కవిత్వం

నిరాసక్తం

ఆగస్ట్ 2014

ఎందుకు వెలిగించి ఉంటారు
ఎవరైనా ఆ దీపాన్ని..!?
కంటి కొలకుల్లో మసిని తుడిచి వెచ్చని వెలుతురు
స్రవించేలా ….
జిగటగా కారే వెలుతుర్లో చేతిని ముంచాక
స్వచ్చమైన చీకటితో
మనసుని కడిగేసి
ఎవరో
వెలిగించే ఉంటారు ఆ దీపాన్ని..
ఎవరివో
కొందరు బాటసారుల
నిర్నిద్రా సమయాల
నిరాసక్త నిరామయపు
నిశ్శబ్దాన్ని కరిగించి
కర్పూరపు పొడిగా
రాల్చుకున్నాక
స్వచ్చంగా
స్వేచ్చగా
వెలుగుని ఎగరెసేందుకు
వెలిగించి ఉంటారు
కొన్ని పగిలిపోయిన
ఆకాశాల
ముక్కలని వెతికేందుకు
ఏవో ప్రమదా వనాల
చిత్తడి దారుల్లో
ఈ ప్రమిదని
వెలుగుల కాగడాగా
వాడేందుకేమో
ఏమో మరి…
ఎందుకోమరి
వారా దీపాన్ని ఒక
దేహంగా వెలిగించి ఉంచారేమో
బహుశా…
ఒకనాటి అనామక
పాదాలకంటిన
ఎర్రని పారాణి గానో
పోరాటపు వెలుగుల
నెత్తుటి గుర్తుగానో
ఆ దీపాన్ని
ప్రజ్వలించి ఉండవచ్చు
లేదంటావా…
కొన్ని అస్పృశ్యపు
ఆత్మ కథలు
రాయబడగా మిగిలిన
సిరాని ఎవరైనా
అక్కడ వొంపిఉండొచ్చు…
ఆ వెలుగుతో
ఒక కౄర
ద్వాంతపు దంతాన్ని
ద్వంసం చేసి
ఉండొచ్చు
ఐనా మిత్రుడా…!
ఎవరు వెలిగిస్తేనేం
ఆ వెన్నెల దీపం
అమ్మ గోరుముద్దా కావొచ్చు
ఒకనాటి ప్రేయసి గోటి ముద్రా
ఐ ఉండనూ వచ్చు..
శాశ్వతత్వపు చీకటిని
కాసేపు మరిచేందు కైనా
ఆ దీపాన్నలా వెలగనీయ్
ఏమో…!
ఒకవేళ
ఆ దీపం నీ నుండి
వేరైపోయిన
నువ్వె అయి ఉండొచ్చు..