తులుగా’ చేసుకొని ‘పగబట్టి సంస్కృతిని కొల్లగొట్టిన పరాయీకరణ మీద’ యుద్ధం ప్రకటిస్తున్నడు.

”మనువు వటవృక్ష వూడల అడల్‌ గా అల్లుకొని
ఎనుగేసిన ఎడెముల్ల కులం గొంతుల ఇరుక్కొని
బుగ..బుగ పొంగిన అవమానాల” పలవరిస్తున్నడు.’ఎద పగిలినప్పుడు ఏడ్పందరిదీ ఒక్కటే’ అన్న స్పష్టతవున్న కవి

”అక్షరాలు అగ్గికణాలె కురిసి
జీవిత నిజాలు రాస్తె
కండ్ల సలువ రాతలు కవిత్వమౌతయంటరా?” అని సందేహపడ్తడు.
కాని, ఆ సందేహం తెలువనితనం కాదు

”జాన్‌ డయ్యర్‌ను వేటాడిన ఉద్ధంసింగ్‌లం
శిరస్సు తెగిపడిన శంభూకులం
వేలు కొయ్యబడ్డ ఏకలవ్యులం
రామాయణాన్ని రాసినోళ్ళం
రాజ్యాంగాన్ని రాసినోళ్ళం
ఎర్రకోటను ఏలెటోళ్ళం” అంటూ సాధికార స్వరాన్ని వినిపిస్తడు. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరాన్ని చెప్పుతడు. 50 కిలోల సిమెంట్‌ బస్తా ఎత్తుకొని ఏకబిగిన 12 అంతస్థులు ఎక్కే మనిషి ఎంత దృఢంగా ఉంటడో బాలయ్య తాత్విక నేపధ్యం కూడ అంతే గట్టిది. కాబట్టే, ‘జాతిని తాకట్టు పెట్టి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతూ, అంబేద్కరిజాన్ని అమ్ముకొని బ్రతికే జాతిద్రోహుల మీద’ యుద్ధం ప్రకటిస్తడు.

బహు సంక్లిష్టమైన భారతదేశంలో బతుకుతున్నడు కవి. అందుకే, బహుముఖ సమాజంలో అనేక పొరల అస్తిత్వాన్ని కలిగి వున్నడు. అంతర్గత వలసవాదంలో దోపడి, వివక్ష, అణచివేతలకు గురవుతున్న తెలంగాణ సమాజంలో జీవిస్తున్న కవితన ప్రాంతీయ అస్తిత్వాన్ని వెదుక్కుంటున్నడు. తెలంగాణ ఉద్యమం ఎగిసిసడ్డప్పుడల్లా వలసవాదులు భాషను ముందుకు తెస్తరు. తెలుగుజాతి మనమంతా ఒక్కటేనంటరు.తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటరు.అందుకు ఉద్యమించమంటరు.ఆకుట్రను అర్థం చేసుకున్న కవి

”అయ్యా! ఓ తెలుగోడా!
ఇక్కడ నువ్వు భద్రమే, నీ భాషా భద్రమే
భరోసా లేనిదల్లా మా బతుకులకే” అని మఖం మీద గుద్దుతున్నడు.

తెలంగాణ మలి ఉద్యమం పునాది సాగునీరు, వనరుల దోపిడి.నాగార్జునసాగర్‌ నిర్మాణంలోని కుట్రను అర్థం చేసుకున్నంకజలయజ్ఞం భవిష్యత్తులో తెలంగాణను ఎడారిగా మారుస్తుందని తేలికగనే గ్రహించిండ్రు.ఆ ఎరుకతోనే

‘బుద్దుని పాదాలను బురద తగలకుండ
సుమేరుడు తన శరీరాన్ని పరిచినట్టు
తలమీద ప్రాజెక్టు కట్టి
నా మొకాన మట్టి కొట్టిండ్రు’
అని ‘బొజర్లల్ల ఎండిన నీటి కలల’ పలవరిస్తడు. ‘ఎగిడ్సిన వలసవాది అగిరలేస్తిన అంగమయిన’ వైనాన్ని వివరిస్తడు.నీళ్ళు కావాలె నని నిలదీస్తడు. ‘ఈసమెత్తు జాగనిడువక మర్మం తెలిసిన మనమట్టి కోసం మన్ను బుక్కైనా కొట్లాడుదాం’ అని ఉద్భోద చేస్తడు. కలిసుండడం అనేది నిజానికి చాలా ఉదాత్తమైన భావన.విడిపోవడం ఎప్పుడైనా బాధాకరమే. అది భార్యాభర్తల బంధమైనా కావచ్చు, తెలంగాణ ఉద్యమమైనా కావచ్చు, ఎస్‌.సి. వర్గీకరణైనా కావచ్చు. కాని కల్సిందామని కథలు చెప్పేవాళ్ళు దాన్ని దోపడీ,అణచివేతలకు సాధికారతను సాధించిపెట్టేదిగా చూడడమే అసలు సమస్య.’పాపమని ఎంగిలి రొమ్మును చీకనిత్తే, పాలోడై, పామై పగబట్టడమే’ విషాదం.

సామాజికస్పృహ ఉన్న కవి,సమసమాజ కలగన్న కవి సమాజం కోసం తపించిన ధీరుల అమరత్వాన్ని గానం చేస్తడు. ‘పొన్న పువ్వుల దుక్కపు రెమ్మై’న నరేందర్‌ మాదిగను, ‘ పారిన నీ నెత్తురంతా ఏరులై నా కలం నుండి కవితా పాదాలై నిలువనీ ‘ అని గురు రవిదాస్‌నీ, ‘పొద్దు గూకడమంటే రేపటి పొద్దుపొడుపుకు ఎరుక’ అని బాలగోపాల్‌ని, ‘మట్టి పొత్తిల్ల విచ్చుకున్న పుట్ట బంగారం’ అని మిద్దె రాములుని, ‘చిల్లులు పడ్డ హక్కుల జెండాను కన్న బిడ్డోలె సంకనెత్తుకున్న’ కన్నబీరన్‌ని, ‘అంటరాని జాతి అస్తిత్వగొంతు’గా నిలిచిన ఫ్రొ|| కొమ్రన్ననీ, ‘ఉదయించే సూర్యుడివే, నువ్వు చమర్‌జాతి వీరుడివే’ అంటూ ఉద్ధమ్‌సింగ్‌నీ యాది చేసుకుంటడు.

స్వతహాగా ఆవేశపరుడిగా ముద్రపడ్డ బాలయ్యకు అడవిమీద, ఆయుధం మీద అచంచల విశ్వాసం. అస్తిత్వ ఉద్యమాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నా అంతిమ పరిష్కారం అది మాత్రమే కాదని స్పష్టంగా తెలిసినవాడు.

”మేమెందుకు విడిపోవడానికి
శరీరాలు అంటువెట్టుకొని సత్యాగ్రహులమైనం?
ఆత్మహత్యలనాపి ఆయుధాలు ధరించి సాయుధులం కాలేమా?” అంటూ ఆవేశపడ్తడు.’జబ్బకు డప్పు బదులు తుపాకి వేసుకున్న సూర్యుడు రాత్రికి రాత్రే హత్యచేయబడుతడు’ అని అంగలారుస్తడు.’ఆకుల్లా రాలుతున్న అమరుల శవాలకు వేపచెట్టు తనువంతా తల్లడిల్లి తల్లివేర్లలో రేపటి స్వప్నాలను వెతుక్కుంటున్న’ వైనాన్ని గమనిస్తడు.’కోమలి పాదాలకుప్రేమగా కుట్టిన అలుకల చెప్పులు మల్టీ డేగ ముక్కులో రక్తం కక్కి చచ్చిన’ కారణాల్ని పసిగడ్తడు. అందుకే సామ్రాజ్యవాదం మీద, ప్రపంచీకరణ మీద అలుపెరుగని యుద్ధానికి సిద్ధమైతడు.

”అదగో.అదిగదిగో..గగనానగేయాల సూర్యులు
నల్లసారపు గుండ్లమీద గగుపవ్వులు నడిసి ఆడిన జ్ఞాపకాల పలవరింత
హుస్నాబాద్‌ ఎల్లవ్వ తల్లి సిగలో పూసిన నల్ల బతుకమ్మ
శ్రమజీవులు తలెత్తుకొని శిఖరానికెత్తిన సుత్తెకొడవలి” అవనతమైందని వ్యధచెందుతూ, మట్టిస్వప్నాల సౌధం విచ్ఛిన్నమైందని విలపిస్తడు.’గిరాయిపల్లి అడవిలో పచ్చని కలలను కాలుస్తున్న శబ్దాని’కి కలత చెందుతడు. కాని కవి నిరాశావాది కాదు.

”నన్ను పాతిపెట్ట చూత్తె
బొందపెట్టిన మట్టినుంచి మల్ల మొనదేలిన కత్తినై మొలకెత్తుత
మరణించి ప్రతిసారీ సూర్యుడినై ఉదయిస్తా
కొత్త కవితనై బతికొత్తా” నంటూ భరోసా నిస్తడు.

వస్తువుకు సంబంధించిన స్పష్టత కవిత్వ నిర్మాణంలో కనిపించకపోవడం ఇబ్బంది పెడ్తది. కవిత ఎత్తుగడ, ముగింపుల విషయంలో పరవాలేదనిపించినా పదాల కూర్పులో, వాక్య నిర్మాణంలో,ప్రతీకలు ప్రయోగించడంలో శ్రద్దపెట్టాలె.మనల్ని మనమే కాంట్రాడిక్టు చేసుకునే సందర్భాల్ని పరిహరించాలె.ముఖ్యంగా ‘ఎగిలివారంగ’ లో అట్ల ఎక్కువ కనిపిస్తది. ‘దందెడ’ లో కొంత అట్ల అనిపించినా వస్తువుకు తగ్గ రూపాన్ని సంతరించుకున్న కవితల్ని అనేకం మనం చూడవచ్చు.

‘భూమాత నుదుటిమీద దస్కత్‌ చేసిన పాదం’
‘తలపాపిన తల్లి పాపెడ నిండ నేల రాలుతున్న సుక్కల తిలకం’
‘తలపువ్వు వేసే మక్క కర్రకు సంకల పాపోలె కులం’
‘గాడుపు దుమారంల ఈతకమ్మల పతంగి’ లాంటివి అందుకు మంచి ఉదాహరణలు.

అట్లాగే, తెలంగాణ పదసంపద, పలుకుబడులు,నుడికారాలు, శ్రామిక సాంస్కృతిక చిహ్నాలు బాలయ్య కవిత్వం నిండా పరుచుకొని ఒక కొత్త సోయగాన్ని అబ్బుతయి.కుక్కుడు పట్టిన,మర్రవడి,కైలాటకాలు, కశికె, బల్లిపాతర, సందెనవడడం,అడ్డికి పావుశేరు, పిత్తకంత,మోర్థపుతనం, గెరువు, మక్క కంకి, గతిమెల్లె, దొయ్య, కాట్రావు, నొగ,తడక, ఎడ్లకొట్టం,గలుమ, ఉద్దరాశిపువ్వు, అడధర్మి, దండె పొడిత్తె, అర్నమడిగితె, ఎతలవూట లాంటి పదాలు, పదబంధాలు కవిత్వం నిండా పరుచుకొని అబ్బురపరుస్తవి. నిర్మాణాన్ని మరింత మెరుగు పరుచుకొని, మరింత కవిత్వంతో పొన్నాల బాలయ్య మనల్ని అలరించాలని, సామాజిక పరాణామ క్రమంలో ఉత్ప్రేరకం అవా&ఆలని ఆకాంక్షిస్తూ…

*** * ***

బయోడేటా
పేరు: పొన్నాల బాలయ్య
తల్లిదండ్రులు: కొమురవ్వ, దుర్గయ్య
పుట్టిన తేది: 04-09-1973
స్వగ్రామం: ఆరెపల్లి, కోహెడ (మం) జి|| కరీంనగర్‌
విద్యార్హతలు: ఎం.ఎ.(హిందీ), ఎం.ఎ.(తెలుగు)
వృత్తి: భాషాపండిట్‌
రచనలు: ఎగిలివారంగ-2008(కవిత్వం)
దందెడ-2011(కవిత్వం)