ప్రత్యేకం

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

ఏప్రిల్ 2014

గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?
ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి మరో శైలి…

అలా వెళ్తూ వెళ్తూ ఎలాటి మార్పులొస్తాయో, ఏ కొత్త రూపాలు ఏర్పడతాయో!

మొదటి కవిత ఎవరు రాస్తున్నారు మరి?


ఇప్పుడు కావలసినది -స్వాతీ శ్రీపాద

1
ఆగిపోయినది కాలం అనుకుంటాము
కాదు
ఎక్కడి అట్టడుగు అనుభూతులలోతుల్లోనో పాతుకు పోయిన క్షణానికి
చూపుల తాళ్ళతో మనను మనమే కట్టేసుకుంటాము
పెనుగులాడి పెనుగులాడి ఊడిరాని తలపులచుట్టూ
తిరుగుతూ పోయే గుడ్డి గానుగెద్దులమవుతాము
కాలం కదులు తూనే ఉంటుంది
ఆగని చక్రాలు అమర్చుకున్న యంత్రమై
కాలం సాగుతూనే ఉంటుంది
ఆపలేని ,అడ్డం లేని నదీ ప్రవాహపు ధారలా…

2.
ఉదయపు నీరెండ పలకరింతలు అద్దు కున్న మొహం మీద
ఉండీ ఉండీ మసకలు బారే మబ్బుల గుంపులు
రాలి పడిపోతున్న నీడల మెరుపుల్లో
తొంగి చూస్తూ వెలసిపోతున్న వెలవెలలు
అసహనంగా ఊపిరాడని ఉక్కపోతలో
ఒక చల్లని మాట వీవన కోసం
బీటలు వారిని భూమి పగుళ్ళలా
లోలోపల ఒక నిలువు పగులు

౩.
ఎవరిచుట్టూ వారు మౌనాన్ని కప్పేసుకు
శీతస్వాపన సుప్తావస్తలోకి జారుకుని
ఎప్పటికో రూపవిక్రయ విధాన ధ్యానంలో
కలల తెరలు దించుకు
పరిమళాలూ పట్టు పరుపులూ స్వప్నిమ్చే క్షణాలు
చిత్రి౦చుకుంటూ
కాలం కాళ్ళకు సంకెళ్ళు వేసామనుకుంటారు

4
ఎందుకిలా సమయాన్ని గాలి బుడగల్లా ఊదిపారేస్తూ
ఈ పిల్లతనపు చేష్టలు
తెరమీద కురిసిన వానవెల్లువలో
ఎందుకలా పరవశాల మయసభలో తత్తరపాటు
తెలుసు కదా
మనకు తెలియదు ఏది మిధ్యో ఏది విద్యో?
కాలం సంగతి మనకెందుకు
మనను మనం బతికి౦చు కోడం ముఖ్యం కదా
మనకు మనం వేసుకునే శృంఖలాలు విడగోట్టుకోడం
అదికడా ఇప్పుడు కావలసినది.


మానస చామర్తి

కాలం సంగతి మనకెందుకు,
ఇలా రా – ఈ ఏటిఒడ్డు వైపు.
గులకరాళ్ళ చప్పుడొకటి అడవి గుండెల్లో
ఎన్నడూ వినని అడవి పాట ఏటి గొంతులో
వింటున్నావా?
అహ, చెవులు రిక్కిస్తే వినపడవ్.

ఎందుకు పదే పదే తలెత్తి చూస్తావ్,
సూరీడేమైనా చెప్తాడనా?
కాలం సంగతి వదిలెయ్ -
ఈ లేచివుర్ల వయసెంతో
వీచేగాలి బలమెంతో
వానచుక్క ఎందాకా ఇంకిందో
చెప్పగలవా?
అహ – సూత్రాలకు దొరకవ్.

కాసేపాగగలవా?
పరిమళపు తుఫాను మొదలవుతుంది
ఆకాశానికి కలువపూలకీ వంతెన వేస్తారెవరో
చందనం చల్లి లోకాన్ని చల్లబరుస్తారెవరో

ఇప్పుడంటే ఇలా భయపడుతున్నావ్ కానీ,
నీ గుప్పిట్లోని నా చేతిని మళ్ళీ మళ్ళీ చూస్తున్నావ్ కానీ,
అడవి దారి అర్థం కాక దిక్కులు చూస్తూ
కాలం నిను వదిలేస్తుందని దిగులుపడుతున్నావ్ కానీ,

నీ భయాల్తో, సంశయాల్తో
నిద్రపట్టక నీలాకాశంలోకి చూసినప్పుడు,
నీకూ తెలుస్తుంది,
చీకట్లో మిణుకుమిణుకుమనే వెలుగొకటి ఉంటుందని
ఆశ గట్టిదైతే ఆకాశమంతా నీ చూపుల్లో ఒదుగుతుందనీ.

అడవి దారి – అడవి పాట – అడవి చూపు
రహస్యాలన్నీ ఒక్క రాత్రిలో అర్థమయ్యాక,
రేపిక నువ్వే అంటావ్ చూడూ,
“కాలంతో మనకేం పని”


వదల్లేక-వదల్లేక -స్వాతికుమారి బండ్లమూడి

ఆకాశానికీ కలువపూలకీ వంతెన వేస్తారెవరో
నేలని నిచ్చెనగా గాలిగోడల ఆసరాగా నిలబెట్టి-
అనుకునేలోపే అంతా ఐపోతుంది
మబ్బుల చెరువు- పువ్వుల ఆకాశం
మిగిలిపోయిన కొన్ని మాటలు.

నలుపు తెలుపుల నీడలో నడిచిపోతారెవరో
అరికాళ్ల అద్దాలు అరిగిపోయేదాకా
తోవలో గులకరాళ్ళు పగిలిపోకుండా
తన అడుగులకింద తానే నలిగిపోకుండా

వీడ్కోలు వలయాల్లో పెనుగులాడతారెవరో
వెళ్లలేక పోవడాన్ని ఆపలేక పోవడంలో
వీల్లేక పోవడాన్ని వదల్లేకపోవడంలో
వేళ్లమధ్య వేళ్లలా బిగించుకుని
ఊపిరితో దాహం తీర్చుకుంటూ
నీతోనే ఉండిపోతారెవరో…


ఎప్పటికో -క్రాంతికుమార్ మలినేని

అనుకునేలోపే అంతా అయిపోయింది
బడబడమంటూ ఉరిమేసి
జలజలమంటూ రాల్చేసి
మేఘాల గుంపు ఎటో వెళ్ళిపోయింది
కావలి వాడిని తప్పుకెళ్ళిన మంద వెళ్ళినట్టు

ఆకాశం నిండుదనమంతా
నేలతడి నింపుకుంది
యుద్ధమాపిన గాలి
మళ్ళీ గుసగుసలేవో మొదలెట్టింది

ఒళ్ళు విదిలించుకుంటూ
పిట్టల జంట
ముత్యాలు కాని ముత్యాలని మోస్తూ
ఆకూ పువ్వు

నన్ను చూసి నవ్వుతున్నాయనిపిస్తుంది.

చీకటిని ఎదిరించి అలిసిపోయి
మసిబారిన బుడ్డి దీపం

బార్లా తెరుచుకుని
వేచి చూసే వీధి గుమ్మం

రెప్పవేయడం మర్చిఫోయిన
నా కనులు

మాత్రమే సాక్ష్యాలు నా నిరీక్షణకి

నీ జతలొ వానలో తడవాలన్న
ఆశ ఆశగానే ఉండి పోయింది
ఈ సారీ ఎప్పటిలానే
గుండె నిండుగా భారంగా

ఆకాశం బరువు దించింది
నేల పైనా?
నా గుండె పైనా?


నేనిలాగే – రవి వీరెల్లి

ఎడమచేత్తో “ఆకాశం బరువు దించి”
కుడిచేతి చూపుడువేలు మీద భూమిని గిరగిరా తిప్పుతూ
నువ్వలా మౌనంగా వెళ్తుంటావే
తరిగి చూడని నదిలా
పాలిచ్చి మరిపించి వెళ్ళిన తల్లిలా.

నీ మౌనం విస్తీర్ణం కొలవడానికే అనుకుంటా
విశ్వంలోని గ్రహాలన్నీ ఇంకా అలా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాయి.

ఇవన్నేవీ పట్టకుండా
నువ్వలాగే వెళ్తుంటావు.

నేనిలాగే
నాలో నేనే మొలకెత్తి
వసంతాన్నై పూసి
గ్రీష్మాన్నై తపించి
శిశిరాన్నై రాలి
వెలుగుతూ ఆరుతూ
పదానికి పదానికి మధ్య ఋతువులా కరిగిపోతూ..

నా ప్రపంచానికి
క్షణానికో సరికొత్త పొలిమేరై పుట్టే
నీ పాదముద్రలేరుకుంటూ..

నేనిలాగే!


అవినేని భాస్కర్

ఎప్పటికీ నీతోనే ఉండిపోతారెవరో
ఆ నమ్మకమే ఈ వీడ్కోలుకి పునాదయ్యింది
సెలయేరుల పాటలతో గువ్వల కువకువలతో
ఎడతెగని సంగీతాలతో విభిన్న శబ్దాలతో
అలకల అలికిళ్ళతో చేరవేసిన చుంబనాలతో
తీరిన మన ప్రణయపు ఆకలికి
కాలం మౌనాన్ని వడ్డించెళ్ళింది
సిగ్గుల కాంతిలో చిరునవ్వుల వెలుగులో
కవ్వింతల మెరుపులో కళ్ళ దీపాలలో
గోళ్ళు గుచ్చుకున్న రక్తపు ఎరుపులో
రాత్రుళ్ళని వెలిగించుకు సాగిన
మన ప్రణయపు ప్రయాణంలో
కాలం కారు చీకటి నింపెళ్ళింది

విడివిడిగా సాగిన పొడిపొడి నడకలు
ఒకరినొకరు కలుసుకోగానే
వడివడిగా చేరువయ్యాము
ఏకాంతంలో ఇద్దరం ఒక్కరయ్యాము
ఒక్క గుండెచప్పుడుతో రెండు తనువులు
ఒక్క నిద్రతో నాలుగు కళ్ళు

కాలానికి కన్ను కుట్టింది…
ఒక్క అనామక ప్రవేశం,
ఒక్క అపార్థం -
జంటలో ఒంటరితనం
కౌగిట్లో దూరం
బాగానే ఉన్నట్టు ఆహార్యం
పైకి శ్మశాన నిశబ్ధం; లోలోపల చెరో కురుక్షేత్రం
బయటపడి ప్రశ్నించుకోనివ్వని సంస్కారపు ముసుగు
రాయభారానికీ, రాజీకీ అడ్డుపడుతూ…
అందుకే.. అందుకే..
ఎప్పటికీ నీతోనే ఉండిపోతారెవరో
ఆ నమ్మకమే ఈ వీడ్కోలుకి పునాదయ్యింది!


పైకి శ్మశాన నిశబ్ధం; లోలోపల చెరో కురుక్షేత్రం – సాయి పద్మ

ఎవరి జంటరి తనం వారిదే
ఎవరి వంటరి తనమూ వారిదే
వత్తిగిల్లిన జ్ఞాపకాల కనుసన్నల్లో
నడిచే జీవితాల పనోరమా
ఉవ్వెత్తున ఉరికిన వలపు జలపాతాల్ని
దిండు గలీబుల కన్నీటి ఉప్పునూతుల్లో
మునకలేసినా..
నిజమే, ఇక్కడంతా వ్యక్తిగతం
మనసు తప్ప మిగతా అంతా పరాయితనం
హృదయమెక్కడున్నది అంటూ నిత్యం జపించే మంత్రం
హరివిల్లులకి కూడా హద్దులు నిర్ణయించేటంత వదరుతనం
సహజాతాలని తూనిక కొలతల్లో ఇరికించేటంత భావుకత్వం
పైకి శ్మశాన నిశ్శబ్దం ; లోలోపల చెరో కురుక్షేత్రం