సిలికాన్ లోయ సాక్షిగా

రిపేర్ ఇన్ అమెరికా

ఆగస్ట్ 2014

(సిలికాన్ లోయ సాక్షిగా-16)

సూర్య మొదటి సారి అమెరికాకి బిజినెస్ ట్రిప్ లో వచ్చినపుడు “అమెరికా నించి వస్తూ నీకేం గిప్ట్ తెమ్మంటావ్” అనడిగాడు.

నిధి పుట్టి రెండు నెలలు కావస్తూంది అప్పటికి. ఇప్పటిలా సెల్ఫోన్ లోనూ పవర్ ఫుల్ కేమెరాలున్నరోజులు కావవి. పాప ఎదిగే విశేషాలన్నీ భద్రపరచుకోవడానికి వీడియో కేమెరా ఉంటే బావుణ్ణనిపించింది. అదే చెప్పాను.
అప్పట్నించి పాపాయి ప్రతి కదలికా రికార్డు చేసి అతి భద్రంగా దాచాను.

అయితే సరిగ్గా రెండేళ్లకనుకుంటా. ఏం ప్రాబ్లం వచ్చిందో కేమ్ కార్డర్ పనిచేయడం మానేసింది.

అది పుచ్చుకుని హైదరాబాదు లో సర్వీసు సెంటర్లకి అస్తమాటూ తిరిగే వాళ్ళం.

ప్రతీసారీ రెండు మూడు వేలు బిల్లు కట్టడం, ఒకసారి వాడగానే మరలా ప్రాబ్లం రావడం, మళ్ళి రిపేరుకి పరుగెత్తడం మామూలైపోయింది మాకు.

ఇక అమెరికా కి వస్తున్నామని అన్నీ సర్దుకునేటప్పుడు మర్చిపోకుండా వీడియో కేమెరా తెచ్చాను,కనీసం కొన్న షాపుకి పట్టుకెళ్తే బాగుపడ్తుందనే ఆశతో.

సూట్కేస్ తెరుస్తూనే “ఇదేవిటి, నీకింకా ఈ కేం కార్డర్ మీద ఆశ ఉందా?” అని, “ఈ విషయం ఇక నువ్వు మర్చిపోతే మంచిది.” అన్నాడు సూర్య.

అన్ని వేలు పోసి కొన్న వస్తువు. పైగా పాపాయి అందమైన అనుభూతుల్ని పదిలపర్చిన గొప్ప వస్తువు. ఎలా మర్చిపోతాను?

సూర్యకీ , నాకూ ఈ విషయంలో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది.

“ప్రియా! నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన చోట కూడా సెన్సిటివ్ గా ఆలోచిస్తావ్” అంటాడు.

అదెంత వరకూ నిజమో నాకు అర్థం కాదు కానీ, “నీకు వస్తువుల పట్ల మోజు” అని సాధారణ వ్యక్తుల్లా ఈసడించనందుకు సంతోషిస్తూ నవ్వి ఊరుకున్నానీసారి.

సూర్య ఆఫీసు కెళ్ళగానే అప్పట్నించీ భద్రంగా దాచిన రిసీటు పుచ్చుకుని, అడ్రసు గూగుల్ లో వెతుక్కుని వెళ్లేను.

కస్టమర్ సర్వీసు లైను లో పది మంది వెనక నిలబడ్డాను. మొత్తానికి గంట సేపటి తర్వాత నా వంతు వచ్చింది.

నాలుగేళ్ల నాటి అక్షరాలు పోతూ ఉన్న నా రిసీటుని, నన్ను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కానట్టు మొహం పెట్టి, షాపు లో కొన్నవి 90 రోజుల వరకే వెనక్కి తీసుకుంటామనీ, వాళ్ల దగ్గిరే 2 స.రాల ఇన్సూరెన్సు కొనుక్కుంటే ఆ లోగా రిపేరు వస్తే బాధ్యత వహిస్తామనీ, ఇక అన్ని ఆప్షన్లూ అయ్యిపోయేక ఆ కంపెనీ వాడు తప్ప వీళ్లేమీ చెయ్యలేమనీ తేల్చారు.

వాళ్ల దగ్గిరే ఉన్న రిపేరు కౌంటరు కి వివరాల కోసం వెళ్లి, మరో అరగంట గడిపేక “ఇలా చూడమ్మా, ఇది న్యూయార్క్ కి పంపించాలి. అక్కడికి పంపడానికి పోస్టేజీ100 డాలర్లు అవుతుంది. ఇక రిపేరుకి, తిరిగి తెప్పించడానికి మరో 500 అవుతాయి. ప్రస్తుతం మంచి లేటేస్ట్ మోడల్ ఇంత కంటే చవకగా దొరుకుతుంది. కాబట్టి మీరు కొత్తది కొనుక్కొండి.” అన్నాడు.

ఉస్సూరుమంటూ తిరిగొచ్చిన నన్ను చూస్తూనే సూర్యకి నవ్వాగ లేదు.

“నేనప్పుడే చెప్పేను. ఇది అమెరికా, ఇక్కడెవ్వరూ రిపేరు చెయ్యరని, విన్నావా” అన్నాడు.

కేం కార్డర్ ని పడేయడం ఇష్టం లేక, పేక్ చేసి అట్టపెట్టె లో పెట్టి సామాన్ల అట్టడుగున దాచేను.

ఆ బాధని కాస్త మర్చిపోవడానికి ప్రయత్నిస్తూండగా-

ఆ వారాంతంలో నా లాప్టాప్ పొరబాటున గట్టిగా వెనక్కి తెరవడం వల్ల స్క్రీన్ కి, కీబోర్డుకి మధ్య ఉన్న పిన్ను కాస్తా విరిగిపోయింది.

“కొత్త లాప్టాపు…” అని సూర్య అనబోతుండగా
“ఇంత చిన్న విషయానిక్కూడా అమెరికాలో వందలు అడిగేస్తారా ఏవిటి?” అని ఆన్లైనులో చూసి కంప్యూటర్ రిపేర్ అన్నచోటికి వెళ్లేను.

షాఫు వాడు నా లాప్టాపుని జాగ్రత్తగా చూసి “ఈ కంపెనీ పిన్నులు కంపెనీ వాడు మాత్రమే అమ్ముతాడు. ఆర్డరు ఇచ్చి తెప్పించాలి. అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఈ పిన్నుని మేం అతికిస్తే సరిగ్గా అతక్కపోవచ్చు. అందుకని మేం సాధారణంగా ఈ కంపెనీ లాప్టాపుని వాళ్ల ఆధరైజ్డ్ సర్వీసు సెంటర్ కి పంపిస్తే… అక్కడి నుంచి …….” అని లెక్క తేల్చి “మొత్తానికి … బిల్లు” అని చెప్పేసరికి నాకు చెప్పలేనంత అసహనమూ, బాధా వచ్చాయి.

చిన్న పిన్ను తప్ప ఇంచక్కగా పనిచేస్తూంది లేప్టాప్. కానీ ఆ పిన్ను లేకుండా వాడితే మధ్య వైర్లు కట్టై పోయి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండడంతో రిపేరు చేయించడం, లేదా కొత్తది కొనుక్కోవడం రెండే మార్గాలు. చివరికి నాలుగైదొందలు పెట్టి దాన్ని రిపేరు చేయించడం కంటే కొత్తది కొనుక్కోవడం మేలనే నిర్ణయానికి యథావిధిగా వచ్చేసాం.

***

కాథరీన్ ఫోన్ చేసింది.

“ప్రియా! మీ అలీసియా చిన్నమ్మాయికి ఫర్నిచరేమైనా కావాలేమో కనుక్కో. మా డైనింగ్ టేబుల్, సోఫాసెట్, టీవీ ఎవరికైనా ఇచ్చేద్దామనుకుంటున్నాను.” అంది.

“అడుగుతాను కానీ, వాళ్లు డబ్బు చెల్లించగల స్థోమత ఉన్న వాళ్లు కాదు మరి” అన్నాను.

“అయ్యో, డబ్బులకి కాదు, ఫ్రీ గానే ఇచ్చేస్తాను” అంది.

“అదేవిటీ, ఫ్రీగానా” అన్నాను.

“అవును, మేం అయిదేళ్ల కిందట కొన్నవవి. నీకు తెల్సుగా మేం ఇల్లు కొనుక్కున్నామని. కొత్త ఇంటికి ఈ పాత ఫర్నిచరు నప్పనూ నప్పదు, నాకు కొత్త ఇంటికి పాత ఫర్నిచరు పట్టుకెళ్ళడం ఇష్టమూ లేదు. అమ్మడానికి ఆన్ లైన్ సైట్స్ లో పెట్టేను రెండు, మూడు నెలల పాటు. కానీ ఎవ్వరూ కొనుక్కోలేదు. వీటిని బయట కర్బ్ సైడు పెట్టి “ఫ్రీ” అని రాసినా మా కాలనీలో ఎవ్వరూ తీసుకొనే వాళ్లుండరు. చక్కని ఫర్నిచర్, వీటిని చెత్త బుట్టలో ముక్కలు కత్తిరించి వేసెయ్యడానికి మనసు ఒప్పడం లేదు” అంది.

“అడిగి చూస్తాను” అన్నాను.

ఆ సాయంత్రం అడిగేను అలీసియాని.

పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వి, “ఇలారా నాతో” అని తీసుకెళ్లింది.

మా అపార్ట్మెంటుని ఆనుకుని ఉన్న రోడ్డుకావల కర్బ్ సైడున మంచి పెద్ద కలర్ టీవీ “ఫ్రీ” అని రాసి పెట్టి ఉంది.

“చూసేవా! ఇలా ఎప్పుడూ మంచి చక్కగా పనిచేసే టీవీ ల వంటివి బయట ఇలా రాసి పెట్టినా ఎవ్వరూ తెచ్చుకోరు. ఎందుకంటే అవన్నీ ఓల్డ్ మాడల్ టీవీలు. ఇప్పుడెవరు చూస్తున్నారు చెప్పు?
ఇక నువ్వన్న సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్ తెచ్చుకోవాలంటే ఒక ట్రక్కు, మోసే ఇద్దరు మనుషులను తెచ్చుకోవాలి. మనుషులకి 100, ట్రక్కు రెంటుకి మరో వంద డాలర్లు వదులుతాయి.” అని
“ఈ కంట్రీ లో సామాన్లు కొనుక్కోవడం సులభమే. కానీ వాటిని వదిలించుకోవడం కష్టం. అంతెందుకు మీ కేథరీన్ ఆ సామాన్లని డొనేట్ చేయాలనుకుంటే తీసుకునే ఏజన్సీలుంటాయి కావాలంటే. కానీ వాళ్ళు కూడా ఉచితంగా పట్టుకెళ్లరనుకుంటా. కొంత డబ్బు చెల్లించాల్సి ఉండొచ్చు” అంది.

మర్నాడు కాథరీన్ కు ఆ మాట చెప్తూ “ఇక్కడ ఏదైనా చీపుగా రిపేరు చేసే వాళ్లున్నారా?” అనడిగాను.

సమాధానంగా వాళ్ల ఇంటి కింద అంతస్థు లో ఉన్న గరాజు లోకి తీసుకెళ్లింది.

వాళ్ల గరాజు ఒక మెకానిక్ షెడ్డులా ఉంది. కానీ రెంచులు వగైరా గోడలకు వేళ్ళాడుతూ చాలా పద్ధతిగా ఎక్కడిక్కడ సెక్షన్ లలో చక్కగా అమర్చి ఉన్నాయి.

“ఇదిగో ఇలా ఇంత పెర్పెక్టుగా అన్ని పనిముట్లూ అమర్చుకున్నా, స్వంతంగా సైకిలు ట్యూబు మార్చుకోవడం దగ్గర్నించి కాంపౌండు వాల్ చెక్కలు బిగించుకోవడం వరకూ అన్నీ స్వంతంగా చేసుకున్నా ఈ కంట్రీలో ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి బాగు చేయించడానికి ఎవరి మీదైనా ఆధారపడడం తప్పదు.

కానీ చాలా సందర్భాల్లో అసలు రిపేరు కంటే రిపేరు చేసే లేబర్ చార్జీలు ఎక్కువ అవుతాయి ప్రియా! కాబట్టి, అంత కంటే కొత్త వస్తువు కొనుక్కోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేస్తాం.

అయితే నా వరకూ నాకు ఏదైనా రిపేరు తక్కువలో అయితే చేయిస్తేనే మంచిదని అనిపిస్తుంది.” అని

“మొన్నేమైందో తెలుసా, మా వాషర్, డ్రైయ్యరూ పాత మోడల్ వి కదా. సడెన్ గా వాషర్ పనిచెయ్యడం మానేసింది. కొత్త వాషర్ కొనాలంటే వెయ్యి డాలర్ల వరకూ పెట్టాలి. అందుకే రిపేరు చేయిద్దామనుకున్నాం. ఆథరైజ్డ్ డీలర్ దగ్గిర రిపేరు చేయించుదామంటే 500 వరకూ ఖర్చు అవుతుంది. అందుకే నేను క్రయిగ్స్ లిస్ట్ లో చూసి, ‘గంటకి ఇంతని కాకుండా పనికి ఇంత’ అని పుచ్చుకునే స్థానిక రిపేరర్ ఒకరిని ఫ్రీ ఎస్టిమేట్ కోసం పిలిచాను. ఒక ట్రక్కు లో రిపేరు సామగ్రి పెట్టుకుని ఒక రోజు ఉదయాన వచ్చిన పెద్దమనిషి పాపం మధ్యాహ్నం దాకా కష్టపడి బాగుచేసాడు మొత్తానికి. ముందు అన్ని పార్టులూ విప్పి, చివరికి కుదరక “సర్క్యూట్ బోర్డ్ పోయింది కొత్తది కొంటే నాలుగు వందలు అవుతుంది, నాదగ్గిర పాతది ఉంది 70 $ వెయ్యమంటారా” అని అడిగాడు.

నేను “సరే”నన్నాను.

ట్రక్కు లో తన దగ్గిర ఉన్న ఇలాంటి పాత సర్క్యూట్ బోర్డ్ ల కట్ట తీసి, అందులో ఒకటి దీనికి బిగించేడు.

బిగించినందుకు ముప్ఫై తీసుకున్నాడు. మొత్తం 100 డాలర్లలో పని అయిపోవడమే కాదు, ఇదంతా జరిగి 6 నెలలు కావస్తూన్నా దివ్యంగా పనిచేస్తూంది ఇప్పటికీ. అప్పటి నించి రిపేరు మీద నమ్మకం పెరిగింది నాకు.
అయితే లేబర్ చార్జీలు ముప్ఫై, నల్భై మినిమం అవుతాయి దేనికైనా. మరో చిక్కేవిటంటే ఇలా ఇంటికొచ్చి పని చేసే వాళ్లు అన్నిటికీ ఉండరు. కంప్యూటర్లు, కేమెరాలు, టీవీలు ఇన్సూరెన్సు సమయం అయిపోయాక రిపేరు వస్తే అంతే సంగతులు” అంది.

***

ఇంటికి తిరిగి వచ్చి గరాజులో కారు పెట్టి ఎందుకో యథాలాపంగా పక్క కారు వైపు చూసేను.

కారుగలతను నాలుగు చక్రాల టైర్లు ఊడబెరికి కొత్తవి స్వంతంగా మార్చుకుంటున్నాడు.

నా వైపు చూసి “హలో” అన్నాడు పలకరింపుగా.

“నేను టైరు మార్చడం ఎలాగో చూడొచ్చా” అన్నాను ఆసక్తిగా.

“తప్పకుండా” అన్నాడతను నవ్వుతూ.

ఆ మర్నాడు మా కారు స్టార్ట్ కాలేదు. మాకేమో రోడ్ సైడ్ అసిస్టెన్సు ఇన్సూరెన్సు లేదు.

మా రెగ్యులర్ మెకానిక్కు కి ఫోన్ చేసి అడిగేను.

“కారుని మా షెడ్డు వరకు టోవ్ చేయిస్తే బాగు చేస్తాను, ఇంటికొచ్చి చూడడం కుదరద”న్నాడు.

ఇక మధ్యాహ్నం వరకూ క్రయిగ్స్ లిస్ట్లో వెతికి మొత్తానికి ఇంటికి వచ్చే ఒక మెకానిక్కుని $50 డాలర్ల లేబర్ చార్జీకి పిలిపించాను.

అతను వచ్చి చూసి చేసిందల్లా బాటరీ ఫాల్టని తేల్చి కొత్త బాటరీని నేనిచ్చిన డబ్బుల్తో కొని తెచ్చి బిగించడం. రెండు క్షణాలలో అతను బిగించిన తీరు చూసి మనసు ఉసూరుమంది. ‘ఈ మాత్రం పని నేర్చుకోకపోవడం వల్ల అనవసరంగా డబ్బులు దండగ అయ్యాయే’ అని బాధ వేసింది.

“కారు రిపేరు నేర్చుకోవాలి లాభంలేదు” అన్నాను సూర్య తో.

నవ్వుతూ నా వైపు చూసి “అదంత సులభం కాదు కానీ, ఇంకోమాట చెప్పు” అని,
“ప్రియా! నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన చోట కూడా సెన్సిటివ్ గా ఆలోచిస్తావెందుకు?” అని మొదలెట్టేడు.