కవిత్వం

అర్థాల వసారా

మే 2014

పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు
వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి

అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను
నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు

నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు
రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం

ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే
ఎప్పుడూ పాత నీడలే

మునుపెన్నడో నేశాను
అంతరంగ పరికిణీని
ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు
ఎండిపోయిన పూల సుగంధంలా
నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ

నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటాను
కాస్తంత ఖాళీ ఉంచమని నేనొచ్చేదాకా

మనసు గుహల్లో ఎన్ని శవాలో
ప్రతి నిత్యం కాలుతుంటాయి నిర్వేదానికి వత్తాసులా
చెక్క తలుపుల మధ్యన ఓ నిండు సువాసన తెరచిమూసినప్పుడల్లా

వసారాలో ఒంటరి దూలాలు
చెదలతో రమిస్తూ
వర్షం పలకరించినపుడల్లా ఒళ్ళుతడుపుకుంటూ కొంత మట్టివాసనను లోలోపలకు తోడుకుంటూ

మరికొన్ని అక్షరాలు నగ్నంగా నానాలి కొత్త అణువుల శోధనలో