కవిత్వం

అమ్మతో మాట్లాడని మాటలు!

జనవరి 2013

 ఎవరైనా ఎప్పుడైనా అమ్మ తో మాట్లాడారా?

దివారాత్రుల నడుమ మూడో కన్నులా
నిరంతరం మెలకువ తో జీవించే అమ్మతో
ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా?

అమ్మా! నువ్వంటే నాకిష్టమని చెప్పేలోగా
నేనంటే ఎంత ప్రాణమో
ఆమె తన ప్రేమ చూపించేది….

అంతే…ఇక నేను మాట్లాడనే లేదు….
నీకేమైనా సహాయం చేయాలా అని అడిగేలోగా
నా పనులన్నీ తనే చేసి పెట్టేసేది

అంతే…ఇక నేను మాట్లాడనే లేదు….

మొదటి సారి నేను ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు
ఆమె కన్నీళ్ళ నది లో
వాళ్ళ అమ్మ రూపం కనిపించింది నాకు
నా పిచ్చి తల్లి వాళ్ళ అమ్మ కోసం
ఎంతకాలంగా బెంగెట్టుకుందో…

అంతే…ఇక నేను మాట్లాడనే లేదు….
మనం రాయని ఉత్తరాల కోసం
మనం మాట్లాడని మాటల కోసం
మనం చెయ్యని సహాయాల కోసం
మనం పొందటమే తప్ప తిరిగివ్వని ప్రేమల కోసం
మన కవితల్లో వస్తువులై, కవితా శీర్షికలై
మాతృ దినోత్సవాలకు గ్రీటింగ్ కార్డులై
అమ్మ లు అలా ఎదురు చూస్తూనే వున్నారు

నాకిప్పటికీ అర్థం కాదు
మనకు అమ్మ అపురూపమా? అమ్మకు మనం అపురూపమా?