కవిత్వం

సముద్రాంబర

ఆగస్ట్ 2014

1.
ఇంటి ముందు ఆకాశపు ముక్కల్ని
నక్షత్రపు శకలాల్ని, విరిగిన మబ్బుల్ని
ఏరుతూ, వేరు వేరు చేస్తూ
కాలాన్ని గంటలుగా కాచి , చాయి నీళ్ళుగా
గ్లాసులో పోసుకుని తాగుతుందామె

2.
ఉదయం సూర్యుడు పిల్లలతో పాటు బడికి
బయలుదేరాక
బజారులోని చెట్ల మీది పక్షులు ఎగిరిపోయాక
కొన్ని మాటలు రాల్చిన ఆకుల్ని ఎత్తి, నోరు తెరిచి
ఎదురుచూస్తున్న చెత్త డబ్బాకు భోజనం పెట్టి
నాలుగు రాళ్ళతో
జానెడు పొట్ట నవ్వడం కోసం
ఉన్నా లేన్నట్టున్న తాగుబోతు భర్త బాధ్యతలు మరిస్తే,
గుడిలో భక్తురాల్లాగా ముడుచుకు కూర్చుని
భూగర్భంలోని నిఖార్సైన బొగ్గులు ఆమె చేతుల్లోకాలి
మసి నింపినట్టు కనిపిస్తుంటే
ఆ చేతుల్నే దైవ నైవేద్యంగా చేసి
పనితో తన రోజు నింపుకుంటుంది

3.
అప్పుడప్పుడు ఆకాశం ఆమె చేతుల్లోంచి జారిపోతుంది
ఆ నలుపుకు ఎక్కడుండాలో తెలియక
నక్షత్రాల్ని గట్టిగా పట్టుకునేప్పుడు అంచులు ఆమె వేళ్ళని
నిర్దాక్షిణ్యంగా కోస్తున్నా ఒక్క మాటా నోటి నుండి రాదు
మద్యం సీసాలో మునక లేస్తున్న భర్త ఆమె కన్నీళ్లు తాగిన మరుక్షణమే
మనిషయ్యేవాడేమో
కాని ఏడ్చి ఏడ్చి తన కళ్లిప్పుడు ఎండి ఎడారులయ్యాయ్

4.
పక్షులు ,సూర్యుడు గూళ్ళకు చేరే ముందు
పిల్లలిద్దరూ నదుల్లా పరుగు పరుగునొచ్చి
ఆమె ఒడిలో అలల్లా మారినప్పుడు
ఆమె సంద్రమై యుప్పొంగుతుంది
నేర్చుకున్న మాటలు , పాటలు , పాఠాలు ఆమెకు చెబుతూ
నక్షత్ర శకలాల్ని , ఆకాశపు ముక్కల్ని ,విరిగిన మబ్బుల్ని
వాళ్ళూ ఏరుతూ ఆమెకు సహాయంగా కూర్చున్నప్పుడు
ఎండిన తన ఎడారి కళ్ళను ఆ కొద్ది సేపు ఒయాసిస్సులు చేస్తుందామే

5.
పాయలు పాయల చీకట్లలా భుజాలపై చింపిరిగా పడ్డ జుట్టును
వెనక్కి ముడేసుకుని
ముసురుగా చుట్టుకునే ఆలోచనల్ని చిన్నారుల నవ్వుల్లో కలిపేసి
ఏరి వేరు చేసిన తళుకుల్ని భుజానికెత్తుకుని
ప్రపంచాన్ని మోస్తున్న తల్లిలా తను వెళ్ళేప్పుడు
ప్రతి తల సలాం అని దించాల్సిందే

6.
చేతికొచ్చిన రూపాయలు ఆమె కష్టానికి తక్కువే
అయినా
వాటిని తన చేతుల్లోకి తీసుకున్న సంతోషంతో పాటు
ఆమె చిరిగిన చీర కూడా చిరునవ్వు నవ్వుతుంది

7.
ఇక అప్పుడు
రేపటికోసం ఇంకొంత జీవితాన్ని పోగుచేసుకునేందుకు
దోపుకున్న చీరకొంగుతో చెమట చెమ్మ బాషను
హృదయం వరకు చేర్చి
గుండె నిండా భవిష్యత్తును పోగుచేసుకుంటూ
సముద్రాంబరై ఆమె వేస్తూ వెళ్తున్న ఈ అడుగులు
ఇద్దరు సూర్యుళ్ళను తయారుచేసేందుకే..!
సమాజానికి ఒక పాఠం నేర్పేందుకే ..!

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

Painting: జావేద్