కథాకథనం

ఆమె స్నేహానికి అతని మోహానికి మధ్య – గోడ!

జూలై 2014


ఆడది ఒంటరి గా బ్రతికితే ఏమౌతుంది?
ఆమెకీమీ కాదు. ఎంచక్కా ఆరోగ్యంగా, ఆనందంగా బాగానే వుంటుంది.
ఎటొచ్చీ చుట్టూ వుండే మగాళ్ళకే బోలెడంత దిగులౌద్ది. పాపం. మగ దిక్కులేకుండా ఎలా మనగల్గుతుందీ, ఒక్కత్తెనూ? ప్చ్. అని తెగ బాధ పడిపోతారు. పనిమాలా వెళ్ళి మరీ బ్రతిమాల్తారు. కాదు ప్రాధేయపడుతారు. తామూ ఓ చేయి వేస్తామని.
సాయం చేయడానికి ఇంతమంది మగాళ్ళు ముందుకొస్తే, నిజానికి – ఎంతమంది స్త్రీలు స్వేచ్చ గా, ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడరనీ, ఈ సమాజం లో? అయితే ఆ సాయం నిస్వార్ధమైనదైతే కదా?

కథ గురించి క్లుప్తంగా :
మహీ ఒక ఒంటరి స్త్రీ. చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్ల. పెళ్ళి వొద్దనుకుంటుంది.
అనుకోకుండా ఓ నాటి సాయంత్రం, తుఫాను వేళ బస్ కోసం ఎదురుచూస్తున్న ఆమెని గుర్తుపట్టి, తన తనింటికి తీసుకొస్తాడు ఒంటరి సాగర్. ఒకప్పుడు ఇద్దరూ కాలేజ్ ఫ్రెండ్సే కాబట్టి ఆమె కాదనదు. అతని వెంట వస్తుంది.
బాగ్ లో ఆమె బట్టలన్నీ తడిసిపోడంతో, తన బట్టలిచ్చి మార్చుకోమంటాడు. టీ కాచిస్తాడు. ఆమె దీపం వెలిగిస్తే..ఆ వెలుగులో వంట చేసి పెడతాడు. ఆమెతో కలసి తింటాడు. కుందెలో నూనె అయిపోతుంది. దీపం ఆరిపోతుంది.
ఆమె పక్కేయమంటుంది. వేస్తాడు.
అతను -ఆమె కోరిన పాటలు పాడతాడు. ఆ పరవశంలో చనువుగా అతని వొళ్ళొ వాలుతుంది. అప్పటి దాకా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే.
ఆ తర్వాతే అసలు కథ మొదలు. అతను అక్కడితో వూరుకోక, అడ్వాన్సయిపోతుంటే మహి సున్నితంగా వారిస్తుంది. వినడు. ఆమె నిరాకరణ తో అతని అహం దెబ్బ తింటుందో ఏమో..అప్పుడు..అతన్లోని నిజమైన మగాడు బయటకొస్తాడు. ‘పాతివ్రత్యమా? అంటూ!

అతగాడడిగిన ప్రశ్నకి –నింపాదిగా ఇచ్చిన సమాధనమే ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకాంశం. కథకి మూలమైన ప్రాణం.
ఒక్క నిప్పు కణిక చాలదూ, కీకారణ్యాలను దహించేందుకు. ఆమె చెప్పింది విన్నాక , ఇప్పుడతని మానసిక స్థితీ అలానే వుంది. కారణం ఆమె మెత్తగానే చెప్పినా, కఠిన నిజాల ఇజాలకు కావొచ్చు. ఆ మాటల ధాటికి, వేడికి అంత తుఫాన్లోనూ, అతనికి ఉక్కపోత పోస్తుంది.
ఇంతకీ అతనితో – ఏమంది మహీ? ఆమె మాటలకి అతనంతగా అచేతనుడైపోయాడెలా ? – అని మీరూ తెలుసుకోవాలనుకుంటే ఈ కథని పూర్తిగా చదవి తెలుసుకోవచ్చు.

కథ పై నా అభిప్రాయం :
ఏ కథకైనా ఆరంభం కంటెనూ, ముగింపే ముఖ్యమని నా భావం. ఎందుకంటే – కథ చదవడం పూర్తయ్యక, పాఠకుణ్ని పంపేస్తూ, కథ తలుపేసుకున్నా, అతనింకా అక్కడే ఆరుబయట తచ్చాడుతూ వుండాలి. అతన్ని వెంటాడాలి.
మంచి కథలెప్పుడూ పాఠకుణ్ని ప్రశ్నించడమే కాదు, సమధానమూ పరచాలి.
అప్పుడె అది – మరపురాని కథౌతుంది. అలాటి కథే ఈ గోడ కథ కూడా!

నాకెందుకు నచ్చిందంటే :
నిజ జీవితంలో – ఇలాంటి అనుభవాలెదురైనప్పుడు స్త్రీల మనసులు కలతబారుతాయి. ‘బాగా బుధ్ధొచ్చింది బాబూ..ఇంకెప్పుడూ మగ స్నేహాల జోలికే పోను’ అని డిసైడైపోడం కూడా కద్దు.
అసలు వీడిలాటి వాడనుకోలేదు.అంత చీప్ గా మాట్లాడ్తాడని కలలో కూడా ఊహించలేదు. అని చెప్పుకుని చెప్పుకుని దుఖించే ఆడపిల్లల్ని చూస్తాం.
నిజానికి అతడెంత గొప్ప స్నేహితుడే అయినా, ఒంటరి వేళలో లో మాత్రం అతడు ఫ్రెండ్ కాడు. మగాడు..వొట్టి మగాడౌతాడు. అని తెలీకపోడం మూలాన కూడా కాసింత షాకింగ్ గా నే వుంటుంది ఏ ఆడపిల్లకైనా. అవును కదూ?
కానీ, ఈ కథలో అలా కాదు. ఆమే – అతని కి షాకిచ్చి, వేపేస్తుంది. ఆ పై హాయిగా నిద్ర పోతుంది.
శభాష్ మహీ! శభాష్ ! అనిపించుకునే ఆ పాత్ర వ్యక్తిత్వం నచ్చింది నాకీ కథలో.
ఒక విభిన్నమైన కథాంశానికి ఒక వినూత్నమైన ముగింపునిచ్చారు రచయిత్రి.
కుప్పిలి పద్మ గారి కథ అంటేనే ఒక ప్రత్యేకత వుండి తీరుతుందని ఆశ పడే పాఠకులకు పూర్తి సంతృప్తినిచ్చేపోయే కథ – ఇదని మాత్రం ఖచ్చితం గా చెప్పక తప్పదు.
రచయిత్రికి నా హార్దికాభినందనలు తెలియచేసుకుంటూ,
మీ అందరకీ నా శుభాకాంక్షలతో…
సెలవు మరి!

 


గోడ

-కుప్పిలి పద్మ


తూర్పు సమురంలో తుఫాన్ – పగిలిన మబ్బులోంచి విచ్చుకుంటున్న ప్రళయంలా పెనువర్షం. ఎగిసిపడే కెరటాలు, రాలిపడే చినుకులు, ఏకమవుతోన్న భూమ్యాకాశాలు.

తుఫాన్ వేళ సాయంత్రమే ముసుకురుకున్న రాత్రి చీకట్లు.

బీచ్ రోడ్డు లో బస్టాప్. తడిసి ముద్దైన దేహాలు, వర్షధారల్లోంచి తడవకుండా కాపాడుకోటానికి శరీరంలో అణుభాగమైనా లేదేమో వెన్నెల్లో నిరీక్షిస్తున్నంత మామూలుగా ఆ బస్టాప్లో ఆ వర్షంలో చేరాల్సిన ప్రదేశాలకి చేర్చే ఏదో ఒక వాహనం దొరకకపోతుందాని ఎదురుచూస్తున్నారంతా.

ఆ బస్టాప్లోకి పూర్తిగా తడిసిపోయిన సాగర్ కొత్తగా ప్రవేశించాడు. తడిచేత్తో కళ్ళపై నీళ్ళని తుడుచుకుంటూ నిలబడ్డాడు. కాసేపటికి చూపు కాస్త తెరిపిన పడింది. చుట్టూ చూశాడు. తడిసిన శరీరాలు. ఎదురుగా చూశాడు. ఆకాశమూ సముద్రమూ ఏకమైనాయి. తిరిగి చుట్టూ చూశాడు. ఓ చోట చూపునిల్చింది.
అవును ఆమె..నిజమే. ఆమె మహిమే. ‘మహిమా’ చలికి పూడుకుపోయిన గొంతులోంచి మాట పెగల్టం లేదు.

‘మహిమా’..ఊహు లాభం లేదు. మాట రావటం లేదు. పెదవుల కదలిక తప్పా.
అతను ఆమెకి చేరువగానే వెళ్లి భుజం మీద చేత్తో చిన్నగా తట్టాడు. ఆమె వెనుదిరిగింది. తడిసిపోయిన కళ్లలో ఆశ్చర్యం. తడిగా ‘సాగర్ ‘ చలికి గడ్డ కట్టుకుపోయిన పిలుపు మెల్లగా ఒకరిమాట ఒకరికి వినిపించేంతగా కొద్దిగా గొంతు సడలింది.

“ఇప్పుడు నీకే బస్సు, ఆటో దొరకదు. అదిగో ఆ కనిపించేది నేనుండే ఇల్లు. రా నాతో వచ్చె…” గాలి హోరులా చెల్లాచెదురవుతున్న మాటలు.

ఆమె వంగి ట్రావల్ బాగ్ భుజానికి తగిలించుకొంది.
అడుగు ముందుకి వేయనివ్వకుండా వెనక్కి తోసేస్తున్న ఈదురుగాలి. నీటి ఒత్తిడి. ఒకరివెంట మరొకరు, బాగ్ భుజాలు మారుతూ, అడుగులో అడుగు. చేతుల్లో చెయ్యి. పడుతూ లేస్తూ ఈదుతూ అతని ఇంటికి ఇద్దరూ చేరారు.
“బట్టలు మార్చుకో, అదిగో అదే బాత్రూం” చెప్పాడతను.

అతను లోపలి గదిలోకి వెళ్ళాడు.బట్టలు మార్చుకున్నాడు. తిరిగి ముందుగదిలోకి వచ్చేసరికి ఆమె అలానే తడిగా నిలబడి వుంది.

“మా ర్చు కోలేదా” అడిగాడు.

ఆమె చూపులు నేలపై. ఆమె చూపులని అతని చూపులు అనుసరించాయి.

బాగ్ లోని బట్టలు నేలపై కుప్పపోసి వున్నాయి. అవి నీళ్ళల్లో జాడించినట్టున్నాయి.

“తుఫాన్”అంటూ అతను లోపలికి వెళ్లాడు.

తిరిగొచ్చాడు. చేతిలో లుంగి, లాల్చి, తువ్వాలు ఆమె అందించాడు. అందుకొని బాత్రూంలోకి వెళింది. తిరిగి వచ్చే సరికి అతను గదిలో లేడు. తువ్వాలుతో తల తుడుచుకుంటూ లోపలికి వెళ్లింది. చీకటి. వంటగదిలో స్టౌవ్ వెల్గులో టీ చేస్తూ కనిపించాడు.

అతను ఆమెవైపు చూసి “అచ్చు కేరళైట్లా వున్నావ్” అనాడు. ఆమె నవివ్వింది. స్టౌవ్ వెలుగులో బుగ్గపై డింపుల్ తళుక్మంది. “కరెంట్ లేదు” అన్నాడతను.

“కాండిల్, హరికేన్ లాంతరు లేవా?”, ఆమెకు టీ అందిస్తూ “లేవు” అన్నాడు. ఓ గుక్క తాగింది. చల్లబడిన శరీరంలో వెచ్చదనం వేడి టీతో మెల్లగా రాజుకుంటూంది.

“పూజచేస్తావా” అడిగింది.
“లేదు” అన్నాడు.
“పూజామందిరమే లేదా”
“ఉంది. అమ్మ వచ్చినప్పుడు చేస్తుందిగా. ఏం?”
“ఎక్కడుంది మందిరం”
“ఆ మూల”

చీకట్లో మెల్లగా నడిచి దేముని దగ్గరున్న కుందెలో నూనె పోసింది. ఒత్తి వేసి వెలిగించింది.
“నూనె దీపమా.. అదే పిల్లా..నూనె కొంచెమే వుంది.” అన్నాడు.
“వంట పూర్తి చేసై. ఆకలి. తినగానే దీపం తీసేద్దాం.”

“వంటా..ఏం చేద్దాం..అన్నం, పప్పుచారు, కొద్దిగా మాగాయ వుంది. కూరగాయలేం లేవ్.”
“ఏదో ఒకటి త్వరగా కానీయ్. ఆ ట్రైన్ లోకూర్చుని నడుం నొప్పి వస్తోంది. నిన్నట్నుంచి సరియైన తిండే లేదు.” కుక్కర్ లో నీళ్లు పోస్తూ అంది.
“ఎక్కడ్నుంచి రాక, ఎక్కడికి పోతున్నావ్?”
మద్రాస్ నుంచి మెయుల్లో. దారి పొడుగునా వానే. భీంలీలో వుండటం. అక్కడే ఉద్యోగం. ఎలాగోలా భీంలీ వెళ్లి పోదామనుకున్నాను. ఆ బస్సు ఆర్.కె.బీచ్ వరకు వచ్చి ఇంక వెళ్లనని మొరాయించింది. ఎలాగోలా ఆ బస్టాండ్ వరకు చేరాను. ఇంతలో నువ్వు కని పించావ్. అవునూ నువ్వెక్కడ్నుంచి రాక” బియ్యం కడుగుతూ అడిగింది.

“యూనివర్సిటీ నుంచి. నిన్న కథ రాశాను. ఆ పేపర్లు టేబుల్ పైనే వుండిపోయాయి. కిటికి తలుపులు వేశానో లేదోనని అనుమాన మొచ్చింది. పేపర్లపై వెయిట్ పెట్టానో లేదో గుర్తులేదు. గాలికి కాగితాలు ఎగిరిపోతాయోనని బెంగ. మొదటిసారి కథ రాయటం కదా. ఆ అక్ష రాలు ఈ తుఫాన్ నీళ్లలో కరిగిపోరాదని వెళ్లాను. ” పప్పు కప్పుతో కొలుస్తూ అన్నాడు.

“ఇంతకీ తలుపులు వేసొచ్చావా లేదా”
“వెయ్యటానికి మెయిన్ బెల్డింగ్ తాళాలు వాచ్మెన్ దగ్గరున్నాయి. బిల్డింగ్ చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేశాను. కానిలోపల కాగితాలు ఏమయ్యాయో తెలియదు.” దిగులుగా చెప్పాడు.
“కథలని పెన్ తో రాయటం ఏంటింకా, కథలని రమేష్ లా డైరెక్ట్ గా కంప్యూటర్ మీదే కంపోజ్ చెయ్యాలి.” అంది మహిమ.

“అవునూ, నీకు వీళ్లంతా కనిపిస్తూనే వున్నారా”
“ఈ హైదరాబాద్ పనిమీద వెళ్లినప్పుడంతా కలుస్తుంటారు. రావుడు కవిత్వం రాస్తున్నాడు. ఏం చేద్దాం. ఏం చేద్దామంటూనే వున్నాడు. నీకెవ్వరూ కనిపించటం లేదా” అడిగింది.
“ఆ మధ్య గాయత్రి కనిపించింది. వాళ్ళాయనికి విడాకులు ఇచ్చేసిందట. జీవితం ఇప్పుడెంతో హాయిగా వుందట.” అన్నాడు.

కుక్కర్ విజిల్స్ రాగానే ఆపారు.
ప్లేట్స్ టేబిల్ పై సర్దింది. మధ్యలో దీపపు కుందె వుంచింది. నీళ్లు గ్లాసుల్లో పోసింది.
కుక్కర్, చల్లారిందో లేదో చూసి మూత తీశారు.
పళ్లాల్లో అన్నం, పప్పు, పెట్టుకొన్నారు.
“ఆయిల్ లైట్ డిన్నరా” పప్పు కలుపుకొంటూ అంది.
“ఊ” అంటూ నవ్వాడు.

“ఆ పప్పా.. అది పోలూరి వాళ్ళ పప్పు. పుస్స్త కంలో చదివాను. నచ్చింది. అప్పట్నుంచి ఇలా చాలా మందికి ఈ పప్పు రుచి చూపిస్తున్నా. అఫ్ కోర్స్ నీలా చాలామంది మెచ్చుకుంటున్నారనుకో..” అన్నాడు.
“బాగుంది అన్నానంతే! ఎంత ఉపన్యాసం ఇచ్చావ్. ఇంకాస్త పప్పు వెయ్యి.”
తింటూ తింటూ ఆమె పొలమారింది. అతను ఆమెకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ నెత్తిమీద చేత్తో తడుతూ “ఎవరో తలచుకుంటున్నారు.” అన్నాడు.
“ఇంకెవరూ. ఆ రైల్లో టి.టి.ఐ.యే..”
“ఆయన ఎవరూ…”
“రైల్లో టిక్కెట్లేని ప్రయాణం చేస్తున్నామో లేదో చూసే ఆయన.” అంది.
“ఆ విషయం తెల్సు. నిన్నెందుకు తలచుకుంటున్నట్టు”
“రైలేమో ఎక్కడిక క్కడ ఆగిపోతుంది. తెగ బోర్. ఏ పని చేయటానికి లేదు. అందుకని కాసేపు అతన్ని ప్రేమించాను.” అంది నవ్వుతూ.

“నువ్వు ప్రేమిస్తే నువ్వు తలచుకోవాలి కానీ అతను నిన్నెందుకు తలచుకుంటాడు” అడిగాడు.
“ఈ ట్రైన్ ఇలా ఎంతసేపు ఆగుతుంది. అని అడిగానంతే. అతను నా సమస్త విసయాల గురించి అంచెలంచెలుగా ప్రశ్నలు వేసేశాడు. ఆడపిల్ల ఓ ప్రశ్న వేయగానే అలా నిలువు గుడ్లేసుకొని మాట్లాడేస్తారు. ఆ విషయాన్ని అక్కడితో వదలరు. పైపెచ్చు అక్కడ్నుంచి ప్రేమంటూ వెంటపడతారు. ఐదు నిముషాల్లో విడవలేనంత ప్రేమేంటిరా. ఆకర్షణ అనైనా అనరు. ప్రేమ అంటారేమిటిరా? పెళ్ళి కాలేదా అంటారు. చేసుకోలేదయ్యా అంటే ఒంటరిగా వున్నారా..లోన్లీగా అని పించదా..మాకు తోడుంటామంటారు. నువ్వు చాలా ఆలశ్యంగా కనిపించావ్. అబ్బే నాకు నేను ఇప్పుడున్న జీవితం నరకంగా వుంది. నీతో జీవితాంతం వరకు కలసి వుండాలని వుంది. అంతవరకు ముందు శరీరాలని పెనవేసుకుపోతాం…అంటూ ఎన్నెన్ని కథలని చెప్పేస్తారో. మేమేదో మా ఒంటరి జీవితాలకి వాళ్ల ఆలంబన కోరినట్టు.” తిన్న పళ్ళెం తీసి అంట్ల గిన్నెలో పెడుతూ అందామె.

“నీకైతే బోల్డన్ని వ్యాపకాలు. చదువుతావ్. పాటలు వింటావ్. ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఊళ్లు తిరిగుతావ్. అదీ కాకుండా నువ్వెక్కడున్నా అ అపరిసరాలలో, మనుష్యులలో వున్న నీకు నచ్చిన అంశాన్ని ఇష్టపడతావ్. నీలా అంతా వుండలేరుగా. ఒంటరితనంతో బాధపడేవాళ్లు లేరంటావా” అడిగాడు.
“ఎవరో కొందరే ఒంటరితనంతో బాధపడుతారా? చాలమందిలో ఆ దిగులుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అంతా అందులో కొట్టుకుపోతోనే వుంటాం. ఆ దిగులు, బెంగ ఎందుకో తెలిసినా మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేఛ్చగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదు కదా. ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్లది. అనుకోరుగా. మనముందు ఓ వ్యవస్థని ఉంచారు. మన కి ఇరుగ్గా వున్నా అందులోనే వుండాలా? బయటికి వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా.. మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా.. అసలు కొట్టాలా వద్దా..కొట్టటం వల్ల మనకి కావల్సింది మనకు దొరుకుతుందా..దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టచ్చు. అనిపించకపోయినా కొట్టచ్చు. లోపల ఏం లేదని తెల్సింది. బయట ఏముందో లేదో తెల్సుకోటానికి ఎందుకు వెనుకాడాలి” ఆమె మాట్లాడుతుండగా దీపం వెల్తురు కొదికొద్దిగా తగ్గి ఆరిపోయింది.

“నూనె అయిపోయింది.” అన్నాడతను.
“మంచిది. పక్కలు వేసుకుందామా” అడిగింది.
“ఆ”
అతను చాప పరిచాడు. దానిపై బొంతపరుస్తూ “బొంతలు భలే వుంటాయేం. మా అమ్మమ్మ వీటిని చాలా ఆర్టిస్టి క్ గా కుట్టేది.” అంది.
“ఈ బొంత మా నాయనమ్మ ఇచ్చింది.” అన్నాడు. ఆమె కిటికి దగ్గరికి వెళ్లి మెల్లగా తలుపు తెరిచింది. రయ్ మని గాలి ఆమె ముఖాన భళ్ళున కొట్టింది.
“అబ్బా ఏం తుఫాన్” అంటూ ఆమె కిటికీ రెక్క వెయ్యటానికి తంటాలు పడుతోంటే అతనొచ్చి తలుపుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బోల్టు పెట్టింది.
“నిక్షేపంలా వేసున్న కిటికీని తీయటం ఎందుకు? వెయ్యటానికి ఇబ్భంది పడటం ఎందుకు?” అన్నాడు.
“బయటేం జరుగుతుందో చూడొద్దా”
“బయటేం వుంది. వర్షమని తెలుసుగా”

“ఉత్తి వర్షమేనా. తలుపువేయకపోతే ఆ గాలికి ఎంత బలం వుందో తెలిసేదా”
“సాయంత్రమంతా నడిరోడ్డులో ఆ గాలికి కొట్టుకుపోయావు కదా మళ్లీ ఇప్పుడు కొత్తగా చూడ్డానికి ఏముంది”
“నాలుగు గోడల మధ్య నుంచి తుఫాన్ని చూస్తే ఎలా వుంటుందోనని” అంది.
ఆమె మెడవరకు దుప్పటి కప్పుకుంటూ “పాటపాడు” అంది.
“ఏ పాట” అడిగాడు.
“నీ ఇష్టం.”

“దీవారోం సె మిల్ కర్ రోనా
అచ్చా లగ్ తా హై
హం భీ పాగల్ హో జాయేంగే
ఐసా లగ్ తా హై

కిత్ నె దినోం కె ప్యాసె హోంగె
యారో సోచో తో
షబ్నం కా టుకడా భీ
జిన్ కొ దరియా లగ్ తా హై
హం భి పాగల్ హొ జాయెంగె,
ఐస లగ్ తా హై
దీవారోం సె..- అతను పాడుతున్నాడు.
“నీకీ పాటంటే ఇష్టం కదా” అడిగాడు.
“ఊ”
“నువ్వీ పాటని సిద్దార్ధని అడిగి మరీ పాడించుకునే దానివిగా. అతని దగ్గరే నేనీ పాట నేర్చుకున్నాను నీకిష్టమని. కానీ నీకు వినిపించకముందే నువ్వు, ఉద్యోగం అంటూ మా అందరి నుంచి వెళ్లిపోయావ్” అన్నాడు.
“చదువులు అయిపోయాక ఇష్టమయిన బ్రతుకుతెరువు చూసుకోవాలిగా. నీకీ పాటకి అర్ధం తెలుసా” అడిగింది.
“తెలియదు చెప్పు”
“నే అర్ధం చెప్పనా. నీ గొంతు బాగుంది. కానీ నీకీ పాట అర్ధం తెలియక ఇన్వాల్మెంట్ తో పాడలేకపోతున్నావ్. కొండగాలి తిరిగింది పాటని నువ్వు పాడినప్పుడు నిజంగా గుండె ఊసులాడుతుంది.” అంది.
“అర్ధం చెప్పు.”
గోడల్తో కలిసి దుః ఖించడం ఎంతో బాగుంటుంది.
నేను పిచ్చివాడి నైనా ఇలానే వుంటుంది. ఎన్ని రోజులుగా దాహంతో వున్నానో కొంచెం ఆలోచించండి.
ఓ మంచు ముక్క కూడా నదిలా కనపడుతోంది..”
చీకటి వర్షం హోరు. గాలి గొడవ. చలి. ఆ గదిలో ఆమె గొంతు జలపాతపు లోయలో మంచు కురుస్తున్నట్టు వినిపిస్తోంది.
అతను తిరిగి ఆ పాటే పాడాడు.
చీకటి దిగంతరేఖ మీది వంగి సృష్టి రహస్యం గుసగుసగా చెవిలో చెపుతున్నట్టుంది అతని స్వరం.
ఆమె చేయి చాపి అతని చెవిని మెలె పెడుతూ “కొండగాలి తిరిగింది పాడవా” అడిగింది.
అతను పాడటం మొదలుపెట్టాడు.
ఆమె చేతివేళ్లు అతని జుట్టుతో ఆడుకుంటున్నాయి.
పాట తర్వాత పాట.
ఆమె అతనికి కాస్త చేరువగా జరిగి దగ్గరగా పడుకొని కళ్ళు మూసుకొని పాటలు వింటోంది.
పాడుతూ పాడుతూ చప్పున ఆమె వైపు తిరిగి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఆమె నవ్వుతూ అతని నుంచి తప్పించుకొంటూ “అబ్బాయ్ ఏంటిది” అంది.
“తుఫాన్”
“తుఫాన్ గాలి అంటే..ఊహు నాకు బెంగ. గోదారిగాలే ఇష్టం.” నవ్వుతూ అంది. అతను నవ్వుతూ ఆమె సమస్త దేహాన్ని అల్లుకుపోతున్నాడు.
ఆ క్షణంలో సాగర్ నవ్వు ఆమెకి హాయిగా అనిపించింది.
అతని ప్రతి కదలికలోనూ ఆమెకు తన సాగర్ కనిపించడం లేదు. సాగర్ లోపల్నించి మరో సాగర్ బయటికి వుబికివస్తున్నాడా అనిపిస్తోంది. అప్పటిదాకా సాగర్తో తను పంచుకున్న ప్రపంచమంతా వున్నట్టుండి తెగిపోయినట్లనిపించింది. చివరికి సాగర్ కి కూడా తానొక శరీరంగానే కనిపిస్తోందా? ఆమె లోలోపల్నించి ఒక చురకత్తి మెలెపెడుతున్న బాధ.
ఆమె అతన్ని మెల్లిగా వారిస్తుంది.
సాగర్ ప్రశ్నార్ధకంగా ఆమెవైపు చూశాడు. మళ్ళీ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. ఆమె దూరంగా జరిగింది.
“ఏం”
“వద్దు”
“మహీ! ఎందుకు? ఉప్పెనలా దేహాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఈ వారింపు ఏమిటి?” నిష్టూరంగా అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
“నిన్ను నేను ముద్దు పెట్టుకున్నా, నువ్వు నా జుట్టు, బుగ్గలని తాకినా, నీకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయంలో నీకెందుకంత అభ్యంతరం? నువ్వు కూడా పాతివ్ర త్యం, శీలం అని ఆలోచిస్తున్నావా? చికాకుగా అడిగాడు.

మహిమ పక్కమీద నుంచి లేచి అతడిని ఆనుకొని కూర్చుంటూ..”శీలం..పాతివ్రత్యం..ఉహూ..అవేంకాదు. సాగర్ ఏ ఎమోషన్స్ నన్ను ఎటు తీసుకు వెళ్లితే అటు అడుగులేస్తున్నదాన్ని. ఈ సిస్టం లో ఇమడలేకే గా పెళ్ళి చేసుకోనిది. ఏదో ఒక ఉద్యోగం అంటూ ఒకే చోట కూరుకుపోనిది. కానీ ఈ విషయానికొచ్చేసరికి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎస్ అనలేను. ఏ క్షణంలోనైనా ఇలాంటి ఎమో షన్స్ ఎదురౌతాయని ఎప్పుడూ ఒక శారీరక జాగ్రత్తతో వుండటం అసాధ్యం కదా” అంది.

“ఏమవుతుంది? నువ్వూ అందరిలా ప్రపంచం ఏం తెలియదన్నట్టు మాట్లాడతావేం? నువ్వేదో అందరికంటే భిన్నమైనదానివనుకున్నాను.” ఆశ్చర్య పోతూ అడిగాడు.

“ఏమవుతుందా? ఏమైనా కావొచ్చు. నీకు నాకు మధ్య ఓ సైకలాజికల్ కోజ్ నెస్ రావొచ్చు. నువ్వూ, నేనూ, రావుడూ, రమేశ్, మనమంతా కాలేజ్ దినాల్లో మంచి స్నేహితులం. అల్లరి చేసేవాళ్లం. బొల్డన్ని విషయాలు చర్చించేవాళ్లం. కానీ మన మధ్య ఇలాంటి విషయాలు ఎప్పుడూ వచ్చేవి కావు. ఈ విషయాలపట్ల మీరంతా ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఈ విషయం జరిగాక నువ్వెలా రియాక్ట్ అవుతావో? ఏమేమి మాట్లాడతావో, నాపై నీకు హక్కు వుందనుకుంటావో, నే బిడ్డను కనాలనుకుంటే నువ్వు వొద్దనొచ్చు. అబార్షన్ చే యించు కుంటానంటే కాదొనొచ్చు. లేదా అస్సలు మొత్తం వ్యవహారంతో నీకే సంబంధం లేదనొచ్చు. లేదా ఇందాక వచ్చాం పెళ్లి చేసుకుందాం అనొచ్చు. కలిసి వుందాం అనొచ్చు. లేకపోతే ప్రపంచం తెలియకుండా లేను. నా రెండు చేతులూ చాచి నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను.” అని ఆగి.. ఆ చీకట్లోనే అసహనంగా వినిపిస్తున్న అతని ఊపిరి వింటూ అతని పక్కనే వున్న పక్కపై పడుకొని దుప్పటిని మెడవరకూ కప్పుకుంటూ..”కాని నువ్వో ప్రపోజల్ పెట్టినప్పుడు నేను వద్దంటే నువ్వు నేను ఎందుకు వద్ద న్నానో నీకు నిజంగా తెలియదా? తెలిసి కూడా తెలియనట్టున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నన్నేం అడిగావ్. నువ్వూ అందరిలా ఇలానే మాట్లాడతావా? నువ్వు ఇంకేదో అందరికంటే భిన్నం అనుకున్నాను – అంటూ మా వ్యక్తిత్వాలతో మానిప్యులేట్ చేసే నీలాంటి వాళ్ల కోసం కాదు.” చెప్పింది మహిమ.

ఆమె నిద్ర సవ్వడి వింటూ అచేతనంగా కూర్చున్నాడు. బయటి తుఫాన్ హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సవ్వడి ఎక్కువగా అలజడి కలిగిస్తోంది.
అతను తలుపు తీసుకొని బయటకు వచ్చాదు.
తుఫాన్ మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే వుంది.
పొద్దున్న తుఫాన్ భయపెట్టింది.
ఆ తుఫాన్ ప్రశాంతంగా వుంది అతని లోపలి తుఫాన్ కన్నా..