కాశీ మజిలీలు

తలుపులమ్మ

జూలై 2014

దుబ్బుగడ్డి కోసే పనికెళ్లినోళ్ళకి అన్నాలట్టికెళ్ళిన తట్ట తలమీదనుండి దించి కుదేసి నామలో పడేసింది తలుపులమ్మ “ ఏంటే తలుపులూ! మాంచి ఇసురుగా వొచ్చావ్! ఏడిమీదున్నట్టున్నావ్ దుబ్బులంకలో ఏమన్నా గొడవయ్యిందా ఏంటీ? అన్నాడు నాగేశరావు. మా రేవునుండి దుబ్బులంకని దాటుకుంటా అటేపున్న చేర్లంకకి ఎల్లాలంటే నామ్మీదే ఎల్లాలి మేము ఆ నామల్ని నామాల నాగేశరావు, పడుసప్పారావు తొళ్తారు.అయేల లంకలో దుబ్బుగడ్డి కొయ్యడానికి సూరమ్మ , పెదలచ్చిమీ, గొంతమ్మా , బూరిగాడి పెళ్ళాం ఇంకా సేనా మంది ఎల్లారు. వొచ్చేది వానాకాలం కదా రాజులందరూ ఇళ్లదగ్గర వంట పాకలు దుబ్బుగడ్డితోనే నేయించుకుంటారు.

అందుకే మాయూరోళ్ళందరూ మే నెల సివర్లో చేలల్లో పైరుతీతలయ్యాక కూలి కూడా ఎక్కువుంటాది కదా అని దుబ్బుగడ్డి పనికెళ్తారు పనిలోకెళ్ళినోళ్ళకి అన్నాలట్టికెళ్లిన మనిసి మిగతావోల్లకంటే ముందులెగిసితట్టా బుట్టా అన్నీ సర్దుకుని బయల్దేరాక మిగతావోల్లు కూడా పనిమీదనుండి లెగుత్తారు. తలుపులమ్మ అసలే కంగారూ మనిషి నడక కూడా యమా స్పీడు కదా నామకాడకి పడదుగుల్లో వొచ్చి పడిపోయింది.మిగతా జనాలంతా ఎనకాలొత్తున్నారు. ఏం కంగారుమీదుందో ఏమో గాని నాగేస్రావేసిన ప్రెస్నికి సిర్రెత్తుకొచ్చి “ఆ ఏటీ గొడవా! ?నాతోటా? ఎవత్తదీ! ఎవడాడు? ఆడడైతే జుంపట్టుకూని రేవులో ముంచేత్తాను, మొగోడైతే” అన్నీ నాగేశరావొంక పంచికేసి సూసి “ సెప్పమంటావా?” అన్నాది. “ ఒద్దులేయే బాబూ అనాసరంగా గెలికానే నిన్ను” అన్నాడు. ఈ లోపు లచ్చుముడు బెల్లం బుట్టట్టుకొచ్చి నామలో ఏసాడు.

“ఏరా బట్టీ ఎట్లేదా? ఇయ్యేల మూర్తమ్ బోగుందని బట్టీ ఎడతానన్నాడు కదా మీ అన్నియ్య” అని సారా బటీ గురించి అడిగాడు నాగేశరావు. తలుపులమ్మ కలగజేసుకుని “ఏంటీ ఈల్లా ! ఈ అన్నాదమ్ములా! సారా ఏపారమే? సాళ్ళొద్దూ” అని అదోలాగా నవ్వుతా అంది. “ ఒరే నాగేశరవన్నా మేమంటే లోకువురా దీనికి ఊల్లమ్మటా ఎలిపోయినదాన్ని తీసుకొచ్చి తగువెట్టి దీని కాపరం నిలబెట్టాం కదా! తింగరముండ కదా అని అప్పుడు సనువిచ్చాం. అందుకే సంకనెక్కెసిందిరా ఇది” అని నాగేస్రావుతో అంటన్నాడు లచ్చుముడు.

లచ్చుముడికీ రాముడు మాయకీ వరసకి మరదలవుతాది తలుపులమ్మ ఆళ్ళిద్దరి సిన్నమ్మ కొడుకు బొంతు బీమన్నగాడికి తలుపులమ్మనిచ్చి పెళ్లిసేశారు. ఆడేమో తింగరోడు కదా అందుకే బీమన్ని ఏలనని మాయూర్లోకి ముగ్గమ్మడానికొచ్చిన ముత్తాల్రావుతో లెగిసిపోయింది. ఓ నెల రోజులకి మురాముల్లా సంతలో పట్టుకూనొచ్చి తగువెట్టి మళ్ళీ భీమన్నగాడింట్లో ఉంచారు. నాగేశరావేసిన ప్రెస్నికి “ అన్నియ్యా! లేదెహే ఎల్లుండ అమాసంట కదా! అదైపోయాక పెడదామన్నాడు మా అన్నియ్య అందుకే బెల్లం బుట్టలు ఎనక్కట్టుకొత్తున్నాను అన్నాడు.

“ ఓలమ్మో ఓ వోరంరోజుల సంబడానికి అమాస పున్నాలు కూడా సూసుకోవాలేటీ?” అని ఎక్కిరించిది తలుపులమ్మ “ అదంతేరా లచ్చుముడు అలాగే ఉడికిత్తాది నిన్ను ఎటకారం బాయతో కాపోతే ఎవల్తో ఆడతాదేటీ? అన్నాడు నాగేశరావు. ఆ మాటతో కాత సల్లబడ్డాడు లచ్చుముడు. బెల్లం బుట్టలు కాత పక్కకి జరిపి బుట్టల మీద అన్నాల తట్టెట్టిఆ సెక్కమీదకి జరిక్కుచ్చో పిల్లోడా అన్నాది నన్ను తలుపులమ్మ. అమ్మియ్యా ఈ నామలో నేను కూడా ఉన్నానని కనిపెట్టరనమాట అనుకున్నాను. లేపొతే ఎక్కిన దగ్గరనుండి ఎవలూ నన్ను పట్టించుకొట్లేదు ఇంతకీ నేను లంకలోకెందుకెల్లానంటే మేము పుట్టక ముందు మా నాన రికార్డింగు డేన్సులేసేవోడంట. అప్పుడు అక్కినేని గెటప్పు మానాన మాతరమే సెయ్యాలని అన్నూల్లో జనాలూ పట్టట్టేవోరంట .

పేమాభిసేకం పాటలకి మనా డేన్సులేత్తుంటే ఓ ఊరంతా ఈలలేసెవోరంట. అయ్యన్నీ అప్పుడప్పుడూ మాయమ్మ సొప్తాది. ఇయ్యేల పొద్దున్న ఎవలో పెదపేద్ద మీసాలేసుకుని ఓ పెద్దాయనొచ్చాడు. తిన్నగా మాయింటికొచ్చి కాశి సత్తియ్య ఇల్లిదేనా అనడిగాడు. అవునండీ మీరెవలూ అన్నాన్నేను. మీ నానున్నాడా అనడిగాడాయన. “అమ్మా” అని పిలిసాన్నేను . లోపలనుండి మాయమ్మ వొత్తానే “ నానగారూ బోగున్నారా” అనడిగింది. ఇదేంట్రా బాబూ నేను పుట్టకుండానే మాతాత సచ్చిపోయాడు కదా! నానగారు అంటంది ఈయనెవరబ్బా అనుకున్నాను.

ఎవలమ్మా అని మాయమ్మనడిగితే సెప్తానుండ్రా అని ఆయనకి మొక్కలపీటేసి కుచ్చోబెట్టింది నేను ఆడుకోడానికి బయటకెళితే ఓ అరగంట తరవాత కేకేసి నాన దుబ్బులంకలో ఉన్నాడు ఎల్లి ఇంటికి సుట్టాలొచ్చారని తీసీరా అన్నాది. మా నాన రికార్డేన్సులేసినపుడు ఈయనే కాంట్రాట్టుకి అన్నీ ఊళ్లలోనో డేన్సు ట్రూపులు కుదుర్సేవోడంట. సరేనని బుర్రూపి పెద్ద మంచం కోడికి తగిలించిన సొక్కాయేసుకుని రేవుకాడికొచ్చి నామెక్కి లంకలోకొచ్చాను. మా నానకి కబురు సెప్తేనేమో ఇంకో అరగంటలో వొచ్చేతాను పనైపోయిందని సెప్పు అన్నాడు. నువ్వు ముందు నామలో ఎలిపో అని పంపించేసాడు. అలా పడవెక్కినోన్ని ఇప్పుడికి సూసారు కనక. సూసార్రా నాయనా అనుకున్నాను.

పనిలోనుంచొచ్చిన మిగతావోళ్ళందరూ నామెక్కి కుచ్చున్నారు. “ఏరా ఎలిపోదామా ?” అని లచ్చుమున్నడిగాడు నాగేశరావు. “పదరా అన్నియ్యా ఇంకెవలొత్తారు” అన్నాడు లచ్చుముడు. ఓ పక్క తెడ్డి తిప్పుతా ఇంకోపక్క తిప్పమని లచ్చుముడికి తెడ్డిచ్చాడు నాగేశరావు అదేమో తలుపులమ్మ లాక్కుని “ఈ జీవలేనోడు తెడ్డేమేత్తాడు! ఇప్పుడు కదుల్తాది సూడు” అని నీట్లో తెడ్డేసి తిప్పితే మొగోడు తెడ్డేసిన దానికన్నా సులుగ్గా ముందుక్కదిలింది. మిగతా ఆడోళ్ళందరూ లచ్చుముణ్ణి సూసి నవ్వారు. లచ్చుమూడేమో నీట్లో నామ్మీద కుచ్చున్నట్టు లేడు. పొయ్యిలో పెనం మీదున్నట్టున్నాడు .

ఇవతలొడ్డుకొచ్చాక అందరూ దిగాక ఒలే పెదలచ్చిమప్పా ఈ తట్ట బయటకి తియ్యే అన్నాది తలుపులమ్మ . పెదలచ్చిమి తట్ట బయటకి తీశాక కచ్చ ఎగేసుకూని నామ దిగింది తలుపులమ్మ . ఆ తరవాత నేనూ దిగిపోయాను.

ఈసర్రావుగారని సెప్పావా అన్నాది మాయమ్మ . సెప్పానే వొత్తానన్నాడు అన్నాను. కాసేపడికి నేను తానం సేసొచ్చాక నిక్కరు తీసేసి బొందులాగూ ఏసుకుంటుంటే మానానొచ్చాడు. మానానొచ్చాక కూసేపు మాటాడి ఆ పెద్దాయన ఏదో కార్డు మాయమ్మ సేతికిచ్చాడు. మాయమ్మ తీసుకెళ్లి దేముడి బల్లమీదెట్టింది. ఓహో అది శుభలేకేమో అదియ్యనాకే వొచ్చాడేమో! అనుకుని ఆడుకోడానికి ఎలిపోయాను.

బడిదగ్గరా గంగులింటికాడా సేలా సేపు ఇసగ్గుట్టలో దూదూపుల్ల ఆడుకున్నాక మెల్లగా శీకతడతుందికదా అని దాగుడుమూతలాడదామని పంటలేసుకున్నాం సివరికి నేనే మిగిలాను. అందరూ ఎల్లి దాక్కున్నారు. ఓ ముప్పై అంకీలు లెక్కెట్టి ఆ తరవాత ఇంకో పదీ పదిహేను వందదాకా లెక్కెట్టి అందర్నీ ఎతకడానికెల్లాను. పుల్లల గుట్ట సాటునీ, కాల్లోనుంచి బయటకి తీసేసిన పాత తూములోని మంగియ్యమ్మ మరుగుదొడ్లోని అన్నీ సోట్లా ఎతికాను. ఎవాలూ కనపల్లేదు. ఊళ్ళో అందరూ రేవుకాడకి పరిగెడుతున్నారు. నాకేమీ అర్ధమవట్లేదు. దాకున్నోళ్ళు కూడా ఎవలూ కనిపిత్తాలేదు. మొండీదిలో నుండి సొమిటి సుబ్బమ్మ సెంగెగేసుకుంటా వొత్తంది. యాయే సుబ్బియ్యిమామా ఎక్కడకే అంతా పెరిగెడుతున్నారు అంటే “ ఇంకెవలూ ఆ తలుపుల్ది” అన్నాది. నేనడిగింది ఎలా ఇనబడిందో ఏమనుకుందో తెలీదుగాని నాకు కంగారు మొదలై సుబ్బియ్యమ్మ ఎనకాలే రేవుకాడికి పరిగెట్టాను. అందరూ రాయిసెట్టు మొదల గుమిగూడున్నారు ఏం జరిగిందో అని కంగారులో అందర్నీ తోసుకూనెల్లి సూత్తే తలుపులమ్మ నోట్లో పక్కనుంచి రత్తం కారతా పడుకోబెట్టుంది. ఆ సెవాన్ని సూత్తా ఒక్కొకలూ ఒకో మాటంటున్నారు.నాకేదీ అర్ధమవతాలేదు.

“ అయినా వొయుసులో ఉన్నాది తింగరోడితోటీ, పెళ్లమంటే తెలీనోడితోటీ ఏం సుకపడతాడి? సెప్పుకోలేక ఎన్నాలనుండేగుతుందో” అని ఒకలంటుంటే “ నిన్న దాచ్చరంలో ఏక్సడెంటయ్యి ముత్తాల్రావు సచ్చిపోయాడనీ అందుకే ఈయమ్మి కూడా ఉరేసుకుందనీ ఇంకొకలంటున్నారు. ముగ్గమ్ముకునే ముత్తాల్రావుతో లెగిసిపోయినా మళ్ళీ మొగుడితో బాగానే కాపరం సేసింది కదా! సచ్చిపోడానికి దీనికేం పోయేకాలమని ఇంకొకలంటున్నారు. ఎవలకొచ్చిన మాటలాలంటుంటే బీమన్న గాడు అందర్నీ తోసుకుని ముందుకొచ్చాడు. అమయ్యిందిరా మా తలుపులుకి అని అదోరకంగా సూసడిగాడు. నాగేశరావూ, లచ్చుమూడూ ఇద్దరూ ఓసారే! యేమవలేదురా మీయావిడ నిద్దరోతుంది మేమింటికి తీసుకొత్తాం నువ్వెళ్లిపో అన్నారు.

బీమన్న గాడు అందరొంకా కోపంగా భయంగా సూసి రత్తమెందుకొత్తంది మా తలుపులుకి? తలుపుల్ది నిద్దరొత్తాలేదు సచ్చిపోయింది. అని ఏడుత్తా అన్నాడు. ఓ నిమసమాగి తలకాయ పైకెత్తి సచ్చిపోలేదు సంపేశారు. ఈ ఊరోల్లే సంపేశారు అన్నాడు. అందరూ తప్పుసేసినట్టే బీమన్నగాడి మాటలకి తలదించుకుంటంటే సెవం ఎదమీద సెదిరిపోయిన సెంగుకప్పి మా తలుపుల్ది మంచిది అని బుగ్గలు తుడిశాడు బీమన్నగాడు. ఆడోళ్ళందరూ పొయ్యిలెలిగించకుండా ఎవరి గుమ్మాల్లో ఆల్లు కుచ్చూనున్నారు మొగోళ్ళందరూ మందుతాగి తలుపులమ్మ సెవాన్ని కాట్టాల్లోకి మోసుకెళ్లారు. బీమన్ని ఆ సెట్టుకాన్నుంచి తీసుకొద్దామంటే రాట్లేదాడు. కాసేపు అలాగే ఉండిమ్మని మిగతా జనాలకి సైగసేసి నన్ను తీసుకుని మానాన ఇంటికొచ్చేసాడు. తెల్లారగానే ఆ సెట్టు దగ్గరకుచ్చూని దార్లో పోయేవోళ్ళందరినీ పలకరిత్తున్నాడు బీమన్నగాడు ఎంతమంది జాలితో సమాదానం సెప్పారో తెల్దుగానీ, నేను సూత్తునంత సేపూ నవ్వుతానే ఉన్నాడు బీమన్నగాడు.

ఆ రాయిసెట్టు మొదలున్న ముత్తాలమ్మ తల్లిని ఇది మా తలుపులమ్మ అని పిలుత్తున్నాడు. ఆ రోజంతా ఆదారినొచ్చిపోయేవోళ్లందరికీ ఆ సెట్టుకింద ముత్తాలమ్మ తల్లిని సూపించి ఇది మా తలుపులమ్మే అంటున్నాడు. అందరూ అవును మీ తలుపులమ్మే అన్నట్టు సూసెళ్లిపోతున్నారు. అయేల కూడా సీకతడతుంది అందరూ పొయ్యిలెలిగించేటయమయ్యింది. కానీ అందరూ ఎందుకో ఆగారు. ఎవాలూ ఇంకా పొయ్యెలిగించట్లేదు.

“అమ్మా నానేడే” అనడిగితే కాట్టాలనుండి తానం సేసి వొత్తాడుండు అన్నాది. అప్పుడర్ధమయ్యింది నాకు ఇయ్యేల మా ఊళ్ళో ఆడోళ్ళందరూ పొయ్యెలిగించలేదనీ , మొగోళ్ళందరూ మళ్ళీ మందుతాగారనీ , బీమన్నగాడు కూడా మానాన పచ్చగడ్డి కోసేకాట్టాల కాడ తులసి మొక్కలాగా మొలుత్తాడని.
అన్నిరోజుల్లాగే మళ్ళీ తెల్లారింది మాయూల్లో ! అదే సూరీడు ఏటి గట్టుమీద ఎర్రగా పైకొచ్చాడు. మరకాళ్ళందరూ వలలట్టుకూని సైకిళ్లమీద రేవుకెళ్తున్నారు. మా ఇంటిముందునుంచి డప్పాల సూర్రావు సెంటర్లోకి ఎల్తా! “ తలుపులమ్మ సెట్టుకాడుంటాను మీ ఆయన్ని రమ్మను సేంతా” అన్నాడు. మాయమ్మెమో
“అలాగే మాయా ”అన్నాది.

సద్దికూడు తినేసి లింగీపంచి కట్టుకూని బుజంమ్మీద తుమాలేసుకుని బయటకెల్నాకి సైకిలి తీశాడు మానాన. “ డప్పాల సూర్రావు తలుపులమ్మ సెట్టుకాడ ఆగుతానన్నాడు” అని సెప్పింది. ఊకడతా ఎలిపోయాడు మానాన అప్పున్నుంచీ ఇప్పుడిదాకా ఆ రేవుకాడ ముత్తాలమ్మతల్లి రాయిసెట్టుని తలుపులమ్మ సెట్టు అంటానే ఉన్నారు. మొన్నీమద్ద నేనుకూడా మా బుజ్జిగాడికి ముత్తాలమ్మని సూపెట్టి తలుపులమ్మకి దన్నమెట్టుకో అన్నాను. పదేళ్ళు గడిసినా ఆ సెట్టుని ఎవలూ ముత్తాలమ్మ తల్లిడి అంటాలేదు. అందరికీ అక్కడ సచ్చిపోయిన తలుపులమ్మే గుర్తుంది .

సచ్చిపోయినప్పుడు బీమన్నగాడు కప్పిన నీలం రంగుసెంగు ఇప్పుడీ తల్లికి పూజారి కట్టిన నీలంరంగు సెంగూ ఒకేలా ఉన్నాయి.