కవిత్వం

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో..

ఏప్రిల్ 2014

బద్దకంగా పడుకున్న రాత్రిని
కోడికూతో/కోయిలపాటో తెమలమంటూ తొందర చేసింది

చీకటి దుప్పటి తొలగించుకుని ఆకాశం
వసంతం పలికిన ఆహ్వానమేదో అందినట్టు తొందరపడుతుంది

పెరట్లో చెట్టుచెట్టుకీ
చిగురులు ఒళ్ళు విరుచుకున్నాయి
రేపటి నించీ ఇక రోజులు మావేనన్నట్టు

వాకిట్లో అమ్మేసిన
మెలికల ముగ్గు హొయలు పోతుంది
భూమి చేతిపైన తానేదో అదృష్టపు గీతైనట్టు

కోయిల గానాల ఆరోహణవరోహణాలూ
పైరు మీదినించి పిల్లగాలి పరుగులు
సుప్రభాతాలాపనకి ప్రకృతి గొంతుసవరించుకున్నట్టు

వసంతం తొలిపొద్దులోనే ఇన్నిన్ని అందాలుంటే
మరి జీవితమంతా చూడగలిగితే…

(జయభేరి మొదటి భాగం – కవిత 4)