మన తెలుగు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 5

జూలై 2014

రమేష్ కుమార్, సురేష్ రెడ్డి. పేర్లను కొందరు ఇలా రాసుకోవటం అరుదేం కాదు. కాని అవి తప్పులు. ఎందుకంటే ఆ పేర్లలోని ఉత్తర పదాలు ‘ఈశుడు’కు చెందినవి.
రమ + ఈశుడు = రమేశుడు. సుర + ఈశుడు = సురేశుడు. కనుక రమేశ్, సురేశ్ అని రాయటమే సవ్యమైనది. అదేవిధంగా కొందరు లతా మంగేష్కర్ అని తప్పుగా రాస్తారు. లతా మంగేశ్కర్ అనేదే రైటు. చలామణిలో ఉన్నంత మాత్రాన పదాలు తప్పులు కాకుండా పోవు! ‘చెలామణి’ అటువంటిదే! చలామణీ, చలావణీ కూడా సరైనవే అని ప్రామాణిక నిఘంటువుల్లో చెప్పబడింది. చెండాలము, చెంద్రుడు, చెరించు అని కూడా రాస్తారు చాలా మంది. ఇవన్నీ తప్పులే. ‘చె’ కు బదులు ‘చ’ ఉంటేనే సవ్యంగా ఉన్నట్టు అని గ్రహించాలి. అంకురము అనే పదంలాగే అంకూరము అన్నది కూడా ఉంది. కాని అంకూరార్పణము అనకూడదు. అంకురార్పణము అనే అనాలి. నిజానికి అంకురార్పణముకు బదులు ‘అంకురారోహణము’ సరైనదని ఈ మధ్యనే భాష గురించిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. సౌరభము లాగానే సౌరభ్యము అనే పదం కూడా ఉంది. రెండింటికీ అర్థం ఒక్కటే, వాసన. అలాగే సౌగంధము, సౌగంధ్యము రెండూ రైటే. “హనుమంతుడు లంకలోని సీతాదేవికి శ్రీ రాముని అంగుళీయాన్ని నిదర్శనంగా చూపించాడు” అనే వాక్యంలో అంగుళీయము తప్పు. అంగుళీయకము సరైన పదం.

కొంత మంది అంచలంచలుగా అని రాస్తారు. కాని అది తప్పు. అంచె లేక అంచియ అంటే వరుస. కనుక ‘అంచెలంచెలుగా’ అనాలి. “ఎన్నో తరాల పాటు మా పూర్వీకులు కరణీకం చేసారు” అనే వాక్యంలో కరణీకం తప్పు కరణికము అనేదే సరైన పదం. భూమి తాలూకు యజమానిని కామందు అనటం వాడుకలో ఉన్న విషయం. కాని ఖామందు అన్నదే సరైన పదం. ఇది హిందుస్తానీ భాషనుండి వచ్చిన పదం కనుక, ‘భూఖామందు’ వైరి సమాసం అవుతుంది. భూకామందు అని వాడితే అది రెండు విధాలుగా తప్పు అవుతుందన్న మాట.

“ఏమోయ్, అంతా కులాసాయేనా?” అంటూ పలకరించటం సాధారణంగా మనం గమనించే విషయం. కాని ఖులాసా అన్న పదమే రైటు. ఈ పదం కూడా హిందుస్తానీ భాషనుండి తెలుగులోకి వచ్చింది. అయితే కులాసా అనే పదం కూడా తెలుగు భాషలో స్థిరపడిపోయింది. పూర్వం మన ఇళ్లల్లో రాగి చెంబులు, ఇత్తడి చెంబులు ఉండేవి. వాటిలో కొన్నింటిని ‘గుండు చెంబులు’గా చెప్పుకునే వారు. కాని అసలు గుండు చెంబు అనేది లేదు. సన్నని మెడను కలిగిన చెంబును ‘గిండి చెంబు’ అనీ, వెడల్పైన మూతిగల చెంబును లేక పాత్రను గుండిగ అనీ చెప్పటం సరైనది. “ఈ రోజుల్లో అంతా గూండా రాజ్యమైపోయింది. బస్తీని గూండాలు రాజ్యమేలుతున్నారు” ఇలాంటి వాక్యాలను చాలా మంది వాడుతారు. కాని గుండాలు అన్న పదమే సరైనది. గుండా అంటే ధీరుడు, శూరుడు, సాహసికుడు. “గురివింద గింజ తన నలుపునెరుగదు” అనే సామెత బాగా వాడుకలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాని, గురివింద అనే పదం తప్పు. గురిగింజ లేక గురివెంద అన్నవి సరైన పదాలు.

అణగు అంటే తగ్గు, నశించు అనే విషయం తెలియనివాళ్లు అరుదు. అనగు అనే మరో పదం ఉంది. అనగు అంటే వ్యాపించు అని అర్థం. నివృత్తి , నిర్వృతి అనేవి కూడా భిన్నమైన అర్థాన్ని కలిగిన పదాలే. నివృత్తి అంటే ఆగుదల, మోక్షము. నిర్వృతి అంటే ఊరట, ఉపశమనము. అదేవిధంగా అనేకము, అనీకము అని రెండు పదాలున్నవి. ఇవి కూడా భిన్నమైన అర్థాలను కలిగినవే. అనేకము = పెక్కు, చాలా. అనీకము = సేన, దండు. “ఈ విజయాన్ని సాధించటానికి నేను అహర్నిశలు పాటు పడ్డాను” అని ఒకాయన వాక్రుచ్చినాడనుకోండి. అది తప్పు పదమని గ్రహించాలి మనం. అహర్నిశము లేక అహర్నిశములు అనేవి సవ్యమైన పదాలు. అదేవిధంగా ‘అహోరాత్రులు’కు బదులు అహోరాత్రము అనేదే సరైన పదం. “అకస్మాత్తుగా ఆగంతకుడు లోపలికి రాగానే ఆమె భయంతో కంపించిపోయింది”- ఇట్లాంటి వాక్యాలను మనం కథల్లో, అపరాధ పరిశోధక నవలల్లో చదువుతుంటాం. కాని ఆగంతకుడు అన్నపదం తప్పు. ఆగంతుకుడు సరైన పదం. ఆగంతుకము = అనుకోకుండా వచ్చునది. సన్యాసిలాగ బతికేవాణ్ని సర్వసంగ పరిత్యాగి అనాలి, సర్వసంఘ పరిత్యాగి అని కాదు. సంగము = కూడిక, లేక చేరిక.

“రాత్రి కర్ణాటక సంగీత కచేరీ వినటానికి వెళ్లాము. కచేరీ బాగానే ఉంది కాని, పాడేటాయనకు పక్కన ఉన్న అమ్మాయి తంబూరను సరిగ్గా సుతి చేయలేదు” ఇట్లాంటి వాక్యాలను అప్పుడప్పుడు వింటుంటాం మనం. కొందరు ‘తంబురా’ అని కూడా అంటారు. కాని ఆ రెండు పదాలూ తప్పే. తంబుర లేక తంబుఱ (తంత్రి + బుఱ్ఱ) అనేవి సరైన పదాలు. తుల్యము, తౌల్యము – ఈ రెండు పదాల మధ్య భేదాన్ని గుర్తించరు కొంత మంది. “మనం తీసుకునే ఆహారంలో సమతుల్యం ఉండాలి” అనకూడదు “సమతౌల్యం ఉండాలి” అనాలి. “మన ఆహారం సమతుల్యంగా ఉండాలి” అనవచ్చు. సమతుల్యం విశేషణం (Adjective). సమతౌల్యం నామవాచకం (Noun). కొత్తిమిరి విత్తులను (కొత్తిమిర కాదు) ధనియాలు అనడం తప్పు. దనియాలు అనేది సరైన పదం.

“తిలాపాపం తలా పిడికెడు” అని ఒక సామెత ఉంది. ఇందులో తిలాపాపం అనే పదబంధం సరైనదేనా? లేక ‘తిలపాపం’ సరైనదా? భాషాజ్ఞానం బాగా ఉన్నవాళ్లే ఈ అనుమానాన్ని తీర్చగలరు. అదేవిధంగా ఆరాధనభావం అనాలా, లేక ఆరాధనాభావం అనాలా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని ఏర్పరచేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి ఎప్పుడు దీర్ఘం వస్తుంది, ఎప్పుడు రాదు? ఈ సందేహానికి వివరణ మామూలు వ్యాకరణ గ్రంథాల్లో సాధారణంగా దొరకదు. పండితులైన పాఠకులు ఎవరైనా ఈ విషయం గురించిన వివరణ ఇస్తే మనం నేర్చుకోవచ్చును. కనుక అభిప్రాయాలను, సమాధానాలను ఆహ్వానిస్తున్నాం. ఆధునిక వచన కవిత్వంలో నాగేటి చాలు అనే పదం కనిపించటం అరుదేం కాదు. అది భాషాదోషం అనుకుంటాం. కాని, నాగలి వలెనే నాగెలి, నాగేలు అన్న పదాలు కూడా మనభాషలో ఉన్నాయి!. కనుక ‘నాగేటి చాలు’ కరెక్టే.

ఒక గొప్ప వక్త గురించి చెబుతూ “అతడు అనర్ఘళంగా ఉపన్యసిస్తాడు” అనే వ్యాఖ్య చేసామనుకోండి. అందులో అనర్ఘళం అనే పదం తప్పు. అనర్గళం అన్నది సరైన పదం. కాబట్టి ‘అనర్ఘలం’లో రెండు తప్పులు ఉన్నట్టు గ్రహించాలి. నిరర్గళం కూడా అనర్గళంకు సమానమైన పదం. ఈ రెండు పదాలు అడ్డంకి లేనిది అనే అర్థాన్నిస్తాయి. అర్గళము = గడియ మ్రాను (తలుపుకు అడ్డంగా ఉంచే కర్ర). వ్యాఖ్యకు వ్యాఖ్యానముకు మధ్య స్వల్ప భేదం ఉంది. వ్యాఖ్య = అర్థ వివరణ (Comment). వ్యాఖ్యానము = అర్థ వివరణము చేయుట (Commentary). నిస్త్రాణ, నిస్త్రాణము అన్న పదాల మధ్య కూడా భేదం ఉంది. త్రాణ = శక్తి, బలము. త్రాణము = రక్షణ. కనుక శక్తి లేకపోవడాన్ని నిస్త్రాణ అనీ, రక్షణ లేమిని నిస్త్రాణము అనీ అనడం సరైనది. పక్షిని అండజము అంటారని చాలా మందికి తెలుసు. కాని నీడజము అంటే కూడా పక్షే అని తెలుసినవాళ్లు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. నీడము = గూడు. గూడులో పుట్టినది కావడం వల్ల నీడజము అయింది పక్షి. నీడోద్భవము అంటే కూడా పక్షే. “ఫలానా ప్రజా నాయకుని పార్థివ శరీరాన్ని ప్రజల సందర్శనార్థం ఫలానా గ్రౌండులో ఉంచారు” అని వార్తల్లో చెప్పటం, పత్రికల్లో రాయటం గమనిస్తుంటాం మనం. ఇందులో పార్థివకు పృథ్వీ సంబంధమైన అనే అర్థం ఉంది. అంటే ‘భౌతిక’కు దాదాపు సమానమైన పదమన్న మాట.

“ప్రయాణీకులకు విజ్ఞప్తి” అంటూ బస్ స్టాండుల్లో, రేల్వే స్టేషన్లలో రాసి ఉండటం మనం గమనించ వచ్చు. ప్రయాణం చేసేవాళ్లను ప్రయాణికులు అనాలి, ప్రయాణీకులు అనకూడదు. అదేవిధంగా యాత్రికులుకు బదులు యాత్రీకులు అని రాయడం సబబు కాదు. ఊళ్లలో ఎవరి పశువులైనా ఇతరుల పొలాల్లోకి పోయి పంట మొక్కల్ని మేస్తే, గ్రామ పంచాయతి (పంచాయితి కాదు) వాళ్లు వాటిని పట్టుకుని ఒక శాల వంటిదానిలో కట్టేస్తారు. ఆ పశువుల యజమానులు అపరాధ రుసుము కట్టితేనే వాటిని విడుదల చేస్తారు. ఆ శాలను బందెల దొడ్డి అనాలి. బంజరు దొడ్డి అన్నది సరైన పదం కాదు. బందె = పశువుల చెఱ.

ఒక స్త్రీ పాపను ప్రసవిస్తే కొన్ని రోజుల వరకు ఆమెను ‘బాలింత’గా ప్రస్తావించటం మామూలు విషయమే. కాని ‘బాలింత’ తప్పు. బాలెంత సరైన పదం. అదేవిధంగా బాలింతరాలు కాక బాలెంతరాలు అన్నది సవ్యమైన పదం. “మా ఇంట్లో బొజ్జింకల బాధ మరీ ఎక్కువైపోయింది. వాటితో వేగలేక చస్తున్నాం” అంటుంటారు కొందరు. మరికొంత మంది బొద్దెంకలు అని కూడా వాక్రుచ్చుతారు. కాని ఈ రెండు పదాలూ తప్పే. బొద్దింక లేక బొద్దీక అనేది రైటు. బొటన వేలును కొందరు బ్రొటన వేలు అనడం కూడా తప్పే. వ్యభిచారము అనే పదానికి గల పర్యాయ పదాల్లో ‘నల్ల మేక తప్పు’ అనేది ఒకటి. అయితే బ్రహ్మ రథము లాగ ఇది కూడా చాలా అసంబద్ధం అనిపించక మానదు. నల్లమేక తప్పు అనే పదబంధం ఎలా వచ్చిందో, అందులోని పదాలకూ అర్థానికీ మధ్య ఏదైన పొంతన ఉంటే అదేమిటో తెలియదు. పాఠకుల్లో ఎవరికైనా తెలిస్తే వివరణను మాకు తెలియపరచ వలసిందిగా కోరుతున్నాం.

“వచ్చే మాసంనుండి మీకు శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది. కనుక మీరు ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నారు” అని ఏ సిద్ధాంతో లేక జ్యోతిష్కుడో చెప్పవచ్చును. కాని ఉచ్ఛస్థితి తప్పు ‘ఉచ్చస్థితి’ సరైనది. ఉచ్చము = ఉన్నతము, పొడవు. విలంబము, విలంభము అనేవి విభిన్న అర్థాలున్న రెండు వేర్వేరు పదాలు. విలంబము అంటే ఆలస్యము. విలంభము అంటే త్యాగము. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలోని ఖయాళ్లలో విలంబిత్, ద్రుత్ అని రెండు భాగాలు ఉంటాయి. విలంబితము = మెల్లగా సాగునది. ద్రుతము (దృతము కాదు) = వడి గలది. అదేవిధంగా వియ్యము, వియ్యపురాలు అనే పదాలున్నవి. వాటికి సమానార్థకాలైన వీయము, వీయపురాలు కూడా సరైన పదాలే.