కవిత్వం

పాలరాతి ఏనుగుబోమ్మ

జనవరి 2013

పాలరాతి ఏనుగుబోమ్మ చేజారి పడిపోయింది
నర్మదానది  జలపాతం విరిగిన బోమ్మ గుండెలోంచి  దూకింది
బొమ్మ శిధిలంలో మూడేళ్లకోసారి సంచారజీవితంలా కొత్త నగరాల ప్రవేసాల జ్జాపకం
 
నగరం తనువులోకి వచ్చిపడ్దాక కొత్త ఉదయం మొదలైంది
కొత్త భాష కొత్తపరిసరం పలకమీద అ ఆ లు  దిద్దుకోవడమే
రోజులు గడిచాక నగరం అలవాట్లు ఒంటబట్టాక
కోత్త దారులను వెతుకుతుంటే  నగరంలో ఒదిగి నిశ్శబ్ధంగా పారే నది ఇసుక తీరాలవెంట
పాలరాతి బొమ్మల అంగడిలిలో నది కొత్త స్వరూపం తెలిసింది
 
పాలరాతి కొండలమధ్యలో ఇరుకు దారిలో నది నాజూకుగా వంపులు తిరిగి పలకరింస్తుంది
అనందంగా ఎగిరిపడే జలపాతాలు పాలనురుగులు
సూర్యుడి వెలుగులో నల్లని నీటి చీర అంచులలో తోంగి చూస్తున్న రెండు కొండలు
అలలమీద తేలుతూ పడవ దారిలో కరిగిపోతూ
 
పున్నమి జాతరలో నది
పడవదారి కన్నాముందు వెన్నెలవెలుగు నదిలోయలోకి దిగి
కొండల రంగులు మారుస్తూ లాంతరు దీపంలా చంద్రుడు నదిలో నడుస్తూ తోవచూపిస్తాడు
నదిలోతులు కొలవబోతే చేతివేళ్ళలో ఇమిడిన చంద్రకాంతి చేపపిల్లలా తుళ్లిపడుతుంది
నది గర్భంలో పడవ  సన్నని దారులవెంట “మయ్యాక నమస్కార్ కరో”పడవవాడి మాటలకి నవ్విన నది ఊగిసలాడింది
వెన్నెలని చలిని ఒడినిండా చుట్టుకుని పడవ దిగాక అందం దుఃఖంగా మిగిలిపోయింది
తెరలు తెరలుగా ఆవహించిన నీటిగాలి జ్జాపకమై మనసునిండా నిద్రపోయింది
 
అప్పుడు కొన్న పాలరాతి ఏనుగు బొమ్మ శిధిలాలు
మరచిపోయిన నగరాన్ని  అరచేతిలో ఉంచింది
 
                    (జబల్ పూర్ బేడాఘాట్ జ్జాపకం)