వ్యాసాలు

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం

జూలై 2014

అమెరికాంద్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను – ఉత్సాహంతోను అక్కడి కథా రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు, కవితలు వ్రాసే రచయిత్రులు కూడా అక్కడి తెలుగు సంస్కృతికి ఇతోధికసాయం చేస్తున్నాయని చెప్పవచ్చు.

అమెరికాంధ్ర సాహిత్యంలోని  కథలన్నీ అమెరికాంద్రుల జ్ఞాపకాల నుండి, ఆరాటాల నుండి, బెంగల నుంచి, స్పృశించిపోయే అనుభవాల నుండి పుట్టుకొచ్చాయి. అక్షరాల ఈ కథలు ప్రస్తుతం తెలుగు గడ్డపై వెలువడుతున్న కథలకు ఇవి భౌతికంగాను, మానసికంగాను భిన్నమైనవి. ఈ కథలలో అధిక భాగం స్త్రీ దృక్పథం నుండి కష్ట సుఖాలను విశదం చేస్తాయి. అమెరికాంధ్ర కథా రచయిత్రులందరూ రచనే వృత్తిగా కలిగినవారు కాదు. అక్కడి రచయిత్రులకిది ప్రవృత్తి మాత్రమే. ఈ రచయిత్రులకు వారు చేసే ఉద్యోగాల ద్వారా రకరకాల వ్యక్తులు పరిచయమవుతుంటారు. అమెరికాంధ్రులు పరాయిగడ్డపై  ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, వాటిని వారు ఎలా పరిష్కరించుకోగలుగుతున్నారో, ఆయా సమస్యల నుండి బయటపడే దారిలేక ఎలా బలి అవుతున్నారో తెలుసుకొని కూర్చబడిన కథలివి.

అమెరికా తెలుగు కథా పరిణామాన్నే అమెరికా తెలుగు సాహిత్య పరిణామంగాచెప్పవచ్చు. అమెరికాలో తెలుగు కథ పుట్టు పూర్వోత్తర వికాసాలను పరిశీలిస్తే – 1965 ప్రాంతపు తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన తెలుగువారు, ఆ సరికొత్త  వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తుళ్ళకులోని సాహిత్యం జోలికిపోలేదు. కానీ 1970 ప్రాంతంలో ఈ పరిస్థితులు మారి సాహిత్య సృజనకు అనుకూలమైన వాతావరణం  ఏర్పడింది. దీంతో అంతకుముందు రచనా వ్యాపకం కలిగిన వారేగాక కొత్తవారు కూడా కలంపట్టి  తమ సంఘర్షణలను కథలుగా మలచడం ఆరంభించారు.

డేబ్బయ్యో దశకంనాటికి అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య క్రమంగా పెరగడంతో అక్కడి ముఖ్య నగరాలన్నింటిలోను తెలుగు సంఘాలు ఏర్పడటం, ఆ తరువాత ఆ సంఘాలే చిన్నవో, పెద్దవో లిఖిత పత్రికలు ప్రచురించడం ఆరంభమైంది. ఆ తరువాత కొంత కాలానికి అచ్చు పత్రికలు కూడా వెలువడ్డాయి. తెలుగు భాషా పత్రిక, మధురవాణి, తెలుగు అమెరికా పత్రికల్లో ఇక్కడున్న తెలుగు కథకుల కథలు ప్రచురించబడేవి. తొంబయ్యో దశక ప్రారంభంలో వెలువడిన తానా పత్రిక, ఆ తరువాత కొంతకాలానికి వెలువడిన అమెరికా భారతి, తెలుగు జ్యోతి, తెలుగు వెలుగు, తెలుగు పలుకు, ఇంద్ర ధనుస్సు, తెలుగువాణి పత్రికలు వెలుగు చూసాయి. ఈ పత్రికలన్నీ తెలుగు కథకు అగ్రతాంబూలన్ని ఇచ్చాయి. ఈ మాట, కౌముది, తులిక లాంటి  వెబ్ జర్నల్స్ కూడా అమెరికాంధ్ర రచ రచయితలను/ రచయిత్రులను ప్రోత్సహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.

తొలితరం అమెరికాంధ్ర రచయిత్రులు మొదట్లో పుట్టినగడ్డకు దూరం ఉండటం వల్ల ఆ జ్ఞాపకాలు, అనుభూతులు ఒకరితో మరొకరు పంచుకోవాలనుకున్నారు. అందుకు ప్రారంభంలో చిన్నగా ఏర్పడిన తెలుగు సంఘాలు, వాటి సావనీర్లు ఆలంబన అయ్యాయి. కాబట్టి తొలుత చాలా మంది నాస్టాల్జియాతో రచనలు చేశారు. దాదాపు 25,30 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న తొలితరానికి చెందిన ఇప్పటికీ ఆ ప్రపంచం నుండి బైటపడలేకపోతున్నారు.  ఈ తరం వాళ్ళు ఏం రాసినా మాతృదేశంతో వాళ్ళ మానసిక సాన్నిహిత్యం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుండి వీరు భౌతికంగా విదేశంలో వున్నా మాతృ దేశపు మూలాల్ని మరిచిపోలేదు. దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంటి లాంటి వాళ్ళు పూర్తిగా మాతృదేశపు జ్ఞాపకాలతో కథలు రాశారు. మొదటి తరం వాళ్ళు ఈ దేశం వచ్చేటప్పటికీ తెలుగు వారి సంఖ్యా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువగా వుండటం, అప్పుడు ఆంధ్రదేశంలో వున్నా తీరు, వాళ్ళు వచ్చ్జినప్పుడు అమెరికా వున్నా తీరు – ఇవన్నీ కూడా తొలితరం రచయిత్రులు ఎలాంటి కథలు రాసారన్న దానికి స్పష్టమైన ఆధారం. అమెరికాకు వచ్చిన మొదట్లో వ్యక్తిగతంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా నిలదొక్కుకోవడానికి మొదటితరం వారు పడిన సంఘర్షణ, దాని తాలూకు అనుభవాలు తర్వాత వచ్చిన తరాల వారికి ఉపయోగాపడ్డాయి.

1990 సంవత్సరం తరువాత వచ్చిన రెండోతరం కథకుల కథల్లో నాస్టాల్జియా భావనలు కనిపించడం లేదు. కొత్త దేశంలో తమకు ఎదురయ్యే సరికొత్త అనుభవాలను, పాత అనుభవాలను సమన్వయం చేస్తూ, ప్రతి విషయాన్ని కొత్త కళ్ళతో పరిశీలిస్తూ వ్రాసే డైస్పోరా కథాసాహిత్యం వెలువడటం ప్రారంభమైంది. 1998 అట్లాంటాలో జరిగిన ప్రప్రథమ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, 2000 చికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ భావనలకు బలాన్ని ప్రసాదించింది.

ఉత్తర అమెరికాలోని తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే సంకల్పంతో 1994లో ఆవిర్భవించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలుగుకథకు రాజ గౌరవాన్ని కలుగజేసింది. ఈ  ఫౌండేషన్ కృషితోనే 1995 జులైలో అమెరికా తెలుగు కథానిక – మొదటి సంకలనం వెలుగు చూసింది. అమెరికాలో వెలువడిన మొట్టమొదటి కథా సంకలనం కూడా ఇదే కావడం విశేషం. ఈ ఫౌండేషన్ వారే ఏటేటా కథా పోటీలను నిర్వహించి బహుమతులు ఇవ్వడమే గాక, కథా సంకలనాలుగా కూడా ప్రచురిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ 11 కథా సంకలనాలను ప్రచురించారు. ఈ కథా సంకలనాలలో అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలకు సముచిత స్థానం దక్కింది.

వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన “20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం” అనే పుస్తకం ఒక అద్భుత ప్రయోగమేనని చెప్పాలి.  ప్రారంభ దశలో అమెరికాలోని తెలుగు కథా రచయితలు/ రచయిత్రుల కథలను సాహితీ లోకానికి పరిచయం చేసిన మహత్తర గ్రంథమిది. 1970వ సంవత్సరంలో అమెరికా నుండి వెలువడిన తెలుగు భాషా పత్రికలో చెరుకూరి రమాదేవి - పుట్టిల్లు, కోమలాదేవి – పిరికివాడు కథలు ప్రచురించబడ్డాయి. ఈ కథలు భారతీయ కుటుంబ నేపథ్యంలో వ్రాయబడిన కథలు.

అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రుల సృజనాత్మకత శక్తిని వెలికితీయడంలోనూ, ప్రోత్సహించి ఉత్సాహపరచడంలోనూ ఈ ఫౌండేషన్ గణనీయమైన పాత్రను పోషించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. చిమట కమల – “అమెరికా ఇల్లాలు“,  పూడిపెద్ది  శేషుశర్మ – “ప్రవాసాంధ్రుల ఆశాకిరణం”, దశిక శ్యామల – “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” మొదలైన  కథా సంకలనాలను కూడా వంగూరి ఫౌండేషన్ వారే ప్రచురించారు. మరి ముఖ్యంగా పూడిపెద్ది  శేషుశర్మ  అమెరికాంధ్ర జీవితంలో భిన్న పార్శ్వాలను  కథా వస్తువులుగా స్వీకరించి విశ్లేషణాత్మకంగా కథల రూపంలో ఆవిష్కరించిన తీరు అభినందనీయము.

సంప్రదాయబద్ధంగా స్వదేశంలో పెరిగి, పెళ్లి పేరుతో తమ సంస్కృతి – సంప్రదాయాలకు – ఆచార వ్యవహారాలకు ఎంతో భిన్నమైన వాతావరణంలోకి అడుగిడిన తెలుగింటి ఆడపడుచుల మనోభావాలను కథల రూపంలోను – కబుర్ల రూపంలోను అందించే ప్రయత్నాన్ని కొంతమంది అమెరికా తెలుగు కథా రచయిత్రులు చేశారు. ఐతే ఈ కబుర్లు – కథలు ఈనాటి అమెరికా తెలుగింటి ఇల్లాళ్ళుకు వర్తించకపోవచ్చు. ఎందుకటే నేడు అమెరికాకి వస్తున్న ఆడపిల్లల తరహాయే వేరు. అంతేగాకుండా ఇప్పటి భార్యాభర్తల మధ్య చదువు పరంగా – ఆర్థికపరంగా – సంస్కృతి పరంగా పెద్ద ఏమీ ఉండటం లేదు. కానీ పాత రోజుల్లో ప్రవాసాంధ్రులుగా అమెరికాలో స్థిరపడటానికి వచ్చిన భార్యాభర్తల మధ్య చదువులోను, సంప్రదాయంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువుగా వుండేది. ఆ రోజుల్లో మగవారందరూ పెద్ద చదువుతో అమెరికాకి వచ్చి, ఇక్కడకు వచ్చి కూడా చదువుకునేవారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కువ మంది కొద్దిపాటి చదువుతో, అప్పటి వరకు తమ గ్రామ పొలిమేరలు కూడా దాటకుండా అమాంతం అమెరికాకి వచ్చిన ఆడపిల్లలే.

ఈ తెలుగింటి గృహిణులు క్రమంగా ఆంగ్ల భాష నేర్చుకొని, చదువులు చదువుకొని తమ జ్ఞానాన్ని – పరిజ్ఞాన్ని పెంపొందింజేసుకొని అమెరికా జీవన స్రవంతిలో మమేకమైనారు. ఈ గృహిణులు పరాయి గడ్డపై నా అనే వారి తోడు లేకుండా, ఒకరి మీద ఆధారపడకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. భారతీయ కుటుంబ విలువల్ని – సంస్కృతి – సంప్రదాయాలను పరాయి గడ్డపై పదిలపరిచే ప్రయత్నంలో విజయం సాధించారు. అనేక సంవత్సరాల అమెరికా జీవితంలో తమకు స్వయంగా ఎదురైన అనుభవాలను అక్షరాలుగా మలిచి కథా సంకలనాల ద్వారా పాఠకుల  ముందుంచే ప్రయత్నం చేసిన రచయిత్రులు అభినందనీయులు. ఈ అనుభవాలు కేవలం వ్రాసిన రచయిత్రులవి మాత్రమే కాదు. అమెరికాలో వున్నా తెలుగింటి ఇల్లాళ్ళందరివి.

పురాణం సుబ్రమణ్యశర్మ “ఇల్లాలి ముచ్చట్లు” రచనను అనుసరిస్తూ దశిక శ్యామలాదేవి చేసిన అద్బుతప్రయత్నమే ఈ “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” సంకలనం. తెలుగింటి ఆడపడుచులు అమెరికాకు వెళ్తున్న తొలినాళ్ళలో మధ్య తరగతి కుటుంబం నుండి మధ్య తరగతి చదువుతో, మధ్య తరగతి ఆలోచనలతో పరాయి గడ్డపై అడుగుపెట్టిన తెలుగింటి ఆడపదుచుల మనోభావాలకు – మానసిక సంఘర్షణలకు అక్షర రూపం ఈ “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” సంకలనం.

మన దేశం అయినా అమెరికా అయినా ప్రతి సంసారంలోను బాధలు, సుఖాలు, చిరునవ్వులు ఉంటాయి. ఐతే అమెరికా లాంటి భిన్న వాతావరణంలోకి అడుగు పెట్టిన అమెరికాంధ్ర కుటుంబాలలోని కష్టాలు – కన్నీళ్లుణు కమ్మని కబుర్లు రూపంలో చిమట కమల “అమెరికా ఇల్లాలు” సంకలనం ద్వారా పాఠకుల ముందుంచారు. అమెరికాలోని తెలుగింటి ఇల్లాళ్ళ సాధక బాధలను ఈ సంకలనం ద్వారా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశారు. అనేక సంవత్సరాల అమెరికా జీవితంలో రచయిత్రి తనకు స్వయంగా ఎదురైన అనుభవాలను అక్షరాలుగా మలిచి ఈ సంకలనం ద్వారా పాఠకుల ముందుంచారు.

1977 నుంచి జరుగుతున్న ద్వైవార్షిక తానా సమావేశాలు – 1991 నుండి జరుగుతున్న ఆటా సమావేశాలు – ఈ మధ్యే జరుపుకుంటున్న అనేక తెలుగు సంఘాల రజతోత్సవాలు – ఆ రజతోత్సవాలు సందర్భంగా ప్రత్యేక సంకలనాలు ప్రచురించడం ఆనవాయితీగా మారింది. ఈ పత్రికలు, ప్రత్యేక సంచికలు కూడా వీలైనంత వరకు అమెరికాంధ్ర కథా రచయిత్రులను ప్రోత్సహిస్తున్నాయి.  అమెరికాలోని తెలుగు రచయిత్రులు చాలా మంది తెలుగుదేశపు పత్రికల్లో తమ రచనలను ప్రచురిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కలుపుకుంటే అమెరికాంధ్ర  కథా రచయిత్రులు సృష్టించిన తెలుగు సాహిత్యం రాశిపరంగా గణనీయంగానే వుంది. అమెరికాంధ్ర  సాహిత్యంలో అధిక భాగాన్ని ఈ కథలే ఆక్రమించాయి.

అమెరికా తెలుగు కథల్ని ప్రచురితమైన క్రమంలో పరిశీలిస్తే – మొదటి తరం అమెరికా తెలుగు కథలలో ముఖ్యంగా కనిపించేది కల్చర్ షాక్ కథలు.  కల్చర్ షాక్ కథలు తర్వాత నెమ్మదిగా అమెరికాలోని తెలుగు కుటుంబాల జీవనానికి సంబంధించిన కథలు రావడం మొదలైనాయి. పిల్లల పెంపకంలో ఉండే ఇబ్బందులు, మారుతున్న భార్య – భర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎదురౌతున్నఅవస్థలు, అమెరికాలో అతిథులతో ఇబ్బందులు, అమెరికా నుండి ఇండియాకి వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలు కథా వస్తువులయినాయి. ఆ తరువాత విడాకులు, వృద్ధాప్యం, ఉద్యోగ విరమణ వస్తువులుగా కథలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అమెరికాతెలుగు కథలు చాలా వరకు తెలుగు పాత్రలకు, తెలుగు కుటుంబాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నాయి. అమెరికన్ పాత్రలు, అమెరికన్ ప్రపంచం ఈ కథలలో అరుదుగా కనిపిస్తాయి.

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలను ఇతివృత్తాలను ఆధారం చేసుకొని కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.

1. అమెరికన్ సంస్కృతిలో మమేకమైన – మమేకం కాని జీవితాలను చిత్రించిన కథలు :-   భారతీయ వాతావరణంలో పుట్టి పెరిగిన మహిళలు అమెరికాకు వచ్చినప్పుడు ఆ సరికొత్త వ్యవస్థకు, పద్ధతులకు అలవాటు పడటానికి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడతారు. ఐతే రెండు, మూడు సంవత్సరాలు  గడిచిన తరువాత వారు కూడా ఆ సమాజానికి అలవాటుపడి, అక్కడి వాతావరణంలో మమేకమైపోతారు. మరి కొంత మంది  మహిళలు తమ వారికి  దూరంగా ఉండలేక అక్కడి వాతావరణానికి  – పద్ధతులకు ఇమడలేక ప్రవాస ఖేదాన్ని అనుభవిస్తుంటారు. ఎలాంటి మహిళల జీవితాలను, వారి ఆలోచనలనల లోతులను వెల్లడించే ప్రయత్నాన్ని కొందరు రచయిత్రులు చేశారు. దశిక శ్యామలాదేవి  –  ’జానకి’, చిమట కమల – ‘అమెరికా ఇల్లాలు’, రాధిక శాస్త్రి  – ‘జీవన వాహిని’, సునీతారెడ్డి – ‘అమెరికాలో మొదటి రోజు’, కృష్ణ ప్రియ – ‘న్యూయార్క్ చేరిన అనుభవం’, కనుపర్తి దీప్తి  – ‘ఏ తీరుగా నను’  మొదలైనవి.

2. తరాల మధ్య సంఘర్షణలను చిత్రించిన కథలు :- భారతదేశంలో పుట్టి పెరిగి అమెరికాకు వెళ్లి స్థిరపడిన భారతీయ మహిళ తొలి తరానికి – అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలలో పుట్టి పెరిగిన రెండవ తరానికి అనేక విషయాలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో వుండే ఈ రెండు భిన్న తరాల మధ్య విద్య – సంస్కృతి – వివాహా తదితర విషయాలలో అనేక భేదాలు పొడ చూపుతున్నాయి. ఈ రెండు తరాల వ్యక్తుల మానసిక సంఘర్షణలను చిత్రిస్తూ అమెరికాంధ్ర కథా రచయిత్రులు కొన్ని కథలను వ్రాసారు. పూడిపెద్ది  శేషుశర్మ- ‘అభాసులు – అభాతలు’, ‘నిర్ణయం’, ‘పదహారేళ్ళ వయస్సు’, ‘సంఘర్షణ’, ‘దృక్పథం’, నోరి రాధిక – ‘విలువలు’, ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’, ‘తికమక’, కామేశ్వరీదేవి – ‘తీర్పు’, మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని – ‘ఈ తరం కథ’  మొదలగు కథలు ఈ కోవకు చెందినవి.

3. వివాహ సమస్యలను చిత్రించిన కథలు:- అమెరికాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలలో వారి పిల్లల వివాహా సమస్య వారిని ఎంతగానో వేధిస్తుంది. అందులోనూ ఆడపిల్లల వివాహ విషయంలో ఈ సమస్య అనేది మరింత అధికంగా వుంది. అమెరికాంద్రుల వివాహ సమస్యను కేంద్రంగా చేసుకొని అమెరికాంధ్ర  రచయిత్రులు తమ తమ దృక్కోణాల్లో కథలను తీర్చిదిద్దారు. పూడిపెద్ది శేషుశర్మ –  ’అన్వేషణ’, ‘పెళ్లి చేసుకుంటే చూడు’, సుధేష్ణ –  ’మొగుడు కావాలా’, జొన్నాళ్ లలితా- ‘పి.పి.అమ్మ’, రాధిక నోరి – అబ్బాయి పెళ్లి , అరుణా గల్లా – ‘అమెరికా సిటిజన్’, నళిని అదితం – ‘హరిణి’ ఈ కోవకు చెందిన కథలు.

4. వృద్ధాప్య సమస్యలను చిత్రించిన కథలు:- అమెరికాకు  తరలిపోయిన తొలితరం వారు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైనది వృద్ధాప్య ఒంటరితనం. అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలలో అక్కడి ఒంటరి వృద్దాప్య హృదయాల లోతులను కూడా చక్కగా ఆవిష్కరించింది. పూడిపెద్ది  శేషుశర్మ – ‘చిరుదీపం’, ‘ముసురు చీకట్లో మెరుపుకిరణం’, ‘వానప్రస్థాశ్రమం’, కోమలాదేవి – ‘జవాబు లేని ప్రశ్న’ కథలు ఈ కోవకు చెందినవి.

5. మధ్య వయస్సు ఒంటరితనానికి పరిష్కారం చూపిన కథలు:- అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలలోని కొందరు వ్యక్తులను వేధిస్తున్న సమస్యల్లో మధ్య వయస్సు ఒంటరితనం ఒకటి.  మధ్య వయస్సు ఒంటరితనానికి పరిష్కారం చూపుతూ అమెరికాంధ్ర కథా రచయిత్రులు  కొన్ని కథలు వ్రాసారు. ఈ కథలలో చాలా కథలు ఈ సమస్యకు పరిష్కారంగా పునర్వివాహాన్ని సూచిస్తున్నాయి. పూడిపెద్ది శేషుశర్మ – ‘ఎండమావులు’, ‘కొత్తగా రెక్కలొచ్చనా’, ‘అనుబంధం’, నోరి రాధిక – ‘న్యాయం’, ‘అకాల వసంతం’, సుధేష్ణ  – ‘చైతన్యం’, సూర్యదేవర ప్రమీల – ‘తోడు – నీడ’, రెంటాల కల్పన – ‘అయిదో గోడ’  మొదలైనవి.

6. విభిన్న సంస్కృతుల వివాహ సమస్యలను చిత్రించిన కథలు:-  వేర్వేరు దేశాలలో, వేర్వేరు సంస్కృతులలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం ద్వారా ఒకటయితే వారి మధ్య తలెత్తే సమస్యలను గూర్చి – ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన తీరును గూర్చి, కలిసి మెలిసి జీవించాల్సిన ఆవశ్యకతను గూర్చి కథా రచయిత్రులు కొన్ని కథలు వ్రాసారు. యార్లగడ్డ కిమీర – ‘వీడిన నీడలు’, సాయి లక్ష్మి  – ‘ఒయ్యారం’, రాణీ సంయుక్త – ‘వంచన’, కాళ్ళకూరి సాయిలక్ష్మీ – ‘ఇ అ’ పెళ్ళి, కడప శైలజ – ‘మళ్ళీ పెళ్ళి’   ఈ కోవకు చెందిన కథలు.

7. భార్యాభర్తల అనుబంధాలను చిత్రించిన కథలు:-  అమెరికాలాంటి  విదేశాలకు వెళ్ళినప్పుడు భార్య భర్తల బాధ్యతలు మరింత పెరుగుతాయి. దేశం కాని దేశంలో భార్య – భర్తల మధ్య వుండాల్సిన  ప్రేమానురాగాలను గూర్చి, బాధ్యతలు పంచుకోవాల్సిన తీరును గూర్చి, సర్ధుకుపోవాల్సిన ఆవశ్యకతను గూర్చి కొందరు అమెరికాంధ్ర రచయిత్రులు తమ కథలలో తెలియజేసారు.  పూడిపెద్ది శేషుశర్మ – ‘సర్ ప్రైజ్’, ‘అగాధం’, అయ్యగారి రమామణి – ‘కల నుండి ఇలకు’, పుచ్చా అన్నపూర్ణ  – ‘పెళ్ళి’, కనకదుర్గ –  ’హెన్ పెక్డ్’ మొదలైన కథలు ఈ కోవకు చెందిన కథలు.

8. గృహహింసను చిత్రించిన కథలు:-  లక్షల కట్నాలు కుమ్మరించి సంపాదించుకున్న భర్తలు తమకు రక్షణ ఇవ్వకపోగా మానసికంగాను, శారీరకంగాను హింసలకు గురి చేస్తుంటే  పరాయి దేశంలో తమ బాధలను పంచుకొనేవారు లేక, స్వదేశంలోని తల్లిదండ్రులకు చెప్పుకోలేక మూగ బాధను అనుభవిస్తున్న గృహిణులను కేంద్రంగా చేసుకొని అమెరికాంధ్ర రచయిత్రులు కొన్ని కథలను సృజించారు. కొవ్వలి జ్యోతి  – ‘తరతరాల కథ’, పూడిపెద్ది శేషుశర్మ – ‘చీకటి వెలుగులు’, చెరుకూరి రమాదేవి – ‘శ్యామ’, పొన్నలూరి పార్వతి – ‘ఇది కథ కాదు’ మొదలైనవి.

9. సాంస్కృతిక విలువలను వెల్లడించిన కథలు:- పరాయిగడ్డ పై సొంత సంస్కృతిని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ అమెరికాంధ్ర కథా రచయిత్రుల కలం నుండి కొన్ని కథలు జాలువారాయి. ఒకతరం నుండి మరొక తరానికి సంస్కృతిని అందించాల్సిన ఆవశ్యకతను గూర్చి ఈ కథలు నొక్కి చెబుతాయి. నిడదవోలు మాధవి – ‘ఉభయ భాషా ప్రవీణ’, పూడిపెద్ది శేషుశర్మ – ‘ఆశాకిరణం’, ‘ఉగాది పచ్చడి’, దేశభొట్ల ఉమ – ‘చేతులు కాలాక ఆకులు’, కొవ్వలి జ్యోతి – ‘గణేష్ బర్త్  డే’, గల్లా అరుణ – ‘తలక్రిందులైన సంస్కృతి’, చిమట కమల – ‘భాష కందని మనిషి’, ఆదిరాజు ప్రియ – ‘వినాయక వ్రత కల్పము’ మొదలైనవి.

10. అమెరికా విద్యా విధానం పట్ల అవగాహన కలిగించు కథలు :- పాఠ్య ప్రణాళికలలోను, బోధనలోను, పరీక్ష విధానంలోను భారతీయ విద్యా విధానానికి – అమెరికా విద్యా విధానానికి ఎంతో తేడా వుంది. అమెరికన్ విద్యా విధానంలోని విశేషాలను కథల రూపంలో అందించే ప్రయత్నం కొందరు కథా రచయిత్రులు చేశారు. యర్రమిల్లి దుర్గా - ‘జీవిత చక్రం’, రెంటాల కల్పన – ‘టింకూ ఇన్ టెక్సాస్’, నిడదవోలు మాలతి - ‘చివురు కొమ్మ చేవ’  మొదలైన కథలు ఈ కోవకు చెందిన కథలు.

11. మాతృభూమి పట్ల మమకారాన్ని వెల్లడించే కథలు :-  ’జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనే సూక్తిని అమెరికాంధ్ర కథా రచయిత్రులు మరువలేదు. వ్యక్తులుగా వీరు అమెరికాలో వున్నప్పటికీ, వారి మనస్సు మాత్రం మాతృదేశంలోనే వుంటుంది. మాతృభూమిని ప్రేమించడంలోనూ, జాతీయ భావాలు కలిగి ఉండటంలోను స్వదేశంలోని భారతీయులకు ఏ మాత్రం తీసిపోరు. మాతృభూమి పట్ల తమకున్న అభిమానాన్ని అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలలో వ్యక్తం చేశారు. మాచిరాజు సావిత్రి - ‘పాస్ పోర్ట్’, పూడిపెద్ది శేషుశర్మ – ‘లోభి’, కొమరవోలు సరోజ – ‘ఏ కథ వ్రాయాలి?’, విజయలక్ష్మీ రామకృష్ణన్ – ‘మనసు – మనుగడ’, అనంతు శివ పార్వతి – ‘వేప చెట్టు’, సంగాసాని జయ – ‘వెనుదిరిగితే?’ మొదలైనవి.

12. వ్యక్తుల  వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చిత్రించిన కథలు :-   భారతదేశం నుండి వలసపోయి అమెరికా లాంటి అత్యాధునిక సమాజంలో జీవిస్తున్నప్పటికీ, వ్యక్తులు తమకు స్వతహాగా అలవడిన గుణాలకు ఏ మాత్రం దూరం కాలేకపోతుంటారు.  తమ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకొని నిరాశ చెందటం, తాము చేయలేక పోయినా చేసిన వారిని నిందించడం, అసూయతో వ్యక్తుల ఎదుగుదలను అడ్డుకోవడం, పొరుగింటి పుల్లకూర తియ్యననే చందాన ఆలోచించడం మొదలైన అంశాలు ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను తేటతెల్లం చేస్తాయి.   పూడిపెద్ది శేషుశర్మ – ‘కుక్కతోక’, ‘తృప్తి’, రాధిక నోరి – ‘అలవాటు’, ‘పండుగ’, ‘పొరుగింటి పుల్లకూర’, ఎస్. విజయ – ‘ఊరు మారినా’ మొదలైన కథలు.

13. మాతృ ప్రేమను చిత్రించిన కథలు :- అమెరికాకు వెళ్ళిన భారతీయ ఆడపడుచులు వారి కాన్పుల కోసం, తమ పిల్లలను జాగ్రత్తగా పెంచడం కోసం మాతృదేశంలోని తమ మాతృమూర్తులను  అమెరికాకు పిలిపించుకోవడమనేది సర్వ సాధారణ విషయం. కాన్పులు తదితర సమయాలలో సహాయంగా ఉండటానికి అమెరికాలోని భారతీయ భర్తలు తమ అత్త గారిని ఆహ్వానించడానికి చూపుతున్న ఆసక్తి, తమ తల్లులను  పిలిపించుకోవడానికి చూపడం లేదనే ఆవేదనను అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథల ద్వారా వ్యక్తం చేశారు. రాధిక శాస్త్రి  – ‘సోషల్ సెక్యూరిటీ – సీక్రెట్ కౌ’, కొమరవోలు సరోజ – ‘మాతృదేవోభవ’, ములుకుట్ల గునుపూడి అపర్ణ – ‘ఘర్షణ’ మొదలైనవి ఈ కోవ చెందిన కథలు.

14. స్వదేశంలోని బంధుప్రేమలను చిత్రించిన కథలు:- స్వదేశంలోని రక్త సంబంధీకులు, బంధువులు అమెరికాలో ఉన్న తమను కేవలం వారి అవసరాలను తీర్చే కల్ప వృక్షాలుగా భావిస్తున్నారనే నిరసన కొందరు అమెరికాంధ్ర కథా రచయిత్రులు కథలలో కనిపిస్తుంది.  అమెరికాలో తామేదో డాలర్లలో మునిగి తేలుతున్నామని స్వదేశంలోని బంధువులు అనుకుంటారే తప్ప, తమకు కష్టనష్టాలు ఉంటాయని వారు ఏమాత్రం గ్రహించడంలేదనే ఆవేదన ఈ కథలలో వ్యక్తమవుతుంది. అట్లే కొందరు రచయిత్రులు స్వదేశంలోని రక్త సంబంధీకుల – బంధువుల స్వచ్ఛమైన ప్రేమలను కూడా తమ కథలలో చక్కగా వివరించారు. కొమరవోలు సరోజ – ‘ఉష్ణేణ ఉష్ణం శీతల’, నోరి రాధిక – ‘ఆట’ మొదలైనవి.

పైన పేర్కొన్న అంశాల మీదనే గాక కట్నాలను గూర్చి, కులాన్ని గూర్చి, సాంస్కృతిక విభేదాలను గూర్చి, ఉద్యోగాలను కోల్పోయి స్వదేశానికి తిరిగొచ్చే వారిని గూర్చి……………తదితర అంశాల నేపథ్యంలో కూడా అమెరికాంధ్ర  కథా రచయిత్రులు రచనలు చేశారు. అమెరికాలో గోంగూరను పెంచితే ఎంత ప్రమాదమో చెరుకూరి రమాదేవి – ‘గోవింద! గోవింద! గోంగూరా! గోహోవిందా’, అమెరికాలో డబ్బు సంపాదించుకొని స్వదేశానికి వచ్చి స్థిరపడాలనే కోరిక దాదాపు అక్కడికి వెళ్ళిన ప్రతి భారతీయునిలోనూ వుంటుంది. అట్టి అమెరికాంధ్రుల కోరికను కథా వస్తువుగా గ్రహించి స్రవంతి తీర్చిదిద్దిన కథ ‘లక్ష డాలర్లు’.  యువతీ యువకుల సాన్నిహిత్య  సంబంధాలు అనేవి అమెరికా – భారతదేశాలలో ఒకే రకంగా లేవని, అవి పరస్పర విరుద్ధమైన పోకడలతో ఉన్నాయని పూడిపెద్ది శేషుశర్మ – ‘తూర్పు పడమరలు’ అనే కథ తెలియజేస్తుంది. తమవైన అనుబంధ, ఆప్యాయతలను తమవిగా చెప్పుకోలేక, తమదికాని దాని కోసం పరుగులు తీసే దురదృష్టవంతులు కొందరు ఉంటారని సూరంపూడి అనంత పద్మావతి ‘వెకేషన్’ కథ తెలియజేస్తుంది.

పైన పేర్కొన్న అమెరికాంధ్ర కథా రచయిత్రులలో చాలా మంది అటు అమెరికా నేపథ్యంలోను – ఇటు భారతీయ నేపథ్యంలోను కథలు వ్రాస్తున్నారు.  కేవలం కొద్దిమంది అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలను గూర్చి మాత్రమే ఈ వ్యాసంలో ప్రస్తావించబడినది. అలాగే కేవలం అమెరికా  సమాజ – కుటుంబ జీవన నేపథ్యంలో వ్రాయబడిన కథలను గూర్చి మాత్రమే ఈ వ్యాసంలో విశ్లేషించబడినది.   భారతీయ సమాజ – కుటుంబ నేపథ్యాలను ఇతివృత్తంగా చేసుకొని చక్కని కథలను వ్రాస్తున్న అమెరికాంధ్ర కథా రచయిత్రులు చాలా మందే వున్నారు. వ్యాస పరిధిని దృష్టిలో పెట్టుకొని వారిని గూర్చి ప్రస్తావించలేకపోతున్నాను. క్షంతవ్యుడిని.

అమెరికాంధ్ర కథాసాహిత్యంలో అమెరికాంధ్ర కథా రచయిత్రులు పోషించిన పాత్ర అగ్రగణ్యమైనదనే చెప్పాలి. 1975 ప్రాంతం నుండి అమెరికాంధ్ర కథా రచయిత్రులు కథలు వ్రాయడం ప్రారంభించారని అనుకుంటే నాటి నుండి నేటి దాక ఎంతో మంది అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలతో అమెరికా తెలుగు కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈనాడు అమెరికాంధ్ర కథా రచయిత్రులు చాలా ఎక్కువ మందే వున్నారు. వీరంతా మంచి ఉత్సాహంగా కథా సృజన చేస్తున్నారు. వీరు సంస్కృతుల మధ్య వారధులు కడుతున్నారనడం కంటే తరాల మధ్య వారధులు కడుతున్నారనడం సమంజసం.

అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులలో చాలా మంది అక్కడి తెలుగు వారి జీవనానికి సంబంధించిన కుటుంబిక ఇతివృత్తాలతోనే కథలు వ్రాసారే తప్ప, వర్తమాన సాంఘిక – రాజకీయ – ఆర్థిక విషయాలను స్పృశించినట్లు కనిపించడం లేదు. అంతేగాక నేడు కొత్తగా పుట్టుకొస్తున్న వివాహా వేదికలు, ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోల వంటి అంశాలపై కూడా అమెరికాంధ్ర కథా రచయిత్రులు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఎన్నారైల కట్నం వేధింపులను చిత్రిస్తూ వచ్చిన కథలు కూడా చాలా తక్కువనే చెప్పాలి.  అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు కొంచెం కథా శిల్పంపై పట్టు సాధిస్తే మరెన్ని మన్నికైన కథా రత్నాలు వెలువడే అవకాశం వుంది.

అమెరికన్ ఇమిగ్రేషన్ నియమాలలో మార్పులు వచ్చాక, తెలుగువారు అమెరికాకు వెళ్ళడం ఆరంభమైంది. ఈ దశాబ్దాలలో వారి జీవితాలలో వచ్చిన మార్పులు అవగాహన చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు పూర్తిగా అందుబాటులో లేవు. వీటిని సంగ్రహించి, విశ్లేషించి ప్రకటించే పరిశోధకులు ఇంకా బయలుదేరలేదనే చెప్పాలి. ఈ కొరతను కొంత వరకు అమెరికా తెలుగు కథా సాహిత్యం తీర్చిందనుటలో ఎట్టి సందేహం లేదు.

తెలుగు సాహిత్యంలో అమెరికాంధ్ర కథా సాహిత్యమనేది ఓ పాయ. దళిత, స్త్రీ, మైనార్టీ ఉద్యమాలలో భాగంగా అమెరికాంధ్ర జీవితం గురించి అమెరికాలోనూ – స్వదేశంలోనూ సరైన చర్చ జరిగినప్పుడే వర్తమాన తెలుగు సాహిత్య స్వరూపం మరింత స్పష్టమవుతుంది. అమెరికాలోని తెలుగు సంఘాల వారు, సాహితీ సంస్థల వారు పూనుకొని అమెరికాంధ్ర తెలుగు రచయిత్రుల సాహితీ సదస్సును నిర్వహిస్తే బాగుంటుంది. ఈ రచయిత్రులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, సమగ్రమైన చర్చ జరిపితే భవిష్యత్తులో వెలుగు చూడబోయే అమెరికాంధ్ర సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన వారౌతారు.  ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో జరుగుతుందని ఆశిద్దాం. అమెరికాంధ్ర తెలుగు సాహిత్యం దిన దిన ప్రవర్ధమానమై  వెలుగొందాలని మనసారా కాంక్షిద్దాం.

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
M.A,M.Phil, Ph.D.

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)