కథాకథనం

ఒంటరి

ఆగస్ట్ 2014

ఒంటరి జీవన౦ అది అనివార్యమైనా, కొని తెచ్చుకున్నా ఎక్కడి కక్కడ అసంతృప్తి చదువరులకే తెలిసి వస్తు౦ది. అయితే ఒ౦టరితన౦ ఎప్పటికీ అలా మిగిలిపోవాలన్న నియమమేమీ లేదు కదా . అది ఇంట్లో అయినా ఆకాశంలో అంతరిక్షంలో ఎక్కడ ఉన్నా తొంగి చూస్తూనే ఉంటుంది. అతనూ ఆమె ఇద్దరూ సహాప్రయాణీకులు. విమానంలో పక్కపక్కన సీట్లు. అయితే ఆమె అక్కడున్న స్పృహే లేదు అతనికి.

ఒక పక్క సెలెబ్రిటీ నన్న ఈగో మరో వంక గుర్తింపుని ఆస్వాదించే ఆనందం, వీటి మధ్య అతని నిర్లక్ష్యం కించిత్తు ఇబ్బందికరమే అనిపి౦చిదామెకు.
ఒంటరితనం . అందరిలో ఉండీ ఒంటరితనం.
కలిపి౦చుకుని ఏదో ఒకటి మాట్లాడటం, ఆ ఏదో ఒకటిలో సినిమాల ప్రసక్తి , కాస్త గర్వంగా తనను తాను నటిగా పరిచయం చేసుకున్నప్పుడు ఎదురు చూసిన స్పందన రాక వినలేదేమోనని మళ్ళీ చెప్పబోతే నవ్వి విన్నానని చెప్పడం ఇంత సహజంగా ఉన్న కధ చదివి చాలా రోజులైంది.
నెమ్మది నెమ్మదిగా అల్లుకున్న సంభాషణ అతని స్వభావం అంచనా వెయ్యాలన్న తహతహ .. చివరకు తన అందం మీద తనకే అపనమ్మకం.
అంచనాల అపనమ్మకాల మధ్య న్యూయార్క్ చేరాక గత్యంతరం లేక అతని వెంట అతని ఇంటికి వెళ్ళడం ఫిలిం ఫెస్టివల్ అయ్యేవరకు అతని అతిధిగా ఉండి పోడం ఆ పరిచయంలో మహితో అతని పొసగనిప్రేమ చివరకు అతన్ని ఇష్టపడటం
ముగింపు అద్భుతంగా ఉంది.

కదా చదివి ముగిసినా కధలో౦చి బయటకు రాలేదో బయటికి కధకూ తేడా లేదో అర్ధం కాలేదు. మనసును హత్తుకునే కధ. ఎక్కడా ఉపన్యాసాలలాటి సంభాషణలు లేవు.రచయిత అనవసరపు వ్యాఖ్యలు లేవు. ఎన్నో సార్లు భారత దేశానికీ అమెరికాకూ తిరిగాక ఎంత సహజంగా ఉండీ ప్రయాణ వర్ణన అనిపించింది.
సినిమాలలోలాగా డైలాగ్స్ లేవు చివరకు ముగింపు కూడా చెప్పకనే చెప్తున్న భావన.  జీవితంలా సాగిన కధ. ఎక్కడా ఒక్క పదమైనా తప్పించి చదువుదామనిపించలేదు. రచయితకు అభినందనలు.
చదివి ఆస్వాదించండి


ఒంటరి

రచన: తమ్మినేని యదుకులభూషణ్


అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదురుచూసింది. కానీ అతనిలో ఏమీ కదలిక లేదు. పక్కన తాను ఉన్నానన్న స్పృహే లేదు. సాధారణంగా ప్రయాణాల్లో తనను గుర్తుపట్టేసి, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి, తనను మొహమాటపెట్టేసే వాళ్లే ఎక్కువ. ఒక్కోసారి ప్రయాణంలో ఏకాంతం పోతోంది అనిపించినా, ఆ గుర్తింపు తనకు లోలోపల ఆనందాన్నే ఇచ్చింది. కానీ ఈ శాల్తీ విచిత్రంగా ఉన్నాడు. పోనీ కళ్ళు మూసుకుంటాడా అంటే అదీ లేదు. కళ్ళు తెరచుకొనే వున్నాడు. తనవంక చూడట్లేదు. అసలు తనను ఒకసారన్నా చూశాడా అని శంక.
” డ్రింక్స్‌ ” ఏర్‌ హోస్టెస్‌ నవ్వుతూ తనవంకే చూస్తోంది. అలవాటు చొప్పున తను ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ తీసుకొంది. పక్కనున్న వ్యక్తి పళ్ల రసంతో సరిపెట్టుకొన్నట్టున్నాడు. అతనికి సర్వ్‌ చేస్తున్నప్పుడు ఏర్‌ హోస్టెస్‌ ఎక్కువ వినయం ప్రదర్శిస్తున్నట్టు అనిపించింది. ఆమెలో కొంచెం తడబాటు కూడా కనిపించింది.
విమానంలో అందరూ ఎవరిలోకం లో వారు ఉన్నట్టున్నారు. నాకు ఉన్నట్టుండి ఒంటరి తనంలో కూరుకుపోతున్నట్లు అనిపించింది. తను ఆర్ట్‌ సినిమాల్లో నటించేటప్పుడు, ఎక్‌ లా అన్న సినిమాలో ప్రధానపాత్రలో తనను అందరూ జీవించావు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా గుర్తుకు వస్తుంది; అందులో నాయిక ఒంటరితనంతో బాధ పడుతుంది. భర్త సైన్యంలో. .
ఎదురుచూపులతో ఎంతోకాలం గడిచిపోతుంది. తను కమర్షియల్‌ సినిమాలలో నటించడం మొదలుపెట్టాక చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ, తనకెందుకో నటిగా అసంతృప్తి పెరిగిపోతోంది. ” ఏదో నెపం మీద పలుకరిస్తే ?” అతనేదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు అతను గ్లాసును పట్టుకొన్న తీరే చెబుతుంది.
తాత్కాలికంగా నా ప్రయత్నాన్ని విరమించుకొన్నాను.

2

విమానం వాతావరణం లో ఏవో మార్పులవల్ల అనుకున్నదానికంటే పైనో క్రిందో ఎగురుతుందని చెబుతున్నాడు కెప్టెను.
ఖాళీగ్లాసులు తీసుకు వెళుతోంది ఏర్‌ హోస్టెస్‌.
అతను తన గ్లాసును కొంచెం ముందుకు వంగి అందివ్వబోతుంటే నేనే చొరవ తీసుకొని తన గ్లాసును ఏర్‌ హోస్టెస్‌ కు అందించాను.
అతను పొడిగా ” థాంక్స్‌” అన్నాడు. ” హమ్మయ్య” అనిపించింది.
ఏదో హిందీ సినిమాలో డిషూం డిషూం సీను. ” మీరు హిందీ సినిమాలు చూడరా” మాట కలిపాను సాలోచనగా అతనివంకే చూస్తూ.
” నాకు హిందీ బొత్తిగా రాదు. పెద్ద ఆసక్తి కూడా లేదు. ”
అతని సమాధానం నిరాశ కలిగించింది. కొంత సంతృప్తి కూడా కలిగింది , అతను తనను ఎందుకు గుర్తు పట్టలేదో కారణం తెలిశాక.
తాను ఒక నటినని పరిచయం చేసుకోవాలా ? వద్దా ?! అన్న సంశయం. తన ఫీలింగ్స్‌ తనకే కొత్తగా ఉన్నాయి.
ఏమయితే అదయింది లెమ్మని. . తను సినిమాల్లో నటిస్తుంటానని తల ఎగురవేస్తూ చెప్పింది. టీవీ లో వస్తున్న సినిమాలో విలన్‌ డైలాగు. . . జనాల నవ్వులు వాటిల్లో కలిసిపోయింది తన స్వరం.
మళ్ళీ చెప్పబోతుంటే , అతను నవ్వి . . తనకు వినిపించింది అన్నాడు యథాలాపంగా. అతనిలో నేను ఆశించిన చలనం కనిపించలేదు.
ఎందుకో నాకు లెక్కల మాస్టరు గుర్తుకొచ్చాడు. తను గొప్పగా ఎగురుతూ వెళ్ళి నూటికి తొంభై తొమ్మిది వచ్చాయి అని చూపించింది; ఆయన ఆ ఒక్కటి ఏమయింది అన్నాడు. తనకు ఉక్రోషం పొడుచుకు వచ్చింది. తర్వాత ఆయనే సముదాయించి పంపాడు.
ఈసారి అతనే మాట్లాడాడు. మీరు పాడతారా ? అని. తనకెందుకో సిగ్గుగా అనిపించింది , కానీ చెప్పక తప్పలేదు ” లేదు” అని.
జ్యూరిక్‌ వచ్చేదాకా మాటల్లో పడ్డాము.
నేను గమనించిందేమంటే అతను మితభాషి. ఒకరిని నొప్పించే తరహా కాదు. అతని స్వభావంలో చాలా తీక్ష్ణత వుంది. అతనిముందు ఎందుకో నేను తమాషాకు కూడా అబద్దాలు చెప్పలేక పోయాను.
అతను అమెరికా లో మంచి హోదాలో వున్నాడు. ఎదుటివారిలో తడబాటు కలిగించేది అతనిలో వున్న హుందాతనం.
ఇంతవరకు నాకు తారస పడిన వారెవరూ ఇలా లేరు. . ఇంత హుందాగా !!
అతనితో నేను ఎక్కువ మాట్లాడానేమోననిపించింది, స్కూలు పిల్లలు చేతులు కట్టుకొని రైమ్స్‌ అప్పచెప్పినట్టు , నా గురించి నేను పూర్తిగా చెప్పివేశాను. సినిమాల్లో కెరీర్‌ , ఒడుదుడుకులు , కుటుంబంలో కలతలు , ఇగోలు , గాసిప్‌ , ప్రేక్షకుల అమాయకత్వం ; ఊ కొట్టకుండా వింటున్నాడు. ఒక్కోసారి అనుమానం వేసేది తను చెబుతున్నది వింటున్నాడా లేదా , ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడా?? అని. కానీ, అతను ఆ తరహా మనిషి కాదనిపించింది. జ్యూరిక్‌ లో ఫ్రెషప్‌ అయ్యాము. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. బయట మంచులో విమానాలు. జర్మన్‌ లో పెద్ద సైన్‌ బోర్డులు. సందడిగా వుంది. ఏదో మూల పైంటింగ్స్‌ నన్నేవీ ఆకట్టుకోలేదు. రెస్టారెంట్‌ లో ఫ్రెంచ్‌ కాఫీ సిప్‌ చేశాము. డాలర్లు చెల్లుతున్నాయి. చిల్లర మాత్రం ఫ్రాంక్స్‌ లో అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ” ఏమిటి ఆలోచిస్తున్నారు ?” నవ్వుతూ ప్రశ్నించాను. విన్నట్టు లేడు. కొంచెం సేపటి తర్వాత ఉలిక్కిపడి, ” ఏమన్నారు” అని మళ్ళీ తన చుట్టూ ఉన్న ప్రపంచం లో పడ్డాడు. రొడిన్‌ శిల్పంలా అతను ఆలోచించే తీరు ఆకర్షణీయంగా ఉంది. ఒక సినిమా షూటింగ్‌ కోసం స్విజర్లాండ్‌ వచ్చినప్పుడు, నా లగ్గేజ్‌ రాక నేను పడ్డ అవస్థలు చెబుతుంటే నవ్వాడు ! ఏమీ ప్రశ్నలు వేయలేదు. గ్లాసుడోర్ల వెనుక చలి కమ్ముకొస్తుంది. అతను ఏదైనా మాట్లాడితే బావుండు ననిపించింది. ” స్మోక్‌ చేస్తారా ?” అని అడిగాడు. నేను లేదు అన్నాను. ఎందుకో లేవబోయి కూర్చుండి పోయాడు. నేను మౌనంగా వుండిపోయాను. అతని వాలకం నాకూ కొంచెం అబ్బినట్లుంది. నవ్వుకొన్నాను. గమనించాడు. ” మీలో మీరు నవ్వుకొంటున్నారే” అని అడిగాడు. ఏమీలేదని తల తిప్పాను. ఒక సాధారణ స్త్రీలా ఒకరోజు ఒకరి ముందు ఇలా చేష్టలుడిగి కూచుండిపోతానని కలలో కూడా అనుకోలేదు. అతనికి నా అలోచనలతో ప్రమేయం లేదు. , నా అంతర్మధనాన్ని అతను ఆనవాలు పట్టలేడు. కారణం అతని స్వభావం చాలా సరళం. లోపలా బయటా అది ఒకటే.

4

న్యూయార్క్‌ ఫ్లైట్‌ ఒక గంట ఆలస్యంగా బయల్దేరనున్నదని అనౌన్స్‌ మెంట్‌. నాకెందుకో చాలా సంతోషం వేసింది. ఒకసారి పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు బస్సు చెడి పోయింది. పెద్దలు ఆందోళనగా పరికిస్తుంటే, పిల్లలం పొలో మని పరిగెత్తాం ఆడుకోవడానికి! కొన్ని గంటల్లో న్యూయార్క్‌ చేరతాం. తర్వాత ఎవరి దారి వారిదే. అతని స్వభావాన్ని ఇంకా ఎందుకో తరచిచూడాలి అనిపించింది. ఎన్నో పాత్రలను పరిశీలించే నన్ను ఇతని పాత్ర పూర్తి అయోమయం లోకి నెట్టివేసింది. బుద్ధి పనిచేయడం మానివేసినట్టుంది. ” చల్లారి పోతుంది కాఫీ; ఇంకో కప్పు తీసుకురానా ?” ఈ సారి ఉలిక్కి పడటం నా వంతయింది. అతను జర్మన్‌ లో ఏదో మాట్లాడుతున్నాడు. ” చాలా భాషలు వచ్చే ” అని నవ్వుతూ నేనంటే ” ఏవో బొట్లేరు ముక్కలు” అన్నాడు. అతను మాట్లాడే వేగం , ఉచ్చారణ , తీరు చూస్తుంటే బొట్లేరు ముక్కలు కావనే నమ్మకం కలిగింది. అదే అతనితో చెబితే , నవ్వి ” జర్మనీలో ఏణ్ణర్ధం ఉన్నాను ” అన్నాడు. ఇద్దరం పొగలు పోయే కాఫీని సిప్‌ చేస్తూ కూచున్నాం, ” కాలం ఇలాగే ఆగిపోతే బావుండు ” అని నాకు చాలా సార్లు అనిపించింది, చిన్నప్పుడు ఊటీ స్కూల్‌లో కాథరిన్‌ టీచర్‌ పాఠం చెబుతుంటే, నిశ్శబ్దంగా క్లాస్‌ రూమ్‌, దూరంగా మంచులో తడిచిన పచ్చిక. . కాలం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించేది. . ఇంతలో గంట మోగేది.
ఆల్ఫ్స్‌ పర్వతాల మీదుగా ఎగురుతోంది విమానం. అతని ఆలోచనల్లో అతను. నాలోనేను. మొట్టమొదటి సారి నాకు అనుమానం కలిగింది, నేను అందంగా ఉన్నానా ? లేనా ?! అని. ఆ పక్కసీటు లో వయసు మళ్ళిన వ్యక్తి నన్ను దాదాపు తినేసేలా చూస్తూ నా అనుమానం పోగొట్టాడు. తలతిప్పుకొన్నాడు. మరి ఈ మనిషి ఏమిటి ?అతని చూపు లో ఒక అభినందన. . గుర్తింపు ఏమీలేవు. తలనొప్పిగా అనిపించింది. అతని గూర్చి ఆలోచించడం మానేస్తే మంచిదనిపించింది. మాగన్ను నిద్ర. . రాత్రి పొద్దు పోయింది. న్యూయార్క్‌ నగరం మెరిసిపోతోంది. అనౌన్స్‌ మెంట్లు ఏర్‌ పోర్ట్‌ లో రద్దీ కలకలం. లగ్గేజ్‌ వచ్చాక అతనే ఫోన్‌ చేశాడు, నన్ను పికప్‌ చేసుకొంటానన్న దేశాయ్‌ అన్న వ్యక్తికి. వాయిస్‌ మెసేజ్‌ కు వెళ్ళింది. తాను అనుకోని ప్రయాణం వల్ల ఏ్‌ పోర్ట్‌ కు రాలేక పోతున్నానని, దగ్గరలో ఏదైన హోటెల్లో దిగి తర్వాత కాల్‌ చేయమని సారాంశం. నేనూ అదే అనుకొన్నా. కాబట్టి పెద్దగా కంగారు పడలేదు. రవి స్వభావం (అన్నట్లు, అతని పేరు రవట) . . చూదామనిపించింది. మర్యాద కోసం పిలుస్తాడా, లేదా అలవాటైన మౌనం తో వెళ్ళిపోతాడా. . రవి మందహాసంతో అన్నాడు. ” సింధూ, no probs! we shall go home, later you can decide, comeon !!” నాకెందుకో అతని ఆహ్వానాన్ని తిరస్కరించాలి అనిపించలేదు. అతని కళ్ళు సంస్కారం తో మెరుస్తున్నాయి.

5

గంటలో ఇల్లు చేరుకొన్నాం. మంచు పేరుకుపోయి రాత్రిని మరింత చల్లగా మారుస్తోంది. కోట్లూ, షూస్‌ విప్పేసి, స్నానాలు గట్రా చేసి, ఫ్రెషప్‌ అయ్యేసరికి రాత్రి మూడయింది. నాకెందుకో కొత్త ప్రదేశానికి వచ్చాను అన్న బెరుకే లేదు. నాకే ఆశ్చర్యం అనిపించింది.
” రేపు వీకెండ్‌ నాకు ఆఫీస్‌ లేదు. మీరు నాకంటే ముందు లేస్తే, ఫ్రిజ్‌ లో అన్నీ వున్నాయ్‌” నైట్‌ చెప్పేసి తలుపేసుకొన్నాడు. అతని గదిలో లైటారిపోయింది. ఒకటే పెయింటింగ్‌ మూలన వాంగో వేసిన starrynights కు రెప్లికా ! అతనికి స్వభావానికి విరుద్ధంగా వుందే ఎంపిక అనిపించింది. వాంగో స్వభావం గుర్తుకు వచ్చి ఎందుకో ఒక్కక్షణం భయం ఆవరించింది. హీటరు చప్పుడు వినిపిస్తుంది. బ్లైండ్స్‌ వుండటం వల్ల ఆ వైపు మంచులో నిలుచున్న చెట్టు కనిపించడం లేదు. అమ్మ వేసే పెయింటింగ్స్‌ అన్నీ గుర్తుకు వచ్చాయి. starry nights లో గోళాకృతిలో ఊగుతున్న నక్షత్రాలను చూస్తూ నిద్రపోయాను, లైటార్పకుండానే.
నాకంటే ముందు అతనే లేచేసి వున్నాడు. ఫ్లైట్‌ లో అతని ప్రవర్తన ఇంట్లో అతని తీరు ఒకేలా ఉన్నాయి. ” బాగా నిద్ర పట్టిందా ?అలసి పోయినట్టున్నారు!” అన్నాడు. అతనిచ్చిన కాఫీ తాగాను.
“మీరు ఫ్రీ గా వుండండి. నేను ఓ అరగంట లో వచ్చేస్తా” నని వెళ్ళిపోయాడు నింపాదిగా, తొందరపాటు కలికానికైనా లేదు. దేశాయ్‌ కి ఫోన్‌ చేస్తే, దగ్గరి బంధువు హఠాన్మరణం, ఉన్న హోటెల్లో కంటిన్యూ అయిపొండి, ప్రస్తుతానికి. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వెన్యూ దగ్గర కలుస్తా అని హడావుడిగా ఫోన్‌ పెట్టేశాడు. ఇంతలో రవి వెచ్చాలు పట్టుకొచ్చాడు. దేశాయ్‌ విషయం చెబితే, ” నో వర్రీస్‌ , ఇక్కడే కంటిన్యూ ఐపొండి. మీ పనులు ముగించుకొని ఏ టైమ్‌ కు వచ్చినా ఫర్వాలేదు. అన్నీ ఫ్రిజ్‌ లో వుంటాయి, మైక్రో ఓవెన్‌ లో వేడిచేసుకొని తినడమే. అవసరమైతే నాకు కాల్‌ చేయండి. ” స్నేహపూర్వకంగా వుంది గొంతు. ఫ్రిజ్‌ లో సర్దేశాడు, మాటల్లోనే. బరువు దిగిపోయింది. రావలసిన చోటికే వచ్చావు అంటోంది మనసు. కృతజ్ఞతా పూర్వకంగా అతని వంక చూశాను. ఫ్లైట్‌ లో మాటల్లో థాంక్స్‌ లూ సారీలు నా కిష్టం లేదు అన్నవాక్యం నాకు బాగా గుర్తుండిపోయింది. మిన్నకుండిపోయాను.
నాకు వంట వచ్చన్నా వారించాడు. తనకు బాగా అలవాటు వున్నట్టుంది. ఇద్దరం ఆలస్యంగా భోజనం ముగించాం. పుస్తకాలు షెల్ఫ్‌ నిండా, Engg., management వదిలేసి, నవలల మీద దృష్టి సారించా. లారెన్స్‌ , హక్స్లీ కొందరు రష్యన్‌ రచయితలు. “టైమ్‌ ఉంటే చదువుకొండి,” నవ్వుతూ అన్నాడు.
film festival మొదలయిపోయింది. దేశాయ్‌ కలిశాడు. సారీ చెప్పాడు. ఇతరదేశాలనుండి వచ్చిన వారిని కలుసుకోవడం, ముచ్చట్లూ. ఒక పోలిష్‌ దర్శకుడు, నా ” పభlథథ ” సినిమా నచ్చిందని, “ఒంటరితనం కళ్ళల్లో బాగా నింపుకొన్నారు” అని ప్రశంసించాడు. నాకు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో పాల్గొనడం కొత్త కాకపోయినా ఈ సారి నేను రావడం వెనుక ప్రత్యేక కారణం వుంది. నేను నటించిన ఆ సినిమా ప్రదర్శనలో చోటుచేసుకోనుంది. ఇండియన్‌ సినిమా తీరుతెన్నులు, మలేసియా, గల్ఫ్‌ దేశాల నుండి వచ్చిన వారు ఎంతో కుతూహలంతో ప్రశ్నించారు. ” Art cinema నుండి popular cinema కు transition ఎలా సాధ్యం ” అని కొందరు. అన్నీ సాధ్యమే అని నవ్వుతూ చెప్పాను. జపనీస్‌ పత్రిక షింబున్‌ వారు, నా ఇంటర్వ్యూ తీసుకొన్నారు.
ఒక్కోసారి నేను లేటుగా వచ్చేదాన్ని. ఒక్కోసారి అతను. నేను తొందరగా వచ్చిన రోజు నేనే వంట చేసేదాన్ని. అతను నొచ్చుకొనే వాడు. మీరు నా గెస్ట్‌ అని మృదువుగా నవ్వేవాడు. నాకు విచిత్రంగా అనిపించేది. ” కుచ్‌ ఖాబ్‌ హై కుచ్‌ అసల్‌ హై” (” కొంత స్వప్నం కొంత వాస్తవం !” ) ఏదో ఎప్పుడో చదివిన గజల్‌ ముక్క మనసును పట్టుకొని మరి వదిలేది కాదు. నా సినిమా స్క్రీన్‌ అయ్యే రోజు వచ్చేసింది. రవికి చెబుతామనుకొన్నా. అతను నన్ను కేవలం సాటిమనిషిగానే చూస్తున్నాడు. సినిమాల గొడవ లేదు మా మధ్య. నిజం చెప్పొద్దూ ఈ మధ్యకాలంలో ఇది నాకెంతో ఊరట కలిగించే విషయం. పిలవాలా వద్దా అని చాలసేపు తర్జన భర్జన పడి , ” రవీ! రేపు నా సినిమా ఒకటి స్క్రీన్‌ అవుతోంది రావడం వీలవుతుందా?? అడిగేశా. ఒక్క క్షణం పలుకలేదు. అతని మొహం వంక నేను ఆత్రంగా గమనిస్తున్నా. నేను మొదటిసారి కెమెరా ముందు నిలబడి కొంత నెర్వస్‌ గా, కొంత ఆనందంగా నటించి కట్‌ అనగానే దర్శకుడి వైపు చూశా. ఆయన షాట్‌ ఓకే చేయగానే నా మొహం వెలిగిపోయింది. ఆ దృశ్యం కళ్ళముందు మరోసారి. రవి అలాగే నన్నాడు. స్క్రీనింగ్‌ టైమ్‌ అడిగి తెలుసుకొన్నాడు. ఆఫీసు నుండి నేరుగా వచ్చేస్తానన్నాడు. కొంచెం ఆలస్యంగా వచ్చినా కంగారు పడవద్దన్నాడు. నాకేమీ వినిపించడంలేదు. నా సంతోషానికి హద్దు లేదు. అతను గమనించాడో లేదో నాకు తెలియదు.

7

screening time కు కొందరు మన జర్నలిస్టులు, కొందరు విదేశాల వారు నేను అక్కడే వున్నానని తెలిసి నా చుట్టూ మూగారు. షో మొదలయిపోయింది. నాలో ఆత్రం పెరిగిపోయింది. ఇతను రాడు పిలవడం నా బుద్ధితక్కువ అని తిట్టుకొన్నా. ఎడమవైపు ఉన్న ద్వారం నుండి నాకు చిరపరిచితమైన నడక. హుందాతనం అడుగడుగునా. కొనదేలిన ముక్కుమీద లైట్‌ పడి మెరుస్తోంది. చివరి వరుస అమ్మాయిల చూపులు అతన్ని వెంటాడటం నేను గమనించక పోలేదు. నాలో ఏదో చిరు గర్వ హాస రేఖ ! ఫపలసlపరపల మేఘ గంభీర స్వరం, తల తిప్పి చూశాను అతని దారికి ఎవరో అడ్డొచ్చారు, దారి తొలగమని అతను అడిగేతీరు!!చేయి ఊపాను. పోలిష్‌ దర్శకుడికి పరిచయం చేశాను. ఆయన రవిని తేరిపార చూశాడు. ఏ పాత్రలో లేని లక్షణాలను పుణికిపుచ్చుకొన్న పాత్ర!!సినిమా లో మునిగిపోయాం. ఎక్లా థlలలప అని సబ్‌ టైటిల్స్‌ తో మొదలయింది. చిన్న సినిమాయే. ఒంటరితనం. . సైనికుడి భార్య. . ఎదురుచూపులు. . యుద్ధంలో పట్టుబడతాడు. జాడ తెలియదు. ఎంతో కాలం తర్వాత తిరిగి వస్తాడు. పునస్సమాగమం. రవిని గమనిస్తున్నా మధ్య మధ్యలో. ఆ రోజుకు అదే ఆఖరి సినిమా. కొన్ని ప్రశ్నలు, ఓపిగ్గా చివరిదాకా ఉన్నాడు రవి. తన కారులో బయల్దేరాం ఇంటికి. విపరీత మైన రద్దీ. మనది కాని ప్రపంచం.
వింత అనుభవం. ” రవీ, నీ అభిప్రాయం చెప్పలేదు. సినిమా మీద.”
” అంతా బావుంది, చాలా కాలం తర్వాత సైనికుడు ఇంటికి రాగానే భార్య వెళ్ళి వళ్ళో వాలడం తప్ప!” . నేను షాక్‌ తిన్నాను. ఆ షాట్‌ గురించి మేము చాలా అలోచించాము తీయబోయేముందు.
రవి స్టీరింగ్‌ మీది నుండి దృష్టి మరల్చకుండా అన్నాడు. “ఎంతో కాలం గడిచాక మనుషులు కలుసుకుంటే, వారి ప్రవర్తన మీకు అనుభవంలోకి రానట్టే వుంది. ఐనా నా ఒపీనియన్‌ ను అంత సీరియస్‌ గా తీసుకోవద్దు.” అప్రతిభురాలినైపోయా. ఇతనిలో ఇంత లోతు ఉందా ? ” గ్లిజరిన్‌ వాడతారా? సన్నివేశపరంగా కన్నీళ్ళు వస్తాయా??” నా చెవులను నేను నమ్మలేక పోయా! ఆ సినిమాలో కన్నీటి దృశ్యాలు చాలా వున్నా చివరి దృశ్యంలో మాత్రమే గ్లిజరిన్‌ వాడాము. ఇంటికి వచ్చేదాకా అలోచిస్తూ ఉన్నా!! are you upset by my comments? తల అడ్డంగా తిప్పాను. that’s good నాకు కలిగిన ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయాను. కన్నీళ్ళ గురించి ఇంత ఆలోచనా!

8

దేశాయ్‌ ఫోన్‌ చేశాడు. డైరెక్టర్‌ నుండి కాల్‌ వచ్చిందట, రిటర్న్‌ డేట్స్‌ గురించి. సరే నేను తర్వాత చెబుతా అని పెట్టివేశా !పెద్ద ఆకలిగా లేదు. ఈపూటకు ఆపిల్స్‌ చాలు. రవి నైట్‌ డ్రెస్‌ లో ఏదో పుస్తకం పట్టుకొని వెళ్లిపోతున్నాడు. ” ఒక్క నిమిషం” అంటే నావైపు వచ్చాడు. నేను ఒకటిరెండు రోజుల్లో వెళ్లవలసివస్తుందని చెప్పాను. వివరంగా రేపు మాట్లాడుదాం అని బై చెప్పి వెళ్ళిపోయాడు.
లేచి చూసేసరికి పొద్దెక్కింది. తలనొప్పిగా ఉంది. tickets confirm చేయించాలి. కాల్‌ చేస్తే సరిగ్గా వారం రోజుల తర్వాత confirmation దొరికింది. ఇళ్ళంతా కలియతిరిగాను. రవి గదిలోకి నేనెప్పుడూ వెళ్ళలేదు, సరికదా అతను నన్ను పిలవ లేదు కూడా. కుతూహలం కొద్దీ ప్రవేశించాను. అక్కడ ఇంకో బుక్‌ షెల్ఫ్‌ . నోట్‌బుక్స్‌, మాగజైన్‌ లు వగైరాలు వున్నాయి. వాటిల్లో ఒక పుస్తకం Odd size లో వుండి నన్ను ఆకట్టుకొంది. డైరీ! నా కళ్ళు మెరిశాయి. పదేళ్ల క్రిందటిది. గుండె దడ హెచ్చింది. కొన్నిరోజులు ఖాళీగా , మరికొన్ని నిండుగా, అక్కడక్కడా పేజీల్లో రెండు, మూడు లైన్లే వున్నాయి.
29 MAY1990
జీవితంలో ఎవ్వరూ వందసార్లు ప్రేమించరు. గొప్ప ప్రేమ పొందిన వాడు నిశ్చలంగా నిలబడతాడు. . ఆ ప్రేమ తనకు దూరమైనా సరే! మహీ పెళ్లి. తను నన్నెంత గాఢంగా ఇష్ట పడిందో తలచుకొంటే గుండె తరుక్కు పోతుంది. మనస్ఫూర్తిగా అభినందించి వచ్చేశా. తన కళ్లల్లో దిగులును నేను గమనించక పోలేదు.
22 AUG1990
మహీ దూరమైపోయింది. తను లేని లోటు తెలుస్తోంది.

9

ఫోన్‌ మోగింది. దేశాయ్‌ కంగారు పడుతున్నాడు. మళ్ళీ ప్రొడ్యూసర్‌ కాల్‌. ముక్తసరిగా మాట్లాడి పెట్టేశా. రవి రావడానికి ఇంకా చాలా టైమ్‌ వుంది. ఒక వేళ ముందే వచ్చేస్తే? ఎందుకో కీడు శంకించింది మనసు. ఆత్రం నిలువ నీయలేదు. డైరీ లో ఇంకో పేజీ.
30 0ct 1990
కాలేజీ లో చివరి రోజులు . . మహీ అంది . . ” నిన్ను మరచిపోలేను” నాకు నిజంగా అర్థం కాలేదు. మహీ వయసులో నా కంటే కొన్ని నెలలు చిన్న. కానీ బుద్ధిలో నా కన్న కొన్ని సంవత్సరాలు పెద్ద. మహీ నాకెప్పుడూ అంతు పట్టేది కాదు. వసంతంలో విడిగే పుష్పాల ధావళ్యం తన కళ్లల్లో. కానీ , అవి మేము ఉద్యోగాల వేటలో ఉరుకులు పెడుతున్న రోజులు. ఒక వైపు బేలగా మహీ. ఏదైనా సాధించాకే మహీకి మొహం చూపాలి అన్న పట్టుదలతో ఆరేడు నెలలు కలవలేదు. ప్రయత్నాలు కలిసి రాలేదు. మహీని చూడాలని ఆరాటపడే మనసు. అప్పుడు మహీ వాళ్ల బంధువుల ఇంట్లో వుండేది, చిన్న ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది. నన్ను అన్యాప దేశంగా తిట్టింది. నాకు తలకెక్కేది కాదు. నాకంత మానసిక పరిపక్వత లేదు. ఎవరినో ఇష్ట పడుతోంది మహీ, అందుకే నన్ను తిడుతుంది అనుకొనే వాణ్ణి. ఇంకా దూరమవ్వాలని ప్రయత్నించే వాణ్ణి. ఒకసారి ఈ విషయం తెలిసి మహీ అంది జాలిగా “నీవు బాగా అపార్థం చేసుకోగలవు”.
ఏదో అలికిడి. కొంపదీసి రవి రాలేదుగా. డైరీని జాగ్రత్తగా యథాస్థానంలో పెట్టి, అతని బెడ్‌ రూమ్‌ తలుపు వేసి వచ్చాను. ఏదో పువ్వుల బొకే. హాపీ బర్త్‌ డే అని రాసుంది. దాన్ని జాగ్రత్తగా పక్కన పెడుతుంటే ఫోన్‌ మోగింది. రవి !! రావడం లేటవుతుంది, తినేసి పడుకో అని చెప్పాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మళ్ళీ డైరీ ముందేసుకు కూర్చున్నా.
1DEC1990
నాలో మహీ బాగా ఇష్టపడేది అమాయకత్వం. నేను అంత అమాయకంగా ఉండననే నా అభిప్రాయం. నన్ను ఉడికించడానికే ఎప్పుడు అలా అనేదేమో? ఏదైనా సాధించే కలవాలి అన్న పంతం తో ఎప్పటిలా చాలానెలలు కలవకుండా ఉన్నా, చివరికి ఉండబట్టలేక కలిశా. అదే ఆఖరు సారి తనను చూడటం. తనకు అప్పుడే పెళ్ళి కుదిరింది. అదే విషయం చెప్పింది. నేను నమ్మలేకపోయాను. మహీ నన్ను ఏడిపించడానికి అలా చెబుతుందేమోనని, ఆశ చావక మళ్ళీ మరోసారి వెళ్లా. . తను వరుడి ఫోటో చూపించింది. నేను ఎంత అమాయకున్నో ఆ రోజు బాగా తెలిసివచ్చింది. మహీ నాకంటే ఎన్నో రెట్లు తెలివైనది. తన అభిప్రాయమే కరెక్ట్‌ చాలాసార్లు.
4DEC90
నన్ను నన్నుగా ప్రేమించింది మహీ ఒక్కటే. అమాయక ప్రేమను దూరం చేసుకొన్నా.
తను వెళ్లిపోయాక నా ఒంటరితనం రెట్టింపైంది!!నిష్కృతి లేదు.
31DEC90
మహీ రాసిన ఉత్తరాలన్నీ తగులబెట్టాను. బూడిదైపోయింది కాగితాలే.
నిప్పుకణికెల్లా ఇప్పటికీ వెలిగిపోతున్నాయి తన జ్ఞాపకాలు.
నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనని ఎంతగా ప్రేమించాడు. నాకు మహీ మీద అసూయ కలిగింది. డైరీ అంతా వెదికాను. ఒక చిన్న ఫోటో. ఖచ్చితంగా మహీదే. తన నవ్వులో కట్టిపడవేసే ఆకర్షణ, కళ్లల్లో దయ, జాలి. చాలా సుకుమారంగా వుంది. నేను మహీ కన్నా అందంగా వుంటాను. కానీ నా స్వభావంలో అంత లోతు లేదు. గూఢతా లేదు. కాబట్టి నా చిరునవ్వు సాదాసీదాగా ఉంటుంది. అలోచనల్లో చాలా సమయం గడిచిపోయింది.
రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చాడు రవి. ఎవరో అందమైన అమెరికన్‌ అమ్మాయి. డ్రింక్‌ చేసినట్టుంది, రవి మీద ఒక చెయ్యి వేసి విలాసంగా నడుస్తోంది.
నా కెందుకో ఇబ్బందిగా అనిపించింది. పట్టుతప్పించి, తనను పడుకోబెట్టాను. ఆఫీస్‌ లో లేట్‌ అని ఇదా తతంగం. నా ఆలోచనల మీద , నా మీద నాకే నవ్వు ముంచుకొచ్చింది.
“సారీ సింధూ, ఇవాళ నా బర్త్‌ డే, ఉదయం నీవు పడుకొని వున్నావు, లేపలేదు.”
హాపీ బర్త్‌ డే అనబోయాను. నా ప్రయత్నం ఫలించలేదు. గొంతు పెగలలేదు.
అట్టే ఆలస్యం చేయకుండా బై చెప్పి రవి నిద్రకుపక్రమించాడు.

11

నా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి, వాంగో చిత్రాల్లో కనిపించే వలయాల్లా!
రవి వైపు లాగుతుంది మనసు. తలుపు తట్టాను. ఏదో biography పుస్తకం చేతబట్టుకొని లేచి వచ్చాడు. హాపీ బర్త్‌ డే అన్నాను. . . అతని వంకే చూస్తూ.
ప్రసన్నంగా వుంది వదనం. అలసట, ఒత్తిడీ ఏమీ లేకుండా.
” బొట్టు చెదిరిపోయింది. జుట్టు రేగిపోయింది. . ” మునివేళ్లతో బుగ్గమీద తట్టి
” ఇంత అశ్రద్ధ అయితే ఎలా” అన్నాడు. మొట్టమొదటి సారిగా తన స్పర్శ.
వెదురును వాయువు తాకినంత సహజంగా. అతను నాలో అశాంతిని కనిపెట్టి నట్టే వున్నాడు. ” సింధూ వెళ్లి పడుకో, లాంగ్‌ వీకెండ్‌, ప్లాన్‌ చేయి. ” నాన్న నన్ను అలాగే పడుకో బెట్టేవాడు. రేపు లేవగానే పార్క్‌ వెళదామనో; చిలుకను చూద్దామనో చిరు మందహాసం తోసుకొచ్చింది. నేను బయట పడనివ్వలేదు. కొంచెం సేపటి తర్వాత అతని గదిలో లైటారిపోయింది. నేను గాఢంగా నిద్రపోయాను, కలలో నా చిన్న నాటి స్కూల్‌ . మా అందరికీ రెక్కలు ఉన్నాయి. ఎ్తౖతెన చెట్ల మీదుగా అలసట ఎరుగకుండా ఎగురుతూ వున్నాము.
నేను లేచే సరికి రాత్రి వచ్చిన అమెరికన్‌ యువతి వెళ్లిపోయింది. రవి చెప్పాడు “ఇక్కడ డ్రింక్‌ చేసి డ్రైవ్‌ చేయరు. అందుకే వివిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాను. నాకైతే అతను పుస్తకాల కన్నా మనుషులను బాగా చదవగలడనిపించింది.
ఏది ఏమైనా అతను అలా చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మొదటి సారి ఇతనిలో ఏదో స్పందన కలుగుతోంది అనిపించింది.
నా కోరిక వినిపించాను. చిన్నప్పుడూ ఊటీ లో నాకు పాఠాలు చెప్పిన ఆస్ట్రియన్‌ టీచర్‌ కాథరిన్‌ అమెరికా లో సెటిలయింది. ఆమెను కలవాలి. రవి చిరునామా తీసుకొని మాప్‌ తో తిరిగి వచ్చాడు. ” దూరమే రెడీ అవ్వు” అంటూ.
నా మనసెందుకో సినిమాలు, అవార్డులు అన్నీ వదిలేసి ఊటీ వెళ్లిపోతుంది.
పొడవైన చెట్లనుండి పడే ఏటవాలు సూర్యకాంతీ, చలిలో ఉదయాలు.
కాథరిన్‌ చాలా అందంగా వుండేది. ఇప్పుడూ తన వయసు కొంచెం అటూఇటుగా ఒక 45 వుండవచ్చు. ఎంత అందమైన ఉత్తరాలు రాసేది. ఫ్రీవే ఎక్కాము. కారు దిగితే చలి.
మిట్టపల్లాల రోడ్డులు. కొండ దారులు. మంచు దట్టంగా. అక్కడక్కడ జింకలు కనిపిస్తున్నాయి.
మాటల్లో పడి దారి తప్పాం. ఏదో పల్లె. రౌతు లేని గుర్రం బండిని లాక్కువెళుతుంది, అలవాటుమీద. పచ్చిక బయళ్లలో ఆవులు మమ్మల్నే చూస్తున్నాయి.
ఏదో మిల్లు. . పొగ వస్తోంది. కొన్ని పాడుపడిన షెడ్డులు. మొండిగోడల మీద కొన్ని కోళ్లు ఎగురుతున్నాయి. గడ్డాలు పెరిగిన రైతులు తమ పని తాము చేసుకొంటున్నారు. వుండుండి ట్రాక్టర్‌ చప్పుడు. మేము దారి తప్పినట్టు స్థానికులు కూడా ధృవీకరించారు. ఆ రోజుకు ఓ మాదిరి బస దొరికించుకొన్నాం, చాలా అవస్థలు పడి. చిన్న గది. అయినా హీట్‌ సరి పోవడం లేదు. రవి బాగా అలిసిపోయాడు. నేనుకూడా ఒకమోస్తరుగా అలసిపోయాను. నిద్రకుపక్రమించాం. ఒకటే మంచం. కానీ ముగ్గురు పడుకోవచ్చు. అంత పెద్దది. ఇద్దరికీ నిద్ర పట్టింది. నాకు చూచాయగా గుర్తు. నిద్రలో అతని మీద ఒకటి రెండు సార్లు నా చేయి పడింది. కానీ అతను జాగ్రత్తగా సర్ది, బుద్ధిగా అటు తిరిగి పడుకొన్నాడు. గాఢనిద్రలో నా భుజం మీద బరువుగా తన చేయి. నాకెందుకో తొలగించాలనిపించలేదు. చల్లని వాతావరణం వెచ్చబడుతున్నట్లనిపించింది. కలలు. . కలతలు లేకుండా హాయిగా నిద్రపోయాను.

12

కళ్లు తెరిచేసరికి అతను తయారై పోయి నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నేను నిద్ర నటిస్తూ గమనిస్తూ ఉన్నా. సిగ్గు ముంచుకొచ్చింది, బద్దకంగా ఆవులించి చాలా టైమ్‌ అయిందా ? అన్నా.
“నేను గాస్‌ నింపుకొస్తా ఈ లోపు నీవు తయారవు.”
తలుపుతీసుకు వెళ్లిపోయాడు.
ఆలస్యంగానే బయల్దేరాము. నానా కష్టాలు పడి ఎట్టకేలకు కాథరిన్‌ ను పట్టుకొన్నాం. మా కోసం ఎదురుచూస్తోంది. ముందు కాథరిన్‌ ఏమీ మాట్లాడలేదు. కొంచెం చేపయ్యాక నన్ను వచ్చి వాటేసుకొంది. nice to see my dear little sind along with your husband అంటూ. kathy, he is my friend పరిచయం చేశా. తడబాటు నాలో. ” it’s ok dear ” అని కాథి లోకాభిరామాయణంలో పడిపోయింది. పల్లెపట్టు జీవితాన్ని వర్ణించింది. ఊటీ రోజులను తలచుకొంది. నేను తెచ్చిన పట్టుచీరలు, చుడీదార్లు చూసి మురిసి పోయింది. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కలిశాం !
రవి “ఏక్‌ లా” సినిమా ముగింపును ఎందుకు విమర్శించాడో నాకు అర్థమయింది. అదే విషయం కాథీ తో చెబితే రవి వైపు మెచ్చుకోలుగా చూసింది.
నేను ఫ్రెషప్‌ అయి వచ్చేసరికి కాథి, రవి చక్కగా జర్మన్‌ లో మాట్లాడుకొంటున్నారు. నాకు ఒక ముక్క అర్థమైతే ఒట్టు. Sind, pick up some german! We shall go to our country అంటోంది. రవి తో జర్మన్‌ లో ఏదో చెణుకు విసిరి నా వైపు కొంటెగా చూస్తోంది. తిరుగు ప్రయాణం ఆనందంగా గడిచింది. కాథి ని కలిసాక నాలోనే కాదు రవిలో కూడా తెలియని మార్పు వచ్చినట్లు అనిపించింది. కానీ రవి దట్టమైన అడవిలా నాకు అంతు పట్టడం లేదు. ఎప్పటిలా ఏమీ బయట పెట్టకుండా అలాగే వున్నాడు. నాకు అతన్ని అడిగేద్దామా అనిపించింది. ” నా గురించి నీవేమనుకొంటున్నావ్‌ ?” అని. ” ఏమీ అనుకోవట్లేదు ” అన్న గడుసు సమాధానం కూడా రావచ్చు !తనకు ఎవరిమీదైనా ఇష్టం కలిగినా బయటపడి చెప్పడు అన్న విషయం నాకు రూఢిగా తెలిసిపోయింది. అతనిది మృగరాజు తరహా. అతని దగ్గరికి చేరిన వారిని హుందాగా చూసుకొంటాడు. freeway మీద వేగంగా పోతుంది కారు. ఏవో పాటలు.

13

ఇంటికొచ్చిచేరాం. voice messages నాకోసమే. నాన్న చేశాడు నాలుగుసార్లు. లండన్‌ లో ఇండస్ట్రియలిస్ట్‌ సంబంధం ok అయింది, నీవు సరే అంటే ముహుర్తాలు పెట్టించేస్తాం!అదీ సారాంశం. ఇక రవితో మాట్లాడవలసిన తరుణం వచ్చింది అనిపించింది. సాయంత్రమే నా ఫ్లైట్‌ కూడా. రవి నాకోసం సెలవు పెట్టాడు. ఊహించలేదు, ఐనా తెలియని సంతోషం. అవకాశం కోసం వేచిచూస్తున్నా. సర్దడం లో నాకు సాయ పడుతున్నాడు. సర్దడం ముగించి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర చేరాం. బ్లైండ్స్‌ పైకి లాగాను.
బయట చెట్టు కనిపిస్తుంది. నా గొంతు వణుకుతోంది.
” రవీ, నా పెళ్ళి UK లో ఇండస్ట్రియలిస్ట్‌ తో”
” కంగ్రాట్స్‌ ” అతని గొంతు ఎప్పటిలా వుంది.
” కానీ, నాకీ సంబంధం ఇష్టం లేదు”
” ఏం”
” నీ పెళ్ళెప్పుడూ ” ?
అతను కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు.
నేను రెట్టించాను.
రవీ నా రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. నవ్వి చెప్పాడు.
” నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా UK సంబంధం ఒప్పుకో. . పిచ్చిపిల్లా, ఎవరూ వందసార్లు ప్రేమించరు. నాలాంటి వారు మరీనూ”
” ఇలాగే ఒంటరిగా గడిపేస్తావా?” రుద్ధమయింది నా గొంతు.
కన్నీళ్ళు దూకుతున్నాయి బుగ్గల మీదుగా. ఇద్దరం లేచి ఇవతలకు వచ్చాం.
మబ్బులు వీడి సూర్యుడు దేదీప్యమానంగా వెలుగు తున్నాడు. నా మొహాన్ని తన గుండెలకేసి హత్తుకొన్నాడు. నుదుటిమీద ముద్దు పెట్టుకొని చెప్పాడు
” నా బంగారు కదూ, ఏడవకు”