మర్మస్థానం అనబడే జన్మస్థానం
ఇరుకుగోడల నడుమ నుండి శీర్షాసన భంగిమలో
బయటకు నెట్టబడటంతో ప్రారంభమైన
ప్రతి జీవనయానం ఒక అగమ్యగోచర ప్రస్థానం
ఉమ్మనీటి మాయాపొరల్ని కర్కశంగా చింపేసి
నవమాసాల మౌనధ్యాన రంగస్థల గర్భకుటీరాన్ని
నిర్భయంగా నిర్దయగా కూల్చేసి
స్వేచ్ఛకోసం ఈ అనంతకోటి బ్రహ్మాండంలోకి
తనను తానే ఐచ్ఛికంగా విసిరేసుకుంటుంది
రక్తసిక్తాభిషిక్తమైన పిండం.. దాని చేష్టలకొక దండం.
ఏడుపుతో మొదలైన జీవితం
దానితోనే అంతమవుతుందని తెలియని
వింత అమాయకత్వం దాని స్వంతం
కొత్త ప్రపంచంలో కళ్ళు తెరిచిన మరుక్షణం నుంచి
అనుబంధాల మధ్య అందమైన నవ్వుల పువ్వుల్ని
పండించే సేద్యం అప్రతిహతంగా చేస్తుంది
అంతు చిక్కని భవితవ్యాన్ని
కలతనిద్రలో కలలుగా ఆవిష్కరిస్తుంది
ఎలా తెలుసుకుంటుందో…
రోదనతోనే కడుపు నిండుతుందని
విరిసిన తన చిరు దరహాసానికే మురిసిన
హస్తాలు అప్యాయంగా అక్కున చేర్చుకుంటాయని
ఊగే వూయల ఆగినా
పాడే లాలిపాట క్షణం వినపడకపోయినా
వొడిలో నుంచి దింపినా…
తడిపెదాల్లో నుంచి స్తన్యం తీసినా
ఒంటరితనాన్ని గుర్తించి భీకరంగా గర్జిస్తూ బీభత్సం సృష్టిస్తుంది
కనిపించిన కనిపెంచిన ప్రతివస్తువునల్లా
తన కాంతి కంటి రెటీనాలతో ఫోటోలు తీసి
మెదడు ఆల్బంలో భద్రపరుచుకుంటుంది
తనవాళ్లెవరో పరాయివాళ్లెవరో గుర్తించే
చారుచక్షువుగా మారి అంతరంగపు అంతర్భాగాల్లోని
వైషమ్యాలను మృదుమధురంగా నిద్రలేపుతుంది
ఒకప్పుడు దుర్లభమనిపించిన విషయం
ఇప్పుడు సులభమైనట్లు..
రాయి పల్లానికి కదిలినట్లు దొర్లడం
బోర్లాపడి పాకుతూ
తలపైకెత్తి త్రాచులా పడగ విప్పడం
గుండ్రంగా కాటుక దిద్దిన తన నల్లటి కనుగుడ్లను
మెలమెల్లగా కిటకిటమని మిటకరించడం
సున్నితమైన తన లేలేత కాళ్ళూ చేతులని
వేగంగా ఆడించటం
పోరాట కళల వినూత్న విన్యాసాలతో
కఠోర వ్యాయమాల మయమై
నిర్విరామ చలనసూత్రమై
చిత్రవిచిత్రంగా గాత్రకచేరీ చేయటం
పన్నెండు నెలలుగా నేలపై
వక్రరేఖలా అతుక్కున్న దేహాన్ని
సరళరేఖగా నిటారుగా నిలబెట్టాలని
లెక్కలేనన్ని అవస్థలు పటం
అనేక విఫల ప్రయోగాల ఫలితంగా
తబడుతూనే తప్పటడుగులు వేస్తుంది
నైపుణ్యం పొందిన పాదాలు
పాపపుణ్యవిచక్షణ లేకుండనే
ప్రగతికొరకు జగతిపై పరుగులు తీస్తాయి
మురిపాల పాలామృత ధారలతో
పునీతమైన నాలుకపై మాతృభాష ఆశగా వేదఘోషగా
పరమపవిత్రంగా పల్లవిస్తుంది
ఇక ఆ శిశువు జీవిత పాఠాల్ని అభ్యసించేందుకు
కాంక్రీటు కాన్వెంటు ఆశ్రమాల్లో విశ్రమిస్తున్న
బోధివృక్ష ఛాయలను ఆశ్రయిస్తుంది
ఐతే మనందరి ఆనంద పర్వం అక్కడివరకే సుమా
మనం పెన్నిధిగా భావించే బాలకాండని
కాలసర్పం విధిగా యధావిధిగా మింగేస్తుంది
ఆ అద్భుత ఘట్టపు విషాదాంతాన్ని శైశవగీతంగా
వినీల గగనం విలపిస్తూ ఆలపిస్తే
ఒక అస్తమయ గేయం
పడమటి కొండల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది
ఇన్నాళ్లా ఎదలో ఉప్పొంగిన పాలకడలి
ఇంకిపోవడం అమ్మకి నెమ్మదిగా తెలుస్తుంది
మరో కొత్త బీజం అంకురార్పణకి
మాతృగర్భంలోని నెత్తురు అప్రమత్తంగా ఆయత్తమవుతుంది
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
Painting: జావేద్
ఈ కవిత చాలా గొప్ప కవిత నాకు చాలా బాగా నచ్చింది …
-స్వప్న అరెల్లి
సూపర్ బ్రదర్ చాల బాగుంది
కవి అనే కవిత్వాన్ని కవించడం ఈ కవి కలంలో వున్న అనుభవం.
చాలా బాగుంది అండి.