ఆడది ఒంటరి గా బ్రతికితే ఏమౌతుంది?
ఆమెకీమీ కాదు. ఎంచక్కా ఆరోగ్యంగా, ఆనందంగా బాగానే వుంటుంది.
ఎటొచ్చీ చుట్టూ వుండే మగాళ్ళకే బోలెడంత దిగులౌద్ది. పాపం. మగ దిక్కులేకుండా ఎలా మనగల్గుతుందీ, ఒక్కత్తెనూ? ప్చ్. అని తెగ బాధ పడిపోతారు. పనిమాలా వెళ్ళి మరీ బ్రతిమాల్తారు. కాదు ప్రాధేయపడుతారు. తామూ ఓ చేయి వేస్తామని.
సాయం చేయడానికి ఇంతమంది మగాళ్ళు ముందుకొస్తే, నిజానికి – ఎంతమంది స్త్రీలు స్వేచ్చ గా, ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడరనీ, ఈ సమాజం లో? అయితే ఆ సాయం నిస్వార్ధమైనదైతే కదా?
కథ గురించి క్లుప్తంగా :
మహీ ఒక ఒంటరి స్త్రీ. చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్ల. పెళ్ళి వొద్దనుకుంటుంది.
అనుకోకుండా ఓ నాటి సాయంత్రం, తుఫాను వేళ బస్ కోసం ఎదురుచూస్తున్న ఆమెని గుర్తుపట్టి, తన తనింటికి తీసుకొస్తాడు ఒంటరి సాగర్. ఒకప్పుడు ఇద్దరూ కాలేజ్ ఫ్రెండ్సే కాబట్టి ఆమె కాదనదు. అతని వెంట వస్తుంది.
బాగ్ లో ఆమె బట్టలన్నీ తడిసిపోడంతో, తన బట్టలిచ్చి మార్చుకోమంటాడు. టీ కాచిస్తాడు. ఆమె దీపం వెలిగిస్తే..ఆ వెలుగులో వంట చేసి పెడతాడు. ఆమెతో కలసి తింటాడు. కుందెలో నూనె అయిపోతుంది. దీపం ఆరిపోతుంది.
ఆమె పక్కేయమంటుంది. వేస్తాడు.
అతను -ఆమె కోరిన పాటలు పాడతాడు. ఆ పరవశంలో చనువుగా అతని వొళ్ళొ వాలుతుంది. అప్పటి దాకా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే.
ఆ తర్వాతే అసలు కథ మొదలు. అతను అక్కడితో వూరుకోక, అడ్వాన్సయిపోతుంటే మహి సున్నితంగా వారిస్తుంది. వినడు. ఆమె నిరాకరణ తో అతని అహం దెబ్బ తింటుందో ఏమో..అప్పుడు..అతన్లోని నిజమైన మగాడు బయటకొస్తాడు. ‘పాతివ్రత్యమా? అంటూ!
అతగాడడిగిన ప్రశ్నకి –నింపాదిగా ఇచ్చిన సమాధనమే ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకాంశం. కథకి మూలమైన ప్రాణం.
ఒక్క నిప్పు కణిక చాలదూ, కీకారణ్యాలను దహించేందుకు. ఆమె చెప్పింది విన్నాక , ఇప్పుడతని మానసిక స్థితీ అలానే వుంది. కారణం ఆమె మెత్తగానే చెప్పినా, కఠిన నిజాల ఇజాలకు కావొచ్చు. ఆ మాటల ధాటికి, వేడికి అంత తుఫాన్‌లోనూ, అతనికి ఉక్కపోత పోస్తుంది.
ఇంతకీ అతనితో – ఏమంది మహీ? ఆమె మాటలకి అతనంతగా అచేతనుడైపోయాడెలా ? – అని మీరూ తెలుసుకోవాలనుకుంటే ఈ కథని పూర్తిగా చదవి తెలుసుకోవచ్చు.
కథ పై నా అభిప్రాయం :
ఏ కథకైనా ఆరంభం కంటెనూ, ముగింపే ముఖ్యమని నా భావం. ఎందుకంటే – కథ చదవడం పూర్తయ్యక, పాఠకుణ్ని పంపేస్తూ, కథ తలుపేసుకున్నా, అతనింకా అక్కడే ఆరుబయట తచ్చాడుతూ వుండాలి. అతన్ని వెంటాడాలి.
మంచి కథలెప్పుడూ పాఠకుణ్ని ప్రశ్నించడమే కాదు, సమధానమూ పరచాలి.
అప్పుడె అది – మరపురాని కథౌతుంది. అలాటి కథే ఈ గోడ కథ కూడా!
నాకెందుకు నచ్చిందంటే :
నిజ జీవితంలో – ఇలాంటి అనుభవాలెదురైనప్పుడు స్త్రీల మనసులు కలతబారుతాయి. ‘బాగా బుధ్ధొచ్చింది బాబూ..ఇంకెప్పుడూ మగ స్నేహాల జోలికే పోను’ అని డిసైడైపోడం కూడా కద్దు.
అసలు వీడిలాటి వాడనుకోలేదు.అంత చీప్ గా మాట్లాడ్తాడని కలలో కూడా ఊహించలేదు. అని చెప్పుకుని చెప్పుకుని దుఖించే ఆడపిల్లల్ని చూస్తాం.
నిజానికి అతడెంత గొప్ప స్నేహితుడే అయినా, ఒంటరి వేళలో లో మాత్రం అతడు ఫ్రెండ్ కాడు. మగాడు..వొట్టి మగాడౌతాడు. అని తెలీకపోడం మూలాన కూడా కాసింత షాకింగ్ గా నే వుంటుంది ఏ ఆడపిల్లకైనా. అవును కదూ?
కానీ, ఈ కథలో అలా కాదు. ఆమే – అతని కి షాకిచ్చి, వేపేస్తుంది. ఆ పై హాయిగా నిద్ర పోతుంది.
శభాష్ మహీ! శభాష్ ! అనిపించుకునే ఆ పాత్ర వ్యక్తిత్వం నచ్చింది నాకీ కథలో.
ఒక విభిన్నమైన కథాంశానికి ఒక వినూత్నమైన ముగింపునిచ్చారు రచయిత్రి.
కుప్పిలి పద్మ గారి కథ అంటేనే ఒక ప్రత్యేకత వుండి తీరుతుందని ఆశ పడే పాఠకులకు పూర్తి సంతృప్తినిచ్చేపోయే కథ – ఇదని మాత్రం ఖచ్చితం గా చెప్పక తప్పదు.
రచయిత్రికి నా హార్దికాభినందనలు తెలియచేసుకుంటూ,
మీ అందరకీ నా శుభాకాంక్షలతో…
సెలవు మరి!
గోడ
-కుప్పిలి పద్మ
తూర్పు సమురంలో తుఫాన్ – పగిలిన మబ్బులోంచి విచ్చుకుంటున్న ప్రళయంలా పెనువర్షం. ఎగిసిపడే కెరటాలు, రాలిపడే చినుకులు, ఏకమవుతోన్న భూమ్యాకాశాలు.
తుఫాన్ వేళ సాయంత్రమే ముసుకురుకున్న రాత్రి చీకట్లు.
బీచ్ రోడ్డు లో బస్టాప్. తడిసి ముద్దైన దేహాలు, వర్షధారల్లోంచి తడవకుండా కాపాడుకోటానికి శరీరంలో అణుభాగమైనా లేదేమో వెన్నెల్లో నిరీక్షిస్తున్నంత మామూలుగా ఆ బస్టాప్‌లో ఆ వర్షంలో చేరాల్సిన ప్రదేశాలకి చేర్చే ఏదో ఒక వాహనం దొరకకపోతుందాని ఎదురుచూస్తున్నారంతా.
ఆ బస్టాప్‌లోకి పూర్తిగా తడిసిపోయిన సాగర్ కొత్తగా ప్రవేశించాడు. తడిచేత్తో కళ్ళపై నీళ్ళని తుడుచుకుంటూ నిలబడ్డాడు. కాసేపటికి చూపు కాస్త తెరిపిన పడింది. చుట్టూ చూశాడు. తడిసిన శరీరాలు. ఎదురుగా చూశాడు. ఆకాశమూ సముద్రమూ ఏకమైనాయి. తిరిగి చుట్టూ చూశాడు. ఓ చోట చూపునిల్చింది.
అవును ఆమె..నిజమే. ఆమె మహిమే. ‘మహిమా’ చలికి పూడుకుపోయిన గొంతులోంచి మాట పెగల్టం లేదు.
‘మహిమా’..ఊహు లాభం లేదు. మాట రావటం లేదు. పెదవుల కదలిక తప్పా.
అతను ఆమెకి చేరువగానే వెళ్లి భుజం మీద చేత్తో చిన్నగా తట్టాడు. ఆమె వెనుదిరిగింది. తడిసిపోయిన కళ్లలో ఆశ్చర్యం. తడిగా ‘సాగర్ ‘ చలికి గడ్డ కట్టుకుపోయిన పిలుపు మెల్లగా ఒకరిమాట ఒకరికి వినిపించేంతగా కొద్దిగా గొంతు సడలింది.
“ఇప్పుడు నీకే బస్సు, ఆటో దొరకదు. అదిగో ఆ కనిపించేది నేనుండే ఇల్లు. రా నాతో వచ్చె…” గాలి హోరులా చెల్లాచెదురవుతున్న మాటలు.
ఆమె వంగి ట్రావల్ బాగ్ భుజానికి తగిలించుకొంది.
అడుగు ముందుకి వేయనివ్వకుండా వెనక్కి తోసేస్తున్న ఈదురుగాలి. నీటి ఒత్తిడి. ఒకరివెంట మరొకరు, బాగ్ భుజాలు మారుతూ, అడుగులో అడుగు. చేతుల్లో చెయ్యి. పడుతూ లేస్తూ ఈదుతూ అతని ఇంటికి ఇద్దరూ చేరారు.
“బట్టలు మార్చుకో, అదిగో అదే బాత్రూం” చెప్పాడతను.
అతను లోపలి గదిలోకి వెళ్ళాడు.బట్టలు మార్చుకున్నాడు. తిరిగి ముందుగదిలోకి వచ్చేసరికి ఆమె అలానే తడిగా నిలబడి వుంది.
“మా ర్చు కోలేదా” అడిగాడు.
ఆమె చూపులు నేలపై. ఆమె చూపులని అతని చూపులు అనుసరించాయి.
బాగ్ లోని బట్టలు నేలపై కుప్పపోసి వున్నాయి. అవి నీళ్ళల్లో జాడించినట్టున్నాయి.
“తుఫాన్”అంటూ అతను లోపలికి వెళ్లాడు.
తిరిగొచ్చాడు. చేతిలో లుంగి, లాల్చి, తువ్వాలు ఆమె అందించాడు. అందుకొని బాత్రూంలోకి వెళింది. తిరిగి వచ్చే సరికి అతను గదిలో లేడు. తువ్వాలుతో తల తుడుచుకుంటూ లోపలికి వెళ్లింది. చీకటి. వంటగదిలో స్టౌవ్ వెల్గులో టీ చేస్తూ కనిపించాడు.
అతను ఆమెవైపు చూసి “అచ్చు కేరళైట్లా వున్నావ్” అనాడు. ఆమె నవివ్వింది. స్టౌవ్ వెలుగులో బుగ్గపై డింపుల్ తళుక్మంది. “కరెంట్ లేదు” అన్నాడతను.
“కాండిల్, హరికేన్ లాంతరు లేవా?”, ఆమెకు టీ అందిస్తూ “లేవు” అన్నాడు. ఓ గుక్క తాగింది. చల్లబడిన శరీరంలో వెచ్చదనం వేడి టీతో మెల్లగా రాజుకుంటూంది.
“పూజచేస్తావా” అడిగింది.
“లేదు” అన్నాడు.
“పూజామందిరమే లేదా”
“ఉంది. అమ్మ వచ్చినప్పుడు చేస్తుందిగా. ఏం?”
“ఎక్కడుంది మందిరం”
“ఆ మూల”
చీకట్లో మెల్లగా నడిచి దేముని దగ్గరున్న కుందెలో నూనె పోసింది. ఒత్తి వేసి వెలిగించింది.
“నూనె దీపమా.. అదే పిల్లా..నూనె కొంచెమే వుంది.” అన్నాడు.
“వంట పూర్తి చేసై. ఆకలి. తినగానే దీపం తీసేద్దాం.”
“వంటా..ఏం చేద్దాం..అన్నం, పప్పుచారు, కొద్దిగా మాగాయ వుంది. కూరగాయలేం లేవ్.”
“ఏదో ఒకటి త్వరగా కానీయ్. ఆ ట్రైన్ లోకూర్చుని నడుం నొప్పి వస్తోంది. నిన్నట్నుంచి సరియైన తిండే లేదు.” కుక్కర్ లో నీళ్లు పోస్తూ అంది.
“ఎక్కడ్నుంచి రాక, ఎక్కడికి పోతున్నావ్?”
మద్రాస్ నుంచి మెయుల్లో. దారి పొడుగునా వానే. భీంలీలో వుండటం. అక్కడే ఉద్యోగం. ఎలాగోలా భీంలీ వెళ్లి పోదామనుకున్నాను. ఆ బస్సు ఆర్.కె.బీచ్ వరకు వచ్చి ఇంక వెళ్లనని మొరాయించింది. ఎలాగోలా ఆ బస్టాండ్ వరకు చేరాను. ఇంతలో నువ్వు కని పించావ్. అవునూ నువ్వెక్కడ్నుంచి రాక” బియ్యం కడుగుతూ అడిగింది.
“యూనివర్సిటీ నుంచి. నిన్న కథ రాశాను. ఆ పేపర్లు టేబుల్ పైనే వుండిపోయాయి. కిటికి తలుపులు వేశానో లేదోనని అనుమాన మొచ్చింది. పేపర్లపై వెయిట్ పెట్టానో లేదో గుర్తులేదు. గాలికి కాగితాలు ఎగిరిపోతాయోనని బెంగ. మొదటిసారి కథ రాయటం కదా. ఆ అక్ష రాలు ఈ తుఫాన్ నీళ్లలో కరిగిపోరాదని వెళ్లాను. ” పప్పు కప్పుతో కొలుస్తూ అన్నాడు.
“ఇంతకీ తలుపులు వేసొచ్చావా లేదా”
“వెయ్యటానికి మెయిన్ బెల్డింగ్ తాళాలు వాచ్మెన్ దగ్గరున్నాయి. బిల్డింగ్ చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేశాను. కానిలోపల కాగితాలు ఏమయ్యాయో తెలియదు.” దిగులుగా చెప్పాడు.
“కథలని పెన్ తో రాయటం ఏంటింకా, కథలని రమేష్ లా డైరెక్ట్ గా కంప్యూటర్ మీదే కంపోజ్ చెయ్యాలి.” అంది మహిమ.
“అవునూ, నీకు వీళ్లంతా కనిపిస్తూనే వున్నారా”
“ఈ హైదరాబాద్ పనిమీద వెళ్లినప్పుడంతా కలుస్తుంటారు. రావుడు కవిత్వం రాస్తున్నాడు. ఏం చేద్దాం. ఏం చేద్దామంటూనే వున్నాడు. నీకెవ్వరూ కనిపించటం లేదా” అడిగింది.
“ఆ మధ్య గాయత్రి కనిపించింది. వాళ్ళాయనికి విడాకులు ఇచ్చేసిందట. జీవితం ఇప్పుడెంతో హాయిగా వుందట.” అన్నాడు.
కుక్కర్ విజిల్స్ రాగానే ఆపారు.
ప్లేట్స్ టేబిల్ పై సర్దింది. మధ్యలో దీపపు కుందె వుంచింది. నీళ్లు గ్లాసుల్లో పోసింది.
కుక్కర్, చల్లారిందో లేదో చూసి మూత తీశారు.
పళ్లాల్లో అన్నం, పప్పు, పెట్టుకొన్నారు.
“ఆయిల్ లైట్ డిన్నరా” పప్పు కలుపుకొంటూ అంది.
“ఊ” అంటూ నవ్వాడు.
“ఆ పప్పా.. అది పోలూరి వాళ్ళ పప్పు. పుస్స్త కంలో చదివాను. నచ్చింది. అప్పట్నుంచి ఇలా చాలా మందికి ఈ పప్పు రుచి చూపిస్తున్నా. అఫ్ కోర్స్ నీలా చాలామంది మెచ్చుకుంటున్నారనుకో..” అన్నాడు.
“బాగుంది అన్నానంతే! ఎంత ఉపన్యాసం ఇచ్చావ్. ఇంకాస్త పప్పు వెయ్యి.”
తింటూ తింటూ ఆమె పొలమారింది. అతను ఆమెకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ నెత్తిమీద చేత్తో తడుతూ “ఎవరో తలచుకుంటున్నారు.” అన్నాడు.
“ఇంకెవరూ. ఆ రైల్లో టి.టి.ఐ.యే..”
“ఆయన ఎవరూ…”
“రైల్లో టిక్కెట్‌లేని ప్రయాణం చేస్తున్నామో లేదో చూసే ఆయన.” అంది.
“ఆ విషయం తెల్సు. నిన్నెందుకు తలచుకుంటున్నట్టు”
“రైలేమో ఎక్కడిక క్కడ ఆగిపోతుంది. తెగ బోర్. ఏ పని చేయటానికి లేదు. అందుకని కాసేపు అతన్ని ప్రేమించాను.” అంది నవ్వుతూ.
“నువ్వు ప్రేమిస్తే నువ్వు తలచుకోవాలి కానీ అతను నిన్నెందుకు తలచుకుంటాడు” అడిగాడు.
“ఈ ట్రైన్ ఇలా ఎంతసేపు ఆగుతుంది. అని అడిగానంతే. అతను నా సమస్త విసయాల గురించి అంచెలంచెలుగా ప్రశ్నలు వేసేశాడు. ఆడపిల్ల ఓ ప్రశ్న వేయగానే అలా నిలువు గుడ్లేసుకొని మాట్లాడేస్తారు. ఆ విషయాన్ని అక్కడితో వదలరు. పైపెచ్చు అక్కడ్నుంచి ప్రేమంటూ వెంటపడతారు. ఐదు నిముషాల్లో విడవలేనంత ప్రేమేంటిరా. ఆకర్షణ అనైనా అనరు. ప్రేమ అంటారేమిటిరా? పెళ్ళి కాలేదా అంటారు. చేసుకోలేదయ్యా అంటే ఒంటరిగా వున్నారా..లోన్లీగా అని పించదా..మాకు తోడుంటామంటారు. నువ్వు చాలా ఆలశ్యంగా కనిపించావ్. అబ్బే నాకు నేను ఇప్పుడున్న జీవితం నరకంగా వుంది. నీతో జీవితాంతం వరకు కలసి వుండాలని వుంది. అంతవరకు ముందు శరీరాలని పెనవేసుకుపోతాం…అంటూ ఎన్నెన్ని కథలని చెప్పేస్తారో. మేమేదో మా ఒంటరి జీవితాలకి వాళ్ల ఆలంబన కోరినట్టు.” తిన్న పళ్ళెం తీసి అంట్ల గిన్నెలో పెడుతూ అందామె.
“నీకైతే బోల్డన్ని వ్యాపకాలు. చదువుతావ్. పాటలు వింటావ్. ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఊళ్లు తిరిగుతావ్. అదీ కాకుండా నువ్వెక్కడున్నా అ అపరిసరాలలో, మనుష్యులలో వున్న నీకు నచ్చిన అంశాన్ని ఇష్టపడతావ్. నీలా అంతా వుండలేరుగా. ఒంటరితనంతో బాధపడేవాళ్లు లేరంటావా” అడిగాడు.
“ఎవరో కొందరే ఒంటరితనంతో బాధపడుతారా? చాలమందిలో ఆ దిగులుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అంతా అందులో కొట్టుకుపోతోనే వుంటాం. ఆ దిగులు, బెంగ ఎందుకో తెలిసినా మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేఛ్చగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదు కదా. ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్లది. అనుకోరుగా. మనముందు ఓ వ్యవస్థని ఉంచారు. మన కి ఇరుగ్గా వున్నా అందులోనే వుండాలా? బయటికి వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా.. మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా.. అసలు కొట్టాలా వద్దా..కొట్టటం వల్ల మనకి కావల్సింది మనకు దొరుకుతుందా..దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టచ్చు. అనిపించకపోయినా కొట్టచ్చు. లోపల ఏం లేదని తెల్సింది. బయట ఏముందో లేదో తెల్సుకోటానికి ఎందుకు వెనుకాడాలి” ఆమె మాట్లాడుతుండగా దీపం వెల్తురు కొదికొద్దిగా తగ్గి ఆరిపోయింది.
“నూనె అయిపోయింది.” అన్నాడతను.
“మంచిది. పక్కలు వేసుకుందామా” అడిగింది.
“ఆ”
అతను చాప పరిచాడు. దానిపై బొంతపరుస్తూ “బొంతలు భలే వుంటాయేం. మా అమ్మమ్మ వీటిని చాలా ఆర్టిస్టి క్ గా కుట్టేది.” అంది.
“ఈ బొంత మా నాయనమ్మ ఇచ్చింది.” అన్నాడు. ఆమె కిటికి దగ్గరికి వెళ్లి మెల్లగా తలుపు తెరిచింది. రయ్ మని గాలి ఆమె ముఖాన భళ్ళున కొట్టింది.
“అబ్బా ఏం తుఫాన్” అంటూ ఆమె కిటికీ రెక్క వెయ్యటానికి తంటాలు పడుతోంటే అతనొచ్చి తలుపుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బోల్టు పెట్టింది.
“నిక్షేపంలా వేసున్న కిటికీని తీయటం ఎందుకు? వెయ్యటానికి ఇబ్భంది పడటం ఎందుకు?” అన్నాడు.
“బయటేం జరుగుతుందో చూడొద్దా”
“బయటేం వుంది. వర్షమని తెలుసుగా”
“ఉత్తి వర్షమేనా. తలుపువేయకపోతే ఆ గాలికి ఎంత బలం వుందో తెలిసేదా”
“సాయంత్రమంతా నడిరోడ్డులో ఆ గాలికి కొట్టుకుపోయావు కదా మళ్లీ ఇప్పుడు కొత్తగా చూడ్డానికి ఏముంది”
“నాలుగు గోడల మధ్య నుంచి తుఫాన్ని చూస్తే ఎలా వుంటుందోనని” అంది.
ఆమె మెడవరకు దుప్పటి కప్పుకుంటూ “పాటపాడు” అంది.
“ఏ పాట” అడిగాడు.
“నీ ఇష్టం.”
“దీవారోం సె మిల్ కర్ రోనా
అచ్చా లగ్ తా హై
హం భీ పాగల్ హో జాయేంగే
ఐసా లగ్ తా హై
కిత్ నె దినోం కె ప్యాసె హోంగె
యారో సోచో తో
షబ్నం కా టుకడా భీ
జిన్ కొ దరియా లగ్ తా హై
హం భి పాగల్ హొ జాయెంగె,
ఐస లగ్ తా హై
దీవారోం సె..- అతను పాడుతున్నాడు.
“నీకీ పాటంటే ఇష్టం కదా” అడిగాడు.
“ఊ”
“నువ్వీ పాటని సిద్దార్ధని అడిగి మరీ పాడించుకునే దానివిగా. అతని దగ్గరే నేనీ పాట నేర్చుకున్నాను నీకిష్టమని. కానీ నీకు వినిపించకముందే నువ్వు, ఉద్యోగం అంటూ మా అందరి నుంచి వెళ్లిపోయావ్” అన్నాడు.
“చదువులు అయిపోయాక ఇష్టమయిన బ్రతుకుతెరువు చూసుకోవాలిగా. నీకీ పాటకి అర్ధం తెలుసా” అడిగింది.
“తెలియదు చెప్పు”
“నే అర్ధం చెప్పనా. నీ గొంతు బాగుంది. కానీ నీకీ పాట అర్ధం తెలియక ఇన్వాల్మెంట్ తో పాడలేకపోతున్నావ్. కొండగాలి తిరిగింది పాటని నువ్వు పాడినప్పుడు నిజంగా గుండె ఊసులాడుతుంది.” అంది.
“అర్ధం చెప్పు.”
గోడల్తో కలిసి దుః ఖించడం ఎంతో బాగుంటుంది.
నేను పిచ్చివాడి నైనా ఇలానే వుంటుంది. ఎన్ని రోజులుగా దాహంతో వున్నానో కొంచెం ఆలోచించండి.
ఓ మంచు ముక్క కూడా నదిలా కనపడుతోంది..”
చీకటి వర్షం హోరు. గాలి గొడవ. చలి. ఆ గదిలో ఆమె గొంతు జలపాతపు లోయలో మంచు కురుస్తున్నట్టు వినిపిస్తోంది.
అతను తిరిగి ఆ పాటే పాడాడు.
చీకటి దిగంతరేఖ మీది వంగి సృష్టి రహస్యం గుసగుసగా చెవిలో చెపుతున్నట్టుంది అతని స్వరం.
ఆమె చేయి చాపి అతని చెవిని మెలె పెడుతూ “కొండగాలి తిరిగింది పాడవా” అడిగింది.
అతను పాడటం మొదలుపెట్టాడు.
ఆమె చేతివేళ్లు అతని జుట్టుతో ఆడుకుంటున్నాయి.
పాట తర్వాత పాట.
ఆమె అతనికి కాస్త చేరువగా జరిగి దగ్గరగా పడుకొని కళ్ళు మూసుకొని పాటలు వింటోంది.
పాడుతూ పాడుతూ చప్పున ఆమె వైపు తిరిగి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఆమె నవ్వుతూ అతని నుంచి తప్పించుకొంటూ “అబ్బాయ్ ఏంటిది” అంది.
“తుఫాన్”
“తుఫాన్ గాలి అంటే..ఊహు నాకు బెంగ. గోదారిగాలే ఇష్టం.” నవ్వుతూ అంది. అతను నవ్వుతూ ఆమె సమస్త దేహాన్ని అల్లుకుపోతున్నాడు.
ఆ క్షణంలో సాగర్ నవ్వు ఆమెకి హాయిగా అనిపించింది.
అతని ప్రతి కదలికలోనూ ఆమెకు తన సాగర్ కనిపించడం లేదు. సాగర్ లోపల్నించి మరో సాగర్ బయటికి వుబికివస్తున్నాడా అనిపిస్తోంది. అప్పటిదాకా సాగర్‌తో తను పంచుకున్న ప్రపంచమంతా వున్నట్టుండి తెగిపోయినట్లనిపించింది. చివరికి సాగర్ కి కూడా తానొక శరీరంగానే కనిపిస్తోందా? ఆమె లోలోపల్నించి ఒక చురకత్తి మెలెపెడుతున్న బాధ.
ఆమె అతన్ని మెల్లిగా వారిస్తుంది.
సాగర్ ప్రశ్నార్ధకంగా ఆమెవైపు చూశాడు. మళ్ళీ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. ఆమె దూరంగా జరిగింది.
“ఏం”
“వద్దు”
“మహీ! ఎందుకు? ఉప్పెనలా దేహాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఈ వారింపు ఏమిటి?” నిష్టూరంగా అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
“నిన్ను నేను ముద్దు పెట్టుకున్నా, నువ్వు నా జుట్టు, బుగ్గలని తాకినా, నీకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయంలో నీకెందుకంత అభ్యంతరం? నువ్వు కూడా పాతివ్ర త్యం, శీలం అని ఆలోచిస్తున్నావా? చికాకుగా అడిగాడు.
మహిమ పక్కమీద నుంచి లేచి అతడిని ఆనుకొని కూర్చుంటూ..”శీలం..పాతివ్రత్యం..ఉహూ..అవేంకాదు. సాగర్ ఏ ఎమోషన్స్ నన్ను ఎటు తీసుకు వెళ్లితే అటు అడుగులేస్తున్నదాన్ని. ఈ సిస్టం లో ఇమడలేకే గా పెళ్ళి చేసుకోనిది. ఏదో ఒక ఉద్యోగం అంటూ ఒకే చోట కూరుకుపోనిది. కానీ ఈ విషయానికొచ్చేసరికి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎస్ అనలేను. ఏ క్షణంలోనైనా ఇలాంటి ఎమో షన్స్ ఎదురౌతాయని ఎప్పుడూ ఒక శారీరక జాగ్రత్తతో వుండటం అసాధ్యం కదా” అంది.
“ఏమవుతుంది? నువ్వూ అందరిలా ప్రపంచం ఏం తెలియదన్నట్టు మాట్లాడతావేం? నువ్వేదో అందరికంటే భిన్నమైనదానివనుకున్నాను.” ఆశ్చర్య పోతూ అడిగాడు.
“ఏమవుతుందా? ఏమైనా కావొచ్చు. నీకు నాకు మధ్య ఓ సైకలాజికల్ కోజ్ నెస్ రావొచ్చు. నువ్వూ, నేనూ, రావుడూ, రమేశ్, మనమంతా కాలేజ్ దినాల్లో మంచి స్నేహితులం. అల్లరి చేసేవాళ్లం. బొల్డన్ని విషయాలు చర్చించేవాళ్లం. కానీ మన మధ్య ఇలాంటి విషయాలు ఎప్పుడూ వచ్చేవి కావు. ఈ విషయాలపట్ల మీరంతా ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఈ విషయం జరిగాక నువ్వెలా రియాక్ట్ అవుతావో? ఏమేమి మాట్లాడతావో, నాపై నీకు హక్కు వుందనుకుంటావో, నే బిడ్డను కనాలనుకుంటే నువ్వు వొద్దనొచ్చు. అబార్షన్ చే యించు కుంటానంటే కాదొనొచ్చు. లేదా అస్సలు మొత్తం వ్యవహారంతో నీకే సంబంధం లేదనొచ్చు. లేదా ఇందాక వచ్చాం పెళ్లి చేసుకుందాం అనొచ్చు. కలిసి వుందాం అనొచ్చు. లేకపోతే ప్రపంచం తెలియకుండా లేను. నా రెండు చేతులూ చాచి నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను.” అని ఆగి.. ఆ చీకట్లోనే అసహనంగా వినిపిస్తున్న అతని ఊపిరి వింటూ అతని పక్కనే వున్న పక్కపై పడుకొని దుప్పటిని మెడవరకూ కప్పుకుంటూ..”కాని నువ్వో ప్రపోజల్ పెట్టినప్పుడు నేను వద్దంటే నువ్వు నేను ఎందుకు వద్ద న్నానో నీకు నిజంగా తెలియదా? తెలిసి కూడా తెలియనట్టున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నన్నేం అడిగావ్. నువ్వూ అందరిలా ఇలానే మాట్లాడతావా? నువ్వు ఇంకేదో అందరికంటే భిన్నం అనుకున్నాను – అంటూ మా వ్యక్తిత్వాలతో మానిప్యులేట్ చేసే నీలాంటి వాళ్ల కోసం కాదు.” చెప్పింది మహిమ.
ఆమె నిద్ర సవ్వడి వింటూ అచేతనంగా కూర్చున్నాడు. బయటి తుఫాన్ హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సవ్వడి ఎక్కువగా అలజడి కలిగిస్తోంది.
అతను తలుపు తీసుకొని బయటకు వచ్చాదు.
తుఫాన్ మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే వుంది.
పొద్దున్న తుఫాన్ భయపెట్టింది.
ఆ తుఫాన్ ప్రశాంతంగా వుంది అతని లోపలి తుఫాన్ కన్నా..
“నిన్ను నేను ముద్దు పెట్టుకున్నా, నువ్వు నా జుట్టు, బుగ్గలని తాకినా, నీకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయంలో నీకెందుకంత అభ్యంతరం? నువ్వు కూడా పాతివ్ర త్యం, శీలం అని ఆలోచిస్తున్నావా? చికాకుగా అడిగాడు.
అబ్బ మగ వారంతా ఇంతేనా ? ఒక ఆడ పిల్ల గదిలో ఒంటరిగా ఉంటే ,ఆమె తనదైన దారిలో నడుస్తూ ఉంటే ,ఇంక ఆమె శీలం గురించి ఇంత అన్యాయం గా ఆలోచిస్తారా ? ఇంతేనా ? మనిషి అంటే శరీరం ..వాంచలూ అంతేనా ?
ఆమె నడవడిక లో అంతులేని ఆత్మ విశ్వాసం , క్లాస్ మేట్ , ఆత్మీయ స్నేహితుడు కనిపించాడు అన్న సంతోషం తో అతను పాడుతున్న పాటలు వింటూ , తనను తాను మరిచిపోయి , ఒక స్త్రీ అన్న విషయం మరచి ,చనువు గా ఉంది ,అంతే ..అది ఒక బలహీనత క్షణం అని ఎలా పొరబడ్డారు ?
నా కైతే ఆమె ప్రవర్తన లో అసమంజసం గా ఏమీ కనిపించలేదు ..
స్నేహితుడు కూడా ఒక మగవాడు ..అంతే నా ? ఇంతకన్నా ఎదగ లేరా ??
ఆమె కళ్ళ ల్లో వాంచ లేదు ,చనువు ఉంది …చనువు నే ఆకర్షణ అనుకునే మగ వారిని చూస్తే జాలి వేస్తుంది ..ఎదగాలి , శరీరం ఒక్కటే కాదు ,మనిషి అంటే ..తెలుసుకుంటారా ?? ఎప్పటికైనా ??
ఎంత కాలం ఆడది ..అంటే అనుక్షణం ..మెలకువ ,జాగ్రత్త ..నా శరీరం మీద ఎవరి కళ్ళు పడతాయో అని జాగురకత ..అబ్బ నరకం కదా , ఆమె ఇష్టం , ఆమె ప్రేమ ,ఆమె కోరిక ,ఆమె తనువు …అవును …ఆమె ని గౌరవించే ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా ??
మంచి కథ ని పరిచయం చేసినందుకు ,దమయంతి గారికీ ధన్యవాదాలు , తన దైన శైలి లో తుఫాను సృష్టించి న కుప్ప్లిలి పద్మా కి అబినందనలు ..ఈ గోడ లు ఎప్పటికి తొలిగేనూ ??
వసంత లక్ష్మి .
~ స్నేహితుడు కూడా ఒక మగవాడు ..అంతే నా ? ఇంతకన్నా ఎదగ లేరా ?
* అంతే. అంతకు మించిన అంచనాలుంటే ఆ తప్పు ఆమెదే. – అని అంటారు జనం.
లోకం మాటలా ఉంచుదాం. ఈ కథలో నే సాగర్ని తీసుకుందాం. ఏమన్నాడు? నువ్వు కూడా ..ఇలా వ్యతిరేకించడ మేమిటీ అని అంటాడు. అమ్టే? స్వేచ్చ ని కోరుకునే స్త్రీలకి శీలం విష్యం లో ఏదో ఎక్సెప్షన్ వుంటుందని. కదూ?
మీ స్పందన చాలమంది హృదయాలను స్పందింపచేస్తుంది వసంత.
చాలా విలువైన మాటలను అందించినందుకు
మీకివే నా ధన్యవాదాలు.
ముగ్గురికీ కృతఙ్ఞతలు
మా ముగ్గురి తరఫున మీకివే నా ధన్యవాదాలు అమరేంద్ర గారు.
ఆమె ప్రవర్తన చాలా సహజంగా ఉంది. అతనే ఇంకా ఎదగాలి . కథ బాగుంది…మీరు పరిచయం చేసిన తీరూ బాగుంది మామ్
సురేష్..ఎంత మంచి మాటన్నారు!
నిజమే అతనే ఎదగాల్సిన అవసరం వుంది.
మీ కాంప్లిమెంట్ కి ఎంత సంతోషమేసిందో!
చాలా ధన్యవాదాలు మీకు.
శుభాకాంక్షలతో….
బ్యూటిఫుల్ స్టొరీ.. కళ్ళలో చనువుంది.వాంచలేదు.. చనువుని ఆకర్షణ అనుకునే మగవారికి మంచి అర్థం చెప్పే కథ.థాంక్స్…
పద్మ గారూ
కథ, కథనం, విశ్లేషణ అన్నీ బాగున్నాయి. మీకూ, పరిచయం చేసిన దమయంతి గారికీ హృదయపూర్వక అభినందనలు.
మూర్తి గారు,
మీకివే నా హృదయపోర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
నమస్సులతో..
ఫ్రెండ్స్!
ఈ కథపై జరుగుతున్న చర్చను, పలువురి అభిప్రాయాలను మీరిక్కడ చదవి తెలుసుకోవచ్చు.
ఆసక్తి గల వారు పాల్గొనవచ్చు.
ఔనన్నా,
కాదన్నా,
ఒప్పుకున్నా
ఒప్పుకోకున్నా
- అందరి అభిప్రాయాలు చాలా విలువైనవే సుమా నాకు.
ధన్యవాదాలతో..
https://www.facebook.com/groups/186953831400882/permalink/640823536013907/
స్త్రీ సన్నిధి లో చేరినప్పుడు పురుషుడిలో సహజసిద్దంగా కలిగేది కామవాంచ మాత్రమె. పురుషుడిలో మరో పురుషుడు ఉండడు(సాగర్ లోపల్నించి మరో సాగర్ బయటికి వుబికివస్తున్నాడా అనిపిస్తోంది) పురుషుడిలో కామవాంచ అనేది సహజసిద్దమైనది. అది ప్రకృతి దర్మం కూడ. కాని తన కామవాంచ ఎ స్త్రీ తో తీర్చుకోవాలి, ఆ స్త్రీని ఎంచుకును హక్కుని ప్రకృతి పురుషునికి కల్పించ లేదు. అతను కేవలం competitor మాత్రమె. స్త్రీ కి ఆ హక్కు వుంది, ఆమె ఎ పురుషుదినైన ఎంచుకొని సంగామించవచ్చు. అలాగే ఎ పురుషుదినైన తిరస్కరించవచ్చు. ఎందుకంటే ప్రకృతి ఆమెకి మాతృమూర్తి హోదా నిచ్చింది. ఇంకొక బలమైన, తెలివైన తరానికి జన్మనిచ్చి, పోషించే బాద్యతను ప్రకృతి ఆమెపై ఉంచింది. అందుకే స్త్రీ ఎప్పుడు మాతృమూర్తే, వాస్తవానికి ఆమెకు తన అందచెందలతో, ఆటపాటలతో పురుషున్ని లొంగతీసుకునే అవసరంలేదు. ఇవన్ని పురుషుడు చేయాలి. తన శక్తిసామర్ధ్యలని, తెలివితేటలని వుపయోగించి స్త్రీ తనను ఆకర్షించేలా చేసుకొని తన కామవంచ తిర్చుకోవడంలో తప్పు లేదు. ఇతర బంధాలు , బంధనాలు, బాద్యతలు అన్ని మానవసమాజం కృత్రిమంగా స్త్రీని తన చెప్పుచేతుల్లో ఉంచడానికి చేసినవే. ప్రకృతి ధర్మమే ఉన్నతమైనది. ఇతర జీవజాలం అదే పాతిస్తునది.( చార్లెస్ డార్విన్ బుక్ ది ఆరిజిన్ అఫ్ స్పెసీస్ లో సెక్సువల్ సెలక్షన్ చదవండి)
పురుషుడిలో మరో పురుషుడు ఉండడు..
* అదే నండి ఆమె బాధ కూడా. మరొకడు కూడా వుండాలని, ఆటను కేవలం స్నేహం గా వుంటే బావుణ్ణు అని!
మీ వర్షన్ మీరు వినిపించారు.
అందుకు ధన్యవాదాలు abid Hussain గారు.
katha sahajangaa undi . mugimpu chaala vastavangaa undi. okarevaro natho okasari annaru when women are emotional men should be rational ani . kanee men are usually emotional ilanti chota . annitikante e bandhaanikii longi pokuudadanukune ame vyaktitvam nacchindi, kudos padma and thank u damayanthi garu love jagaddhatri
థాంక్సండి జగద్ధాత్రి గారు.
అభివందనాలతో..
sunisitha bhaavalanu sunnitham ga ..manasuku manishiki unna bhandham adbhutanga raasina theeru adbhutam..snehaaniki sareera vanchaku thedaa chooputhu.. aalochincha dagga katha idi..sthree bhavaanni hrudhayaani nirbhayam ga cheppina katha idi..ilanti alajadi kaamukatvaniki lobadina magavaani gundello modalavvali..bayata unna thoofan athani lopala thoofan la maarali ..naku nachhina kathallo idi oka amoolyamaina katha rachayitha kuppili padma gariki deenini adhinchina variki kruthagyathalu
~ ‘deenini adhinchina varikikruthagyathalu ‘
* అందించింది నేనేనండి. – . ఆర్.దమయంతిని.
థాంక్స్ ఆశిష్ పృథ్వి గారు.
swachamaina sthree hrudayam ee katha
ఓ స్త్రీ పురుషుడి స్నేహాన్ని మాత్రమే ఆశించి, అతడికి చేరువై అతడిలోని కామాన్ని తప్పుపట్టడం ప్రకృతి ధర్మానికి విరుద్దమైనది. పెళ్లి కాకుండా పురుషుడితో శారీరక సంబంధాన్ని తప్పు పట్టడం మన నాగరికతలో వున్న దౌర్బల్యం. పైగా దానికి శీలం అని పవిత్రమైన పేరు కూడా. నాగరికతలో పడి స్త్రీ తన నిజమైన ప్రవర్తనని మరచిపోయినది. తన స్వాతంత్రానికి బంగంగా పురుషుడు ఏర్పరచిన బంధనలని గౌరవ మైర్యదలుగా స్వీకరించి పురుషుడి ఆలోచన మార్గంలోనే ఇంకా పయనిస్తూనే ఉంది. ఈ కథలోని స్త్రీ సహజసిద్దమైన శారీరక వంచను తిర్చుకోకుండా మానసిక దౌర్బల్యంతో, అబద్రత బావంతో తనకిష్టమైన స్నేహితుడి సంబోగాన్ని తిరస్కరించడం హర్షించా తగినదికాదు.
కనిపించే కాంతికి… కనిపించని అగ్ని కారణమట. మీ కథలో అడుగడుగునా పెట్టుడు ముసుగులని దహించే స్ఫూర్తి ప్రవహించింది. ఆక్షేపణలూ, ఆటుపోట్లూ తట్టుకుని నచ్చినట్లు బతికిన మీ నాయిక మహి…. చాలా మంది హిపోక్రాట్స్ కి చెంప పెట్టు.
గోడ
-కుప్పిలి పద్మ………ఆయిల్ లైట్ డిన్నరా” పప్పు కలుపుకొంటూ అంది.
“ఊ” అంటూ నవ్వాడు.
“ఆ పప్పా.. అది పోలూరి వాళ్ళ పప్పు. పుస్స్త కంలో చదివాను. నచ్చింది. అప్పట్నుంచి ఇలా చాలా మందికి ఈ పప్పు రుచి చూపిస్తున్నా. అఫ్ కోర్స్ నీలా చాలామంది మెచ్చుకుంటున్నారనుకో..” అన్నాడు.
“బాగుంది అన్నానంతే! ఎంత ఉపన్యాసం ఇచ్చావ్. ఇంకాస్త పప్పు వెయ్యి.”
తింటూ తింటూ ఆమె పొలమారింది. అతను ఆమెకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ నెత్తిమీద చేత్తో తడుతూ “ఎవరో తలచుకుంటున్నారు.” అన్నాడు.
“ఇంకెవరూ. ఆ రైల్లో టి.టి.ఐ.యే..”
“ఆయన ఎవరూ…”
“రైల్లో టిక్కెట్‌లేని ప్రయాణం చేస్తున్నామో లేదో చూసే ఆయన.” అంది.
“ఆ విషయం తెల్సు. నిన్నెందుకు తలచుకుంటున్నట్టు”
“రైలేమో ఎక్కడిక క్కడ ఆగిపోతుంది. తెగ బోర్. ఏ పని చేయటానికి లేదు. అందుకని కాసేపు అతన్ని ప్రేమించాను.” అంది నవ్వుతూ.
“నువ్వు ప్రేమిస్తే నువ్వు తలచుకోవాలి కానీ అతను నిన్నెందుకు తలచుకుంటాడు” అడిగాడు.
“ఈ ట్రైన్ ఇలా ఎంతసేపు ఆగుతుంది. అని అడిగానంతే. అతను నా సమస్త విసయాల గురించి అంచెలంచెలుగా ప్రశ్నలు వేసేశాడు. ఆడపిల్ల ఓ ప్రశ్న వేయగానే అలా నిలువు గుడ్లేసుకొని మాట్లాడేస్తారు. ఆ విషయాన్ని అక్కడితో వదలరు. పైపెచ్చు అక్కడ్నుంచి ప్రేమంటూ వెంటపడతారు. ఐదు నిముషాల్లో విడవలేనంత ప్రేమేంటిరా. ఆకర్షణ అనైనా అనరు. ప్రేమ అంటారేమిటిరా? పెళ్ళి కాలేదా అంటారు. చేసుకోలేదయ్యా అంటే ఒంటరిగా వున్నారా..లోన్లీగా అని పించదా..మాకు తోడుంటామంటారు. నువ్వు చాలా ఆలశ్యంగా కనిపించావ్. అబ్బే నాకు నేను ఇప్పుడున్న జీవితం నరకంగా వుంది. నీతో జీవితాంతం వరకు కలసి వుండాలని వుంది. అంతవరకు ముందు శరీరాలని పెనవేసుకుపోతాం…అంటూ ఎన్నెన్ని కథలని చెప్పేస్తారో. మేమేదో మా ఒంటరి జీవితాలకి వాళ్ల ఆలంబన కోరినట్టు
….
బాగుంది..ఈ కధనం పద్మగారు..అసలు ఆడవాళ్ళు వాళ్ళ చేతులకి వేసుకున్నవి గాజులు అనుకుంటున్నారేమొ …అవి విష్ణుసుదర్షన ఛక్రాలు..సందించండి…ఝాన్సీ లక్ష్మీబాయి లా..రాణీ రుద్రమదేవి లా..దీరవనితా లా..వీర మగువలా.. మీ వెనుక నీనున్నానని ..మీకేం కాదని.. మీ వేణువు
స్త్రీ అవ్వచ్చు ,పురుషుడు అవ్వచ్చు తనకంటూ కొన్ని అభిప్రాయాలూ ఏర్పరుచుకొని ఒక కాంపౌండ్ వాల్ కట్టిన తరువాత దాని తలుపుకి కూడా తాళం వెయ్యాలి. ప్రతి మానసిక స్థితి , శారీరక ధర్మాల్ని ఎరిగి అవతలి వ్యక్తితో ప్రవర్తించాలి ( మన ప్రవర్తన సరిగ్గా ఉన్నా , గాప్ ఉంచినా ,సహజ సిద్దం గా పశువుల ప్రవర్తించే వారి గురించి అసలు చర్చ అనవసరం ) “నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమే నాకు ఇష్టం “,కానీ ఇక్కడ situaటిon ఎలా వ్రాశారు రచయత అంటే పెళ్లికి పిలిచి , ఎంట్రన్స్ లో invitaటిon కార్డు అడిగి ” తీసుకు రాలేదా !! నువ్వు ఇలాంటి వాడివి అనుకో లేదు ఛి పో ” అన్నట్లు ఉన్నది. అవసరానికి తగ్గట్లు manipulatఈ చెయ్యక పోవటానికి అదెమన్న ఆశ్రామమా , అతనేమన్న్న స్వామీ జి నా !! ఉన్నత స్త్రీ, ఉన్నత మనోభావాలు ,మానసిక స్థైర్యం,స్వాతంత్ర్యం .. ఈ వస్తువులు కధలకి కేంద్రమయ్యి వీటి చుట్టూ కధలు అల్లినప్పుడు, ఇలాంటి నాటికలు తయారు అవుతాయి…. కధలు కాదు.
కథ అసంపూర్తిగ ఉంది . చెప్పాలనుకున్న విషయం క్లియర్ గాను లేదు. కథ అనేది ఎవరి ముఖం వారికి చూపించే అద్దం గానో లేదా ప్రతిఒక్కరికి వేరేవారి ముఖం చూపించే అద్దం లాంటి మరో ఎ వస్తువుగానో ఉండకూడదని నా అభిప్రాయం . అందరికి ఒకే వాస్తవికతను చూపించి ,తల ఎత్తుకోనే లాగా లేదా తల దిన్చుకోనేలాగా ఉండాలని అనుకుంటున్నాను . మహి ఇక్కడ ఇష్టం లేక వద్దని అందా లేదా తరువాతి పర్యవసానాలకు భయపడి వద్దు అందా కూడా వ్యక్తం అవ్వలేదు . సింపుల్ గా ఇష్టం లేదు అని చెప్పి వద్దని నిద్రపోయి తెల్లవారి కాఫీ తాగి , థాంక్స్ ,తర్వాతా కలుద్దాం అని చెప్పి వెళ్ళినట్లు గా ముగ్తే బాగుందేమో … స్త్రీ ల పట్ల పురుషుల ప్రవర్తన ..స్త్రీ పాత్రలు ఎక్కువ మాట్లడితే అంతా స్పష్టం కావేమో ….
ఆ అబ్బాయ్ నువ్వూ అందరిలా ఆలోచిస్తున్నావు యెందుకూ – అనడం కథ కి interesting twist.
అలా కాక, మరి నా చెవి మెలేసి, జుట్టు పీకి నా మీద పడ్డావేవిటీ అని అడిగి ఉంటే ఆ అమ్మాయ్ ఏం చెప్పేదో?!
ఈ పనులేవీ చెయ్యకుండా ఉంటే కథ ఇంకాస్త బావుందనిపించింది.
గోడ కథపై…
ఈ కథ 1995లో రాసినది. రెండు దశాబ్దాలకు ముందే రాసినా, నేటి సమాజంలో స్థ్రీ పట్ల, స్థ్రీవాదం పట్ల ప్రజల మనోభావాలు పెదగా మారలేదని చెప్పడానికి పైన చేస్తున్న వ్యాఖ్యలే సాక్ష్యం. స్థ్రీ ఇలాగే వుండాలి, ఇంతకంటే భిన్నంగా వుండకూడదనే మనస్తత్వాలకు ఈ కథ రుచించకూడదు. అలా రుచించనంత కాలం కుప్పిలి పద్మగారు కథకురాలిగా విజయం సాధించినట్లే.చదువుకున్నవాళ్ళు కూడా స్థ్రీ ఇలాగే వుండాలి, తమ ఆలోచనల ప్రకారమే నడుచుకోవాలి (అనే స్క్రీన్ ప్లే) మనసులో వున్నప్పుడు, కథలో స్థ్రీ పాత్ర పురుష పాత్ర తలలో చేతులు పెట్టి నిమరకూడదనే కోరుకుంటారు. అలా నిమిరింది గనక ఆమె శరీరంపై తమకు హక్కు వచ్చేసిందని అనుకుంటారు.
అంటే ఏదైనా గట్టిగా అరిచి చెప్పాలి టీవీ సీరియల్ లోలా. నన్ను ముట్టుకోవద్దని గావుకేకలు వేసితీరాలి. అప్పుడుగానీ మగమహారాజులకు అర్ధం కాదు.
విదేశాలలో నో అంటే నోనే..యెస్ అంటే యెస్సే.అవునంతే కాదనీ కాదంటే అవుననే బుద్దులు వాళ్ళకు లేవు. అలా అర్ధం చేసుకోవడం కూడా వాళ్ళకు అర్ధం కాదు.మనది తోలుమందం. ఆడది నవ్వినంత మాత్రాన అందుకు వొప్పుకుతీరుతుందనే నీచపు ఆలోచన.
తెలుగు లేదా తమిళ్ సినిమాలో నౄత్యం చేయడానికి ఒచ్చిన ఒక విదేశీ డాన్సర్ ఒక భారతీయ నటుడి ప్రేమను అంగీకరించింది.తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆమె చెప్పిన కారణమేమంటే.. అతనంతే నాకిష్టమే..కానీ నేనెక్కడికి వెళ్ళీనా నాను ఫాలోఅవూతూ నా ప్రైవసీకి అడ్దం పడుతున్నాడు.నాకు కొంత స్పేస్ కావాలని అతనెప్పుడు తెలుసుకుంటాడు అని ప్రశ్నించింది.
ఎదటివారి మనస్తత్వాన్ని మన బుద్దుల్తో చూసినంతకాలం ఈ హిపోక్రిటిక్ మగ సమాజంలో ఆడది బానిసగానే పరిగణించబడుతుంది.
అటువంటి బుద్దుల మీద ఈకథ విదిలించిన చెర్నాకోల..మారని మగసమాజంపై ఎక్కుపెట్టిన ఈ కథ మరొక యాభై యేళ్ళు ప్రశంస లందుకుంటుంది. మగసమాజం మారినప్పుడే ఈ కథకు పరాజయం. అందాకా కుప్పిలి పద్మగారికి విజయమే..
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
నా రెండు చేతులూ చాచి నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను.
మా వ్యక్తిత్వాలతో మానిప్యులేట్ చేసే నీలాంటి వాళ్ల కోసం కాదు.
ఎసెన్స్ అఫ్ ది స్టొరీ ఇది. మంచి కధ..బావుంది
పద్మ, ఇప్పుడు అయితే ఈ కథ ఇల్లానే రాస్తుందా అన్నది నా సందేహం.
ఇద్దరి మధ్య intimacy ని అంత bulidup చేసాక… ఆ రాత్రి… ఆ వాతావరణం లో వొక మగ, వొక వుమన్ దూర దూరం గా అంతసేపు ఉంటారా.
ఇస్ ఇట్ possible
వొక కాన్సెప్ట్ ని చర్చ లోకి తీసుకు రావడం వరకు ఓకే. కాని… కథ లో natural ప్రాసెస్ అలా ఉండే అవకాశం ఉన్నదా.
సాగర్ మాటలు ఆ టైం లో అలా ఉండే అవకాశం లేదు.
ఇప్పుడు కథ చదువుతుంటే నాకు అమీర్‌ఖాన్ సినిమా దోభిఘాట్ లోని సీన్ గుర్తుకు వచ్చింది.
అక్కడ ఉన్న సన్నివేశం లోని natural బ్యూటీ ఇక్కడ ఏది.
అందుకే పద్మ, ఇప్పుడు ఈ కథ ని ఈలాగె రాస్తుందా అన్నది నా ప్రశ్న.
కథ మొత్తం ఆఖరి పారా లోని విషయం చుట్టే తిరిగుతునప్పుడు మీరు narration మొత్తం మిగతా వాటి మీద concetrate చేసారు …..ఒక్కసారి mood create చెయ్యడంలో మీరు సఫలం అయ్యాక main point దగ్గరికి వచేసరికి ఐదారు లైన్లలో పూర్తి చేసేసారు…….ఎదో తెలీని అసంతృప్తి……
ఆడది ఒక మనిషి గ మసలే రోజు ఎప్పుడొస్తుంది? అనుక్షణం తనొక ఆడది అని గుర్తు చేసే వాతావరణం వేల్లునుకు పోయింది.మన చుట్టూ లేదలాంటి వాతావరణం.ఎప్పటికప్పుడు రుజువు చేసుకునే పోరాటమే మిగులుతోంది.ప్రతి ఆడపిల్ల చదివి తీరాల్సిన కథ.